Friday, November 9, 2018

కార్తీక చతుర్ధి-నాగుల చవితి

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. 

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం! 

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!

నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. 

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! 

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. 

నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కార్తీక దీపము

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. 

అనాదిగ ఈ రోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ''ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!'- అని.
అనేక స్థలములలో విగ్రహములలో ఈశ్వరుని ఆవాహన చేయురీతినే ఈరోజు దీపములో దామోదరుడనే మూర్తినో లేక ఉమాదేవీ సహితుడైన త్య్రంబకునో- ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కేశవ, నారాయణ, మాధవ- అని చెప్పు నామములతో పండ్రెండవ నామము, దామోదరుడు, ఆయననో లేక ఉమాసహితుడైన త్య్రంబకునో ఆవాహన చేస్తారు.
కృత్తికా పూర్ణిమ నాడు దీపములో ఈశ్వరుని ఆవాహనచేసి- ఈ దీపజ్వాలను చూచినను సరే- ఈ దీపజ్వాలపైబడిననుసరే, చూచుటకు శక్తికల జీవులు, శక్తిలేని జీవులు - ఏవి అయినను-వాని పాపములు నశించాలి అని ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి 'లోకా స్సమస్తా స్సుఖనో భవన్తు', అనే సంకల్పము ఋషులు వెలిబుచ్చారు. కృత్తికానక్షత్రము, పూర్ణిమతిథి-రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. నక్షత్రము ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చుట కూడ ఉంది. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము. తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెటతారు. దీపము వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తినో, దామోదరమూర్తినో ఆవాహనచేసి- 'కీటాః పతంగాః' అనే శ్లోకం చదువుతారు.
ఈ దీపదర్శనమువలన మనుష్యుల పాపములేకాదు. పశుపక్షి కీటకముల పాపములు సైతము నశిస్తాయి. మన మలి పుట్టుక ఏదో మనకు తెలియదు. మనము ఏమ్రాను అయినా కావచ్చు. మశకమయినా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణికోటికి పాపనివృత్తి - ప్రసాదించాలి - అని ప్రార్థన చేయుట.
చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై - అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా - దీపము వెలిగిస్తారు.
జ్వాలాదర్శనముచేసే జనుల పాపములేకాక కీటాః - పురుగులు, పతంగాః - పక్షులు, మశకాః - దోమలు, వృక్షాః - చెట్లు, వీని కన్నిటికీ జన్మనివృత్తి కావాలి. చెట్లు చేమలు లతలు కొన్ని రోజు నీరు పోయకపోతే వాడిపోతాయి. శోషిస్తాయి. ఇది మనము ఎఱిగిందే. వాని జన్మసైతము నివృత్తి కావాలి. జల్సేజలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థల్సేస్థావరాలైన జంతువులు- ''దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగినః''. త్ర్యంబకుని ఆవాహన చేసిన దీపము చూచినా, ఆ దీపజ్వాలయొక్క వెలుతురు వానిపైపడినా - పుష్టివర్థకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాపనివృత్తి కావలెనని కరుణాస్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు.
ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నిటికి పాదములే ఉండవు. వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేలకొలది కాళ్లు. అవి సహస్రపాదులు. 'తే ద్విపాద్‌ చతుష్పావ్‌' అని వేదములో చెప్పబడింది. 'సకలము క్షేమముగా ఉండాలి' అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. 'లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు' అని అన్ని లోకాల సుఖమూ కూడ కోరాలి.
కృత్తికా దీపమునాడు చెప్పవలసిన శ్లోకము
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||
పై శ్లోకమును విడివిడిగా భాగించి స్ఫుటంగా చెప్పడం. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు పశువులు పక్షులు కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అనియే. అదే ఈ శ్లోక తాత్పర్యము. ఇది పరంపరగా వస్తూ ఉంది. ఈశ్వరుని ఆవాహన చేసిన ఈ దీప ప్రకాశమే పరమేశ్వర స్వరూపము, పాపవిమోచకము.
కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని - జ్ఞాపకార్థమైఉంది. ఈ ఆరు నక్షత్రములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఆరు నక్షత్రములే షణ్మాతృకలైన సుబ్రహ్మణ్యస్వామియొక్క తల్లులుగా చెప్పబడుతూ ఉన్నవి.
మరొక విశేషం, ఏమంటే - శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము - కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క ఉత్సవము విశేషము. కాని అన్ని గుడులలో, అన్ని క్షేత్రములలో - ఒకే రోజున విశేషముగా - మూర్తి భేదములేక చేసే ఉత్సవం ఇదే 'లోకా స్సమస్తాస్సుఖినో భవన్తు' అనే వాక్యానికి వ్యాఖ్యానమా? అన్నట్లు - ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణికోటికి జన్మనివృత్తి ఔతోంది. అందుచే మనము కృత్తికా పూర్ణిమనాడు (కార్తికమాసమున పూర్ణిమనాడు) దీపదర్శనముచేసి- దామోదరుని ఉమాసహిత త్ర్యంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనచేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాపనివృత్తులమై లోకులక్షేమానికై ప్రార్థించుట కర్తవ్యము.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Thursday, November 8, 2018

