Saturday, November 22, 2014

టీ కప్పుతో మనం సాధారణంగా ఏం చేస్తాం?

టీ కప్పుతో మనం సాధారణంగా ఏం చేస్తాం? ఏంటి .. ఇంత పిచ్చి ప్రశ్న వేసినందుకు మీలో మీరే నవ్వుకుంటున్నారా? పర్లేదు నా ప్రశ్నకు సమాధానం మీకు తెలిస్తే వెంటనే మీ మొబైల్' నుంచి 12345కు  మీ సమాధానం స్పేస్ మీ పేరు స్పేస్ మీ ఊరు టైపు చేసి ఈరోజు సాయంత్రం లోగా పంపించండి. కళ్ళు చెదిరే టపా చదివే అవకాశాన్ని మీ సొంతం చేసుకోండి. ఏంటో నండి ఈ మధ్య కాలంలో ఏ కార్యక్రమం చూసినా ఇలాంటి smsలు చేయమని చెప్పిన anchor ల డైలాగులు విని వినీ అలా ఆవేశంలో నాలో వున్న anchor బయటికి తన్నుకోచ్చేసి ఈ డైలాగు చెప్పేసి మళ్లీ నాలో దూరిపోయింది. 
                                       
            ఈరోజు మనం టీ కప్పు కథ విందాం . ఈ కథ వినాలంటే మనం ఇంగ్లాండ్ వెళ్ళాలి. సరదాగా అలా టీ కప్పు కథ వినడానికి ఈ టీ బ్రేకు లో ఇంగ్లాండ్ వెళ్దాం పదండి  మరి. రెడీ నా ? ఇంకెందుకు ఆలస్యం మీ ఊహల్లో ఇంగ్లాండు లో లాండ్ అయ్యారా.. ఇంక చదివేయండి మరి..
             ఇంగ్లాండ్ లో ఒక అందమైన జంట (మనసులో అచ్చం మా లాగే అనుకుంటున్నారా ? ఏం పర్లేదు మీరలా దూసుకుపొండి) ఉండేదట. వాళ్ళకి అందమైన టీ కప్పులు సేకరంచిడం ఒక హాబి. అలా సరదాగా ఒకరోజు ఒక టీ కప్పులు అమ్మే షాపుకి వెళ్లి ఒక అందమైన కప్పుని చేతిలోకి తీసుకుని ఆవిడ తన భర్తతో ఏమండీ!ఈ టీ కప్పు చాలా అందంగా వుంది. ఇంత అందమైన దాన్ని మనం ఎన్నడు చూసి ఉండము,మనం దీన్ని ఇంటికి తీసుకెళ్దాం అని.
                అప్పుడు వెంటనే టీ కప్పు ఇలా అంది "మీకు నేను ఇలా ఎందుకు వున్నానో అర్థం కాదు." ఒకప్పుడు నేను ఎర్ర ముద్దలా, బంక మట్టిలా వుండేదాన్ని. నా యజమాని నన్ను నీళ్ళతో కలిపి బాగా తొక్కి గుండ్రంగా చట్రం పైన రౌండ్లు రౌండ్లుగా చాలా సార్లు తిప్పాడు. నాకు కళ్ళు తిరుగుతున్నాయి..ఆపు!నన్ను వొంటరిగా వదిలేయ్ అని గట్టిగా అరిచాను. అప్పుడు మా యజమాని "అప్పుడే వదిలేయలేను" అని తలాడిస్తూ  చెప్పాడు.
                   నేను ఆ తర్వాత ఒక కొలిమిలో వేయబడ్డాను. నేను ఇంతకు ముందెన్నడూ అంతటి వేడిని ఎరుగను. నా యజమాని ఎందుకు నన్ను కొలిమిలో కాల్చాలనుకున్నాడో  నాకు అర్థమవలేదు. నేను కొలిమిలో నుండి గట్టిగా నన్ను బయటికి తీయి అని అరిచాను. ఆ మంటల మధ్య తన పెదవులు "అప్పుడే వదిలేయలేను"  అని అనడం గమనించాను.
