Thursday, February 22, 2018

సత్యాన్వేషణ

అతను యువకుడు. అన్ని అనుకువలు వున్నవాడు. ఏ యిబ్బందులూ లేవు. అట్లాంటిది అతనికి హఠాత్తుగా సత్యాన్వేషణపైకి దృష్టి మళ్లింది. సత్యాన్ని అన్వేషించాలన్న వాడికి గురువు అవసరం. అందుకని తగిన గురువుని అన్వేషించడానికి బయల్దేరాడు. గ్రామం వదిలి వెళుతూ ఉంటే పొలిమేరలో ఒక పెద్ద చెట్టు కింద రచ్చబండపైన ఒక సన్యాసి వుండడం చూశాడు. అతని దగ్గర ఏదయినా సమాచారం దొరకవచ్చని అనుకుని ఆ యువకుడు ఆ సన్యాసి దగ్గరికి వెళ్లి నమస్కరించి
‘నువ్వు ఎన్నో ప్రదేశాలు తిరిగి వుంటావు. ఎంతో అనుభవాన్ని గడించి వుంటావు. నేను సత్యాన్వేషణలో వున్నాను. సరయిన గురువుని వెతికే పనిలో ఉన్నాను. నీ ప్రయాణంలో నీకు గొప్ప గురువు తటస్థపడే వుంటాడు. అతని గురించి చెబితే నీకు రుణపడి ఉంటాను. గురువు లేకుండా నా జీవితం సంపూర్ణం కాదు” అన్నాడు. ఆ సన్యాసి వృద్ధుడు. అరవయ్యేళ్లు ఉంటాయి. అతను తప్పకుండా నీకు ఆ గురువు వివరాల్ని అందిస్తాను. దాన్ని బట్టి అతన్ని నువ్వు గుర్తు పట్టవచ్చు. అని ఆ గురువు రూపురేఖల్ని వర్ణించాడు. ”ఈ వివరాల్ని మాత్రం విస్మరించకు. అట్లాంటి వ్యక్తి ఎక్కడయినా నీకు ఎదురయితే అతనే గురువు” అన్నాడు.

ఆ యువకుడు వృద్ధుడికి కృతజ్ఞతలు చెప్పి అన్వేషిస్తూ సాగిపోయాడు. ముఫ్ఫయిసంవత్సరాలు గడిచిపోయాయి. యువకుడు కూడా పెద్దవాడయ్యాడు. అన్వేషణలో అలిసిపోయాడు. వృద్ధుడు చెప్పిన పోలికలున్న వ్యక్తి ఎక్కడా అతనికి తటస్థపడలేదు. చివరికి విసిగిపోయి ”బహుశా: అట్లాంటి గురువు లేడేమో” అనుకుని తన గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామపొలిమేరల్లో ఒక వృక్షం,రచ్చబండ. తమ గ్రామాన్ని వదిలిపెట్టినప్పుడు వున్న రచ్చబండ, ఆ రచ్చబండపై అదే సన్యాసి మరింత వృద్ధుడయ్యాడు. పండు ముసలివాడయ్యాడు. ఆ తొంభయి సంవత్సరాల వృద్ధుణ్ణి చూసి యువకుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ముప్పయిసంవత్సరాల క్రితం ఆ సన్యాసి వర్ణించిన లక్షణాలన్నీ ఆ వృద్ధుడిలోనే ఉన్నాయి. యువకుడి కళ్లలో నీళ్లు కదిలాయి. ఆవేశంతో ఆ సన్యాసి దగ్గరకి వచ్చి ”ఎందుకు నన్ను మోసం చేశావు? నా ముప్పయి సంవత్సరాల జీవితాన్ని నాశనం చేశావు. నువ్వే గురువని చెప్పి ఉంటే ఇలా జరిగేది కాదు కదా!” అన్నాడు. దానికి ఆ వృద్ధుడు నవ్వుతూ.. ”మొదట నీ కోపాన్ని ఉపసంహరించుకో. అప్పుడు అసలు సంగతి చెబుతాను. ముప్ఫయిసంవత్సరాల క్రితం నువ్వు యువకుడివి. ఆవేశంలో ఉన్నావు. నేనే గురువని చెప్పి ఉంటే నువ్వు నవ్వే వాడివి. విశ్వసించేవాడివి కాదు. పైగా మా గ్రామానికి వచ్చి నేనే గురువంటావా?” అని హేళన పట్టించేవాడివి. అయినా అన్నీ నీకు వివరంగా చెప్పాను. వర్ణించాను. కానీ నువ్వు ఇక్కడ కాకుండా ఎక్కడో వెతుకుతున్నావు. ముప్పయి సంవత్సరాల నీ అన్వేషణ వ్యర్థం కాలేదు. నువ్వు పరిణితి చెందావు. నన్ను గుర్తించావు. పైగా నీ ముప్పయి సంవత్సరాలు వ్యర్థమయ్యాయని నాపై ఆరోపణలు చేస్తున్నావు. కానీ నా సంగతి ఆలోచించు. ముప్పయిసంవత్సరాలుగా నేను ఈ వృక్షాన్ని వదిలిపెట్టలేదు. యిక్కడే వున్నాను. నీకోసం ఎదురు చూస్తున్నాను. తప్పకుండా ఏదో ఒకరోజు నువ్వు వస్తావని నీకోసం ఎదురుచూస్తున్నాను. నీకు చెప్పిన మాటల్లో అణువంతుకూడా అసత్యం లేదని గ్రహించు” అన్నాడు.

ఆ మాటలతో యువకుడికి జ్ఞానోదయమైంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...