Sunday, February 11, 2018

మహా_శివరాత్రి_నాడు_చేయవలసిన_విధులు

చతుర్దశాబ్దం కర్తవ్యం శివరాత్రివ్రతం శుభమ్‌

శివరాత్రి వ్రతమును పదునాల్గు సంవత్సరములు చేయవలెను. త్రయెదశినాడు ఒక పూట భోజనమును చేసి, చతుర్దశినాడు ఉపవాసమునుండవలెను. శివరాత్రి సంప్రాప్తము కాగానే నిత్యనిధిని అనుష్టించి, తరువాత శివాలయమునకు వెళ్లి యథావిధిగా పూజను చేసి, తరువాత అచట ముల్లోకములలో గౌరీ తిలకమని ప్రసిద్ధిని గాంచిన దివ్యమగు మండపమును ప్రయత్నపూర్వకముగా చేయవలెను. ఆ మండలమునకు మధ్యలో లింగతోభద్రము, లేదా సర్వతో భద్రము అనే ముగ్గును వేయవలెను.

వస్త్రము, ఫలము మరియు దక్షిణలతో కూడిన శుభకరమగు కుంభములను అచట ప్రాజాపత్య విధానముతో స్థాపించవలెను. కుంభములను మండపమునకు ప్రక్కలయందు జాగ్రత్తగా ఉంచవలెను. మధ్యలో ఒక బంగరు కుండను, లేదా మరియొక కుండను ఉంచవలెను.వ్రతమును చేయువాడు పలము, లేక అర్ధపలము, బంగారముతో, లేదా యథాశక్తిగా చేసిన పార్వతీపరమేశ్వరుల మూర్తిని నిర్మించి అచట ఉంచవలెను.

శివుని మూర్తిని కుడివైపున, పార్వతి మూర్తిని ఎడమవైపున ఉంచి రాత్రియందు శ్రద్ధతో పూజించవలెను. ఆ సమయములో బుుత్వికులతో సహా ఆచార్యుని వరణము చేసి, వారి అనుజ్ఞతో భక్తిపూర్వకముగా శివుని పూజించవలెను. వ్రతనిష్ఠ గల భక్తుడు రాత్రియందు ప్రతియామమునందు పూజను చేయుచూ, జాగరణము చేయవలెను. వ్రతమును చేయువాడు రాత్రి అంతయు గాననాట్యదులతో గడుపవలెను. ఈ విధముగా యథావిధిగా పూజించి శివుని ప్రసన్నని చేసి ఉదయమే మరల పునఃపూజను చేసి యథావిదిగా హోమమునుచేయవలెను. శక్తిని అనుసరించి ప్రాజాపత్యవ్రతమును చేసి బ్రాహ్మణులకు ప్రీతిపూర్వకముగా భోజనమునిడి భక్తితో దానము చేయవలెను.

భార్యలతో కూడియున్న బుుత్విక్కులను వస్త్రములతో మరియు ఆభరణములతో అలంకరించి వేర్వేరుగా యథావిధిగా దానములను చేయవలెను.దూడ, ఇతరములైన అలంకారములు మరియు ఉపకరణములతో కూడియున్న ఆవును యథావిధిగా ఆచార్యునకు ఇచ్చి, శివుడు నాయందు ప్రీతిని పొందుగాక అని పలుకవలెను. తరువాత కుంభములతో మరియు వస్త్రాది సర్వాలంకారములతో కూడియున్న మూర్తులను ఎద్దుపైన నుంచి ఆచార్యునకు నివేదించవలెను. తరువాత మహేశ్వరుడు, మహాప్రభుడు అగు దేవుని చేతులను జోడించి తలను వంచి నమస్కరించి పరమ ప్రీతి వలన గద్గదమైన వాక్కుతో చక్కగా ప్రార్థించవలెను.

