Friday, March 16, 2018

కనకధారా స్తోత్రం (తాత్పర్యము)

కనకధార స్తోత్రం చాల శక్తివంతమైనది. ఈ స్తోత్రంప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. మానాన్నగారు ఓ రోజు రైలు లో నెల్లూరు వస్తున్నారు. ఒకముస్లిం అతను మా నాన్న పక్కన కూర్చొని, కనకధారస్తోత్రం పుస్తకం తీసి చదువుతున్నారు, మా నాన్నఅది చూసి ఆశ్యర్యపోయారు. సాధారణంగా ముస్లింలుమన పుస్తకాలూ చదవరు కదా, తనని అడిగితే, "కనకధారా స్తోత్రం" చదివితే ధనముకు ఇబ్బంది వుండదు అని ఎవరోచెప్పారట, అప్పటినుండి చదువుతున్నాను, అంతా మంచేజరిగింది అని సమాధానం ఇచ్చారట. నమ్మకం వుండాలేకానీ ఈ మతాలు అడ్డురావు కదా. 
       శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద ఏమీ లేకపోయే సరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. "స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం. ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. 

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ 
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం 
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా 
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః 

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక 

ముగ్ధాముహుర్విదధతీ వదనే మురారేః 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని 
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ 
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః 

పెద్ద నల్ల కలువపై నుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక 

ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం 
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం 
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం 
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః 

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక. 

భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య 
హారావలీవ హరినీలమయీ విభాతి 
కామప్రదా భగవతోపి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాః 

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 

కాలాంబుదాలి లలితోరసి కైటభారేః 
ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ 
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక 

ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్ 
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన 
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం 
మందాలసం చ మకరాలయ కన్యకాయాః 

ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం 
ఆనందహేతు రధికం మధువిధ్విషోపి 
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః 

సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక 

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర 
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే 
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం 
పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ 

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక 

దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా 
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే 
దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః 

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక 

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి 
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై 

వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర
వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై 
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై 

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై 
నమోస్తు సోమామృత సోదరాయై 
నమోస్తు నారాయణ వల్లభాయై 

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు హేమాంభుజ పీఠికాయై 
నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై 
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై 

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు దేవ్యై భృగు నందనాయై 
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై 

భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై 
నమోస్తు దేవాదిభి రర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై 

తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము 

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యోతాని 
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే 

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక 

యత్కటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్ధ సంపదః 
సంతనోతి వచనాఞ్గ మానసై 
త్వాం మురారి హృదయేశ్వరీం భజే 

ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును 

సరసిజనిలయే సరోజ హస్తే 
ధవళతమాం శుక గంధమాల్యశోభే 
భగవతి హరివల్లభే మనోఙ్ఞే 
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం 

కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట 
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం 
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం 

దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

కమలే కమలాక్ష వల్లభేత్వం 
కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః 
అవలోకయ మా మకిఞ్చనానాం 
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః 

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము. 

స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం 
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాగినో 
భవంతి తే భువి బుధ భావితాశయాః 

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలు రగుచున్నారు.

సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం 
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్ 

శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును. 

పురుష సూక్త మహిమ

మైసూరు దగ్గర ఒక గుట్టమీద ఉన్న గుహలో పాపనాశన లింగం ఉందని తెలిసి శృంగేరి జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి  వారు(  1954 — 1989 ) అక్కడ సంధ్యాపూజ చేయడానికి ఉద్దేశించారు.

గుహలో కొంతదూరం పోయాక ఇరుకుగా ఉన్న ఒకచోట వంగి పాకుతూపోగా లోపల ఒక విశాలమైన ప్రాంగణం లో శివలింగం కనిపించింది.

లింగం వెనుక కొంత ఎత్తుగా ఉన్న మిట్టనుంచి నీళ్ళు ఉబికి లింగం పై ధారగా పడుతుందని వినిఉన్న  మహాస్వామి ఆ గుహ లోపల లింగం దగ్గర తడి కనిపించినా ఎక్కడా నీరున్నట్లు తెలియలేదు.

పూజ చేయడం ఎట్లా ? అని ఆలోచించిన శ్రీ మహాస్వామి
" పురుష సూక్తం " మొదలు పెట్టారు.

