Thursday, February 22, 2018

సుముహూర్తం

మనవైపు ఆచారం సుముహూర్త సమయానికి ఒకరినొకరు చూసుకోవాలి.కొన్ని చోట్ల సుముహూర్తానికి మంగళసూత్రం కడతారు.వరుడు వధువు ముఖాన్ని సుముహూర్త కాలంలో చూడటాన్ని సమీక్షణం లేక నిరీక్షణం అంటారు. వధూవరులిద్దరూ పెళ్ళి మంటపం మీద తూర్పు, పశ్చిమ ముఖాలుగా కూర్చుంటారు. వారి కుడి చేతికి జీలకర్ర, బెల్లం కలిపిన ముద్దలు ఇస్తారు. వారి వివాహానికి సరిగ్గా, నిర్ణయించిన సుముహూర్తం సమయంలో, వేద ఘోష, మంగళ వాయిద్యాలు మధ్య ఆ మిశ్రమాన్ని వధూవరులు ఒకరి తలపై మరొకరు ఉంచి, అణచి పట్టుకొని, శిరస్సులను తాకుతారు.

ఒక ప్రక్క "గట్టి మేళం" మ్రోగుతూనే ఉంటుంది. అంతవరకు వారిద్దరి మధ్యా అడ్డుగా ఉన్న తెర/తెరశెల్లాను తొలగిస్తారు. అప్పటి వరకు వేచియున్న వధూవరులు ఒకరినొకరు పవిత్రంగా చూసుకొంటారు.అప్పుడు వరుడు తన ఇష్ట దేవతను ధ్యానిస్తూ వధువు కనుబొమ్మల మధ్యభాగాన్ని చూస్తాడు. జీలకఱ్ఱ బెల్లాని ఆమె నడినెత్తిన బ్రహ్మరంధ్రముపైన ఉంచుతాడు. అలాగే, వధువు కూడా తన ఇష్టదేవతా ధ్యానంతో పెండ్లికొడుకు కనుబొమ్మల మధ్య చూసి అతడి నడినెత్తిన జీలకఱ్ఱ ముద్దను ఉంచుతుంది.  దీనినే "సుమూహుర్తం" అంటారు. ఇదే సమయంలో వేదపండితులు ఋగ్వేదంలోని ఈ మంత్రాన్ని ఉచ్ఛరిస్తారు.

"ధృవంతే రాజావరుణో ధృవం దేవో బృహస్
ధృవంతే ఇంద్రశ్చాగంచ్ఛ రాష్ట్రం థార్యతాం ధృవం."

అంటే " ఓ రాజా! రాజైన వరుణుడు, దేవతలైన బృహస్పతి, ఇంద్రాగ్నులు నీ రాజ్యాన్ని స్థిరమొనర్చుగాక." అలాగే, ఈ గృహస్తు జీవితం నిలకడగా ఆనందంగా జీవించాలని, చివరిదాక ఇద్దరూ ఎడబాటు లేకుండా ఉండాలని, అన్యోన్యమైన దాంపత్యాన్ని కలిగిఉండాలనే ఆకాంక్షే దీని పరమార్ధం. వరుడి శ్రేయం కోరడమే ఇందులోని ముఖ్యాంశం.

ఇహ జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని వినియోగించడంలో కల ప్రయోజనం: జీలకర్ర వృద్ధ్యాప్యం రాకుండా దోహదపడుతుంది. అందువలన శుభకార్యాల్లో దీని వినియోగం మంగళప్రదం. అందుకే జీలకర్రని వంటలలో కూడా విరివిగా వాడతారు.

ఈ రెండిటి కలయిక వలన కొత్త శక్తి పుడుతుంది. నడినెత్తిన బ్రహ్మరంధ్రంపైన ఆ ముద్దను పెట్టిన తరువాత వధూవరులకు ఇద్దరికీ ఒకరిపైన ఒకరికి స్థిరమైన దృష్టి కేంద్రీకరణ జరుగుతుంది అని పెద్దలు చెబుతారు. వైజ్ఞానికులు కూడా సైన్సు పరంగా ఈ విషయాన్ని అంగీకరించారు. శుభమైన లక్షణాలలో కలిసిన అనురాగమయమైన ఆ మొదటి దృష్టి వారి మధ్య మానసిక బంధాన్ని క్షణక్షణానికి పెంచుతుంది.

బెల్లం భోగ్య పదార్ధం. ఇది మధురంగాను, తన మధురాన్ని ఇతర వస్తువుల్లోకి సంక్రమింప చేసేదిగాను, పవిత్రమయినదని, కృష్ణ యజుర్వేద సంహిత చెబుతోంది. ఈ రెంటిని కలిపి నూరినా, నమిలినా "ధనసంజ్ఞకమైన విద్యుత్తు"(POSSITIVE ELECTRONIC CHARGE) కలుగుతుందని పదార్ధ విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువలనే ఈ మిశ్రమ సంయోగం వలన ఒక క్రొత్త శక్తి పుడుతుందనీ, దీనిని తలపై పెట్టినపుడు వధూవరుల శరీరాల్లో ఒక విశిష్ట ప్రేరణ కలిగి , పరస్పర జీవ శక్తుల ఆకర్షణకు సహాయపడుతుందని చెబుతారు. అందుకే ఈ మిశ్రమం పావనం, మంగళకరం అని మహర్షుల మాట.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...