Wednesday, March 21, 2018

కర్మయోగము గీతా మకరందము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉✡🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

03-42-గీతా మకరందము.
        కర్మయోగము
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ :- కామము ఇంద్రియములను , మనస్సును , బుద్ధిని వశపఱచుకొని ,జీవుని (ఆత్మను) మోహపెట్టుచుండ ఇక దానిని జయించుటెట్లు ? ఇంద్రియములను వశపఱచుకొనుటెట్లు ? అను శంకకు సమాధానము చెప్పదలచి జీవునియొక్క యథార్థ స్వరూపమును , ఆతని నిజస్థానమును , శక్తిని వర్ణించుచున్నారు -

ఇన్ద్రియాణి పరాణ్యాహుః 
ఇన్ద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా  బుద్ధిః
యో బుద్ధేః పరతస్తు సః ||

తా :- (దేహాదులకంటె) ఇంద్రియములు గొప్పవి . ఇంద్రియములకంటె మనస్సు గొప్పది . మనస్సుకంటె బుద్ధి గొప్పది . బుద్ధి కంటె గొప్పవాడెవడో ఆతడే ఆత్మ అని యిట్లు పెద్దలు చెప్పుదురు .

వ్యాఖ్య :- ఇంద్రియములను తొలుదొల్త నిగ్రహించవలెనని క్రిందటి శ్లోకమున చెప్పబడెను . అయితే వానిని నిగ్రహించుటెట్లు? ఆ పద్ధతిని రెండు శ్లోకములద్వారా తెలుపుచున్నారు . ఒక  వస్తువును నిగ్రహించవలెననిన , దానికంటె పైస్థానమందున్ననే సాధ్యపడును , లేక దానికంటె శక్తివంతమైన వస్తువును చేబట్టిననే వీలగును . కావున ఇంద్రియములను జయించవలెననిన వానికంటె పరమైనట్టి స్థానమందు జీవుడు స్థితిని బొందవలెను . దేహము రథమువంటిది . అది జడమైనది . ఇంద్రియములు గుఱ్ఱముల వంటివి. అవి ఒకింత చైతన్యవంతములు . కావున దేహముకంటె ఇంద్రియములు గొప్పవి . అట్లే ఇంద్రియములు కంటె మనస్సున్ను ; మనస్సుకంటె బుద్ధియు , బుద్ధికంటె ఆత్మయు గొప్పవి . ఒకదానికంటె మఱియొకటి అధికచైతన్య వంతములు , శక్తివంతములునైయున్నవి . మఱియు ఒకదానికంటె మఱియొకటి ఉపరి భాగమున కలవు . అన్నిటికంటెపైన ఆత్మ కలదు . ఒకదృష్టితో చూచినచో ఆత్మతప్ప తక్కిన బుద్ధ్యాదు లన్నియును జడములే యగును . ఆత్మయొకటియే చైతన్యవంతమైనది . ఆత్మసాన్నిధ్యమును (అగ్నిసన్నిధియందు  ఇనుపగుండువలె) బుద్ధ్యాదులు చైతన్యవంతములుగ గన్పట్టుచున్నవి . ఆత్మేతరములగు  ఆ బుద్ధ్యాది సమస్తపదార్థములున్ను ప్రకృతికి (మాయకు) లోబడి వర్తించుచున్నవి . అవి దృశ్యములు . ఆత్మయొకటియే దృక్కు .
          కాబట్టి  అట్టి ఆత్మస్థానముననున్నచో తక్కిన ఇంద్రియాదు లన్నిటిని సులభముగ నిగ్రహించవచ్చును . అపుడే పూర్ణఇంద్రియనిగ్రహము సాధ్యమగును . ‘రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే’ (2-59) అని భగవాను డిదివఱకే ఈ భావమును వ్యక్తము చేసి యున్నాడు .ఇది వేదాంతమునందలి కీలకమగుటచే ముముక్షువులెల్లరు దీనిని చక్కగ గ్రహించవలెను . కావున ప్రతివాడును దేహమునందుగాని, ఇంద్రియములందుగాని , మనస్సు నందుగాని , బుద్ధియందుగాని నివసించుట తగదనియు వాని యన్నింటికి సాక్షిగా ,పరముగానున్న ఆత్మనుజేరి అచటనే నివాసమేర్పఱచుకొనవలెననియు , అపుడే పూర్ణ ఇంద్రియనిగ్రహము ,తద్ద్వారా కామాదుల జయము తత్ఫలితముగ సంసారదుఃఖబంధవిచ్ఛేదము సంభవించుననియు ఇచట స్పష్టమొనర్పబడినది . జీవుడు తన గొప్ప అంతస్తును తాను గుర్తించవలెను . తాను సర్వోపరిస్థానమందుగల ఆత్మయే యను నిశ్చయభావము గలిగియుండవలెను . అట్టి నిశ్చయముచే ఇంద్రియాదుల జయము అతిసులభముగ సిద్ధించును . ఆత్మయందు స్థావరము నేర్పరచుకొని ఇంద్రియాదులను దుష్టమృగములను గురిపెట్టి కాల్చవలెను . ఆ చోటనుండి తప్ప తక్కిన యేస్థానమునుండికూడ వానిని పూర్ణముగ వశపఱచు కొనుట సాధ్యముకాదని తెలుపుచు బుద్ధికి పరమైన ఆత్మయందే సదా నిలుకడను బొందులాగున భగవాను డీశ్లోకమున, రాబోవు శ్లోకమున హెచ్చరికచేయుచున్నారు.       

ప్ర :- ఆత్మయొక్క స్థానమును , శక్తిని నిరూపించుము ?
ఉ :- దేహమునకుపైన ఇంద్రియములు , ఇంద్రియములకు పైన మనస్సు , మనస్సునకుపైన బుద్ధి , బుధ్ధికిపైన ఆత్మ కలదు . ఇవి ఒకదానికంటె మఱియొకటి ఉత్తరోత్తర శ్రేష్ఠములై యొప్పుచున్నవి .

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...