Sunday, February 11, 2018

లింగోద్భవం

సర్వేశ్వరుడైన ఈశుడు లింగస్వరూపుడూ అందులోనూ తేజో లింగస్వరూపుడై అవతరించిన మరుక్షణంలోనే మానవాళికి గొప్ప సందేశాన్ని ఇచ్చాడని వివరించే ఈ కథా సందర్భం శివపురాణంతో పాటు ఇతర పురాణాలలో కూడా ప్రస్తావితమై ఉంది.

ఒక్క శివలింగానికి కాసింత పూజను, అభిషేకాన్ని ఏ రోజు చేసినా పుణ్యఫలమే. అందులోనూ శివరాత్రి వేళ లింగోద్భవ సమయంగా చెప్పే సమయంలో ఇక అలాంటి పూజలు, అభిషేకాలు చేస్తే ఎంత గొప్ప పుణ్యఫలం ప్రాప్తిస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమేముంటుందని పురాణజ్ఞులు, పండితులు అంతా అనేమాట వాస్తవమే.
అసలు మనిషి దైవ సందేశాన్నందుకొని లోక యాత్రలో పుణ్య పురుషుడుగా మెలగాలన్నదే మన ఆర్షవాణి, సంప్రదాయ పర్వదినాల అవతరణలో అసలు విషయం. ఇక లింగోద్భవ సమయంలో శివుడిచ్చిన సందేశమేమిటి? ఆ భవుడికి, భవనాశనుడికి, శంకరుడికి నచ్చనిది ఏది? అనే విషయం కూడా ఇక్కడ ప్రస్తావితమై కనిపిస్తుంది.

పూర్వం ఓసారి బ్రహ్మకు, విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది. అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది. లోకాలన్నీ ఆ తగవులాటవల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్ర శేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు. వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగరూపంలో అవతరించేలా చేశాడు. అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి, బ్రహ్మలు యుద్ధంమాని విస్తుపోతూ చూశారు. వెంటనే పార్వతీ వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని, ఆ స్తంభం (లింగం) అగ్రభాగాన్ని ఒకరు, అడుగు భాగాన్ని మురొకరు చూసి రావాలని, ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని, వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు. వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్ళాడు. విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు.

హరి, బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాశి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు. ఇంతలో పై నుండి ఒక కౌతకి (మొగలిపువ్వు) రావటం హంస రూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు. బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజో రాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు. పాతాళం వైపు వెళ్ళిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్ళినా కనిపించలేదు. ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు. బ్రహ్మ, ఆ తర్వాత కొద్ది సేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పై కొచ్చాడు. శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంటపెట్టుకొచ్చానన్నాడు. ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది. వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు.

భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదుతలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు. తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు. పక్కనే ఉన్న విష్ణువు కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు. బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు. శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు. ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని, అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు, పూజలు ఏవీ ఉండవని చెప్పాడు. అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరి చేత పూజలందుకుంటాడని, స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు.

మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలిపువ్వుకు చోటుండదని అన్నాడు. అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది. భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలిపువ్వును ధరిస్తారని, అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్థానమయ్యాడు. ఈ కథా సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది. మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

మహా_శివరాత్రి_నాడు_చేయవలసిన_విధులు

చతుర్దశాబ్దం కర్తవ్యం శివరాత్రివ్రతం శుభమ్‌

శివరాత్రి వ్రతమును పదునాల్గు సంవత్సరములు చేయవలెను. త్రయెదశినాడు ఒక పూట భోజనమును చేసి, చతుర్దశినాడు ఉపవాసమునుండవలెను. శివరాత్రి సంప్రాప్తము కాగానే నిత్యనిధిని అనుష్టించి, తరువాత శివాలయమునకు వెళ్లి యథావిధిగా పూజను చేసి, తరువాత అచట ముల్లోకములలో గౌరీ తిలకమని ప్రసిద్ధిని గాంచిన దివ్యమగు మండపమును ప్రయత్నపూర్వకముగా చేయవలెను. ఆ మండలమునకు మధ్యలో లింగతోభద్రము, లేదా సర్వతో భద్రము అనే ముగ్గును వేయవలెను.

వస్త్రము, ఫలము మరియు దక్షిణలతో కూడిన శుభకరమగు కుంభములను అచట ప్రాజాపత్య విధానముతో స్థాపించవలెను. కుంభములను మండపమునకు ప్రక్కలయందు జాగ్రత్తగా ఉంచవలెను. మధ్యలో ఒక బంగరు కుండను, లేదా మరియొక కుండను ఉంచవలెను.వ్రతమును చేయువాడు పలము, లేక అర్ధపలము, బంగారముతో, లేదా యథాశక్తిగా చేసిన పార్వతీపరమేశ్వరుల మూర్తిని నిర్మించి అచట ఉంచవలెను.

