Wednesday, March 21, 2018

జీవితంలో ఒకసారైనా దర్శించాలనుకొనే యాత్ర : అష్టవినాయక !


                ఓం గం గణపతయే నమః

    పరమ శివుని పూజలందుకున్న మహా గణపతి

వినాయక చవితి ప్రతీ ఏటా మనం హిందూ పంచాజ్ఞం ప్రకారం భాద్రపద శుక్ల చవితి నాడు జరుపు కోడం అనాదిగా హిందువులకు వస్తున్న ఆచారం . వినాయక చవితిని భారత దేశ వాసులు జాతి మత  బేధాలు లేకుండా జరుపుకుంటారు అంటే అతిశయోక్తి కాదు . పెద్ద బొజ్జ , ఏనుగు తల , గుజ్జురూపం , ఎలుక వాహనం గా గల  వినాయకుడు భారత దేశం లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పూజలందు కుంటున్నాడు . విదేశాలలో ఎలిఫెంట్ హెడ్ గాడ్ అని హిందూ బుద్ధ అని పిలుస్తూ వుంటారు . పరమేశ్వరుడు గణాసురుని తపస్సుకి మెచ్చి అతనికి సత్వ , తమో , రజో , గుణాల వలన జన్మించిన వారినుండి మరణము లేనట్లు వరం పొందుతాడు . గణాసురుని వధించేందుకు వినాయకుని పార్వతీ దేవి నలుగు పిండితో తయారు చెయ్యడం , తరువాత శివుని కోపానికి గురై శిరస్సు ఖండించబడి పార్వతీ దేవి అభ్యర్ధన మేరకు శివుడు గజాసురుని తలను వినాయకునికి అతికించి ప్రాణం పోయడం మనకందరికీ తెలిసినదే .

విద్యకి , విజ్ఞానానికి , వినయానికి అధిపతి వినాయకుడు . ఏ కార్యం తలపెట్టినా ముందుగా పూజ లందుకోనేది వినాయకుడే అనడంలో అతిశయోక్తి కాదు . మనస్సులో తలచుకున్నంత మాత్రాన విఘ్నాలు తొలగించి విజయాన్ని చేకూర్చే దేముడు అనడం లో తప్పులేదు . వినాయకుని పుజించేవారికి అనేక శక్తులు సిద్ధిస్తాయి .

వినాయకుని అధీనం లో తంత్ర విద్యలైన అభిసార విద్యలో ఆరు రకాల దుష్ఠ శక్తులు కుడా వున్నాయి . అందుకే వసీకరణం  , చిల్లంగి మొదలయిన దుష్ఠ శక్తుల ఉపాసకులు వినాయకుని పూజించి  యీ శక్తులను పొందుతారు  .  వినాయకునిది చిన్నపిల్లల మనస్తత్వం గా వర్ణిస్తారు .

భరత ఖండం లో శైవం , వైష్ణవం , బౌద్ధం వీటితో పాటు భ్రామ్యం ( భ్రహ్మ ని మాత్రమే పూజించేవారు ) , గణపత్యం ( గణపతి ని మాత్రమే పూజించే వారు )  కుడా ప్రాచుర్యం లో ఉండేవి . ఆరవ శతాబ్దం లో యీ గణపత్యం ప్రాచుర్యంలోకి వచ్చి తొమ్మిదవ శతాబ్దం లో రాజుల ప్రాపకం సంపాదించిందని శ్రీ ఆనందగిరి గారు తన  ' శంకర దిగ్విజయం ' లో రచించేరు . పదవ శతాబ్దంలో వినాయకుని ప్రత్యేకంగా కోవెల నిర్మాణాలు జరిగేయి . అలా నిర్మితమైన   మందిరాలలో ముఖ్యం గా చెప్పుకోతగ్గవి మహారాష్ట్ర లోని అష్ఠ గణపతుల మందిరాలు , తిరుచురాపల్లి లో వున్న ' ఉచ్చి పిళియార్  ( ఉచ్ఛ వినాయకుడు ) ' .  గణపత్యం అవలభించేవారు మహా గణపతి సృష్ఠికి ముందు నుండి ప్రళయాంతం తరవాత కుడా వుండే మహా శక్తి అని నమ్ముతారు .