భగినీ హస్త బోజనం

అనుబంధాలకు ఆప్యాయతలకు
అరమరికలులేని అనురాగాలకు
నిలువెత్తు నిదర్శనం భగినీహస్తభోజనం
వివాహభందాలతో దూరమైన సోదరిని
కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని
వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ
ఎన్నిపనులున్నా వదలరాదు ఈ సంప్రదాయం.
‘భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న
పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.

Wednesday, November 7, 2018

కార్తీక పురాణము అధ్యాయము- 1



కార్తీక మాహాత్త్యమును గురించి జనకుడు ప్రశ్నించుట

శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మండమండలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.
ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, "ఆర్యా! తమవలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగ గ్రహించినారము. కార్తీకమాస మాహాత్త్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరు చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది" అని కోరిరి.
అంత నా సూతమహర్షి "ఓ మునిపుంగవులారా! ఒకప్పుడు యిదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి - విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ, సాంబశివుడు పార్వతీదేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక, యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపు" డని యిట్లు చెప్పెను.
పుర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించు చుండగా పార్వతీదేవి " ప్రాణేశ్వరా సలలైశ్వర్యములు కలుగచేయునట్టిదీ, సకల మానవులూ వర్ణబేధములు లేక అచరించదగినదీ, శాస్త్ర సమ్మతమైనదీ, సూర్యచంద్రులున్నంత వరకూ నాచరింపబడెడిదీ యగు వ్రతమును వివరింపు" డని కోరెను. అంతట మహేశుడు మందహాస మొనరించి "దేవీ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దాని నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలానగరమువైపు" అని మిథిలానగరపు దెసగా చూపించెను.
అట, మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమరాకవల్ల నేనూ, నా శరీరమూ, నా దేశమూ, నా ప్రజలూ పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నాదేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను.
అందులకు వశిష్ఠుడు - జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి యిటు వచ్చితిని - అని పలుకగా జనకుడు "మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కాని, చిరకాలమునుండీ నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా యదృష్టము కొలదీ యీ యవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేల నంత పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమిటి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కర్తీక మాహాత్త్యమును గురించి వివరించవలసినది" యని ప్రార్థించెను.
వశిష్ఠమహాముని చిరునవ్వు నవ్వి, "రాజా! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులునూ ఆచరించదగినది సకల పాపహరమైనదీ అయి ఉన్నది. ఈ కార్తీకమాసము హరిహర స్వరూపము. ఈ మానమునందాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నానందదాయకమైనది. అంతియే గాక వినినంతమాత్రముననే యెట్టి నరకబాధలను లేక యిహమందునూ, పరమందునూ సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు" మని యిట్లు చెప్పసాగెను.
వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట:
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను యే వయస్సువాడైనను 'ఉచ్చ - నీచ' అనే భేదములేక కార్తీక మాసములో, సూర్యభగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మములును, దేవతాపూజలునూ చేసినచో - దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కర్తీకమాస ప్రారంభమునుండియు యిట్లు చేయుచూ, విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి "ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలయును.


*కార్తీక స్నానవిధానము*

ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకుని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృ దేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి, మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని,గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిధి ఆభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి, తనయింటి వద్దగాని, దేవాలయములలో గాని, లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందుగాని, విష్ణ్యాలయమందుగాని, లేక తులసికోటవద్దగాని, దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసినవారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి మొదటి యధ్యాయము

మొదటి రోజు పారాయణము సమాప్తము.

