Thursday, November 22, 2018

కార్తీక దీపం సినిమా నుంచి గ్రహించడమైనది


ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
ఇదేసుమా నా కుంకుమ తిలకం
ఇదే సుమా నా మంగళ సూత్రం

||ఆరనీకు||

ఇంటిలోన నా పాప రూపునా గోరంత దీపం..
కంటి కెదురుగా కనబడు వేళల కొండంత దీపం
నా మనస్సున వెలిగే దీపం నా మనుగడ నడిపే దీపం..

||ఆరనీకు||

ఆకాశానా ఆమణిదీపాలేముత్తైదువులుంచారో
ఈ కోనేట ఈ చిరుదివ్వెల చూసి చుక్కలనుకుంటారు..
ఏమైనా ఏదైనా కోవెలలో కొలువై ఉండే దేవికి పట్టిన హారతులే..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
నా నోచిన నోములు పండెననీ ఈ ఆనంద దీపం
నా దాచిన కోర్కెలు నిండుననీ ఈ ఆశా దీపం
ఎటనైనా ఎపుడైనా నే కొలచే కళ్యాణ దీపం నేవలచే నా ప్రాణ దీపం..

ఆరనీకు మా ఈ దీపం కార్తీక దీపం..
చేరనీ నీ పాద పీఠం కర్పూర దీపం
చేరనీ నీ పాద పీఠం నా ప్రాణ దీపం

వృక్ష దేవతలు

హిందువులు అన్ని జీవుల్లోను దేవుణ్ని చూశారు. అందువల్లనే ఆవులు వంటివి పూజనీయ జంతవులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లలో కూడా దేవుణ్ని చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు.
నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ఒకటి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వడంతో బాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. కాగా చెట్లకు మనుషుల మాదిరి ఆనందం, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. అది ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమయింది. భారతీయ రుషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ఇక ఆర్యులు చెట్లతో సహా ప్రకృతి శక్తులను పూజించేవారు. హిందువులు పవిత్ర మైన వృక్ష జాతులుగా పేర్కొనే వాటిలో తులసి, రావి (అశ్వత్థం), వేప, మారేడు, మర్రి, అశోక, ఉసిరి మరి కొన్ని ఉన్నాయి. దేవతా వృక్షాలుగా పేర్కొనే వాటిలో కొన్నిటికి అద్భుతమైన ఔషధ శక్తులు ఉండడం విశేషం. కొన్ని దేవతా వృక్షాల విశేషాలు తెలుసుకుందాం.

తులసి
తులసి పవిత్రమైనదని అందరికీ తెలుసు. ప్రతి ఇంటిలో తులసి ఉండాల్సిన అవసరముంది. తులసి కథ అందరికీ తెలిసిందే. విష్ణుమూర్తికి తులసి ప్రీతికరమని,దానితోఆయనకు పూజ పుణ్యప్రదమనేది అందరికీ తెలిసిందే. తులసిని పవి త్రంగా ఉన్నప్పుడే ముట్టుకోవచ్చని, అనవసరంగా తుంచరాదనే నియమాలు కూడా ఉన్నాయి. తులసి పవిత్రతని చెప్పే ఒక శ్లోకం ఉంది. అది
యన్మూలే సర్వ తీర్థాని, యన్మధ్యే సర్వ దేవతా:
యదగ్రే సర్వ వేదాశ్చ, తులసీం త్వాం నమామ్యహం
మూలంలో సర్వ తీర్థాలు, మధ్య భాగంలో సర్వ దేవతలు, అగ్రభాగంలో సర్వ వేదాలు గల తులసి కి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. తులసికి ఎన్నో ఔషధ గుణాలున్నాయన్నవిషయం తెలిసిందే. తులసికి మనస్సును ఉద్వేగాలను, శరీరాన్ని పరిశుద్ధం చేసే శక్తి ఉందని చెబుతారు. అందువల్లనే యోగులు, సాధువులు వంటి వారు తులసి మాలను మెడలో ధరిస్తుంటారు. ఇతరుల చెడు భావాలను ఎదుర్కొని దూరం చేసే శక్తి తులసికి ఉంది. అంత ఎందుకు తులసిని స్పృశించడమే మనలను శుద్ధి చేస్తుందని చెబుతారు.


