Friday, March 16, 2018

కనకధారా స్తోత్రం (తాత్పర్యము)

కనకధార స్తోత్రం చాల శక్తివంతమైనది. ఈ స్తోత్రంప్రతిరోజూ చదివితే ఆర్ధిక సమస్యలు సమసిపోతాయి. మానాన్నగారు ఓ రోజు రైలు లో నెల్లూరు వస్తున్నారు. ఒకముస్లిం అతను మా నాన్న పక్కన కూర్చొని, కనకధారస్తోత్రం పుస్తకం తీసి చదువుతున్నారు, మా నాన్నఅది చూసి ఆశ్యర్యపోయారు. సాధారణంగా ముస్లింలుమన పుస్తకాలూ చదవరు కదా, తనని అడిగితే, "కనకధారా స్తోత్రం" చదివితే ధనముకు ఇబ్బంది వుండదు అని ఎవరోచెప్పారట, అప్పటినుండి చదువుతున్నాను, అంతా మంచేజరిగింది అని సమాధానం ఇచ్చారట. నమ్మకం వుండాలేకానీ ఈ మతాలు అడ్డురావు కదా. 
       శ్రీ శంకర భవత్పాదులు ఒకరోజు భిక్షకు వెళ్ళినపుడు కడు బీదరాలైన ఒక అవ్వ స్వామికి భిక్ష ఇవ్వడానికి తనవద్ద ఏమీ లేకపోయే సరికి బాధతో, ఇల్లంతా వెతికితే ఒక ఉసిరిగకాయ మాత్రమే ఆమెకి దొరికింది. "స్వామి నా దగ్గర బిక్ష ఇవ్వడానికి ఈ ఉసిరి మాత్రమే ఉంది " అని గురువుకి సమర్పించింది. ఆమె భక్తికి ఆచార్యుల హృదయం ద్రవించి, ఆమె దారిద్ర్యాన్ని తొలగించడానికి లక్ష్మీదేవిని స్తుతించారు. లక్ష్మీదేవి ప్రసన్నయై, స్వామి కోరినట్లు, ఆ ముసలమ్మ ఇంట కనకవర్షం కురిపించింది. ఆ స్తోత్రమే కనకధారస్తోత్రం. ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది. 

అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ 
భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం 
అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా 
మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః 

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక 

ముగ్ధాముహుర్విదధతీ వదనే మురారేః 
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని 
మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ 
సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః 

పెద్ద నల్ల కలువపై నుండు ఆడుతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక 

ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం 
ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం 
ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం 
భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః 

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక. 

భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య 
హారావలీవ హరినీలమయీ విభాతి 
కామప్రదా భగవతోపి కటాక్షమాలా 
కల్యాణమావహతు మే కమలాలయాః 

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 

కాలాంబుదాలి లలితోరసి కైటభారేః 
ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ 
మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః 
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః 

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక 

ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్ 
మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన 
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం 
మందాలసం చ మకరాలయ కన్యకాయాః 

ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం 
ఆనందహేతు రధికం మధువిధ్విషోపి 
ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం 
ఇందీ వరోదర సహోదర మిందిరాయాః 

సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక 

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర 
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే 
దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం 
పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ 

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక 

దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా 
అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే 
దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం 
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః 

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక 

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి 
శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి 
సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ 
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై 

వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర
వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై 
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై 
శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై 
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై 

పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు నాళీక నిభాననాయై 
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై 
నమోస్తు సోమామృత సోదరాయై 
నమోస్తు నారాయణ వల్లభాయై 

పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు హేమాంభుజ పీఠికాయై 
నమోస్తు భూమణ్డల నాయికాయై 
నమోస్తు దేవాది దయాపరాయై 
నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై 

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము. 

నమోస్తు దేవ్యై భృగు నందనాయై 
నమోస్తు విష్ణోరురసి స్థితాయై 
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై 
నమోస్తు దామోదర వల్లభాయై 

భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము 

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై 
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై 
నమోస్తు దేవాదిభి రర్చితాయై 
నమోస్తు నందాత్మజ వల్లభాయై 

తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము 

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి 
త్వద్వందనాని దురితా హరణోద్యోతాని 
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే 

పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక 

యత్కటాక్ష సముపాసనా విధిః 
సేవకస్య సకలార్ధ సంపదః 
సంతనోతి వచనాఞ్గ మానసై 
త్వాం మురారి హృదయేశ్వరీం భజే 

ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును 

సరసిజనిలయే సరోజ హస్తే 
ధవళతమాం శుక గంధమాల్యశోభే 
భగవతి హరివల్లభే మనోఙ్ఞే 
త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం 

కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము 

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట 
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం 
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష 
లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం 

దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను. 

కమలే కమలాక్ష వల్లభేత్వం 
కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః 
అవలోకయ మా మకిఞ్చనానాం 
ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః 

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము. 

స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం 
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం 
గుణాధికా గురుతర భాగ్యభాగినో 
భవంతి తే భువి బుధ భావితాశయాః 

ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలు రగుచున్నారు.

సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం 
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్ 

శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును. 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...