యీ గణపత్యం దక్షిణ భారత దేశం నుంచి పశ్చిమ భారత దేశం వరకు ప్రాకి పేష్వాల పరిపాలనలో మరాఠా సామ్రాజ్యం వున్నప్పుడు , పెష్వాలు వినాయకుడిని యిష్ఠ దైవం , కుల దైవంగా పూజించేవారు .

మహారాష్ట్ర లో వినాయక చవితి పూజలు దేశ విదేశాలలో ప్రసిద్ది అని మనందరికీ  తెలిసినదే .  అలాంటి మహారాష్ట్ర లో అష్ఠ గణపతులు కొలువై వున్నారు .  యీ అష్ఠ గణపతులు స్వయంభూగా వలిసినవే . ద్వాదశ జ్యోతిర్లింగాలు , అష్ఠాదశ శక్తి పీఠాలు లాగే  అష్ఠ గణపతులు కుడా  .

అష్ట వినాయక అంటే ఎనిమిది గణపతులని అర్ధం చెప్పాలి. మహారాష్ట్రలో వివిధ ప్రదేశాలలో కల ఎనిమిది గణపతి దేవాలయాలకు పర్యటన అని భావించాలి. ఈ ఎనిమిది దేవాలయాల పేర్లు వరుసగా చెప్పాలంటే, మోర్గాంవ్ వద్ద కల మయూరేశ్వర, సిద్ధాటెక్ వద్ద సిద్ధి వినాయక, బల్లలేశ్వర్ వద్ద పలి, లేన్యాద్రి వద్ద గిరిజాత్మక్, చింతామణి వద్ద ధేయూర్, ఒజార్ వద్ద విగ్నేశ్వర్, రంజన్ గాంవ్ వద్ద మహాగణపతి, మరియు చివరిదైన మహాద్ వద్ద వరద వినాయక దేవాలయాలు. ఈ ఎనిమిది అష్టవినాయక దేవాలయాలు కూడా పురాతనమైనవి మరియు ప్రాచీన కాలంనాటివి. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంధాలైన గణేష మరియు ముద్గాల పురాణాలలో పేర్కొన్నారు. ఈ దేవాలయాల శిల్ఫశైలి ఎంతో అందంగా ఉంటుంది. ప్రతి హిందూ మతస్తుడు తన జీవితంలో ఆనందాలను అదృష్టాలను పొందేందుకు కనీసం ఒకసారైనా ఈ అష్టవినాయకుల ఎనిమది దేవాలయాలు దర్శించి తరించవలసిందే. ఈ దేవాలయాలన్నింటికి ఒక ఉమ్మడి అంశం ఏమంటే, వాటిలో ప్రతి ఒక్కటి స్వయంభూ దేవాలయమే.

🌹 *1. సిద్ధి వినాయక దేవాలయం* 🌹

గణపతి విగ్రహంలో ఉన్న భంగిమ అంటే ఆయన తొండము కూడి వివిధ రకాలుగా ఉంటాయి. అన్ని దేవాలయాలలో గణపతి తొండం ఎడమవైపుగా కనపడుతుంది. కాని సిద్ధాటెక్ వద్దగల సిద్ధి వినాయక దేవాలయంలో మాత్రం గణపతి తొండం కుడివైపుకు తిరిగి కనపడుతుంది. ఈ ప్రదేశం ప్రత్యేకత అంటే, ప్రదక్షిణం. పూర్తి ప్రదక్షిణ సుమారుగా 5 కి.మీ.ల వరకు వస్తుంది.