ఓ దేవదేవా! మహాదేవా! శరణు పొందిన వారియందు ప్రీతి గలవాడా! ఓ దేవేశా! ఈ వ్రతమును చేసిన నాపైన దయను చూపుము. ఓ శివా! నేను భక్తిపూర్వకముగా ఈ వ్రతమును చేసితిని. ఓ శంకరా! నీ అనుగ్రహముచే లోపములేవైన ఉన్ననూ సంపూర్ణమగుగాక! ఓ శంకరా!నేను తెలిసిగాని, తెలియకగాని జపపూజాదులలో దోషమును చేసియున్ననూ, నీ కృపచే సర్వము సఫలముగుకాక! ఈ విధముగా శివపరమాత్మకు పుష్పాంజలి ఇచ్చి నమస్కరించి తరువాత మరల ప్రార్థించవలెను. ఈ విధముగా చేయువానికి వ్రతములో లోపమేమియు ఉండదు. దానివలన ఆతనికి నిస్సందేహముగా మనోభీష్టము సిద్ధించును.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

బిల్వపత్రం

శివపురాణంలో బిల్వపత్రం యొక్క మహిమను తెలిపే కథ ఉంది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు.

శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

బిల్వ పత్రానికి బోళా శంకరుడి పూజ కీ చాలా సన్నిహిత సంబంధం! బిల్వ వృక్షం (మారేడు చెట్టు) అంటేనే వృక్ష రూపంలో ఉన్న పరమశివుడు అని పురాణాలు చెప్తున్నాయి. మూడు విభూతి రేఖలు నుదుటి మీద ధరించకుండా, రుద్రాక్ష మాల లేకుం డా, బిల్వ పత్రం లేకుండా సంప్రదాయం తెలిసిన పండితులు శంకరుడిని పూజించరు! అంటుంది శివ పురాణం. బిల్వ వృక్ష దర్శనం, స్పర్శన మాత్రం చేతనే పాపక్షయం అవుతుందనీ, బిల్వ వృక్షాన్ని పూజలతో, చందనాది ద్రవ్యాలతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుందనీ శ్రద్ధాళువుల నమ్మకం. మారేడు చెట్టు కనిపించినప్పుడు, దాని ఆకులు కోసి, వాటితోనే ఆ వృక్షాన్ని పూజించినా పుణ్యమే అంటారు.

మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.

ఓ విశ్వాసం ప్రకారం చంద్రదర్శనం మరియు పౌర్ణమి రోజులలో బిల్వపత్రాలను తెంపకూడదు. ఈ రోజులలో వచ్చే ప్రకృతి సంబంధమైన మార్పులు బిల్వ వృక్షంపై తమ ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి ఇలాంటి నిషేధం ఉంది.

నిజానికి మారేడు చెట్టు చాలా సాధారణమైన వృక్షంగానే కంటికి కనిపిస్తుంది. మర్రి,, రావి చెట్ల లాగా మహావృక్షమూ కాదు. చెప్పుకోదగ్గ అందమైన పూలూ కనబడవు. తియ్యటి రుచికరమైన ఫలాలూ కావు. పోనీ అరుదైన వృక్షమా అంటే అదీ కాదు, ఆసి యా ఖండంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని శీతోష్ణస్థితులు తట్టుకొని పెరిగే చెట్టు, నిరాడంబరతా, సాదాతనం, శీతోష్ణాలను ఓర్చుకోగల సహనం మొద లైన లక్షణాలలో మహాదేవుడికీ మారేడు చెట్టును శివా లయాలలో, దేవీ మందిరాల ప్రాంగణాలలో తప్పక పెంచుతారు. సాధారణంగా ఈ చెట్టును ఇళ్లలో పెం చరు. మారేడు ఆకులకూ, ఫలాలకూ ఓషధీ లక్షణాలు న్నాయని, కఫ వాత సంబంధమైన దోషాలను ఇవి నివారిస్తాయనీ ఆయుర్వేద వైద్యవేత్తలు అంటారు.

బిల్వ పత్రాలు మూడు దళాల రూపంగా ఉండ టం ఒక విశేషం అని చెప్పవచ్చు. ఆ త్రిదళ రూపం వల్ల వీటిని సత్వ రజస్తమోగుణాలకూ, సృష్టి స్థితి లయా లకూ, అకార ఉకార మకార సంయోగమైన ఓంకా రానికీ, శివుడి త్రినేత్రాలకు, ఆయన త్రిశూలానికి ప్రతీకలుగా భావించుతారు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రం చ, త్రియాయుధం, / త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అంటూ ఆరంభమౌతుంది. మారేడు దళాల ప్రశస్తిని ఉగ్గడిస్తూ చెప్పిన బిల్వా ష్టకం. ఇలా ఒక వృక్ష జాతి ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే అష్టకం మారేడు గురించి తప్ప, మరే చెట్టు గురించీ కనబడదు.