అందరం ఓం నమః శివాయ అని వ్రాసి ఆ మహా దేవుని అనుగ్రహం పొందుదాం ...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

దీపావళి - ప్రాముఖ్యము

        

ఆశ్వయుజ  బహుళ చతుర్దశిని  నరక చతుర్దశి అని , ఆ మరుచటి రోజు అమావాస్యను దీపావళి అని , మహా ప్రముఖమయిన   పండుగలుగా మహాలక్ష్మి అసీస్స్సుల కోరకు, అనుగ్రహము కొరకు  భారత దేశమే కాదు, విదేశాలలో కూడా    భారతీయులు నివసించు నేపాలు, శ్రీలంక, మలేషియా,  యూరప్, అమెరికా మొ. దేశాలలో వేడుక గా జరుపుకొను పండగ ఈ దీపావళి..దీనిని కొన్ని ప్రాంతములలో,.ఐదు రోజులు, నాలుగు రోజులుల, మూడు,రోజులు, రెండు రోజుల పండుగ గా జరుపుకొను అచారమున్నది.  ప్రాంతాల వారిగా దేశకాల ఆచారము బట్టి  జరుపుచున్నారు. త్రయోదశినాడు, అక్షయతృతీయ అని ,తరువాత నరక చతుర్దశి అని  తరువాత అమావాస్యనాడు దీపావళి గా  తరువాత కార్తిక మాసం మొదటి రోజు పాడ్యమి నాడు బలి  పాడ్యమని  విదియనాడు యమ విదియ గాను, ఈ పండుగను భారత దేశంలో అనాదిగా ఆచరించుచున్న ఆచారం .దీపావళి అనగా దీపముల వరుస. దీపముల సమూహము అని కుడా అర్ధము  చెప్పవచ్చును . ఈ పదము సంస్కృత సమము, .ఏకవచనము.,నామవాచకము.

                               శుభం కరోతి కల్యాణం  ఆరోగ్యం ధనసంపదం
                               శత్రు వృద్ది వినాశాయ  దీపం జ్యోతి నమోస్తుతే
                               దీపం జ్యోతి పర బ్రహ్మ దిపంజ్యోతి జనార్దనః 
                               దిపోహరతి పాపాని సంద్యా దీప నమోస్తుతే !

సకల కళ్యాణ ప్రదము,ఆరోగ్యము,ధనము,శత్రువులపై  విజయము ప్రసాదించు దీపమునకు నమస్కరించు చున్నాను,
ఈ దీపము ,పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపము , సకల పాపములు. హరించు సంద్యా దీపమునకు  నమస్కారము. అని ఈ శ్లోకమున దీప ప్రాసత్యమును  చెప్పుచున్నారు. సంధ్య అనగా మూడు సంద్యలు అని అర్ధము.చెప్పుకోవాలి . .

ఈ దీప ఆరంభము  విశేషము గూర్చి తెలుసుకొందాము.  ఒకనాడు  ఇంద్రుడు  దుర్వాస మహా మునికి ఆతిధ్య మిచ్చి సకల సత్కారములు చేసి ఆసీస్సులర్ధించెను. దానికి ఆముని సంతోషించి మహా మహిమాన్విత మయిన ఒక పూలహారమును  బహుకరించెను.  ఇంద్రునకు అది అంత గొప్పదిగా కనిపించలేదు. ఆ హారమును తన ఐరావతము మేడలోకి విసిరెను.  ఆ ఏనుగు ఆ హారమును  క్రింద పడవేసి కాళ్లతో త్రోక్కేను . దానికి ఆ తాపసి ఆగ్రహించి , ఇంద్రుని తన ఐశ్వర్యము,పదవి పోయి బ్రష్టుడవు కమ్మని శపించి  వెడలిపోయేను..మహేంద్రుడు చేసిన అపరాధము గ్రహించి మహావిష్ణువు ఆశ్రయించి ,విషయము వివరించి , దానికి నివారణ, తరుణోపాయము అనుగ్రహించమని వేడుకొనెను.  ఆ పరమాత్మ ఇంద్రునకు మహాలక్ష్మి స్వరూపమయిన  దీప  మహత్యమును చెప్పి దీపారాధన ,జ్యోతి నమస్కారము , ,ఆవశ్యకత , ఫలము వివరించెను.  ఇంద్రుడు ఆ విధముగా  వివిధ దీపములతో  మహాలక్ష్మిని  ఆరాధించి  ఆమె అనుగ్రహము సంపాదించి  మరల పూర్వ  వైభవమును  సంతరించుకోనేను..  ఇది దీప మహాత్యము తెలుపు పురాణ గాధ . ఈ దీపము అజ్ఞానమును తొలగించి  సన్మార్గము చూపుచు మానవాళికి మహోపకారి యగు  మహలక్షియె నని హిందువుల  విశ్వాసము..