అంతే .................. ! ! ! ! ! ! ! !
లింగం వెనుక ఉన్న ఎత్తైన మిట్ట నుండి నీటిధార పైకి లేచి లింగాన్ని అభిషేకించింది. ! ! ! !

  " పురుషసూక్తానికి అంత మహిమ ఉన్నదని నేను అంతకుముందు విని గానీ , చదివి గానీ ఉండలేదు " అని శ్రీ స్వామి వారు చెప్పారు .

శ్రీ స్వామి వారి నుంచి ఈ వృత్తాంతం విన్న వారు కొందరు ముప్ఫై నలభై మంది ఆ గుహలోకి తమను తీసుకునిపోవలసినది గా శ్రీవారి ని అభ్యర్ధించారు.

గుహలోకి వెళ్ళి చూస్తే పొడి గా ఉంది.

" నేను మౌనంగా ఉన్నాను. భక్తులు ఏక కంఠం తో పురుష సూక్తం మొదలు పెట్టారు.

అంతే .......... ! ! ! ! ! ! ! !

ఆ అద్భుతం మరల జరిగింది ! .

శివలింగం మీద నీటిధార అభిషేకం మొదలైంది.
" పురుష సూక్తం ప్రత్యేకత ఇంకొకసారి నిరూపితమైంది.

అంతా భగవత్కటాక్షం !  "
అని శ్రీ శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్ధ మహాస్వామి ఆ వృత్తాంతాన్ని స్మరించుకున్నారు.

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము శ్రేయస్కరము. అభీష్టసిద్ధికి ఈ క్రింద సూచించిన శ్లోకములను 108 మార్లు జపించవలెను. పిల్లల క్షేమార్ఠము తల్లిదండ్రులు జపము చేయవచ్చును:

1. విద్యాభివృద్ధికి:
(14)
సర్వగ సర్వవిద్భాను ర్విష్వక్సేనో జనార్దనః |వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ||

2. ఉదర రోగ నివృత్తికి:
(16)
భ్రాజిష్ణు ర్భోజనం భోక్తా సహిష్ణు ర్జగదాదిజః |
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ||

3. ఉత్సాహమునకు:
(18)
వేద్యో వైద్య స్సదాయోగీ వీరహా మాధవో మధుః |
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ||

4. మేధాసంపత్తికి:
(19)
మహాబుధ్ధి ర్మహావీర్యో మహాశక్తి ర్మహాద్యుతిః |
అనిర్దేశ్య వపుః శ్రీమా నమేయాత్మా మహాద్రిధృక్ ||

5. కంటి చూపునకు:
(24)
అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీరణః |
సహస్రమూర్థా విశ్వాత్మ సహస్రాక్ష స్సహస్రపాత్
||

6. కోరికలిరేడుటకు:
(27)
అసంఖ్యేయో2ప్రమేయాత్మ విశిష్ట శ్శిష్ట క్రుచ్ఛిచిః |
సిద్ధార్థ స్సిధ్ధసంకల్పః సిద్ధిద స్సిధ్ధిసాధనః ||

7. వివాహ ప్రాప్తికి:
(32)
భూతభవ్య భవన్నాధః పవనః పావనో2నలః |
కామహా కామక్రుత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ||

8. అభివృద్ధికి:
(42)
వ్యవసాయో వ్యవస్థానః సంస్థాన స్స్థానదో ధ్రువః |
పరర్థిః పరమ స్పష్ట: స్తుష్ట: పుష్ట శ్శుభేక్షణః ||

9. మరణ భీతి తొలగుటకు:
(44)
వైకుంఠ: పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః ప్రుథుః |
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయు రథోక్షజః ||

10. కుటుంబ ధనాభివ్రుద్ధికి:
(46)
విస్తారః స్థావర స్స్టాణుః ప్రమాణం బీజ మవ్యయం |
అర్థో2నర్థో మహాకోశో మహాభోగో మహాధనః ||

11. జ్ఞానాభివ్రుద్ధికి:
(48)
యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతు స్సత్రం సతాం గతిః |
సర్వదర్సీ నివృతాత్మ సర్వజ్ఞో జ్ఞాన ముత్తమం ||
12. క్షేమభివ్రుధ్ధికి:
(64)
అనివర్తీ నివృత్తాత్మ సంక్షేప్తా క్షేమక్రుచ్ఛివః |
శ్రీవత్సవక్షా శ్శ్రీవాస శ్శ్రీపతిః శ్శ్రీమతాం వరః ||