రావి
దేవతా వృక్షాల్లో రావి(అశ్వత్థం)ఒకటి. అశ్వత్థం సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం. రావి చెట్టులో త్రిమూర్తులు ఉన్నారని చెప్పే శ్లోకం కూడా ఉంది. అది
మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి
అగ్రత: శివ రూపాయ, వృక్ష రాజాయతే నమ:
ఈ వృక్షం మూలం వద్ద్ద బ్రహ్మ, మధ్యలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉన్నారని దీని అర్థం. ఇక రావి చెట్టు విష్ణువు రూపమని చెబుతారు. అందువల్లనే అశ్వత్థ నారాయణుడు అనే పేరు కూడా ఆయనకు ఉంది. మొహంజొదారో లో దొరికిన ఒక ముద్రలో సింధులోయ నాగరికతకు చెందిన ప్రజలు అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తున్న దృశ్యం బయటపడింది. దేవదానవ యుద్ధంలో దేవతలు ఓడిపోయిన ఒక సందర్భంలో విష్ణువు అశ్వత్థ వృక్షంగా మారాడని పురాణాలు చెబుతున్నాయి. ఆయన ఆ చెట్టు రూపం దాల్చినందున దానికి పవిత్రత వచ్చిందని చెబుతారు. కృష్ణ నిర్యాణం కూడా ఈ చెట్టు కిందే జరిగిందని కొందరు చెబుతారు. స్త్రీలు సంతానం కోసం ఈ చెట్టు మొదలుకు గాని దాని కొమ్మలకు గాని ఎర్ర వస్త్రం గాని, ఎర్ర దారం గాని కట్టే ఆచారం ఉంది. ఏ చెట్టును నరకడమైనా పాపమే కాగా అశ్వత్థ వృక్షాన్ని నరకడం మహాపాపమని ఒక పురాణ వచనం. బుద్ధునికి ఈ చెట్టు కిందే జ్ఞానోదయం అయిందని చెబుతారు. అందువల్ల వారు దానిని బోధి వృక్షమని, జ్ఞాన వృక్షమని వ్యవహరిస్తారు.


వేప
వేపచెట్టు లక్ష్మీ దేవి స్వరూపమని చెబుతారు. అందువల్లనే విష్ణు రూపమైన రావి చెట్టుకు, లక్ష్మీ రూపమైన వేప చెట్టును ఒకే చోట పాతి వాటికి వివాహం చేసే ఆచారం కూడా ఉంది. ఉత్తర హిందూస్థానంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను ఉపయోగిస్తారు. వేపలో ఉన్న ఔషధ గుణాలు తెలిసినవే. వేప‌ చెట్టు గాలే శరీరానికి మంచిదని అంటారు. దాని ఆకులు క్రిమి సంహారిణిగా ఉపయోగిస్తాయి. దాని బెరడు కొన్ని రకా ల చర్మ వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.


మారేడు
మారేడు పత్రాలనే సంస్కృతంలో బిల్వ పత్రాలంటారు. మారేడు శివునికి ప్రీతికరం. అందుకే ఆయనకు లక్ష పత్రి పూజలో కూడా బిల్వాలనే వాడతారు. అది దేవతా వృక్షమై నందునే దానిని కొన్ని రోజులలో, తిథులలో కోయరాదనే నిబంధన కూడా ఉంది. కోసేటప్పుడు కూడా ఒక శ్లోకం చదివి నమస్కరించి కోయాలంటారు.
ఆ శ్లోకం
అమృతోద్భవ శీవృక్ష మహాదేవ ప్రియ: సదా
గృహ్ణామి తవ పత్రాణి శివపూజార్థమాదరాత్‌
మారేడుకు అమృతం నుంచి ఉద్భవించిందని, శ్రీ వృక్షమని పేర్లు. అలాగే ఎప్పుడూ శివునికి ఇష్టమైనది. అటువంటి నీ పత్రాలను శివ పూజ నిమిత్తం కోస్తున్నాను అని దీని అర్థం. మారేడు లక్ష్మీ దేవికి ప్రీతికరం. మూడుగా కలసి ఉన్న బిల్వ దళాలను శివుని పూజకు వాడుతారు. ఈ మూడు పత్రాల దళం శివుని మూడు కనులకు ప్రతీక అని భావిస్తారు. జైనులకు కూడా ఇది పవిత్ర వృక్షం. వారి గురువుల్లో ఒకరైన 23వ తీర్థంకరుడు భగవాన్‌ పరస్‌నాథ్‌జీ మారేడు వృక్షం కిందే నిర్వాణం (జ్ఞానోదయం పొందారని) భావిస్తారు. మారేడులో ఔషధ గుణాలు అధికం. కడుపులో మంటకు కారణమయ్యే ఎసిడిటీ వంటి సమస్యలకు, కొన్ని ఉదర సంబంధ వ్యాధులకు మారేడు చూర్ణం, మారేడు ఆకుల కషాయం పనికొస్తుంది.