🌹 *2. మయూరేశ్వర దేవాలయం* 🌹

మయూరేశ్వర దేవాలయం మోర్గాంవ్ గ్రామంలో కలదు. ఈ దేవాలయానికి 50 అడుగుల ఎత్తుగల డోమ్ నాలుగు స్తంభాల ఆధారంగా నిలుస్తుంది. సమీపంలో పెద్ద దీపమాల అంటే ఒక రాతితో చేయబడిన నూనె దీపాల స్తంభం ఉంటుంది.

🌹 *3. బల్లలేశ్వర దేవాలయం* 🌹

బల్లాలేశ్వర దేవాలయం పాలి గ్రామంలో కలదు. అన్ని దేవాలయాల వలే కాక ఈ దేవాలయానికి బ్రాహ్మణ రూపంలో సాక్షాత్కరించిన ఒక భక్తుని పేరు పెట్టారు.

🌹 *4. గిరిజాత్మజ దేవాలయం* 🌹

గిరిజాత్మక దేవాలయం గుహలు కల ఒక కొండ పైభాగాన కలదు. దీనిని దర్శించాలంటే 300 మెట్లు ఎక్కాలి. కష్టమైనప్పటికి పైకి వెళితే అక్కడి అందచందాలకు ఎంతో ఆనందం కలుగుతుంది.

🌹 *5. చింతామణి దేవాలయం* 🌹

చింతామణి దేవాలయం ధేయూర్ లో కలదు. ఇక్కడి గణపతి బ్రహ్మకుగల చింతను తొలగించే నిమిత్తం ఆయన ధరించిన చింతామణి రూపం కలిగి ఉంటాడు.

🌹 *6. విఘ్నేశ్వర దేవాలయం* 🌹

ఓజార్ వద్ద గల విఘ్నేశ్వర దేవాలయానికి అందమైన గోపురం, గోపుర శిఖరం బంగారంతో తయారు చేయబడ్డాయి. ఓజార్ పూనే - నాశిక్ రోడ్ పై గల నారాయణగాంవ్ మరియు జున్నార్ ల నుండి ఓజార్ 8 కి.మీ. ల దూరం ఉంటుంది. ఈ ప్రదేశాలనుండి ఓజార్ కు ఆటో రిక్షాలలో చేరవచ్చు.

🌹 *7. మహాగణపతి దేవాలయం* 🌹

మహాగణపతి దేవాలయం తూర్పు వైపు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారం ఎంతో పెద్దదిగాను ఆకర్షణీయంగాను ఉంటుంది. ఇక్కడే జయ విజయులనే ద్వారపాలకుల విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇది రంజన్ గాంవ్ లో కలదు.

🌹 *8. వినాయక దేవాలయం* 🌹

చివరగా, మహాడ్ గ్రామంలో వరద వినాయక దేవాలయం కలదు. ఈ దేవాలయ విగ్రహం ఒక సరస్సు ఒడ్డున లభిస్తే దానిని దేవాలయంలోపల ప్రతిష్టించారు. నేడు మనం చూసే వరద వినాయక దేవాలయం వాస్తవానికి పేష్వా పాలకులచే పునరుద్ధరించబడిన దేవాలయం.

🕉🕉🕉🕉🕉🕉

Saturday, March 17, 2018

ఆడవారు బయట ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకోవచ్చా?