‘మారేడు దళాన్ని శివ లింగానికి తాకిస్తే, ఆ స్పర్శ వల్ల కలిగిన స్పందనల ప్రభావం ఆ దళంలో చాలా సేపు నిలిచి ఉంటుంది. అలాంటి మారేడు దళం మీరు రోజంతా మీ జేబులో, హృదయానికి దగ్గరగా ఉంచుకొని చూడండి. అది మీ శారీరక స్థితినీ, మానసిక స్థితినీ కూడా ఆరోగ్యంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది’

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

పరమశివుని దశావతారాలు

ఉపాసనాకాండ ద్వారా సేవింపబడే, మహాకాలమొదలగు పది శివుని అవతారములను గూర్చి నందీశ్వరుడు వివరించెను.  శివుని ప్రధామావతారం మహాకాలుడు. సత్పురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చే మహాకాలావతారము వాటిలో మొదటిది. మహాకాళి ఈ మహాకాలుని భార్య. అపుడు శక్తి మహాకాలియై భక్తులకు ఫలములనిచ్చి కోర్కెలను నెరవేర్చును. పరమశివుని ద్వితీయావతారం తారకావతారం. తారకాదేవి ఈయన భార్య. "తార' అను అవతారము యందు శక్తి "తారా' యనబడును. వీరిద్దరు తమ సేవకులకు భుక్తిని ముక్తిని, సుఖమును ఇచ్చెదరు. పరమశివుని బాలభువనేశుడు మూడవ అవతారము. భాల భువనేశ్వరి భువనేశ్వరుని అర్ధాంగి. ఆ అవతారములో పార్వతి బాలభువనేశ్వరియై సత్పురుషులకు సుఖమునిచ్చును.

భక్తులకు భుక్తిని, ముక్తిని, సుఖమును, ఫలమును ఇచ్చే షోడశవిద్యేశుడు నాల్గవ అవతారము. దానిలో పార్వతి షోడశీ విద్యాదేవి యగును.  సర్వకాలములలో భక్తుల కోర్కెల నీడేర్చు భైరవుడు ప్రసిద్ధిగాంచిన అయిదవ అవతారము. దానియందు పార్వతి భైరవియై మంచి ఉపాసకుల కోర్కెలను తీర్చును.  శివుని ఆరవ అవతారమునకు ఛిన్నమస్తకుడని పేరు. గిరిజాదేవి ఛిన్నమస్తకయై భక్తుల కోర్కెలను తీర్చును. సర్వకామనలనీడేర్చి ఫలములనిచ్చే ధూమవంతుడు శివుని ఏడవ అవతారము. ఆ అవతారములో పార్వతి ధూమావతియై సత్పురుషులగు ఉపాసకుల కోర్కెలను తీర్చును. సుఖమునిచ్చు బగలాముఖుడు ఎనిమిదవ శివావతారము. దానిలో శక్తి మహానందా, బగలాముఖీ యను పేర్లతో ఖ్యాతిని పొందును. తొమ్మిదవ శివావతారము మాతంగుడు. దానిలో పార్వతి మాతంగియై సర్వకామనలను నెరవేర్చును. భుక్తిని ముక్తిని ఇచ్చే కమలుడు శంభుని పదియవ అవతారము. దానిలో పార్వతి కమలయై తన భక్తులను రక్షించును. ఈ పది శివావతారములు సత్పురుషులగు భక్తులకు సుఖమును, భుక్తిని, ముక్తిని, సర్వమును ఇచ్చును.

మహాత్ముడగు శంకరుని ఈ పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించువారికి అనేక సుఖములు లభించును. తంత్ర శాస్త్రము మొదలగు వాటియందు నిగూఢముగా నున్న ఈ పది అవతారముల మహిమను శివ పర్వదినములయందు స్మరించిన సమస్త సుఖాలు, కోర్కెలు సిద్ధించును. తంత్ర శాస్త్రాదులలో నిగూఢముగా నున్న ఈ శక్తుల మహిమ అద్భుతము, కోర్కెలనన్నిటినీ నెరవేర్చును.  ఆ యాశక్తులు శత్రు సంహారము మొదలగు వాటిలో శ్రేష్ఠఫలము నిచ్చుననియు, దుష్టులను శిక్షించి నిత్యము బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించుననియు చెప్పబడినది.