13. నిరంతర దైవ చింతనకు:
(65)
శ్రీద శ్శ్రీశ శ్శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః |
శ్రీధరః శ్రీకర శ్శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ||
14. దుఃఖ నివారణకు:
(67)
ఉదీర్ణ స్సర్వత శ్చక్షు రనీశ శ్శాశ్వత స్థిరః |
భూశయో భూషణో భూతి ర్విశోక శ్శోక నాశనః ||

15. జన్మ రాహిత్యమునకు:
(75)
సద్గతి స్సత్క్రుతి స్సత్తా సద్భూతి స్సత్పరాయణః |
శూరసేనో యదుశ్రేష్ఠ స్సన్నివాస స్సుయామునః ||

16. శత్రువుల జయించుటకు:
(88)
సులభ స్సువ్రత సిద్ధ శ్శత్రుజి చ్ఛత్రు తాపనః !
న్యగ్రోధో దుంబరో2శ్వత్ఠ శ్చాణూరాంధ్ర నిషూధనః ||

17. భయ నాశనమునకు:
(89)
సహస్రార్చి స్సప్తజిహ్వ స్సప్తైధా స్సప్తవాహనః |
అమూర్తి రణఘో2చింత్యో భయక్రు ద్భయ నాశనః ||

18. మంగళ ప్రాప్తికి:
(96)
సనాత్సనాతన తమః కపిలః కపి రవ్యయః |
స్వస్తిద స్స్వస్తిక్రుత్ స్వస్తి స్వస్తిభుక్ స్వస్తిదక్షిణః ||

19. ఆపదలు తొలగుటకు, లోక కల్యాణమునకు:
(97 & 98)
అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జిత శాసనః |
శబ్దాదిగ శ్శబ్దసహ శ్శిశిర శ్శర్వరీకరః ||
అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః |
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ||

20. దుస్వప్న నాసనమునకు:
(99)
ఉత్తారణో దుష్క్రుతిహా పుణ్యోదుస్వప్న నాశనః |
వీరహా రక్షణ స్సంతో జీవనం పర్యవస్తితః ||

21. పాపక్షయమునకు:
(106)
ఆత్మయోని స్స్వయం జాతో వైఖాన స్సామగాయనః |
దేవకీ నందన స్స్రష్తా క్షితీశః పాపనాసనః ||

శ్రీరస్తు --- శుభమస్తు --- విజయోస్తు

ఓం అసతోమా సద్గమయ
ఓం తమసోమ జ్యోతిర్గమయ
ఓం మృత్యోర్మా అమ్రుతంగమయా

ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతిః

మన పంచాంగం ప్రాముఖ్యత

పండగలొస్తాయి వెళ్లిపోతాయి సాదాసీదా కేలండర్ లో. తేదీల పేజీని కొందరూ, నెలల పేజీలను ఇంకొందరూ చింపి అవతల పడేస్తారు కదా! అలాగే పంచాంగాలు మార్చి, కొత్త పంచాంగం తెస్తాం! ఇవేవీ ఈ కాలం పిల్లలకి చెప్పడానికి చాలామందికి తెలియదు. తెలుగు కేలండర్ ని పంచాంగం అంటారు. తిథి,వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు(విషయాలు) పంచాంగంలో ఉంటాయి.

మనకి తెలసిన కేలండర్ కీ, పంచాంగానికీ దోమకీ, ఏనుగుకీ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అవి డేట్స్ మాత్రమే చెప్పి చిరిగిపోతాయి. పంచాంగం అలా కాదు. సూర్య చంద్రాది గ్రహ గతులు అపార వైదిక గణిత శాస్త్రంతో విడమర్చి చెప్తాయి. పున్నమి చంద్రుడు ఎప్పుడొస్తాడు? ఆ చంద్రుడ్ని రాహువో, కేతువో ఎప్పుడు మింగేద్దామని చూస్తాడు? (అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్నమాట). ఇలాంటి మహత్తరమైన కాలపు లెక్కలు మన పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం ఈ రోజు చూస్తున్న కేలండర్ కి చాలాచాలా వేల సంవత్సరాలకి ముందే మన భారతీయులు సాధించిన ఖగోళ గణిత విజ్ఞానం. అదే పంచాంగంగా రూపొందించే జ్ఞానం అన్నమాట.

సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు అనేవే కాకుండా మిగిలిన గ్రహాలూ మన జీవితంలో  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అవును కదా! సూర్యుడొస్తే పగలు, వెళ్లిపోతే రాత్రి. అలా ఏదో రూపంలో చీకటి వెలుగులనిచ్చే శక్తి మిగిలిన గ్రహాలకి ఎందుకుండదు? ఏదైనా మంచి జరిగితే మనం…  ‘టైమ్ బావుందనీ’, ‘లక్కీ’ అని, ‘కలిసి వచ్చిందనీ’ అంటాం కదా! అలాగే టైమ్ బాగోకపోవడం, బ్యాడ్ లక్ ల గురించి కూడా అనుకుంటూ ఉంటాం కదా! ఉదాహరణకు కష్టపడి పరీక్షలకి చదివి మనం అనుకున్న ప్రశ్నలు రాకపోతే, మనకి గుర్తున్న జవాబులు తట్టకపోతే పరీక్ష గోవిందా! అయితే ఇందుక్కారణం  ఉంది- అని  పంచాంగం రాసిన పెద్దలు చెబుతుంటారు.

మనం పుట్టిన వేళని బట్టి, అప్పుడున్న గ్రహగతుల్ని బట్టి ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు బాధలోస్తాయో లెక్కలు గట్టి…. దానికి రెమెడీలు చెబుతారు. అంటే, చీకటి పడుతుంటే మనం అలా చీకట్లో బాధపడకుండా కొవ్వొత్తో, లాంతరో, లైటో వాడతాం! అంటే సూర్యగ్రహానికి రెమెడీని మనం వాడుతున్నామన్నమాట. అలా అన్ని గ్రహాలకీ రెమెడీను మన పెద్దవాళ్లు కనిపెట్టారు. ఫలానా పూజలు చెయ్యి, ఫలానా జపాలు చెయ్యి, ఫలానా దానాలు చెయ్యి-అని కొవ్వొత్తులూ, లాంతర్లూ వాడడం లాగా –పరిహారాలను చెప్పే పుస్తకమే పంచాంగం.

మనకీ నెల్లో బాగుందనీ, మనకీ నెల్లో నష్టం జరగవచ్చుననీ కేలండర్లు చెప్పలేవు. కానీ పంచాంగం ఆ బాధ్యత తీసుకుని, (చలేస్తుంది! స్వెట్టర్ వేసుకెళ్లు! బండి మీద వెళ్తున్నావు కదా! హెల్మెట్ పెట్టుకుని వెళ్లు! అని అమ్మ హెచ్చరించినట్టుగానే) మనకి కాషన్స్, రెమెడీస్ చెబుతుంది. అలాంటి మంచి మాటలూ, మంచి రోజులూ చెబుతుంది. గనుకనే పంచాంగాన్ని ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం ప్రేమించి, గౌరవిస్తున్నాం.

భవిష్యత్తును సైతం అంచనా వేయగల మేధావులు మన పంచాంగకర్తలు .
ప్రపంచంలో ఏజాతికి లేని ఖగోళ పరిజ్ఞానం....అతి ప్రాచీన కాలంలోనే మన హైందవజాతికి ఉంది. శాస్ర్తీయమైన యతార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పాశ్చాత్య సాంప్రదాయాలపై నేడు మన హిందూ యువత మోజు చూపుతోంది. పరమ ఆరోగ్యదాయకమైన మన హిందూ సంవత్సరాదిని ఓ ప్రక్కకు నెడూతూ...విష్ యూ హేపీ న్యూ ఇయర్ అంటూ పరుగులు తీస్తోంది.

హేపీ న్యూఇయర్ అనే మాట వినగానే ఇవాళ చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఫస్ట్..! జనవరి ఫస్ట్ సంవత్సరారంభం అయితే....మరి ఉగాది నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం మాటేమిటి...?  ఉగాది అంటే కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండుగేనా...? ఇంతకీ ఏది కొత్త సంవత్సరం. జనవరి ఫస్టా...లేకా ఉగాదా...! ఏది శాస్త్రీయమైన సంవత్సరాంభం...? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది ఎప్పుడు?  విజ్ఞులు అనుసరించిన, అనుసరించవలసిన అసలు కాలమానం ఏది? ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ కాలమానంలో లోపాలు ఉన్నాయా? అసలు నిజం ఏమిటీ?

ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి "ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్ర్త రీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం. పుష్కరం, శకం, యుగం కల్పకం మొదలైన అన్నింటినీ ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ శాస్ర్త ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.

వేషభాషలు, ప్రవర్తన, ఆహార విహారాలూ అన్నింటిలోనూ విదేశీ అనుకరణనే ఇష్టపడుతున్నారు మనవాళ్లు. అయితే అదే సమయంలో మన ప్రాచీన హైందవ సంస్కృతీ సాంప్రదాయాలకు విదేశాల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందనే మాటను మనవాళ్లు మరచిపోతున్నారు. పండుగలను అనుసరించే పద్దతులలో కూడా విదేశీ అలవాట్లకు బానిసలౌతున్నారు. మన పండుగల నిర్వాహణా విధనాల్లో ఉన్న విజ్ఞాన అంశాల్ని గ్రహించలేక మూర్ఖపు ధోరణులకు, అసభ్య నడవడికలకు బలి అవుతున్నారు.

విశ్వం....లోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మొదలైన వాటి స్థితి గతుల్ని వివరించే శాస్ర్తమే ఖగోళశాస్ర్తం. శాస్ర్తాలన్నింటిలో ప్రముఖమైన శాస్ర్తంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్ర్త పరిజ్ఞానం అత్యంత ముఖ్యం. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఈ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తారు. భూమి ఒక ఆత్మ ప్రదక్షిణం చేస్తే 1 రోజు అనీ, చంద్రుడు ఒక భూ ప్రదక్షిణ చేస్తే 1 నెల అని, భూమి ఒక సూర్య ప్రదక్షిణం చేస్తే 1 సంవత్సరం అనీ...ఇలా కాలమానాన్ని ఖగోళ విషయ ఆధారంగానే ఉండి తీరాలనేది ఈ నియమాల సారం.

సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ పత్ర్యేకతా , ఆధారమూ లేకుండా ఎవరికో తోచిన జనవరి ఫస్ట్ ను సంవత్సరారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు. యదార్థ సంవత్సరారంభం ఉగాదిని మరిచి, పాశ్చాత్య పోకడల వెర్రి వ్యామోహంలో పడి జనవరి ఫస్ట్ కు దాసోహమంటున్నాం.

క్రీస్తు శకం అంటూ కాలమానాన్ని లెక్కించడం చూసి హిందువులు చాలా మంది అపోహలకు లోనౌతున్నారు. మరి హిందువుల చరిత్ర అత్యంత ప్రాచీనమైనదైతే... క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తూ కాలాన్ని లెక్కిచండం ఎందుకొచ్చిందనేది అనేకమందికి సందేహం...! ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు శకాన్నే వాడడంలో ఏమైనా ప్రముఖ విశేషం ఉందా..? ఈ క్రీస్తు శకాన్ని విదేశీయులతోపాటు, మన దేశంలోని  నాస్తికవాదులు సైతం చాలా గొప్పగా భావిస్తుంటారు...! ఇంతకీ ఈ క్రీస్తుశకం అనేది ఎందుకొచ్చింది. ? ఈ శకం వెనుక దాగివున్న యధార్ధం ఏమిటీ?

చరిత్రలో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకుంటూ రావడం అవసరమైంది. అయితే ఈ లెక్కకు ఎక్కడ నుంచి మొదలైందని చెప్పడం కష్టమే. పురాణ పురుషుల కాలం నుంచో.. మహా ప్రతిభావంతులైన చక్రవర్తుల కాలం నుంచో, ప్రవక్తల కాలం నుంచో... ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో- సంవత్సరాలను  లెక్క పెట్టడం చరిత్రలో ఒక రివాజు. దీనినే శకం లెక్కింపు అంటారు.