ఈమధ్యకాలంలో ఇది సాధారణ విషయం అయిపొయింది కానీ ఎన్నో ఏళ్ళ నుండి మన సాంప్రదాయం తప్పని చెబుతోంది. ఇందుకు సంబంధించిన వివరణ.
శ్రీమద్భాగవతంలో ఆరవ స్కంధంలో వివరింపబడిన ప్రకారం పూర్వం ఒకసారి ఇంద్రుడు త్వష్ట పుత్రుడైన విశ్వరూపుని చంపినప్పుడు బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంది. అప్పుడు ఇంద్రుని పాపాన్ని నలుగురు పంచుకుంటామని ముందుకు వచ్చి అతడిని బ్రహ్మహత్యాపాతకాన్నుండి విముక్తి కలిగించారు. స్త్రీ-భూ -జల- ద్రుమైర్ వలన తనకు విముక్తి కలిగిందని చెప్పుకుంటాడు. ఇందుకు ఈ నలుగురికి కొన్ని వరాలను ఇస్తాడు. ఇవే వివరాలను గరుడ పురాణం, దేవీభాగవతం, తైత్తరీయం ఇంకా మరెన్నో పురాణ వాన్గ్మయాలలో చెప్పి వున్నారు.
1. తాను తీసుకున్న బ్రహ్మహత్యాపాతకం వలన భూమి లో కొన్ని ప్రదేశాలలో జీవరాశి ఉండదు. భూమి బీటలు వారడం, ఎడారులు తయారు అవడం అనేవి భూమి తీసుకున్న దోషం వలన సంప్రాప్తిమ్చాయి. దానికి బదులుగా ఇంద్రుని దగ్గరనుండి తవ్విన చోట మరల పూడుకునేలా వరం పుచ్చుకుంది భూమి.
2. నీటిలో నురగ బుడగలు జలం తీసుకున్నపాపం వలన వస్తుంది అని, దానికి ప్రతిగా దేనిలో అయితే జలం కలపబడుతోందో దాని పరిణామము పెరుగుతుంది అని వరం తీసుకుంది. అందుకుని బుడగలు, నురగతో ఉన్న నీటిని పవిత్రకార్యాలకు ఉపయోగించరు.
3. చెట్లు తాము తీసుకున్న పాపం వలన వాటిలో పాలు స్రవిస్తూ ఉంటాయి, ఏ చెట్టు కొమ్మ అయినా చిన్నగా చిదిమి చూస్తె ఈ పాలు వస్తూ ఉంటాయి, వారిని పుచ్చుకోవడం మానవులకు నిషేధం. ఈ పాపానికి ప్రతిగా ఎప్పుడు తమని తరిగినా మరల ఆ చెట్టు చిగురించాలి అన్న వరం పుచ్చుకున్నాయి వృక్షాలు.
4. స్త్రీలకు తాము తీసుకున్న పాపం వలన నెలలో మూడురోజులు ఆ పాప భారాన్ని భరిస్తామని, అందుకు ప్రతిగా తమకు తమ పతితో స్వర్గసుఖాలు అనుభవించేలా వరాన్ని, అలాగే సంతతిని తాము భరించి వృద్ధి చెయ్యాలన్నా వరాన్ని పుచ్చుకుంటారు.

ఇందువలన ఆ మూడు రోజులు వారు బ్రహ్మహత్యాపాతకాన్ని భరిస్తున్న కాలం కనుక వారికి వంట, పూజా గదులలో ప్రవేశం నిషిద్ధం. మన ఇళ్ళలో వంట చేస్తున్నారంటే అదొక యజ్ఞంగా తీసుకునేవారు. అగ్నిభాట్టారకుడు సాక్షాత్తు అగ్ని దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మనం పెట్టిన పదార్ధాలను పక్వం చేస్తున్నాడు. ఇదే తలంపుతో రోజు కూడా వంట స్నానం చేస్తే కానీ మొదలు పెట్టారు. మన కడుపులో ఉన్న వైశ్వారనునికి ఇచ్చే హవిస్సును తయారు చేసే అన్నం, ఇత్యాది భక్ష్యభోజ్యాల తయారీ కూడా ఒక యజ్ఞమే. ఇంటి ఇల్లాలు స్నానం చేసి మడి కట్టుకుని ఒక పూజా కార్యక్రమంగా చేసే వంట వలన ఆ ఇళ్ళలో ఆరోగ్యం, ఐశ్వర్యం స్థిరంగా ఉండేవి, ఉంటున్నాయి. కాబట్టి వంట కార్యక్రమం కూడా పూజావిధానంలో ఒక భాగంగా వుంటుంది. దేవునికి నివేదించి కానీ పుచ్చుకునే సాంప్రదాయం లేని సంస్కారం మనది. ఈ కారణం వలన ఆ మూడు రోజులు ఆడవారికి వంటిల్లు, వంట నిషేధం.

