Tuesday, November 20, 2018

క్షీరాబ్ది ద్వాదశి

 చిలుకు ద్వాదశి - పావన ద్వాదశి - యోగీశ్వర ద్వాదశి

        మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైన తిధి క్షీరాబ్ది ద్వాదశి. 

కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. 

పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ క్షీరాబ్ది ద్వాదశి భారతావనిలో ప్రాచుర్యం పొందింది. 
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. 

దాని తర్వాత వచ్చేక్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది. 

ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో, కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణప్రోక్తంగా చెప్పబడింది. 

క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి.

 ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతుల వుతారు.
      
  క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది.

 ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!

శ్రీమహా విష్ణువు తులసి వుండే బృందావనములోకి ఈరోజే ప్రవేశించారుట. అందువలన, ఈ రోజు తులసి మొక్క దగ్గర మహావిష్ణు ప్రతి లేదా ఉసిరి మొక్కను ఉంచి తులసి కళ్యాణం జరిపిస్తారు.

నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే !
నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయికే !!

యన్మూలే సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః !
యదగ్రే సర్వ వేదాశ్చ – తులసీం త్వాం నమామ్యహం !!

ఈరోజే బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగింది. మహా విష్ణువు ” సాలగ్రామం”(నారాయణ పర్వతం) గా మారి లోక కళ్యాణం జరిగింది.

కార్తీకమాసం ద్వాదశి రోజున తులసి సన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,
    
 నమస్తే తులసి హరి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ”అంటూ ధ్యానం చేస్తూ, శ్రద్ధతో తులసిదేవిని పూజించాలి.

“ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే -ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యంవిష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపంకురుసర్వదా” 

అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి.

ఈ పర్వదినాన, తులసి మొక్క వద్ద ఒక్క దీపం వెలిగించినా చాలు అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అని అంటారు.

కావున అందరు ఈరోజు   నారాయణ హి త తులసి మాత కు తప్పక దీపారాధన చేసి అనంతమైన పుణ్యాన్ని పొందండి….
           ఓం నమో నారాయణాయ నమః
                         గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...