జమ్మి
జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటి. సంస్కృతంలో దీనిని శమీ వృక్షంగా పేర్కొంటారు. జమ్మి చెట్టును తాకడం కూడా పుణ్యప్రదమని చెబుతారు. జమ్మి చెట్టు గొప్పతనాన్ని వివరించే ఒక శ్లోకం కూడా ఉంది. అది
శమి శమయతే పాపం, శమి శత్రు వినాశిని
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియ దర్శిని
శమి శత్రువులను నశింపజేస్తుందని, పాండవుల ఆయుధాలను మోసినదని, రామునికి ప్రియమైనదని దీని అర్థం. ఈ వృక్షం పైనే అజ్ఞాతవాసంలో పాండవులు తమ ఆయుధాలు దాచారు. అలాగే రాముడు లంకపై యుద్ధానికి వెళుతున్నపుడు ఈ వృక్ష అధిష్ఠాన దేవతే ఆయనకు విజయం సిద్ధిస్తుందని చెప్పినట్లు ఒక కథ అలాగే అగ్ని దేవుడు ఒక పర్యాయం భృగు మహర్షి కోపం నుంచి తప్పించుకోవడానికి ఈ చెట్టులోదాగి ఉన్నాడని కథ. ఈ చెట్టు బెరడనును కుష్ఠు రోగం, గాయాలు, శరీరంపై వచ్చే వ్రణాలు వంటి వాటి చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడు పొడి గొంతు నొప్పి, ఆస్త్మా మరెన్నో రోగాల చికిత్సలో ఉపయోగపడుతుంది. గింజలు, రెమ్మలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించేందుకు, శ్వాసకోశ సంబంధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తుంది.


ఉసిరి
ఉసిరిని శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తా రు. అందరికీ తెలిసిన వన భోజనాలు ఉసిరి చెట్టు వనంలో లేదా ఉసిరి చెట్టు ఉన్న వనంలో చేయాలంటారు. కార్తీక మాసంలో ఈ చెట్టు ను శ్రీమహా విష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఉసిరి కాయల మీద వత్తులు పెట్టి వెలిగించే సంప్రదాయం కూడా ఉంది. ఉసిరి చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదం లో వాడే ప్రసిద్ధ ఔషధమైన త్రిఫల చూర్ణంలో ఉసిరి పొడి కూడా ఒక భాగం.


మేడి
మేడి చెట్టుకింద దత్తాత్రేయుల వారు కూర్చుని ఉంటారు. త్రిమూర్త్యాత్మకుడు ఎప్పుడూ ఏ చెట్టు నీడనుంటాడో అది పవిత్రమైనది కాక మరేమవుతుంది. అది దేవతా వృక్షమే. ఎండిన మేడి పళ్లను ఆరోగ్యం కోసం కూడా వాడతారు.


మర్రి
మర్రి చెట్టును కూడా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా భావిస్తారు. ఈ చెట్టును చాలా సంస్కృతుల్లో జీవానికి, సంతాన సాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. అందువల్లనే సంతానం లేనివారు మర్రి చెట్టును పూజించే ఆచారం ఉంది. అలాగే దీనిని ఏ సమయంలోనూ నరికి వేయరాదన్నది పురాణాలలో పేర్కొన్నారు. సర్వ లోకాలకూ గురువుగా భావించే జ్ఞాన స్వరూపుడైన మేధా దక్షిణామూర్తి మర్రి వృక్ష ఛాయలోనే ఉంటాడు. పశ్చిమ బెంగాల్‌ హౌరాలోని ఇండియన్‌ బొటాని కల్‌ గార్డెన్‌లో ఉన్న మర్రి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్దది.


