Wednesday, March 21, 2018

భక్తి లక్షణం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు. 

బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి. మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది. 

ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో మొదటి మెట్టు ప్రతీకోపాసన. అంటే, విగ్రహారాధన. విగ్రహాన్ని సాక్షాత్తు దేవతగా భావిస్తారు. ఆ బాహ్య పూజావిధానానికి పైమెట్టు- మానసిక ప్రయత్నం. భక్తుడు తన హృదయపీఠం పైకి ఇష్టదైవాన్ని ఆహ్వానించి, ప్రతిష్ఠించి, పూజిస్తాడు. ‘అనన్య భక్తితో నన్ను ఎవరు ఆరాధిస్తారో, ఏ ఇతర భావాలూ లేక నన్నే ఎవరు ధ్యానిస్తారో, సదా అనుసరిస్తారో- వారి బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను’ అంటాడు గీతాకారుడు. భగవంతుడి పట్ల ప్రేమానుబంధం ఎక్కువయ్యేకొద్దీ, మిగిలిన వాటిపై భక్తుడి విముఖత పెరుగుతుంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘వైరాగ్య భావన’గా పరిగణిస్తారు. 

భక్తికి సంబంధించి, రెండు దృక్పథాలున్నాయి. ఒకటి- భక్తుడు స్వప్రయత్నంతో ఈశ్వరానుగ్రహం సంపాదించడం, లేదా దైవం మీదే భారమంతా మోపి ‘సర్వాత్మ’గా ఆరాధించడం.రెండోది ప్రపత్తి. అంటే, బంధవిముక్తికి ప్రభు పాదాల్ని ఆశ్రయించడం. వీటిలో- మొదటిది మర్కట కిశోర న్యాయం. రెండోది మార్జాల కిశోర న్యాయం. మర్కటం (కోతిపిల్ల) ఎప్పుడూ తల్లి పొట్టను పట్టుకొనే ఉంటుంది. ఆ తల్లి చెట్లపై ఎంతగా గెంతుతున్నా, దాన్ని పిల్ల వదలదు. మార్జాలం (పిల్లి) తన పిల్లను నోట కరచుకొని తీసుకుపోతుంటుంది. పిల్లిపిల్ల తన రక్షణ కోసం ఏమీ చేయదు. మొదటి మార్గంలో దైవానుగ్రహాన్ని భక్తుడు సంపాదించుకుంటాడు. రెండో మార్గంలో, దైవమే అనుగ్రహిస్తాడు. ప్రపత్తి అంటే ఇదే! ఈ రెండూ పూర్తి విరుద్ధమైన మార్గాలు కావు. ఇవి అన్యోన్యమైనవి. సహానుభూతిని కలిగించేవి. 

‘అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంత గాచుట నీ పని, సేవించుట నా పని...’ అంటాడు అన్నమయ్య. ఏ ప్రాణి పట్లా ద్వేషభావం లేనివాడు; సర్వ ప్రాణుల మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ గలవాడు భక్తుడు. అతడు విపరీతమైన మమత, అహంకారం- రెండూ లేనివాడు. సుఖం ప్రాప్తించినా, దుఃఖం కలిగినా సమభావం కలిగి ఉండేవాడు. క్షమాగుణం కలిగినవాడు. మనసు, శరీరం, ఇంద్రియాల్ని వశంలో ఉంచగలవాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంతుష్టుడైనవాడే అసలైన భక్తుడు. అతడు భగవంతుడికే తన మనసును, బుద్ధిని అర్పణ చేసేంత గొప్పవాడు. 

భక్తుడు అందరితోనూ సమభావంతో మెలగాలి. నిందాస్తుతులకు చలించకూడదు. ఈర్ష్య, భయం వంటి మనోవికారాలకు లొంగకూడదు. 

భక్తుల్ని మూడు విధాలుగా గుర్తిస్తారు. ‘భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన వేరు, ఆ సృష్టి వేరు’ అని భావించేవాడిది అధమ భక్తి. ‘భగవంతుడు అంతర్యామి. లోపల నుంచి అందర్నీ నియంత్రిస్తాడు’ అని తలచేవాడు మధ్యముడు. ‘సర్వమూ భగవంతుడే’ అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. ‘సకల తత్వాలూ భగవంతుడే... సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు’ అనే భావనే ఉదాత్త భక్తి!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......
 
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...