శక్తితో గూడినవి, శుభకరమైనవి అగు మహాకాలాది పది మహేశ్వరావతారములను ఎవడైతే, భక్తి తత్పురుడై శైవపర్వదినములన్నిటి యందు ఈ పవిత్రమగు గాథను పఠించునో, వాడు శంభునకు మిక్కిలి ప్రియుడగును. బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సు గలవాడగును. క్షత్రియుడు వినయమును పొందును. వైశ్యుడు ధనాఢ్యుడగును. శూద్రుడు సుఖమును పొందును. శివభక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేషసుఖమును పొందెదరు. వారి భక్తి వర్ధిల్లును.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

కైలాసమే శ్రీశైలం

కైలాసమే నీ నివాసం.. స్వయంభూవై వెలసెనిచ్చట..
అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్యక్షేత్రం.. శ్రీశైలం..

ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ క్షేత్రంగా శ్రీశైల మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వారిద్దరూ స్వయంభూవులే! శ్రీశైల మహాక్షేత్రాన్ని భూమండలానికి నాభిస్థానంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతంఆచరించినా శ్రీశైలాన్ని స్మరిస్తూ-‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే’ అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకుంటారు. అంతటి మహిమాన్వితమైనది ఈ క్షేత్రం!

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు.

శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.

మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

స్థల పురాణం: శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.

ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకశిపుడికి సభామందిరంగా ప్రసిద్ధికెక్కింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీసమేతుడై మల్లికార్జునస్వామిని సేవించి సహస్ర లింగాల్ని ప్రతిష్ఠించారని పురాణగాథ. ద్వాపర యుగంలో పాండవులు ఈ స్వామిని సేవించారని ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాక శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం తూర్పు ద్వారంగా, కడప జిల్లా సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగా, మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపుర క్షేత్రం పశ్చిమ ద్వారంగా, ఇదే జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం ఉత్తర ద్వారంగా స్కాంధపురాణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రానికి పుష్పగిరి క్షేత్రం(ఆగ్నేయ), సోమశిల క్షేత్రం(నైరుతి), సంగమేశ్వర క్షేత్రం(వాయువ్య), ఏలేశ్వర క్షేత్రం(ఈశాన్య) ఉప ద్వారాలుగా ఉన్నాయి.

క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, కదంబులు, తెలుగు చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు, కొండవీటిరెడ్డిరాజులు, విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో రాజాధిరాజులు,చక్రవర్తులు, మండలాధీశులు ఈ క్షేత్రాన్ని పాలించి, సేవించి ఆధ్యాత్మిక సేవలో తరించారు. ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శించిన... పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మోక్షప్రాప్తి సిద్ధించి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఇట్లు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

ద్వాదశ_రాశులు_ద్వాదశ_జ్యోతిర్లింగాలు

మేషరాశి: "రామేశ్వరం" :

శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి."

ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.

వృషభ రాశి: "సోమనాధ జ్యోతిర్లింగము"

శ్లోకం:- "సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే."

ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.

మిధున రాశి: "నాగేశ్వర జ్యోతిర్లింగం":

శ్లోకం:-"యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే."

ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.

కర్కాటకం: "ఓం కార జ్యోతిర్లింగం":

శ్లోకం:-"కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే"

ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.

సింహరాశి : "శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం"

శ్లోకం:-"ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే."

సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.

కన్యా రాశి: "శ్రీ శైల జ్యోతిర్లింగం".

శ్లోకం:-"శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం."

ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.

తులారాశి: "మహాకాళే శ్వరం":

శ్లోకం:- "అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం "

ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.

వృశ్చిక రాశి: "వైద్యనాదేశ్వరుడు:

శ్లోకం:-"పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి."

ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.

ధనురాశి : "విశ్వేశ్వర లింగం":

శ్లోకం:- "సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే."

ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున "నారాయణ మంత్రం"తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.

మకరము: "భీమ శంకరం" :

శ్లోకం:- "యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి."

ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది

కుంభం:"కేదారేశ్వరుడు":

శ్లోకం:-"మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే ".

ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.

మీనా రాశి: "త్రయంబకేశ్వరుడు" :

శ్లోకం:-"సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే ".

ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...