శివుని మూర్తిని కుడివైపున, పార్వతి మూర్తిని ఎడమవైపున ఉంచి రాత్రియందు శ్రద్ధతో పూజించవలెను. ఆ సమయములో బుుత్వికులతో సహా ఆచార్యుని వరణము చేసి, వారి అనుజ్ఞతో భక్తిపూర్వకముగా శివుని పూజించవలెను. వ్రతనిష్ఠ గల భక్తుడు రాత్రియందు ప్రతియామమునందు పూజను చేయుచూ, జాగరణము చేయవలెను. వ్రతమును చేయువాడు రాత్రి అంతయు గాననాట్యదులతో గడుపవలెను. ఈ విధముగా యథావిధిగా పూజించి శివుని ప్రసన్నని చేసి ఉదయమే మరల పునఃపూజను చేసి యథావిదిగా హోమమునుచేయవలెను. శక్తిని అనుసరించి ప్రాజాపత్యవ్రతమును చేసి బ్రాహ్మణులకు ప్రీతిపూర్వకముగా భోజనమునిడి భక్తితో దానము చేయవలెను.

భార్యలతో కూడియున్న బుుత్విక్కులను వస్త్రములతో మరియు ఆభరణములతో అలంకరించి వేర్వేరుగా యథావిధిగా దానములను చేయవలెను.దూడ, ఇతరములైన అలంకారములు మరియు ఉపకరణములతో కూడియున్న ఆవును యథావిధిగా ఆచార్యునకు ఇచ్చి, శివుడు నాయందు ప్రీతిని పొందుగాక అని పలుకవలెను. తరువాత కుంభములతో మరియు వస్త్రాది సర్వాలంకారములతో కూడియున్న మూర్తులను ఎద్దుపైన నుంచి ఆచార్యునకు నివేదించవలెను. తరువాత మహేశ్వరుడు, మహాప్రభుడు అగు దేవుని చేతులను జోడించి తలను వంచి నమస్కరించి పరమ ప్రీతి వలన గద్గదమైన వాక్కుతో చక్కగా ప్రార్థించవలెను.

ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందిన వారియందు ప్రీతి గలవాడా! ఓ దేవేశా! ఈ వ్రతమును చేసిన నాపైన దయను చూపుము. ఓ శివా! నేను భక్తిపూర్వకముగా ఈ వ్రతమును చేసితిని. ఓ శంకరా! నీ అనుగ్రహముచే లోపములేవైన ఉన్ననూ సంపూర్ణమగుగాక! ఓ శంకరా!నేను తెలిసిగాని, తెలియకగాని జపపూజాదులలో దోషమును చేసియున్ననూ, నీ కృపచే సర్వము సఫలముగుకాక! ఈ విధముగా శివపరమాత్మకు పుష్పాంజలి ఇచ్చి నమస్కరించి తరువాత మరల ప్రార్థించవలెను. ఈ విధముగా చేయువానికి వ్రతములో లోపమేమియు ఉండదు. దానివలన ఆతనికి నిస్సందేహముగా మనోభీష్టము సిద్ధించును.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

బిల్వపత్రం

శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉంది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు.

శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.

మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.

ఓ విశ్వాసం ప్రకారం చంద్రదర్శనం మరియు పౌర్ణమి రోజులలో బిల్వపత్రాలను తెంపకూడదు. ఈ రోజులలో వచ్చే ప్రకృతి సంబంధమైన మార్పులు బిల్వ వృక్షంపై తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి నిషేధం ఉంది.

నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.

బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.

‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

పరమశివుని దశావతారాలు

ఉపాసనాకాండ ద్వారా సేవింపబడే, మహాకాలమొదలగు పది శివుని అవతారములను గూర్చి నందీశ్వరుడు వివరించెను.  శివుని ప్రధామావతారం మహాకాలుడు. సత్పురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చే మహాకాలావతారము వాటిలో మొదటిది. మహాకాళి ఈ మహాకాలుని భార్య. అపుడు శక్తి మహాకాలియై భక్తులకు ఫలములనిచ్చి కోర్కెలను నెరవేర్చును. పరమశివుని ద్వితీయావతారం తారకావతారం. తారకాదేవి ఈయన భార్య. "తార' అను అవతారము యందు శక్తి "తారా' యనబడును. వీరిద్దరు తమ సేవకులకు భుక్తిని ముక్తిని, సుఖమును ఇచ్చెదరు. పరమశివుని బాలభువనేశుడు మూడవ అవతారము. భాల భువనేశ్వరి భువనేశ్వరుని అర్ధాంగి. ఆ అవతారములో పార్వతి బాలభువనేశ్వరియై సత్పురుషులకు సుఖమునిచ్చును.

