Monday, February 26, 2018

శరణాగతి

శరణాగతి అంటే భగవంతుని మీద పూర్తి భారం వేసి, అన్యమైన ఆలోచనలను, ఆందోళలను విడిచిపెట్టడం. శరణాగతి గురించి భగవాన్ రమణ మహర్షి గొప్పగా చెప్పారు. రమణ మహర్షి ఆత్మసాక్షాత్కారానికి చూపిన రెండు మార్గాల్లో ఒకటి ఆత్మవిచారణ అయితే, రెండవది శరణాగతి. ఈ సమస్త ప్రపంచాన్ని సృష్టించి, నడిపిస్తున్నది, లయం చేస్తున్నది భగవంతుడే. ఇది ఒట్టి మాటలలో చెప్పుకుంటే యాంత్రికంగా ఉంటుంది. దాంతో పాటు ఎన్నో సందేహాలు కూడా కలుగుతాయి. అదే అనుభూతి కలిగినప్పుడు, వివేకం కూడా జనిస్తుంది. అప్పుడు సందేహాలకు తావు ఉండదు. ఆయన ఆజ్ఞతోనే సమస్తమూ జరుగుతోంది, భవిష్యత్తులో ఏది జరగాలో కూడా ఆయనే నిర్ణయిస్తాడు. నేను చేస్తున్నాను, నా వల్ల అది జరిగింది, ఇది జరిగింది, నేనలా చేస్తాను అనుకోవడమే అహంకారం. ఎందుకంటే నా, నీ ద్వారా సమస్తమూ చేస్తున్నవాడు భగవానుడే. అన్నీ ఆయన చేస్తున్నాడనే వివేకంతో, అన్నీ ఆయనకే అర్పించి, ఇతర ఆలోచనలు చేయకుండా, తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించడమే శరణాగతి.

దీని గురించి భగవాన్ రమణులు ఇలా అంటారు. భక్తులలో ఉత్తమ భక్తుడెవరు? స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను తాను అర్పించుకుంటాడో, అతడే భక్తశ్రేష్ఠుడు. ఆత్మచింతన తప్ప ఇతర చింతలు (ఆలోచనలు) పుట్టడానికి కొంచమైనా చోటివ్వక, ఆత్మనిష్ఠాపరుడై ఉండడమే తనను ఈశ్వరునికి అర్పించుకోవడం. ఈశ్వరుని మీద ఎంత భారం వేసినా, ఆయన దానిని భరించగలడు. సకల కార్యాలను ఒక పరమేశ్వర శక్తి నడుపుతున్నప్పుడు, మనం దానికి లోబడి ఉండడం మాని, ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించడం ఎందుకు? రైలు బండి బరువులన్నిటిని మోయగలదని తెలిసియుండి, ప్రయాణీకులైన మనము మన చిన్నమూటను కూడా అందులో పడవేసి సుఖంగా ఉండక, దానిని నెత్తికెత్తుకుని ఎందుకు కష్టపడాలి?

ఎంత చక్కగా చెప్పారో చూడండి. పైన చెప్పిన ఉపమానంలో ఈ ప్రపంచమే రైలుబండి అనుకుందాము. ఈ ప్రపంచం అనే రైలులో మనము కూడా ప్రయాణికులము. ఒక స్టేషనులో ఎక్కి, ఇంకొక చోట దిగిపోతాము. ఇలా ఎందరో ప్రయాణిస్తున్నారు. అది ఎందరిని ఎక్కించుకున్నా, అందరిని లాగే శక్తి దానికి ఉంది. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించే శక్తి ఈశ్వరునికి ఉంది. అందుకే కదా విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుః అంటూ ప్రారంభించబడింది. కేవలం ఈ ప్రపంచాన్నే కాదు, సమస్త బ్రహ్మాండాలను అసలే భారం లేకుండా మోస్తున్నవాడు భగవానుడు. ఈ బ్రహ్మండాలన్నిటిలో ఈ విశ్వం చిన్న కణిక. అందులో ఈ ప్రపంచమెంత? అందులో నువ్వెంత? నువ్వు వీటిలోనే ఉన్నప్పుడు నీ భారం కూడా ఆయన మీదే ఉంది. ఈ క్షణంలో కూడా నీ భారం వహిస్తున్నవాడు ఆయనే. రైలు బండి ఎక్కినవాడు, నెత్తి మీద మూటలు దింపి, క్రింద పెట్టి, హాయిగా ప్రయాణాన్ని ఆనందించి, గమ్యం వచ్చినప్పుడు దిగిపోక, ఆ మూటను నెత్తిన పెట్టుకుని, అనవసరంగా కష్టపడటం, గమ్యం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ దిగాలో అంటూ కంగారు పడటం, అనవసరమూ, అవివేకము కూడా. అలాగే ఈ సమస్త ప్రపంచాన్ని నడుపుతున్న ఆ భగవంతుండే నీ భారాన్ని కూడా మోస్తున్నాడనే ఎరుక కలిగి ఉంటూ, జరిగిన వాటి గురించి బాధపడక, జరగబోయే వాటి గురించి చింతించక, వర్తమానంలో, ఈశ్వరునిపై విశ్వాసంతో, ఆనందంగా ఉండడమే శరణాగతి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...