మరియు  శ్రీ మహావిష్ణువు  ద్వాపరమున  నరకాసురుని సంహరించి  దేవ మునిగణ  సాదు సజ్జనులను వాని బారి నుంచి కాపాడిన రోజుగా నరక చతుర్దశిని  జరుపు కొనుట మన ఆచారము.ఆ తరువాతి అమావాస్యనాడు ఆ సంబరము జరుపుకొని మహాలక్ష్మిని  పూజించుట దీపావళి ప్రాముఖ్యము.   ఆ నరకాసుర సంహార ఘట్టమును ముందు వివరముగా మనవిచేసేదను.  మరియొక గాధ :  శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతా సమేతుడయి  అయోధ్యకు వచ్చిన రోజుగా కొందిరి భావము . జైనుల చివరి తీర్ధంకరునకు, మోక్షం  సిద్ధించిన రోజుగా వారి  ఆచారము ప్రకారము ఈ దీపావళి పండుగ జరుపు కొందురు.  బలిచక్రవర్తి  పాతాళము నుంచి తిరిగి వచ్చిన రోజని  మరి కొందరి నమ్మకము.. .  .

దక్షణ భారతమున మాత్రము నరక చతుర్దశి  దీపావళి పాడ్యమి  మూడు రోజలు అరుపుకోను ఆచారమున్నది. కార్ణాటక మహారాష్ట్రలలో, కార్తికమాస మొదటి దినము  పాడ్యమినాడు పశువులకు అలంకారము చేసి పూజించు సాంప్రదాయము కలదు. దీనిని బలిపాడ్యమి గా  వ్యవహరింతురు . ఆ తరువాతి రోజు , విదియనాడు యమ ధర్మ రాజు తన సోదరి ఇంటికి వెళ్లి ఆతిధ్యము స్వీకరించి ఆమెను ఆశిర్వదించేనని యమవిదియ నాడు  సోదరులు సోదరి గృహమునకు వెళ్లి ఆశీర్వదించి  బహుమతులు ఇచ్చుట మనము చూచుచున్నాము ...

ఈ పర్వదినమున  హిందువులు ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానము చేసి , గృహములను పువ్వులతోను తోరణములతోనూ  అలంకరించి ముగ్గులువేసి అలంకరించాలి . సాయంకాలమున , ప్రదోష  సమయమున, దీపము దక్షిణదిక్కుగా తిరిగి వెలిగించి,  పెద్దలకు నమస్కారము చేయవలెను..  ఇలా చేయుట వారికి ముక్తి మార్గము చూపునది  అని  భావిస్తారు. దీనినే ఉల్కాదాన మంటారు. దీనిని దీపావళి నాటి సాయంత్రము  ముందుగా చేయవలెను.  అనం తరము  భక్తి శ్రధలతో మహాలక్ష్మి ఆరాదించి ప్రార్ధించి  వేడుకగా బణసంచా వెలిగించి  ఆనందించు పండుగ ఈ దీపావళి .ఈ పండుగ ప్రాముఖ్యమంతయు మహాలక్ష్మిని  ఆరాధించుట ,కొలుచుట ,పూజించుట అని గ్రహించవలెను .

పంచ భూతములలో అగ్ని ప్రధానమయినది.  ఈ అగ్ని దీపమే, దీపస్వరూపమె . అగ్నిలో తేజస్సు, ఆహారం, విద్యా నిండి ఉంటాయి . అందుచే అగ్ని హోత్రమునకు మన సంప్రదాయమున మిక్కిలి ప్రాధాన్య మీయబదినది దీపములో మూడు రంగులు కలిసి ఉంటాయి  అవి నీలము ,పసుపు, తెలుపు. ఇవి సత్య ,తమో,  రజో గుణాలకు సంకేతములు మరియు లక్ష్మి ,సరస్వతి, దుర్గలకు కూడా ప్రతీకలు .ఈ దీపాన్ని ఆరాధించుట త్రిజగన్మాతలను  ఆరాధించుటయే.ఈ దీపారాధన తో ముగురమ్మలను పూజించి, ప్రసన్నం చేసుకోను తరుణోపాయం   ఈ దీపావళి  రోజుని , ఉత్తర భారత దేశమున నూతన సంవత్సరముగా  భావించి , క్రొత్త కాతాలు, పుస్తకాలు తెరచి  వ్యాపారారంభం చేయు ఆచారము మనకు తెలిసినదే. ఇట్టి మహా మహిమాన్వయితమయిన ఈ పండుగ హిందువులందరి  ముఖ్యమయినది .శుభ మయినది.