మన శరీరంలో మలం ఎన్నో రకాలుగా పోతూ వుంటుంది. కటి ప్రదేశం పైన ఉన్న రంధ్రాల ద్వారా పోయే మలాన్నుండి ఆ భాగాలను కాళ్ళను కడుక్కోవడం వలన పోతున్నాయి. కానీ కటిప్రదేశం నుండి కాళ్ళ వరకు పోయే మలాన్ని శుద్ధిపొందాలంటే మలాపకర్షణ స్నానం చేస్తే తీరుతుంది. ఈ మూడు రోజులు వారు నిత్యం అదే స్థితిలో ఉంటారు, అందువలన శారీరకంగా నీరసంగా ఉంటారు కావున వారికి ఆ మూడు రోజులు విరామం చెప్పింది. ఇన్నాళ్ళు మనకు అన్నీ చేసి పెట్టె వారికి ఆ మూడు రోజులు విరామం తప్పకుండా ఇవ్వాలి. శారీరకంగా నీరసంగా ఉన్నవారికి విరామం, ప్రశాంతత ఇవ్వడం మన కనీస కర్తవ్యం. అందుకు ఆ ఇంటి యజమాని కొంత పూజ అయినా మానేసినా సరే ఇంటి పనులు చేసుకోవాలి. దీపం వెలిగించి గోవిందా గోవింద అనుకున్నా సరిపోతుంది  అంటారు పెద్దలు. రోజు చేసే విధంగా అంతంత సేపు పూజ చెయ్యక్కర్లేదు, కేవలం వంట పని, ఇంటి పని చేసుకుని అందరినీ చూసుకుంటే సరిపోతుందని హితవాక్యం. మాకు కుదరదు అంటూ ఇళ్ళలో కలుపుకుంటే మనకు తెలియని ఎన్నో నెగటివ్ విబ్రేషన్స్ ఇంట్లోకి తెచ్చుకున్నట్టే. మనం పవిత్రం, మన పూజ పవిత్రం, మనం తీసుకునే అన్న పవిత్రం, దేవుని ప్రసాదం అనుకున్న వారికి ఇవన్నీను. అలాంటివి లేవు ఇది నా సంపాదన, ఈ తిండి నా గొప్పదనం, ఇది నా ప్రసాదం అనుకున్న వారికి ఇటువంటి విషయాలు వర్తించవు లెండి.
ఇందుకే కొందరు ఆచారవంతులు పెద్దలు బయట వండిన వంట కూడా తినరు. కొన్ని చోట్ల బయట తినడం మానలేని పరిస్థితి ఉన్నవారికి కనీసం ఇంట్లోనైనా శౌచం పాటిద్దాం. తరిద్దాం.

ఇంకో విశేషం చెప్పనా...కొందరు సైంటిస్ట్ లు...భోజనంతయారు చేసన కొంతమంది వంటవారి యొక్క మానసిక స్థితి తెలుసుకోగోరి...ఆ వండిన పదార్థాలు magnetic resonance images తీసి చూడగా...శాంతచిత్తంతో వండిన పదార్ధం లో అణువుల అమరిక కీ...అశాంతి తో చేసిన వంట లోని అణువుల అమరికకీ చాలా తేడా ఉందని  తేల్చి చెప్పారు.కనుక మహిళలు వత్తిడి కిలోనయ్యే ఆ సమయంలో వంట మొ.వి చేయకపోవడం ఇంటిలో మిగతావారి ఆరోగ్యానికి మంచిది.

ఉగాది - భావం

ఉగాది

హైందవశాస్త్రం ప్రకారం అరవై తెలుగు నామసంవత్సరాలు ఉన్నాయి, అవి ఒక క్రమంగా వస్తాయి.