                 తర్వాత చాలా సేపటికి నన్ను కోలిమిలోంచి తీసి బయట పెట్టాడు. ఇక్కడ నాకు చాలా బావుంది అని అనుకుంటుండగా నన్ను తన చేతిలోకి తీసుకుని రంగులు వేయడం మొదలు పెట్టాడు. ఆ రంగు వాసనలు చాలా భయంకరంగా వున్నాయి. వాటిని భరించలేక "ఆపు! ఆపు! ఆ రంగులు నా పైన చల్లకు!" అని అరిచాను. మళ్లీ అతను "అప్పుడే వదిలేయలేను" అని సమాధానం ఇచ్చాడు.
                రంగులు వేసాక నన్ను తిరిగి కొలిమిలో పెట్టాడు. ఇది ఇంతకు ముందు దాని అంత వేడిగా లేదు, దాని కంటే రెట్టింపు వేడిగా వుంది. నాకు చాలా ఉక్కగా వుంది అక్కడ. నేను తనని ప్రార్థించాను, ప్రాదేయపడ్డాను, ఏడ్చాను, అరిచాను బయటకు తీయమని. ఎప్పటిలాగే తన నుండి సమాధానం "అప్పుడే వదిలేయలేను" అని వచ్చింది.
               నేను ఆశలన్నిటిని వదిలేసికున్నాను. నేను ఇంక బయటపడలేనని నిశ్చయించుకున్నాను. అలాంటి సమయంలో నా యజమాని నన్ను బయటకు తీసి నన్ను ఒక అరలొ పెట్టాడు. ఒక గంట సమయం తర్వాత నాకు ఒక అద్దం ఇచ్చి నన్ను చూసుకోమన్నాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను అద్దంలొ నా రూపాన్ని చూసుకుని నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను  "నేను చాలా అందంగా తయారు అయ్యాను మరి".
        నేను ఇక్కడ మా యజమాని నాకు చెప్పిన మాటల్ని చెప్పాలని అనుకుంటున్నాను..
నేను నిన్ను తొక్కాను, గుండ్రంగా తిప్పాను. నేను అలా చేయకపోతే నువ్వు ఒక మట్టిముద్దలా మిగిలి ఎండి పోయేదానివి . నేను నిన్ను కాల్చాను, నేను అలా చేయకపోతే నీకు ఇంత గట్టిదనం వచ్చేది కాదు, తాకితే పగిలిపోయే పదార్థంగా మిగిలిపోయేదానివి. నేను నీకు వేసిన రంగులు చెడు వాసనలని వెదజల్లి ఉండవచ్చు,కానీ నేను అలా చేయకపోతే నీ జీవితంలో రంగు లేకుండా అందవిహీనంగా కనపడేదానివి. నేను రెండోసారి నిన్ను కొలిమిలో ఎందుకు పెట్టానంటే నీకు  మరింత గట్టిదనాన్ని ఇవ్వడానికి. నువ్వు ఇప్పుడు ఒక అందమైన రూపానివి. మొదట నేను ఏదైతే నీలో చూసానో  ఇప్పుడు నిన్ను అలాగే తీర్చిదిద్దాను.
నీతి:
       భగవంతుడు మనకు కష్టాలు మనల్ని మరింత బలవంతంగా తయారుచేయడానికి ఇస్తాడు. అన్నిటిని ఎదుర్కొంటూ దైర్యంగా ముందుకు సాగిపోవాలి. 
కొసమెరుపు :
          బాసు మనల్ని OVERTIME  చేయమన్నా, సెలవు రోజు ఆఫీసుకు రమ్మన్నా మనకు ఒక రూపాన్ని ఇవ్వడానికే తప్ప అందులో వాళ్ళ తప్పు వెతకకూడదు. ఎందుకో నాకు కథ చదివిన వెంటనే ఇలా అనిపించింది :) :D 
             ఎలా వుంది టీ కప్పు కథ? వచ్చేయండి మరి తిరిగి మీ ఇంటికి. ఇంతటితో ఇంగ్లాండు పర్యటన సమాప్తం. తిరిగి ఇంకొక టపాలో కలుద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...