భక్తులకు భుక్తిని, ముక్తిని, సుఖమును, ఫలమును ఇచ్చే షోడశవిద్యేశుడు నాల్గవ అవతారము. దానిలో పార్వతి షోడశీ విద్యాదేవి యగును.  సర్వకాలములలో భక్తుల కోర్కెల నీడేర్చు భైరవుడు ప్రసిద్ధిగాంచిన అయిదవ అవతారము. దానియందు పార్వతి భైరవియై మంచి ఉపాసకుల కోర్కెలను తీర్చును.  శివుని ఆరవ అవతారమునకు ఛిన్నమస్తకుడని పేరు. గిరిజాదేవి ఛిన్నమస్తకయై భక్తుల కోర్కెలను తీర్చును. సర్వకామనలనీడేర్చి ఫలములనిచ్చే ధూమవంతుడు శివుని ఏడవ అవతారము. ఆ అవతారములో పార్వతి ధూమావతియై సత్పురుషులగు ఉపాసకుల కోర్కెలను తీర్చును. సుఖమునిచ్చు బగలాముఖుడు ఎనిమిదవ శివావతారము. దానిలో శక్తి మహానందా, బగలాముఖీ యను పేర్లతో ఖ్యాతిని పొందును. తొమ్మిదవ శివావతారము మాతంగుడు. దానిలో పార్వతి మాతంగియై సర్వకామనలను నెరవేర్చును. భుక్తిని ముక్తిని ఇచ్చే కమలుడు శంభుని పదియవ అవతారము. దానిలో పార్వతి కమలయై తన భక్తులను రక్షించును. ఈ పది శివావతారములు సత్పురుషులగు భక్తులకు సుఖమును, భుక్తిని, ముక్తిని, సర్వమును ఇచ్చును.

మహాత్ముడగు శంకరుని ఈ పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించువారికి అనేక సుఖములు లభించును. తంత్ర శాస్త్రము మొదలగు వాటియందు నిగూఢముగా నున్న ఈ పది అవతారముల మహిమను శివ పర్వదినములయందు స్మరించిన సమస్త సుఖాలు, కోర్కెలు సిద్ధించును. తంత్ర శాస్త్రాదులలో నిగూఢముగా నున్న ఈ శక్తుల మహిమ అద్భుతము, కోర్కెలనన్నిటినీ నెరవేర్చును.  ఆ యాశక్తులు శత్రు సంహారము మొదలగు వాటిలో శ్రేష్ఠఫలము నిచ్చుననియు, దుష్టులను శిక్షించి నిత్యము బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించుననియు చెప్పబడినది.

శక్తితో గూడినవి, శుభకరమైనవి అగు మహాకాలాది పది మహేశ్వరావతారములను ఎవడైతే, భక్తి తత్పురుడై శైవపర్వదినములన్నిటి యందు ఈ పవిత్రమగు గాథను పఠించునో, వాడు శంభునకు మిక్కిలి ప్రియుడగును. బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సు గలవాడగును. క్షత్రియుడు వినయమును పొందును. వైశ్యుడు ధనాఢ్యుడగును. శూద్రుడు సుఖమును పొందును. శివభక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేషసుఖమును పొందెదరు. వారి భక్తి వర్ధిల్లును.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

కైలాసమే శ్రీశైలం

కైలాసమే నీ నివాసం.. స్వయంభూవై వెలసెనిచ్చట..
అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్యక్షేత్రం.. శ్రీశైలం..

ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ క్షేత్రంగా శ్రీశైల మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వారిద్దరూ స్వయంభూవులే! శ్రీశైల మహాక్షేత్రాన్ని భూమండలానికి నాభిస్థానంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతంఆచరించినా శ్రీశైలాన్ని స్మరిస్తూ-‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే’ అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకుంటారు. అంతటి మహిమాన్వితమైనది ఈ క్షేత్రం!

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు.

శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.

మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

స్థల పురాణం: శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.

ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకశిపుడికి సభామందిరంగా ప్రసిద్ధికెక్కింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీసమేతుడై మల్లికార్జునస్వామిని సేవించి సహస్ర లింగాల్ని ప్రతిష్ఠించారని పురాణగాథ. ద్వాపర యుగంలో పాండవులు ఈ స్వామిని సేవించారని ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాక శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం తూర్పు ద్వారంగా, కడప జిల్లా సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగా, మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపుర క్షేత్రం పశ్చిమ ద్వారంగా, ఇదే జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం ఉత్తర ద్వారంగా స్కాంధపురాణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రానికి పుష్పగిరి క్షేత్రం(ఆగ్నేయ), సోమశిల క్షేత్రం(నైరుతి), సంగమేశ్వర క్షేత్రం(వాయువ్య), ఏలేశ్వర క్షేత్రం(ఈశాన్య) ఉప ద్వారాలుగా ఉన్నాయి.

క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, కదంబులు, తెలుగు చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు, కొండవీటిరెడ్డిరాజులు, విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో రాజాధిరాజులు,చక్రవర్తులు, మండలాధీశులు ఈ క్షేత్రాన్ని పాలించి, సేవించి ఆధ్యాత్మిక సేవలో తరించారు. ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శించిన... పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మోక్షప్రాప్తి సిద్ధించి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఇట్లు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...