Sunday, November 4, 2018

దీపావళి పండుగ సందర్భంగా

5 రోజుల దీపావళి

దీపావళి అంటే సంతోషం ... సందడి ... సంబరం. ఈ రోజున ఉదయం వేళలో ఇళ్లన్నీ పసుపు గడపలతో ... మామిడి తోరణాలతో కళకళలాడుతూ కనిపిస్తాయి. ఇక చీకటిపడే సరికి అందరి ఇళ్లలోనూ అనేక దీపాలు పసిడి వెలుగులను విరజిమ్ముతుంటాయి. ఈ వెలుగులకు భయపడిన చీకటి ఎక్కడా దాచుకోవడానికి చోటులేకపోవడంతో పొలిమేరలు దాటి పారిపోతుంది.

చీకటిని వెలుగులు తరిమి కొట్టడాన్ని చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా చెప్పుకుంటూ వుంటారు. ఇందుకు కారణమైన కథగా మనకి నరకాసుర సంహారం కనిపిస్తుంది.
శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ధరించినప్పుడు ఆయనకీ ... భూదేవికి జన్మించినవాడే నరకాసురుడు. ఆయన తపస్సుకు మెచ్చిన శివుడు, తల్లి చేతిలో తప్ప మరెవరి చేతిలోను మరణంలేని విధంగా వరాన్ని ప్రసాదిస్తాడు. వరగర్వితుడైన నరకాసురుడు అటు దేవతలను ... ఇటు మానవులను నానాబాధలు పెట్టసాగాడు.

ఈ విషయం తెలుసుకున్న శ్రీమహావిష్ణువు, శ్రీకృష్ణుడిగా నరకాసురుడిపై యుద్ధాన్ని ప్రకటించి, సత్యభామగా జన్మించిన భూదేవిని వెంటబెట్టుకుని వెళతాడు. సతీసమేతంగా యుద్ధానికి వచ్చిన కృష్ణుడిని ఎగతాళి చేసిన నరకాసురుడు, ఆమె చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. లోక కంటకుడైన నరకుడి పీడ వదిలిందనే సంతోషంతో అంతా దీపాలు వెలిగించి మతాబులు కాల్చి సంబరాలు జరుపుకుంటారు. తరతరాలుగా ఇదే విధానం దీపావళి పండుగ పేరుతో కొనసాగుతోంది.

ఇక పురాణ సంబంధమైన కథ ఇలా వుంటే, ధర్మ శాస్త్రం మాత్రం దీపావళి పండుగ ఉద్దేశం పితృదేవతలను సంతృప్తి పరచడమేనని చెబుతోంది. దీపాలను వెలిగించి పితృదేవతలకి ఆహ్వానం పలకడం, మతాబులు కాలుస్తూ వారి రాకపట్ల సంతోషాన్ని వ్యక్తం చేయడం ... తారాజువ్వాలను కాలుస్తూ వారికి ఆకాశ మార్గం స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ పండుగలోని పరమార్థమని అంటోంది.

ఈ రోజుల్లో వానలు కురవడం ... చలి పెరుగుతూ వుండటం వలన అనేక రకాలైన క్రిములు వివిధ రకాలైన వ్యాధులను కలిగిస్తుంటాయి. వాటిని నియత్రించడం కోసమే దీపాలను వెలిగించడం, టపాకాయలు పేల్చి ఆ పొగవల్ల అవి నశించేలా చేయడం జరుగుతుందని అంటారు.
ఇక ఈ రోజున శ్రీ కృష్ణుడు ద్వారకానగరానికి చెందిన 16000 మంది గోపికలకు నరకాసురుడి చెర నుంచి విముక్తి కలిగించాడు కనుక, అందుకు సంకేతంగా కొంతమంది 16 దీపాలను వెలిగిస్తుంటారు. మరికొందరు 33 కోట్ల మంది దేవతలకు సంకేతంగా 33 దీపాలు వెలిగిస్తుంటారు.
ధనత్రయోదశి .. నరకచతుర్దశి .. దీపావళి ... బలిపాడ్యమి ... యమద్వితీయ అయిదు రోజుల పండుగలా భావిస్తుంటారు కనుక కొందరు అయిదు దీపాలను వెలిగిస్తుంటారు. భూదేవి దీపం వేడిని భరించలేదట. అందువలన ప్రమిదలో ప్రమిద పెట్టి వెలిగిస్తుంటారు ... ఆ బంగారు కాంతుల్లో అనుబంధాల వాకిట్లో ఆనందాల సందడి చేసేస్తుంటారు.

