Friday, November 9, 2018

కార్తీక చతుర్ధి-నాగుల చవితి

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. 

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం! 

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!

నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. 

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! 

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. 

నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...