అశోక
ఈ చెట్టును కామ దేవునికి ప్రతీకగా భావిస్తారు. ఈ పువ్వులను ఆలయ అలంకరణలో ఉపయోగిస్తారు. బుద్ధుడు అశోక వృక్షం కిందే జన్మించాడని చెబుతారు. అందువల్ల వీటిని బౌద్ధారామాల్లో ఎక్కువగా నాటుతుంటారు. అశోక వృక్షం కూడా పవిత్ర వృక్షం ఒకటి. పుష్పాల నుంచి తీసే ఎసెన్స లో ఈ పుష్పాలకు ప్రత్యేక స్థానం ఉంది.ఇది దట్టమైనాకులతో నిటారుగానిలబడే చిన్నది. ఇది పువాసన కల ఎరుపు రంగు పుష్పాలతో ఉంటుంది. ఏప్రిల్‌, మే నెల్లో ఈ చెట్టు పుష్పిస్తుంది. హిమాలయాల తూర్పు, మధ్య ప్రదేశ్‌ లోను, ముంబై పశ్చిమ తీర ప్రంతంలోనూ ఇది కనిపిస్తుం ది.అశోక అంటే సంస్కృతంలో శోకంలేనిది లేదా శోకాన్ని దూరం చేసేది అనేఅర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ప్రాంతీయ భాషల్లో పలు పేర్లు ఉన్నాయి.


మామిడి
మామిడి చెట్టు కూడా ఒక దేవతా వృక్షమే. రామాయణం, మహాభారతం, ఇతర పురాణాల్లో దీని ప్రస్తావన ఉంది. ఈ మామిడిపండు పండుగా ప్రేమకు, సంతానసాఫల్యతకు చిహ్నంగా భావిస్తారు. ఏ శుభ కార్యమైనా మామిడి ఆకు తోరణాలు కట్టకుండా ప్రారంభం కాదు. ఈ ఆకులకు ఎక్కువ మంది చేరిన చోట ఏర్పడే కాలుష్యాన్ని తొలగించే గుణం ఉందని కూడా చెబుతారు.


కొబ్బరి
కొబ్బరి చెట్టును కల్ప వృక్షంగా వ్యవహరిస్తారు. అన్ని దైవసంబందమైన కార్యాలనూ కొబ్బరికాయను కొట్టి ప్రారంభిస్తారు. పూర్ణ కుంభంలో పై నుంచేది కొబ్బరికాయనే. ఇక కొబ్బరికాయను శివ స్వరూపంగా దానిపై ఉన్నమూడు నల్ల మచ్చలను ఆయన త్రినేత్రాలుగా పేర్కొంటుంటారు. కొబ్బరికాయ నీరు మనుషులు తాకని స్వచ్చమైన జలమని నమ్ముతారు. అటువంటిది మరే పండు విషయంలోనూ లేదు, దేవతలకు కొబ్బరి నీటితో అభిషేకం చేయడం కూడా చేస్తుంటారు.

అరటి
అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవునికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభ కార్యాసమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తారు. కొన్ని చోట్ల భోజనాలకు వీటిని ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోకదలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజచేస్తారు.



చందనం

చందనం చెక్క ఆరగదీయడం వల్ల వచ్చే చందనం నిత్య పూజలో ఒక భాగం కనుక దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అందులో దానిని ఇచ్చే చందన వృక్షాన్ని దేవతా వృక్షంగా భావిస్తారు.

వెదురు

దేవునికి చెందిదేదైనా పవిత్రమైనదనే భావంతో కృష్ణుని వేణువు తయారైన వెదురును కూడా దేవతా వృక్షంగా భావిస్తుంటారు. హిందీలో బన్సూరి అంటే వేణువు. కృష్ణుడు చేతిలో వేణువు కలిగి ఉంటాడు కనుక ఆయనను బన్సీలాల్‌ అని కూడా పిలుస్తుంటారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Wednesday, November 21, 2018

కాలభైరవ స్వరూపం..!! ప్రాముఖ్యత



ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. 
ఆ సందేహమును తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. 
శంకరుడికి "సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన,  వామదేవ అను అయిదు ముఖములు ఉంటాయి. 
ఈ అయిదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మమును’ అన్నాడు. 

అపుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకముల నన్నిటిని సృష్టించాను నేనే  కర్తను. 
నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను 
నేనే వీటిని సంహారం చేస్తాను. 
నేనెప్పుడూ బతికే ఉంటాను. 
కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? 
నేనే బ్రహ్మమును’ అన్నాడు. 

తరువాత పక్కనున్న విష్ణువు 
‘బ్రహ్మా, నా అంతవాడిని నేను అంటున్నావు. 
అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మమును నేను’ అన్నారు. 
ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. 
మనకి శృతి ప్రమాణం కదా అందుకని వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. 

అపుడు ఋగ్వేదం ఈ సమస్తమునకు సృష్టికర్త 
ఏ మహానుభావుడు సంకల్పం చేయాలని మొట్టమొదట నారాయణుడు జన్మించాడో 
ఎవడు చిట్టచివర ఈ లోకములని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది. 

దాన్ని తీసి పారేసి యజుర్వేదమును పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు. 
కాబట్టి జ్ఞాన యజ్ఞమునందు ఆరాధింప బడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది 

తరువాత సామవేదమును పిలిచి అడిగారు 
మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు 
ఈ లోకమునంతటినీ తిప్పుతున్నాడో 
ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో 
ఏ యోగులకి ఉపాసన చేత జ్ఞానమునందు తెలియబడుతున్నాడో 
ఎవరు తనలో తాను రమిస్తూ ఉంటాడో 
అటువంటి శివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది.

 పిమ్మట అధర్వణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖమును పోగొట్టుకుని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము’ అని చెప్పింది. 

అంటే సృష్టి చేసింది మనం కాదు, 
నిలబెట్టింది మనం కాదు, 
వేరొకడున్నాడు. 
తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం. 
నాలుగు వేదములు అదే చెప్తున్నారు. 

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. 
అపుడు ప్రణవం ఎవడు నిరంతరమూ శక్తి స్వరూపముతో క్రీడిస్తూ ఉంటాడో, 
శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, 
శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు,
 పార్వతి వామార్థ భాగమునందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము’ అని చెప్పింది. 
ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. 

ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. 
కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది. 
జ్యోతి సాకారం అయింది. 
సాకారమును చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? 
నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. 
నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు.
బ్రహ్మలో మార్పు రాలేదు. 
ఆయన దండింపబడాలి. 

కాబట్టి ఇపుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. 
అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. 
ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపమును పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. 

ఆ రూపమే కాలభైరవ స్వరూపం. 
ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి 
ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. 
అపుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు. 
కాలము ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది 
నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. 
కాబట్టి నిన్ను ఇవాళ్టి నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. 
ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. 
అపుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. 

పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకం అంతా గజగజలాడిపోయింది. 
కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. 
ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇచట బ్రతుకుతాడో 
వాడి ప్రాణోత్క్రమణము అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. 
అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. 

కానీ ఎవరు నీ గురించి వింటారో, 
శివాలయమునకు వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి యందు శిరస్సు వంచి నమస్కరిస్తారో 
వాళ్ళ పాపమును నీవు తీసెయ్యి. 
అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి 
నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. 
ఇకనుంచి నీవు నా దేవాలయములలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. 
భక్తుల పాపములను నీవు తీసిన వాటిని నువ్వు తినేసెయ్యి. 
నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. 
నిన్ను కాశీ క్షేత్రమునకు అధిపతిగా ఉంచుతున్నాను. 
నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు. 

అందుకే మనను కాశీక్షేత్రంలోని కాలభైరవుడు 
ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించిన క్షేత్రపాలకుడు 
కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశింపచేసి 
నా పాపములను దగ్ధం చేశావు కాలభైరవా’ అని 
ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ అని చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తాడు. 
భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మేడలో ఒక గారెల దండ వేస్తారు. 

కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదమును తీసుకోవాలి.
ఇహలోకమునందు ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల తాము చేసిన దూషణల ఫలితము ఎలా పోతుందని బెంగ పెట్టుకున్న వాళ్ళ కోసం భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు.

అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయమునకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు. 
అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. 
అక్కడితో పాపాలు పోతాయి. 
ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి 
ఇన్ని వరములను గుప్పించాడు. 
ఆ మూర్తే ఇప్పటికీ మనకి ప్రతి శివాలయంలో ఆయన ఈశ్వర ఆజ్ఞను ఔదలదాల్చి వచ్చినవాడు 
కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో ఉంటాడు. 

ఆయన భక్తుల పాలిట కొంగుబంగారం. 
ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు. 
కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. 
‘మేము కాశీ వెళ్ళాము – 
మాకు ఇంట ఏ భయమూ లేదు’ అని చెప్పడానికి 
ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. 
కాబట్టి ఇన్ని రూపములుగా ఆ కాలభైరవ స్వరూపం ఆనాడు ఆవిష్కరింపబడింది. 

ఎవరు ఈ కాలభైరవ స్వరూపమును గురించి వింటున్నారో..
భక్తితో ప్రణమిల్లుతున్నారో..
ఒక్కసారి నమస్కరిస్తున్నారో ..
అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. 
వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు.
ఓం నమః శివాయ..
మీ. గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

పోలి స్వర్గం కథ ఇదీ



కార్తికమాసం చివరికి రాగానే గుర్తుకువచ్చే కథ ‘పోలిస్వర్గం’. ఇంతకీ ఎవరీ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తల్చుకుంటూ సాగే ఆచారం ఏమిటి? అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలిస్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తికమాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాన్నీ సూచించే గాధ.

అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారట. వారందరిలోకి చిన్నకోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా, వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తికమాసం రాగానే చిన్నకోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయల్దేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీస్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది.  ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావల్సిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి మరీ బయల్దేరేవారు అత్తగారు.

కార్తికమాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేంది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు, దాని మీద బుట్టని బోర్లించేంది. ఇలా కార్తికమాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తికమాసం చివరిరోజు కాబట్టి ఆ రోజు కూడా నదీస్నానం చేసి ఘనంగా కార్తికదీపాలను వదిలేందుకు అత్తగారు బయల్దేరింది. వెళుతూ వెళుతూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటిపనులన్నీ అప్పగించి మరీ వెళ్లింది. కానీ పోలి ఎప్పటిలాగే ఇంటిపనులను చకచకా ముగించేసుకుని కార్తిక దీపాన్ని వెలిగించుకుంది.
ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమయినా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చటవేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది.  అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్తగారూ, ఆమె కోడళ్లూ... ఆ విమానాన్ని చూసి, అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లని పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు, పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు.


ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తల్చుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటిదొప్పలలో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి... టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటిదీపాలను చూసుకుంటూ పోలిని తల్చుకుంటారు. కార్తికమాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా, ఈ రోజున 30 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే.... మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రహ్మణులకు దీపాన్ని కానీ, స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు.

_తెలుగువారు ఇటు పోలిని, అటు దీపాన్నీ కూడా శ్రీమహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలిదీపాలను అమావాస్య రోజున కాకుండా, మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు.
ఇదీ పోలిస్వర్గం వివరం! కార్తికమాసం దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తరువాత మాట. ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు, మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావల్సిందే శ్రద్ధే కానీ ఆడంబరం కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి ఆహంకారంతో సాగే పూజలు ఎందుకూ కొరగానివని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ల మధ్య సఖ్యత ఉండాలన్న నీతినీ బోధిస్తోంది. అందకే ప్రతి కార్తికమాసంలోనూ, ప్రతి తెలుగు ఇంట్లోనూ... పోలిస్వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Tuesday, November 20, 2018

శివుడు అభిషేక ప్రియుడు



శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). "శివుడు అభిషేక ప్రియుడు" కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం...
అభిషేక ద్రవ్యాలు... ఫలితాలు
----------------------------------------
ఆవు పాలతో..... సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు... ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి.... ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) .... దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం ... పుత్ర లాభం
పుష్పోదకం... భూలాభం
బిల్వ జలం ... భోగ భాగ్యాలు
నువ్వుల నూనె... అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం ... మహా ఐశ్వర్యం
సువర్ణ జలం ... దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం .... సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం ... సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం .... శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)... ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ ... శివ సాన్నిధ్యం
గంగోదకం ... సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం... ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం... దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ... మంగళ ప్రదం
వీబూది .... కోటి రెట్ల ఫలితం