1. ధన త్రయోదశి

ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నాడు ‘ధన్వంతరి జయంతి’ మరియు ‘ధన త్రయోదశి’ ని జరుపుకుంటాం. ధన్వంతరిని ఆయుర్వేద వైద్యానికి ఆద్యకర్తగా భావిస్తారు. క్షీరసాగర మథనం జరిగినపుడు శ్రీమహావిష్ణువు అంశగా అమృత కలశహస్తుడై  ప్రజలకు ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ధన్వంతరి అవతరించిన రోజు. కుబేరుడు దేవతలకు ధనాధ్యక్షుడు. ధన త్రయోదశిరోజు ఆయనను భక్తితో పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. 

ఈనాడు సూర్యోదయానికి ముందే నదీ స్నానం కాని లేదా సముద్ర స్నానం కాని ఆచరించాలి. గృహంలో కాని, నదీ లేదా సముద్ర తీరాలలో కాని, వైద్యశాలలో కాని తూర్పు దిక్కుగా కలశ స్థాపన చేసి ధన్వంతరికి ఆవాహన చెయ్యాలి.
ధన్వంతరిని ధ్యానించిన తర్వాత యధాశక్తి షోడశోపచార సహితంగా పురుషసూక్త విధానంతో అర్చన జరపాలి. మత్స్యపురాణాంతర్గతమైన స్తోత్రాన్ని పఠించి, గరుడ పురాణాంతర్గతమైన ధన్వంతరి సార్థవ్రత కథను పారాయణ చేయాలి. వ్రత సమాప్త్యానంతరం ఇతర వైద్యులకి, పెద్దలకి తాంబూలం సమర్పించి, ఘృతయుక్తమైన పెసర పులగం నివేదన చేసి భుజించాలి.
వైద్యులు తప్పకుండా ఈ   రోజు ధన్వంతరి పూజ చేయాలి. అలా శ్రద్ధగా పూజిస్తే  వైద్యుల హస్తం అమ్రుతీకరణం అవుతుంది. తద్వారా వారు ఇచ్చిన మందు రోగికి  అమ్రుతంవలె పనిచేస్తుంది.     దీనినే హస్తవాసి అంటారు

ఈరోజు ఐశ్వర్య, సౌభాగ్యదాయిని ధనలక్ష్మీదేవిని పూజిస్తారు.  ఆమెను ఈరోజు పూజించడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. పూర్వం హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ పుత్రుడు జన్మించాడు. అయితే ఆ కుమారుడు జాతకరీత్యా  వివాహమైన నాలుగవ రోజు పాముకాటుకు గురై చనిపోతాడని చెబుతారు. ఆ కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. వివాహం కూడా అవుతుంది. ఆ రాకుమారుడి భార్య వివాహమైన నాలుగోరోజు రాత్రి రాజసౌథాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలని రాశులుగా పోసి  ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని పూజిస్తుంది. రాకుమారుడి ప్రాణాల కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీపకాంతి, బంగారు, వెండి ధగధగలకు కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు. వచ్చిన పని మరచిపోయి తెల్లవారి తిరిగి వెళ్తాడని చెబుతారు. ధనలక్ష్మీ దేవి అనుగ్రహం వల్లే తన భర్తకు ప్రాణహాని తప్పిందని పురాణ కథనం. అందుకే ఈరోజు స్త్రీలు సౌభాగ్యానికి,  ఐశ్వర్యానికీ ధన త్రయోదశిని సూచికగా భావిస్తారు. అందుకే ఈరోజు శక్తి కొలది లక్ష్మీ అనుగ్రహం కొరకు ధన లక్ష్మి ని పూజిస్తారు. దీనినే యమ త్రయోదశి గా కూడా జరుపుకోవడం ఆనవాయితీ గా వస్తోంది.