ఒక్కొక్క జాతి ఒక్కొక్క కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది. మన హిందూజాతికి అతి పురాతన కాలం నుంచీ అనేక శకాలున్నాయి. కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో  అలవాటు చేయబడిన క్రీస్తు శకం కాలమానాన్ని ప్రపంచరీతి కోసం నేటికీ మనం అనుసరిస్తున్నాం. నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆదరించే దేశాల ప్రాబల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీసుకోవాల్సివచ్చింది. అంతేగానీ ఈ శకాల కంటే క్రీస్తు శకానికి ఏదో ప్రత్యేకత ఉందని మాత్రం కాదు.

వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు. ఎవరి లెక్కలు వారికుండేవి. తమకు తెలియని విషయాన్ని, మరో జాతి నుంచి నేర్చుకునేవారు. అయితే కాలం గడిచేకొలదీ...ప్రపంచమంతా ఒకే కాలమాన పద్ధతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలయ్యింది. అయితే ఎవరి కాలమానాన్ని...ఈ ప్రపంచ కాలమానంగా తీసుకోవాలనే సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి. దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు. తమ ఆధీనంలోని అన్ని దేశాలలో ఈ శకాన్ని అమలుపర్చడం మొదలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచలోని అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు తమ సౌలభ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది.

అయితే క్రీస్తు శకంలో ఓ తిరకాసు ఉంది. ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని చరిత్రకారులెవరు కూడా ఒక నిర్థారణగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ఆధారమూ కన్పించడం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు హెచ్. జివెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంథంలో క్రీస్తు జీవితానికి సంబంధించిన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. బైబిల్ కూడా క్రీస్తు అనంతరం రాయబడింది.

చాలా మంది క్రీస్తు పుట్టుక నుంచే క్రీస్తు శకం మొదలైందని అనేకమంది భావిస్తారు. ఏసు క్రీస్తు జీవించాడానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత క్రీ.శ. 532వ సంవత్సరంలో డయోనీషియన్ ఎక్సీగస్ అనే రోమన్ సన్యాసి, క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలంటూ ప్రచారం మొదలు పెట్టాడట..! క్రీస్తు పుట్టిన సంవత్సరం క్రీ.శ.1అని ఆయన ప్రతిపాదించాడు. అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్రీ.శ.816లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడకంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అయినా కూడా చాలా సంవత్సరాలు ఎవరూ పట్టించుకోలేదు.  క్రీ.శ.879 లో జర్మనీ చక్రవర్తి 2వ ఛార్లెస్ మొట్టమొదటగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టాడట. అనంతర కాలక్రమంలో ఇతర చోట్ల మెల్లమెల్లగా క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.! అంటే క్రీస్తు జీవితానంతరం సుమారుగా 800 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట. అయితే క్రీస్తు పుట్టింది. క్రీ.శ.1 లో కాదనీ , క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అయి ఉండవచ్చుననీ సుప్రసిద్ధ చరిత్రకారుడు సర్ జాన్ కెప్లర్ తేట్చాడని కొంతమంది చెబుతారు. అయినా కూడా క్రీస్తు శకం లెక్కను మాత్రం ఎవరూ మార్చలేదు. అలాగే వదిలేశారు. ఇది అలాగానే కొనసాగుతోంది.

అమెరికాకు చెందిన చరిత్రకారుడు విల్ డ్యూరాంట్...క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు. డిసెంబర్ 25న క్రిస్ మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. క్రీ.స్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు బయటపెట్టలేకపోయాడు. ఆయన పుట్టిన నెల, తేదీలను నిర్ణయించగల అవకాశాలు చరిత్రలో ఎక్కడ కనిపించలేదని...దీంతో ఆ కాలాన రోమ్ నగరంలో ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన శాటర్నేలియా అనే పండుగ వేలాది మందితో తిరునాళ్ల వలే జరుపుకునేవారు. ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకులంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట..! కాలక్రమేణ ఆ ప్రచారం ముదిరి క్రీ.శ.1020 నాటికి డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్థిరపడిందట..!

