Sunday, August 16, 2015

69వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....


మహాత్ముడి అడుగుజాడల్లో..... "స్వాంతంత్ర్య దినోత్సవం"
.
ఆగష్టు 15 భారత దేశపు స్వాతంత్ర్య దినోత్సవం గా జరుపుకోబడుతోంది. 1947 ఆగష్టు 15న భారత దేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతర ప్రభుత్వం ఆగష్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ 18వ శతాబ్ది చివరకు దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే ఆయన గౌరవాన్ని తగ్గిస్తూ వచ్చారు. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర సంగ్రామం జరిగి భారత సిపాయిలు, రాజులు అందులో ఓడిపోయాకా 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాకా దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర పోరాటాల ఫలంగానూ దేశానికి ఆగస్టు 14, 1947న అర్థరాత్రి సమయంలో స్వాతంత్రం వచ్చింది.

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ ఆగస్టు 15, 1947న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:
అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

మహాత్ముడి అడుగుజాడల్లో.. "స్వాతంత్య్ర భానోదయం" .......

"దెబ్బ తీయటం గొప్ప కాదు, దెబ్బను సహించటం గొప్ప. అందుకు ఎంతో ఆత్మస్థైర్యం కావాలి" అని నిరూపించిన జాతిపిత మహాత్మాగాంధీ అడుగుజాడలు ప్రతి భారతీయుడికీ మార్గదర్శకాలు. దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి ఒక స్థిరమైన ఆశయంతో వచ్చిన ఆయన వెంట జాతి యావత్తూ అడుగులేసింది. అప్పటిదాకా స్వతంత్ర భారతదేశం కోసం ఓ ప్రణాళిక అంటూ ఏదీలేక అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్లు నడచిన భారత ప్రజలకి ఆయన అడుగుజాడలే దిశా నిర్దేశాలుగా, ఆదర్శాలుగా మారాయి.

ప్రజాగ్రహం స్థానంలో సత్యాగ్రహం.. ఆక్రోశం ఆవేశాల స్థానంలో అహింసలను ఆయుధాలుగా మలచిన మహాత్ముడి తీరు చూసి ప్రపంచదేశాలన్నీఆశ్చర్యచకితులయ్యాయి. అప్పటిదాకా "ఆడింది ఆటగా పాడింది పాటగా" తైతక్కలాడిన బ్రిటీష్ ప్రభుత్వానికి చక్కటి గుణపాఠం చెప్పారాయన.

సత్యాగ్రహం కావచ్చు, దండి సత్యాగ్రహం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు... ఇలా మహాత్ముడు చేపట్టిన ఏ ఉద్యమానికయినా ప్రజలు సంపూర్ణ మద్ధతును, సహకారాన్ని అందించారు. "వందేమాతరం" అంటూ ముక్తకంఠంతో ఆయన వెంట జనప్రవాహమై సాగిపోయారు.

అలా సాగిన ఆ పోరాటానికి 1947 ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రిలో ప్రతిఫలం లభించింది. అంత చీకట్లో కూడా కోట్లాది భారతీయుల కళ్ళల్లో కోట్ల కాంతుల ఉషోదయం విరజిమ్మింది. ఆ ఉషోదయానికి ఇప్పుడు అరవై ఎనిమిదేళ్లు. ఈ 68 ఏళ్ల స్వాతంత్ర్య ప్రస్థానంలో ప్రతి ఏడాదినీ పుట్టినరోజులా ఘనంగా జరుపుకుంటున్నాం. ఇప్పుడు మరో పుట్టినరోజును నేడు జరుపుకోబోతున్నాం.

సాధారణంగా పుట్టినరోజును కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్యన జరుపుకుంటుంటాం.కానీ... స్వతంత్ర భారతదేశ పుట్టిన రోజును బడిలో, గుడిలో, కళాశాలల్లో, కార్ఖానాల్లో, స్వదేశంలో, విదేశంలో... ఇలా ఎక్కడయినా సరే, ముహూర్తంతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చు.

ఈ పుట్టినరోజు వేడుకలు ఆత్మీయుల మధ్యనేగాదు అపరిచితుల మధ్య కూడా జరుపుకోవచ్చు. దీనికి ఆహ్వానాల అవసరం లేదు, అతిథుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండదు. మన స్వతంత్ర భారతావని పుట్టినరోజు వేడుకకు అందరూ ఆహ్వానితులే, ముఖ్యులే...!

"ఇంటా, బయటా" అని పెద్దలు అంటుంటారు. దీనికి ఇంట్లోనూ, అదే ఊరిలో మరోచోట అనే అర్థాలున్నప్పటికీ... వాటి స్వరూపాన్ని బట్టి నేడు "ఇంట అంటే భారతదేశంలో ఎక్కడయినా అనీ.. బయట అంటే, భారతదేశం అవతల ఏ విదేశంలో ఉన్నా" అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సావాలను స్వదేశంలోనూ, విదేశాల్లోని నివసించే భారతీయులందరూ అత్యంత కోలాహలంగా వేడుకలు చేసుకుంటున్నారు.

అందుకే...

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనిన
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”

అంటూ ఎలుగెత్తి కీర్తించిన రాయప్రోలు సుబ్బారావుగారి ప్రబోధాన్ని మరోసారి మననం చేసుకుని దేశ విదేశాల్లో సైతం స్వాతంత్ర్య దినోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యం.

ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన వచ్చే ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇచ్చే సెలవు దినం కోసం ఎదురుచూపులు చూడటం కాకుండా, స్వాతంత్ర్య దినం కోసం ఎదురుచూడటం భారతీయులందరి కనీస ధర్మం. మరణించిన పెద్దలను ప్రతి ఏటా స్మరించుకోవటం, సంతర్పణలు లాంటివి చేస్తుంటాం.

మరి మనందరం స్వేచ్ఛగా బ్రతికేందుకు మరణం తప్ప మరో మార్గం లేదని తెలిసి కూడా కదనరంగంలోకి దూకి అసువులు బాసిన స్వాంతంత్ర్యోద్యమ వీరులను ఒక్కరోజైనా తలచుకోవటం మన కనీస ధర్మం కాదా..? మనం వారికి ఎలాంటి సంతర్పణలు చేయాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఒక్కసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటే చాలు.

మన ముందు తరాలవారి త్యాగ ఫలాలను భోంచేస్తున్న మనం ఇప్పుడు కొత్తగా త్యాగాలు చేయాల్సిన అవసరమేమీ లేదుగానీ.. ప్రతియేటా ఈ పండుగను జరుపుకునేందుకు కాస్తంత తీరిక చేసుకుంటే చాలు. మన భారతీయ పండుగల్లో ఏ పండుగకూ, ఏ వేడుకకీ.. ఈ స్వాంతంత్ర్య దినోత్సవ పండుగ తీసిపోదు. దసరా, దీపావళి, హోలీ, క్రిస్‌మస్ పండుగలు వివిధ మతాలకు చెందినవైతే... అన్ని మతాలవారు చేసుకోదగ్గ అద్వితీయ పండుగ మన "స్వాంతంత్ర్య దినోత్సవం

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...