2. నరక చతుర్దశి

నరకాసుర సంహారం జరిగింది ఈరోజే. పైన   వివరంగా తెలుసుకున్నాము కదా ? ఇంకా ఈ చతుర్దశి రోజున ఆచరించాల్సిన  విధానాలు ఇవి
👉 ఈ చతుర్దశి యమునికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో తలంటుకొని, అభ్యంగన స్నానం చేయాలి. ప్రత్యేకించి ఆ వేళ నువ్వులనూనెలో లక్ష్మి, మంచినీటిలో గంగాదేవి కొలువై ఉంటారని శాస్త్రాలు వివరిస్తున్నవి. యమ ధర్మరాజును స్మరించి, నమస్కరించి, యమ తర్పనం చేయడాన్ని విశిష్టంగా పెద్దలు చెబుతారు. అభ్యంగన స్నానానంతరం దక్షణాభి ముఖంగా ‘యమాయ తర్పయామి’ అంటూ మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణం ఇవ్వడం ఆచారంగా మారింది. యమున్ని పూజించి, మినుములతో చేసిన పదార్థాలు తినడంతోపాటు సూర్యాస్తమయం తర్వాత ముంగిట్లో, పడకగదిలో దీపాలను వెలిగించి, టపాకాయలు కాలుస్తారు. ఈ చతుర్దశి రోజు సాయంత్రం ఎవరైతే దీపాలు వెలిగించి దానధర్మాలు చేస్తారో వారి పితృదేవతలకు నరకబాధ తొలగుతుందని భారతీయుల నమ్మకం. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి రెండో జాములో నరకాసుర సంహారం జరిగింది. కనుక మూడో జాములో అభ్యంగస్నానం చేసినవారికి నరక భయం తీరుతుందని శాస్త్ర వచనం.  పితృ దేవతలకు నరక బాధలు లేకుండా చేసే చతుర్దశి  కనుక నరక చతుర్దశి అని కూడా వ్యవహరిస్తారు.

3. దీపావళి

లోక కంటకుడు అయిన నరకుని పీడ తొలగినందుకు దీపావళి జరుపుకుంటారు. పైన వివరణ చదువుకున్నాం కదా ? ఇంకా ఈరోజున చేయాల్సిన విశేషాలు చూద్దాం.
దీపాలంకరణ మరియు లక్ష్మీ పూజ

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. మహిళామణులంతా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో దీపాలను వెలిగిస్తారు. చివరకు ఈ దీపాలను ముత్తయిదువులు కార్తీక పౌర్ణమికి సముద్ర స్నానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు. ఇవి సౌభాగ్యానికి, సౌశీల్యానికి, సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తారు. పైగా ఈ దీపావళి శరదృతువులో అరుదెంచటం విశేషం. మనోనిశ్చలతకు, సుఖశాంతులకు అనువైన కాలమిది. దీపాలపండుగ అయిన దీపావళి  రోజున మహాలక్ష్మీ పూజను జరుపుకోవడానికి ఓ విశిష్టత ఉంది.
పూర్వం దుర్వాస మహర్షి ఒకమారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతం అను ఏనుగు మెడలో వెేస్తాడు అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది. అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యమును కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు. దానికి తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి.

ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చెంతనే ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు. తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండటం న్యాయమా? నీ భక్తులను కరుణించవా? అంటాడు. దీనికి ఆ మాత సమాధానమిస్తూ.. త్రిలోకాథిపతీ.. "నన్ను త్రికరణ శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభీష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మీ రూపంగా, విజయాన్ని కోరేవారికి విజయలక్ష్మీగా, విద్యార్థులు నన్ను ఆరాధిస్తే విద్యాలక్ష్మీగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మీగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నురాలౌతానని" సమాధానమిచ్చింది. అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం.
దీపావళి పర్వదినాన లక్ష్మీ కుబేర వ్రతము లేదా వైభవలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరిసింపదలు వెల్లివిరుస్తాయి. అలాగే అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే దీపావళి నాడు కుబేర వ్రతాన్ని ఆచరించడం ఎంతో మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటారు .  దీపావళి రోజున దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం.

4. బలి పాడ్యమి

దీపావళి మరుసటి రోజు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున హిందువులు బలి పాడ్యమి గా జరుపుకుంటారు.
పాడ్యమి రోజు ఉదయాన పంచవర్ణముతో బలిని నిర్మించాలి. తెల్లని బియ్యంతో పరివారాన్ని నిర్మించాలి. ఆ మీద పూజ చేయాలి. బలిని ఉద్దేశించి యధాశక్తి దానాలు చేయాలి.