ఒక ఆధారమంటూ లేకుండా కొనసాగుతున్న ఆచారం...క్రీస్తు శకం వాడకం.! వసంత రువుతులో సంత్సరాదిని ఏర్పాటు చేసుకోవడం ఖగోళపరంగా ఖచ్చితమైన పద్ధతి. కాలమానంలో సుక్ష్మఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు...మొదలైనవి ఏర్పరచిన అతి ప్రాచీన కాలమానం మనది. ఇవన్నీ కూడా ఖగోళ ఆధారంగానే ఏర్పరచడం జరిగింది. విదేశీ కాల్యెండర్ లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ తేదీల్ని అంకెల్లో లెక్కించుకోవడం తప్ప... ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నది తెలిపే విధానం ఏదీ లేదు. కానీ అదే మన హిందూ...పంచాంగంలో ఖగోళ పరిస్థితి తెలిపే విధానం ఉంది.

Thursday, March 15, 2018

ఉగాది నాడు పంచాంగ శ్రవణ ఫలితం

శుభకార్యాలు, పూజా పునస్కారాలు, పితృదేవతారాధన, వంటి విషయాలకు వచ్చేటప్పటికి పంచాంగమును వాడుతుంటారు. ఈ పంచాంగం ఉగాదితో అమల్లోకి వచ్చి, మళ్లీ సంవత్సరం ఉగాది ముందురోజు వరకు అమలులో ఉంటుంది. అటువంటి పంచాంగమును ఉగాదినాడు వివిధ దేవతలతోపాటు పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగ శ్రవణాన్ని చేస్తారు. పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగాస్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని పెద్దలంటారు. పూర్వకాలంలో ఆ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి? ఏరువాక ఎలా సాగాలి? లాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి అదో మార్గంగా ఉండేది.

పంచాంగ శ్రవణం చేసే సమయంలో ఉత్తరాభిముఖంగా కూర్చుని పంచాంగం వింటే మంచిదని పండితుల అభిప్రాయం. పంచాంగ శ్రవణంలో ప్రధానంగా ఆ సంవత్సర ఫలితాలను వివరిస్తారు.అంటే నవనాయకులను తెలుసుకుని వారిద్వారా ఫలాలను అంచనా వేస్తారు.

సంవత్సరంలో ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం లభిస్తుందో తెలుసుకుంటారు. ఆ గ్రహాలే ఆ సంవత్సర నవ నాయకులు. వీరికి లభించే అధికారాన్ని బట్టి ఆ సంవత్సర ఫలితాలు ఉంటాయి.

రాజు - చాంద్రమాన సంవత్సర ప్రారంభదిన వారాలకి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

మంత్రి - సౌరమాన సంవత్సర ప్రారంభదిన వారానికి అధిపతి ఆ సంవత్సరానికి రాజు.

సేనాధిపతి - సూర్యుడు సింహరాశికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

సస్యాధిపతి - సూర్యుడు కర్కాటక రాశిలోనికి ప్రవేశించేనాటి వారానికి అధిపతి.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం లో బోలెడంత పరమార్థముంది. ఇది మన ఖగోళ శాస్త్రీయ దృక్కోణానికి అద్దంపట్టే సంప్రదాయం. ఎందుకంటే ఖగోళ స్థితిగతులను అనుసరించే పంచాంగాన్ని రూపొందిస్తారు. ఇందులో ఐదు అంగాలుంటాయి.

తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణంలను పంచాంగం అంటారు. చంద్రుని నడకకు సంబంధించినది తిథి.

వారంలోని ప్రతిరోజునీ ఒక గ్రహానికి అధిదేవతగా భావించి ఆరోజును ఆ గ్రహం పేరుతో పిలుస్తారు.

రాశిచక్రంలోని 27 నక్షత్రాల్లో ఏ రోజున ఏ నక్షత్రం దగ్గరకు చంద్రుడు వస్తే ఆ రోజు ఆ నక్షత్రం ఉన్నట్లు చెబుతారు.

నక్షత్రరాశిలో సూర్యచంద్రులు ఉన్నట్లు భావించి యోగం లెక్కగడతారు. ఇక తిథిలో అర్ధభాగం కరణం. ఇన్ని విషయాలు ఉన్నాయి కాబట్టే భవిష్యత్తు గురించి ముందే తెలుసుకుని అందుకు అనుగుణంగా నడుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా ఈ ఏడాది వాతావరణం ఎలా ఉండబోతుందీ ఏయే పంటలు వేస్తే మంచిదీ వంటి విషయాలన్నీ రైతులు తెలుసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో సాగుపనులనూ ఈరోజే లాంఛనంగా మొదలుపెడతారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...