Saturday, October 27, 2018

అట్లతద్దె పండుగ

ఒకప్పుడు మన దేశంలొ అన్ని జిల్లాలలలో ప్రతీ గ్రామంలోనూ ఎంతో వైభవంగా జరుపుకునే ఈ అట్లతద్దె పండుగ ఇప్పుడు ఆచరించేవారు లేక వెలవెలబోతుంది.  అట్లతద్దె చేస్తే మంచి మొగుడొస్తాడనీ, అందగాడు భర్తగా లభిస్తాడనీ, అట్లతద్దె నాడు ఉపవాసం ఉంటే  అధిక ధనవంతుడో , పెద్ద ఉద్యోగస్ధుడో కోరి వచ్చి మరీ పెళ్ళి చేసుకుంటాడనీ చెప్తూ  చాలామంది పెద్దలు నమ్మించి  ఈ పూజలు చెయ్యిస్తారు. కానీ  ప్రాక్టికల్ గా అవన్నీ జరిగేవి కావు.  దీనివల్ల  అప్పటివరకూ ఊహల్లో తేలిపోతూ , ఆశగా ఎదురుచూసే చాలామంది అమ్మాయిలు నిజజీవితంలో అందుకు విరుద్ధంగా జరిగేసరికి  దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయి, అసంతృప్తికీ, నిరాశానిస్పృహలకీ లోనౌతున్నారు. 


హిందూమతంలో ఉన్న ప్రతీ ఆచార వ్యవహారాల వెనుక, పండుగల వెనుక కొన్ని  సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక  కారణాలూ ప్రయోజనాలు  ఉంటాయి, వాటిని నేటితరానికి  అర్ధం అయ్యేలా చెప్పగలిగితే ప్రతీఒక్కరూ శృద్ధగా, మనస్పూర్తిగా ఈ పండుగలను ఆచరిస్తారు,  కానీ దురదృష్టం కొద్దీ గుడ్డిగా వీటిని ఆచరించేవారే తప్ప వీటిపై అవగాహన ఉన్నవారు మనలో చాలా తక్కువ. 

అట్లతద్ది సమయంలో ఔషద విలువలు ఉన్న ఆ గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలకు ఈ సీజన్ లో వచ్చే చర్మ, నఖ, కీళ్ళ  వ్యాధులు రావనీ, అట్లను దానం ఇవ్వడం వల్ల కుజదోష ప్రభావం తగ్గుతుందనీ, ఉయ్యాల ఊగడం  వల్ల వారి శరీరానికి అవసరమైన  రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుందనీ,  ఆటపాటలతో అందరితో సరదాగా గడపడం  మానసిక ఉల్లాసం కలుగుతుందనీ, ఉదయాన్నే లేచి  పూజలు చేయడం వల్ల దైవభక్తి పెరగడంతో  పాటు దైవకృప వల్ల మంచి జరుగుతుందనే మానసిక ధైర్యం కలుగుతుందనీ, పరగడుపునే పప్పు బెల్లం కలిపి తినడం వల్ల ధాతుపుష్టి కలుగుతుందనీ, పండుగ పేరుతో చీరలు ఆభరణాలు కొనడం ద్వారా వారి వివాహానికి అవసరమయ్యే వస్తువులను ఒకొకటిగా సమకూర్చుకునే ఆర్ధిక ప్రణాళిక ఉంటుందనీ,  ఇప్పటిలా  కాబోయే భర్త గురించి ఇలాంటివాడే కావాలని  నోరు తెరచి తెగేసి  చెప్పలేని ఆరోజుల్లో అట్లతద్ది రోజున  ఆటపాటల్లో సరదాగా సంతోషంగా గడుపుతున్న సమయంలో ఎలాంటి భర్త కావాలని  అడగడం ద్వారా  ఆమె మనసుని తెలుసుకుని ఆమెకు తగిన భర్తను తీసుకొచ్చే ప్రయత్నం చేసే అద్భుతమైన  ఆలోచన ఉందనీ చెబితే అందరికీ ఆ పండుగ విలువ తెలుస్తుంది.  ఇవి చెప్పేవారు లేకే ఇలాంటి పండుగలు ఈ కాలం అమ్మాయిలకి చాదస్తంగా కనిపించి పండుగలకూ పూజలకూ దూరంగా ఉంటున్నారు.  

నిజానికి   మనసుతో చెయ్యాల్సిన వాటిని మభ్య పెట్టి, భక్తితో చెయ్యాల్సిన వాటిని భయపెట్టీ   చెయ్యిస్తూ అర్ధాంతరంగా పుట్టుకొచ్చిన  కొన్ని ఆచారాల వల్ల, మూఢంగా ఏర్పరుచుకున్న కఠిన నియమ నిబంధనల వల్లే చాలామందికి ఈ పండుగలూ పూజలూ చాదస్తంగా అనిపించి,  మతం మారి ఇతర మతాలకు వలస పోతున్నారనేది ఒప్పుకుతీరాల్సిన వాస్తవం. పండుగల వెనుక ఉన్న రహస్యాలనూ, ఆచారవ్యవహారాల వెనుక ఉన్న   సామాజిక ఆర్ధిక ఆరోగ్య ఆధ్యాత్మిక కారణాలనూ ప్రతీ ఒక్కరూ తెల్సుకుని  తెలియనివారికి అర్ధమయ్యేలా చెప్పగలిగిన నాడే దూరమైపోతున్న మన సంస్కృతినీ,  అంతరించిపోతున్న  సంప్రదాయాలనీ కాపాడుకోగలం.  ....
ఇట్లు 
మీ శ్రేయోభిలాషి 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...