  బలి ప్రార్థన

బలిరాజ నమస్తుభ్యం విరోచన సుతప్రభో !
భవిష్యేంద్ర సురారాతే పూజేయం, ప్రతిగృహ్యతాం !!

బలి చక్రవర్తి గురించి మనలో చాలామంది వినేవుంటారు. ఆయనకు 'మాట తిరుగని మానధనుడు’ అని పేరు కూడా ఉంది. ఇచ్చిన  మాట నిలుపుకోవడంలో ఆయనకు ఎంత మంచి పేరుందో అంతటి అహంకారం కూడా ఉంది.   ఒకసారి ఇచ్చిన మాట నిలుపుకోవడానికి.. వామనుడైన విష్ణువుకు తన సర్వస్వాన్ని దానం చేశాడు. అప్పుడు వామనుడు తన మూడవ కాలును బలిచక్రవర్తి తలపై పెట్టి అహంకార భంగం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు. అప్పుడు గర్వభంగమైన  బలిచక్రవర్తి "దేవా! నాకోసం ఏమీ అడగను. నా ప్రజల కోసం ఓ వరం అడుగుతాను అని అన్నాడు. “నా రాజ్యంలో దీపదానం, దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.

ఈ రోజున అనగా కార్తీక శుద్ధ పాడ్యమిన.. మహావిష్ణువుతో కలిసి బలి చక్రవర్తి తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు.  ప్రతి ఇంటి ముంగిట దీపాలూ, మామిడితోరణాలు, రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి, తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం, ఉత్సాహం, భోగభాగ్యాలతో హాయిగా ఉన్నరాని బలి సంతోషపడతాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 'బలి పాడ్యమి 'అయ్యింది. ప్రజల క్షేమం కోసం వచ్చే బలిచక్రవర్తిని ఈ రోజున పూజించాలి.

      ఈ రోజున గోవర్థన గిరి పూజ చేయాలని మన పెద్దలు  చెబుతారు. తనను మాత్రమే పూజించాలని, లేకపోతే అల్లకల్లోలం చేస్తానని.. ఇంద్రుడు భీకర గాలి,తుఫానును సృష్టిస్తాడు. అప్పుడు  శ్రీకృష్ణుడు గోవర్థన గిరిని తన చిటికెన వేలు మీద నిల్పి, ప్రజలను కాపాడి.. ఇంద్రుడికి కూడా ఇదే రోజున గర్వభంగం చేశాడు. కనుక ప్రజలను కాపాడిన గోవర్థన గిరిని, శ్రీకృష్ణుడిని ఇప్పటికీ పూజిస్తాము.

5. భగినీ హస్త భోజనం

కార్తీక శుద్ధ విదియ, అంటే దీపావళి వెళ్ళిన రెండవనాడు వస్తుందీ పండుగ.  ఈనాడు అన్నదమ్ములు తమ తమ అక్కాచెల్లెళ్ళ ఇళ్ళకు వెళ్ళి వారి చేతివంట తిని వారిచేత తిలకం దిద్దించుకుంటారు.
ఒకప్పుడు యముడు తన భటుల్ని కర్తవ్య నిర్వహణలో ఎప్పుడైనా మనసుకి బాధ కలిగిందా? అని అడిగితె ఒక భటుడు భర్త ప్రాణాలు హరించినప్పుడు నవవధువు పడిన వేదన హృదయ విదారకంగా ఉండి తన మనసు పాడైందని చెపుతాడు. యముడు కూడా బాధపడినా చేయగలిగిందేమీ లేదని చెపుతూ ... "ఎవరైనా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరికి బహుమానాలిచ్చి, ఆమె చేతితో తిలకం పెట్టించుకుంటే అపమృత్యువును నివారించవచ్చు'' అంటాడు. దీనికి కారణం ఉంది.
యముడు యమున సూర్యుని పిల్లలు. సోదరిపైన ఉన్న ప్రేమతో ఎవరైతే తన సోదరి అనుగ్రహానికి పాత్రులౌతారో వారికి దూరంగా ఉంటానని వరం ఇచ్చాడట. అందువల్లనే యమునలో స్నానం చేసిన వారికి అపమృత్యు బాధ ఉండదట. అందరూ యమునా స్నానం చేయలేరు కదా! సోదరసోదరీ పరమకు నిదర్శనంగా నిలిచినా యమున, యముల బంధాల్ని గుర్తు చేసుకుంటూ కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ (సోదరి) హస్త భోజనం చేసినట్లయితే అదే ఫలితాన్ని పొందవచ్చు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...