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కార్తీక చలిమిళ్ల నోము



స్త్రీలు సంపద ... సంతానం ... సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా 'కార్తీక చలిమిళ్ల నోము' చెప్పబడుతోంది. కార్తీకమాసమంతా ఉదయాన్నే స్నానం చేసి, ఈ నోముకు ఆధారమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున 'అయిదు మానికల బియ్యం చలిమిడి'ని అయిదుగురు ముత్తయిదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 'పది మానికల బియ్యం చలిమిడి'ని ఉసిరి చెట్టుకింద పదిమంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి.

ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి 'గౌరీ పూజ'చేయాలి. ఆ తరువాత 'పదిహేను మానికల బియ్యం చలిమిడి'ని పదిహేను మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకున్న తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం.

పూర్వం ఒక రాజు గారికి ... మంత్రి గారికి ఒకే ఈడు ఆడ పిల్లలు వుండేవారు. వాళ్లిద్దరూ కూడా మూడేళ్లపాటు 'కార్తీక చలిమిళ్ల నోము'నోచారు. అయితే మంత్రిగారి కూతురికి ప్రతి ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తూ వచ్చాయి. ఆమెకి చక్కని సంతానం ... సౌభాగ్యం ... సంపదలు ప్రాప్తించాయి. ఇక రాజుగారి కూతురు విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దాంతో ఆమె తీవ్రమైన అసహనానికి ... అసంతృప్తికి లోనైంది.

నోము విషయంలో కూడా తాను రాజు కూతురిననే అహంకారాన్ని చూపడం వల్లనే ఆమెకి అలాంటి ఫలితాలు వచ్చాయని పార్వతీ దేవి గ్రహించింది. ఆ రాత్రే అమ్మవారు రాజుగారి కూతురు కలలో కనిపించి ఆ విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే ఆమె తన పద్ధతిని మార్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమునోచి ఆశించిన ఫలితాలను అందుకుంది.

ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.

క్షీరాబ్ది ద్వాదశి

 చిలుకు ద్వాదశి - పావన ద్వాదశి - యోగీశ్వర ద్వాదశి

        మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైన తిధి క్షీరాబ్ది ద్వాదశి. 

కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. 

పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ క్షీరాబ్ది ద్వాదశి భారతావనిలో ప్రాచుర్యం పొందింది. 
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. 

దాని తర్వాత వచ్చేక్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది. 

ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో, కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణప్రోక్తంగా చెప్పబడింది. 

క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి.

 ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతుల వుతారు.
      
  క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది.

 ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!

శ్రీమహా విష్ణువు తులసి వుండే బృందావనములోకి ఈరోజే ప్రవేశించారుట. అందువలన, ఈ రోజు తులసి మొక్క దగ్గర మహావిష్ణు ప్రతి లేదా ఉసిరి మొక్కను ఉంచి తులసి కళ్యాణం జరిపిస్తారు.

నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే !
నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయికే !!

యన్మూలే సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః !
యదగ్రే సర్వ వేదాశ్చ – తులసీం త్వాం నమామ్యహం !!

ఈరోజే బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగింది. మహా విష్ణువు ” సాలగ్రామం”(నారాయణ పర్వతం) గా మారి లోక కళ్యాణం జరిగింది.

కార్తీకమాసం ద్వాదశి రోజున తులసి సన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,
    
 నమస్తే తులసి హరి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ”అంటూ ధ్యానం చేస్తూ, శ్రద్ధతో తులసిదేవిని పూజించాలి.

“ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే -ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యంవిష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపంకురుసర్వదా” 

అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి.

ఈ పర్వదినాన, తులసి మొక్క వద్ద ఒక్క దీపం వెలిగించినా చాలు అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అని అంటారు.

కావున అందరు ఈరోజు   నారాయణ హి త తులసి మాత కు తప్పక దీపారాధన చేసి అనంతమైన పుణ్యాన్ని పొందండి….
           ఓం నమో నారాయణాయ నమః
                         గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...