Tuesday, November 20, 2018

కార్తీక చలిమిళ్ల నోము



స్త్రీలు సంపద ... సంతానం ... సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా 'కార్తీక చలిమిళ్ల నోము' చెప్పబడుతోంది. కార్తీకమాసమంతా ఉదయాన్నే స్నానం చేసి, ఈ నోముకు ఆధారమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున 'అయిదు మానికల బియ్యం చలిమిడి'ని అయిదుగురు ముత్తయిదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 'పది మానికల బియ్యం చలిమిడి'ని ఉసిరి చెట్టుకింద పదిమంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి.

ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి 'గౌరీ పూజ'చేయాలి. ఆ తరువాత 'పదిహేను మానికల బియ్యం చలిమిడి'ని పదిహేను మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకున్న తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం.

పూర్వం ఒక రాజు గారికి ... మంత్రి గారికి ఒకే ఈడు ఆడ పిల్లలు వుండేవారు. వాళ్లిద్దరూ కూడా మూడేళ్లపాటు 'కార్తీక చలిమిళ్ల నోము'నోచారు. అయితే మంత్రిగారి కూతురికి ప్రతి ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తూ వచ్చాయి. ఆమెకి చక్కని సంతానం ... సౌభాగ్యం ... సంపదలు ప్రాప్తించాయి. ఇక రాజుగారి కూతురు విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దాంతో ఆమె తీవ్రమైన అసహనానికి ... అసంతృప్తికి లోనైంది.

నోము విషయంలో కూడా తాను రాజు కూతురిననే అహంకారాన్ని చూపడం వల్లనే ఆమెకి అలాంటి ఫలితాలు వచ్చాయని పార్వతీ దేవి గ్రహించింది. ఆ రాత్రే అమ్మవారు రాజుగారి కూతురు కలలో కనిపించి ఆ విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే ఆమె తన పద్ధతిని మార్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమునోచి ఆశించిన ఫలితాలను అందుకుంది.

ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...