Saturday, October 27, 2018

మాటలు/మంత్రములు - శ్రీసూక్తం..

శ్రీ గురుభ్యో నమః

శ్రీసూక్తం:
ఇంకొకసారి మననం  చేసుకుంటే..
సూక్తం అంటే -
1. సు + ఉక్తం = బాగుగా చెప్పబడినది
2. సుష్టు ఉక్తం = పూర్ణముగా చెప్పబడినది  (complete)
3. సుందర కధనం సూక్తం = సుందరముగ చెప్పబడినది
శ్రీ గురించి అత్యంత వైభవముగా , సుందరముగా చెప్పబడిన

శ్రీ అంటే -
1. శ్రీయతే సర్వైః ఇతి - అందరి చేత ఆశ్రయింపబడినది.. ధనం, ధాన్యం, ఆరోగ్యం మొదలైన సంపదలకై అందరిచేత ఆశ్రయింపబడినది
2. శ్రుణోతి ఇతి శ్రీ - ఎవరు బాగా వింటారో వారు శ్రీ..ఎవరు భక్తుల ప్రార్ధనలను విని స్వామికి చెపుతుందో ఆ తల్లి.
3. శ్రుణాతి ఇతి శ్రీ - నాశనము  చేసేటివంటిది. ఎవరు తనను ఆశ్రయించిన భక్తుల పాపములను నశింపచేస్తుందో ఆ తల్లి శ్రీ ..
4. శ్రయతే భగవంతం ఇతి శ్రీ - ఎవరైతే భగవంతుని సతతము ఆశ్రయించి ఉంటుందో , సర్వదా భగవంతునియందే ఉంటుందో అది శ్రీ..బ్రహ్మాశ్రయమైన మాయ అని చెప్పడం.. శక్తివంతునికంటే శక్తి వేరుగా ఎలా వుండజాలదో అలా ఆ తల్లి లక్ష్మీ ఎప్పుడూ విష్ణువునందే ఉంటుంది. ఆయనను సర్వదా ఆశ్రయించి ఉంటుంది..
ఆ తల్లి పేరు శ్రీ. ఆ శక్తి పేరు శ్రీ.. ఆ తత్వమునకు శ్రీ అని పేరు..
                 
మంత్రం - 1
ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||

సాధరణముగా ఏ దేవతను ప్రార్ధించినా మొదలు ఆ దేవత యొక్క సంబోధన, ఆవహన మొదలైనవి ఉంటాయి.. కాని ఈ మంత్రములో ఈ దేవతను సంబోధించడము లేదు, ఆవహన చెయ్యడము లేదు.  ఇక్కడ
హే జాతవేదః లక్ష్మీ మే ఆవహ -ఓ జాతవేదుడా! నా కొరకు లక్ష్మిని ఆహ్వానించు అని ఉంది..
ఇక్కడ సంపదను కోరినటువంటి ఋషి లక్ష్మిని అహ్వానించమని జాతవేదుని ప్రార్ధన చేస్తున్నారు.
ఎందుకు ??

ఒక్కొక్క పద్దతిని బట్టి ఒక్కొక్కరు ఆహ్వనిస్తేనే పని జరుగుతుంది. ఉదాహరణకి ఒక ఉన్నత పదవిలో ఉన్న పెద్దవారిని ఆహ్వనించాలంటే వారికి సంబందించిన వారికి చెప్పి వారి ద్వారా పెద్దవారిని అహ్వనించినట్లుగా
     
1. అత్యంత పూజ్య భావన కలిగిన వారిని నేరుగా సంబోధించడం కుదరదు. ఇది శిష్టాచార పద్దతి.
2. వైదిక దేవతలను అగ్ని ద్వారనే పూజించాలి. ఇక్కడ జాతవేదుడు అంటే అగ్నిదేవుడు. అందుకే
ఓ అగ్నిదేవా! నా కొరకు శ్రీలక్ష్మీదేవిని ఆవాహన చేసి తీసుకొని రండి  - అని ఆ ఋషి ప్రార్ధన చేస్తున్నారు.