బ్రహ్మదేవుడు తన సృష్టిని చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభించాడు. ఆ రోజు యుగమునకు ఆది - యుగాది, నేటి ఉగాది. భారతీయ గణితవేత్త శ్రీ భాస్కరాచార్యులవారి గణనం ప్రకారం ఈ రోజున సూర్యోదయ కాలానికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజు వస్తాయి. వసంత ఋతువు మొదలవుతుంది. అంత వరకూ బీడు పడి ఉన్న భూమి మొలకలు ఎత్తి, కొత్త జీవితానికి నాందిలా పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పచ్చని పంటపొలాలు, ఏపైన చెట్లు, రంగు రంగుల పూలు సౌభాగ్యానికి చిహ్నంగా కనబడతాయి. ఇది తెలుగు వారి కొత్త సంవత్సరాది.
ఉగాది

ఉగస్య ఆది ఉగాది:-"ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి 'ఆది' 'ఉగాది' అంటే సృష్టి ఆరంభమైన దినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది.
తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:- చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.

ఉగాది పుట్టుపూర్వోత్తరాలు

వేదాలను హరించిన సోమకుని వధించి మత్యావతారధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. చైత్రశుక్లపాడ్యమినాడు విశాలవిశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించెను. కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుచున్నదని కూడా చెప్పబడుచున్నది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతున్నదని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం 'ఉగాది'.

"ఉగాది" ఆచరణ విధానం

ఉగాది పర్వాచరణ విధానాన్ని 'ధర్మసింధు' కారుడు 'పంచవిధుల సమన్వితం'గా ఇలా సూచించియున్నాడు.

తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...

ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...

ఉగాది రోజు

    తైలాభ్యంగనం
    నూతన సంవత్సరాది స్తోత్రం
    నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
    ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
    పంచాంగ శ్రవణం

మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. "అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం" (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి, పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది రసాయనాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడ్రుచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌

భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌

అని ధర్మ సింధుగ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! "తీపి వెనుక చేదు, పులుపూ ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు" అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది.

ఏష ధర్మఘటోదత్తో బ్రహ్మ విష్ణు శివాత్మక:

అస్య ప్రదవాత్సకలం మమ: సంతు మనోరధా:

యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

"తిధిర్వారంచనక్షత్రం యోగ: కరణమేవచ పంచాంగమ్‌"

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలోగాని, గ్రామకూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాంతుల సమక్షంలో కందాయఫలాలు స్థూలంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది.

"పంచాంగస్యఫలం శృణ్వన్‌ గంగాస్నానఫలంఖిలేత్"

ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

"సూర్యశ్శౌర్య మధేందురింద్రపదవీం" అనెడి పంచాంగ శ్రవణ ఫలశృతి శ్లోకంలో ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.

శ్లోకం

శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ

సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం

ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.

'బ్రహ్మ ప్రళయం' పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని 'బ్రహ్మకల్పం' అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభసమయమును "ఉగాది" అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ 'ఉగాది' పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు.

లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

తృట్యైనమః, నిమేషాయనమః, కాలాయనమః అంటూ ప్రకృతిని, ప్రకృతికి కారణమైన శక్తిని ఆరాధిస్తాము. ఉగాదినాటి పంచాంగం పూజ, పంచాంగం పూజ, పంచాంగం శ్రవణం కాలస్వరూపనామార్చనకు ప్రతీకం. పంచాంగ పూజ, దేవి పూజ సదృశమైంది. అంతం, ముసలితనం, మరణం లేనిది కాలస్వరూపం. అదే దేవి స్వరూపం. అందుకే పంచాంగం పూజ, పంచాంగ శ్రవణం, దేవి పూజ ఫలాన్ని ప్రసాదిస్తుంది. విక్రమార్కుడు పట్టాభిషిక్తుడైన శుభదినం చైత్రశుద్ధపాడ్యమి. ఆనాడే విక్రమార్క శకం ప్రారంభమైంది.