ఈ జాతవేదుడంటే ఎవరు ?
1. జాతః వేదః ఇతి - పుడుతూనే అన్ని తెలిసినవాడు. సకలము తెలిసినవాడు. - వైదిక క్రతువులో అరణి మధనము ద్వార, మంత్రోఛ్ఛారణ ద్వార యాగాగ్నిని ఉత్పాదన చేస్తారు. అలా ప్రకటింపబడిన అగ్ని అత్యంత పవిత్రమైనది. ఆహితాగ్నుల ప్రకారము ఈ అగ్ని ప్రత్యక్ష దైవము.. వేదములో కర్మకాండ ప్రకారముగా ఈ అగ్ని లేనిదే ఏ క్రతువు నడవదు.
2. అగ్రణీ - అగ్రే నయతి - అందరికంటే ముందు ఉండేవాడు. దేవతలలో ప్రధముడు. అగ్ని లేకుందా ఏ ధార్మిక కార్యక్రమము నడవదు..   ఋగ్వేదము లొని ప్రధమ  మంత్రము
"ఓం ఆగ్నిమీడే పురోహితం యజ్ఞస్యదేవమృత్విజం  హోతారం రత్నధాతమం"    వేదము ప్రారంభం అవ్వడమే అగ్ని స్తుతితో ప్రారంభమయ్యింది.
===========
out of context - The very first sound that is recorded by Prof. Max Muller when gramaphone was invented by Thomas Alva Edison is this first Veda mantram.
http://www.metroindia.com/news/article/26/06/2015/edison-gramophone-record-max-muller-the-rig-veda/7178
==================
3. ఇంకా ఈ అగ్నిదేవునికి దేవముఖుడు అని పెరు.. వైదిక దేవతలు దేనిని భుజించాలన్నాఅగ్ని ద్వారానే భుజిస్తారు.
4. అలాగే - హవ్యవాహనుడు అని  ఇంకొ పేరు. యజ్ఞములో అగ్నిదేవుడు మన పక్షము వహించి మన కొరకు దేవతలను ఆహ్వానిస్తాడు. యజ్ఞమునందు సమర్పించిన వాటిని ఏ దెవతను ఉద్దెశ్యించి వేస్తామో ఆ దేవత దగ్గరకు మోసుకొని తీసుకువెళతాడు.
ఇవాళ కూడా ఇంట్లో నిత్య పూజలో మొదట దీపము వెలిగిస్తాము. ఇది అగ్నిదేవునికి సంకేతము. దీపము వెలిగించి ఏమి సమర్పించినా ఆ దేవతకు సమర్పింపబదుతుంది అనే భావన.                   

పైన చెప్పినవి బాహ్యమైన భావన..
5. తాత్వికపరముగా చూస్తే - జాతః వేదః యస్మాత్ సః - ఎవరినుండి వేదములు జన్మిస్తాయో  అతనికి జాతవేదుడు అని పేరు. ఇక్కడ జాతవేదుడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడే అని సూచిస్తున్నారు.. (ఋచస్సామాని జిజ్ఞిరే - పురుష సూక్తము ..) సమస్త జ్ఞానము నారయణుని నుండే పుడుతోంది. అందుకు , ఓ నారాయణా! నా కొరకు ఆ లక్ష్మీదేవిని ఆహ్వనించు అని ప్రార్ధన చెయ్యడము.. ఈశ్వరుడు ఇయ్యకుండా మనకు సంపద రాజాలదు.. ఇక్కడ సంపద అంటే జ్ఞాన సంపద అని కూడ.       
లక్ష్మీ నారయణుని శక్తి. కనుక నారయణుడే లక్ష్మిని ఆహ్వానించగలడు.
ఇక్కడ నారయణుడే అంటూ అగ్నికే నమస్కారము చేస్తున్నాము. ఎందుకు?
యజ్ఞోవై విష్ణుః - శ్రుతి వాక్యము
త్వం యజ్ఞః - పురుష సూక్తము               
ఇక్కడ యజ్ఞము అంటే అగ్ని కార్యము అనే ప్రధానమైన అర్ధముగా గ్రహిస్తే విష్ణువే అగ్నిదేవుడై ప్రకటింపబడినాడు అని గ్రహించాలి..     

హే ఆగ్నిదేవా!, అగ్ని రూపముగా మా ముందర సాక్షాత్కరించిన హే విష్ణూ!,మా ధర్మాచరణ కొరకై కావలసిన సంపదలను అనుగ్రహించేందుకై  శ్రీమహాలక్ష్మిని  మా కొరకై ఆహ్వానించండి - అని ఋషి ప్రార్ధన చేస్తున్నారు

ఇప్పుడు అసలు ఈ లక్ష్మి ఎవరు ?
శ్రీదేవి సంపదకు అధిస్టానాదేవత అని చెప్పుకున్నాము. మరి మళ్ళీ లక్ష్మీ అని ఎందుకు సంభోదించేరు ఋషులు ?  ఈ లక్ష్మి అంటే ఎవరు ?  ఈ విషయమును మళ్ళీ చెప్పుకుందాము.

సర్వం శ్రీబాలాత్రిపురసుందరీ దివ్యచరణారవిందార్పణమస్తు

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...