శకులపై శాలివాహనులు సాధించిన ఘన విజయం ఉగాది పచ్చడిలోని తీపికి, యుద్ధంలో కలిగిన కష్టనష్టాలు చేదుకు, శత్రువులను తమలో ఒకరుగా కలుపుకోవడంలో వచ్చిన మంచి చెడ్డలు పులుపునకు చిహ్నంగా మన పూర్వీకులు భావించి స్వీకరించారు. ఈ మూడింటి కలయికకు గుర్తుగా ఆనవాలుగా విక్రమాదిత్యుని కాలంలో శాలివాహన శకారంభం నుండి ఉగాది పచ్చడి ఆస్వాదించడం ఆచారమైందని చారిత్రకుల నిర్ణయం.

ఈ పండగ ప్రత్యేకత 'ఉగాది పచ్చడి'. ఈ పచ్చడిలో చేరే పదార్ధాలలో వేప పువ్వు ముఖ్యమైనది. బెల్లం, కొత్త చింతపండు పులుసు, మామిడి ముక్కలు, కొన్ని ప్రాంతాలలో అరటిపళ్ళ గుజ్జు కూడా చేర్చి పచ్చడిగా తయారుచేస్తారు. తీపి, ఉప్పు, పులుపు, చేదు, వగరు, కారం అనే షడ్రుచుల సమ్మేళనంగా జీవితంలో కష్టసుఖాలు ఆనంద విషాదాలుగా కలగలిసి ఉంటాయని చెప్పడానికి ప్రతీకగా దీన్ని అందరూ సేవిస్తారు. ఆరోగ్యానికి ఇది మంచిది. అంతేకాకుండా అంతర్గతంగా ఆరోగ్య సూత్రం ఇమిడి ఉందని తెలుపుతోంది.

మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు.

మనకు తెలుగు సంవత్సరాలు 'ప్రభవ'తో మొదలుపెట్టి 'అక్షయ'నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి 'షష్టిపూర్తి' ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.

పంచాంగ శ్రవణం

నిత్య వ్యవహారాల కోసం ఈనాడు అందరూ ఇంగ్లీషు క్యాలెండర్ అయిన "గ్రిగేరియన్‌ క్యాలెండరు"ను ఉపయోగిస్తూ వున్నా...శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి
"పంచాంగము" ను ఉపయోగించడం మన పంచాంగ విశిష్టతకు నిదర్శనం. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్ళీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతేకాకుండా 'పంచాంగ శ్రవణం' ఉగాధి విధుల్లో ఒకటి. ఈనాడు గ్రామాలు మొదలుకొని పెద్ద పెద్ద నగరాల వరకూ అన్నిచోట్లా పంచాంగ శ్రవణం నిర్వహించడం చూస్తూనే ఉన్నాము. కాగా ప్రస్తుతం పంచాంగాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇలా పూర్వం లభించేవికాదు. తాటాకుల మీద వ్రాయబడేవి కనుక పండితులవద్ద మాత్రమే ఉండేవి. కనుక వారు ఉగాదినాడు సంవత్సర ఫలాలను అందరికీ తెలియజేస్తారు.

ఈ విధముగా పంచాంగ శ్రవణం ఆచారమైనట్లు పండితుల అభిప్రాయం."పంచాంగం" అంటే అయిదు అంగములు అని అర్ధం. తిధి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనేవి ఆ అయిదు అంగాలు. పాడ్యమి మొదలుకొని 15 తిధులు, 7వారాలు, అశ్వని మొదలుకొని రేవతి వరకు 27 నక్షత్రములు, విష్కభం మొదలుకొని వైధృతి వరకు 27 యోగములు, బవ మొదలుకొని కింస్తుఘ్నం వరకు, 11 కరణములు వున్నాయి. వీటన్నిటినీ తెలిపేదే "పంచాంగం". పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు. అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు. సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

నవనాయకులు

1.రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

2.మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

3.సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

4.సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.
ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
సర్వేజనా సుఖినోభవంతు

🕉 గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ 🕉

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...