Saturday, November 22, 2014

కర్మ ఫలం అంటే ఏమిటి.............?

కర్మ ఫలం అంటే ఏమిటి


"కర్మ" అనే మాటకు సరి అయిన అర్థం "కార్యము" లేదా "కృత్యము", మరింత విస్తారముగా చెప్పలంటే, అది కారణము మరియు పరిణామము, స్పందన మరియు ప్రతిస్పందనల యొక్క విస్వజనీనమయిన సూత్రమును పేర్కొంటుంది, హిందువులు దానిని మనిషి యొక్క చేతనని నడిపించేదిగా నమ్ముతారు. కర్మ అంటే విధి కాదు, ఎందుకంటే మనిషి తన జీవితంలో రాబోవు పరిణామాలను తన స్వేచ్ఛానుగతమయిన సంకల్పము చేత నిర్దేశించబడిన చేతల ప్రభావంతో సృష్టించుకుంటాడు. వేదాల ప్రకారము, మనం మంచితనాన్ని నాటితే మంచి ప్రతిఫలాన్ని పొందుతాము, చెడుని నాటితే, చెడు ఫలితాన్ని పొందుతాము. కర్మ అనేది మన కార్యాలని అన్నింటినీ సమిష్టిగా సూచించి వాటికి ప్రస్తుత జీవితంలోనూ, గత జన్మలలోనూ అనుసరించి ఉన్న ప్రతిస్పందనలను సూచిస్తుంది, ఇవన్నీ మన భవితవ్యాన్ని నిర్ధారిస్తాయి. కర్మను జయించడము తెలివయిన కార్యాచరణలోనూ మరియు నిశ్చలమయిన ప్రతిస్పందనలోనూ ఉన్నది. అన్ని కర్మ ఫలితాలూ వెంటనే సంభవించవు. కొన్ని జమ అయ్యి, ఈ జన్మలోనో లేదా ఇతర జన్మల్లోనో అనుకోని విధంగా సంభవిస్తాయి మనం నాలుగు విధాలుగా కర్మని ఉత్పత్తి చేస్తాము:
  • ఆలోచనల ద్వారా
  • మాటల ద్వారా
  • మనమే చేపట్టే మన కార్యాల ద్వారా
  • మన ఉపదేశాలను అనుసరించి ఇతరులు చేసే కార్యాల ద్వారా
మనం ఆలోచించేది, మాట్లాడేది, చేసేది లేదా దేనికైనా కారణమయ్యేది అంతా కూడా కర్మ; ఈ క్షణంలో మనం ఆలోచించేది, మాట్లాడేది లేదా చేసేది కూడా కర్మే.హిందూ శాస్త్రాలు కర్మను మూడు రకాలుగా విభజిస్తాయి:
  • సంచిత అనేది కూడబెట్టబడిన కర్మ. అన్ని కర్మలనూ ఒకే జీవితంలో అనుభవించడం, భరించడం అనేది అసాధ్యం. ఈ సంచిత కర్మ యొక్క ఖాతాలోనుండి, చేతిలో పట్టేటన్ని ఒక జీవితంలో అనుభవించడానికి వెలికి తీయడం జరుగుతుంది, ఈ కార్యాలు, ఫలించడం మొదలు పెట్టి, అవి ఫలించాకనే వాటిని అనుభవించడం ద్వారా తరిగిపోతాయి, వేరే విధంగా కాదు, దానిని ప్రారబ్ధ కర్మ అని అంటారు.
  • ఫలించగలిగే ప్రారబ్ధ కర్మ అనేది కూడబెట్టబడిన కర్మలోని ఒక భాగం, అది "పండి", ప్రస్తుత జీవితంలో ఒక ప్రత్యేకమైన సమస్యగా గోచరిస్తుంది.
  • క్రియమాన అనేది ప్రస్తుత జీవితంలో మనం ఉత్పత్తి చేసేది. అన్ని క్రియామాన కర్మలూ సంచిత కర్మ లో జమ అయ్యి, తదనంతరముగా మన భవిష్యత్తుని నిర్దేశిస్తాయి. మానవజన్మలో మాత్రమే మనం మన భవిష్యత్గమ్యాన్ని మార్చుకోగలము. చనిపోయాక మనం మన క్రియా శక్తి (పని చేయకలిగే శక్తి) కోల్పోయి, (క్రియామాన) కర్మను మళ్ళీ మనిషి శరీరంలో జన్మించేంతదాకా చేయలేము.
స్పృహతో చేసిన కార్యాలు, స్పృహ లేకుండా అంటే తెలీకుండా చేసిన వాటికంటే చాలా భారీగా ఉంటాయి. ఎలాగయితే విషం తెలీకుండా తీసుకున్నా కూడా మనల్ని ప్రభావితం చేస్తుందో అలాగే, మనకు తెలీకుండా ఇతరులని బాధిస్తే, దానికి కూడా తగిన విధమైన కార్మిక ప్రభావం ఉంటుంది. మంచి చెడుల మధ్య తేడా తెలిసిన మనుషులు మాత్రమే (క్రియామాన) కర్మను చేయగలరు. జంతువులు మరియు చిరుప్రాయంలో ఉన్న పిల్లలు కొత్త కర్మని సృష్టించడం లేదు (అందుకని వాళ్ళు తమ భవిష్యద్గమ్యాన్ని ప్రభావితం చేసుకోలేరు) ఎందుకంటే వాళ్ళు మంచి, చెడుల మధ్య తారతమ్యం గ్రహించలేరు. కానీ స్పర్శా జ్ఞానం కలిగిన ప్రతి జీవీ కర్మ యొక్క ప్రభావమును అనుభవించగలదు, అవి వాటికి ఆనందము మరియు బాధగా తెలుస్తాయి.
తులసిదాస్ అనే హిందు సాధువు ఈ విధంగా అన్నాడు: "మన శరీరం సృష్టిలో భాగం కాక ముందే మన గమ్యం నిర్దేశించబడుతుంది."సంచిత కర్మ లోని ఖాతా అంతమయ్యే వరకూ, దానిలోని కొంచం భాగము ఒక జీవిత కాలంలో ప్రారబ్ధ కర్మ ను అనుభవించడానికి వెలికితీయడం జరుగుతుంది, అది జనన మరణ చక్రానికి దారితీస్తుంది. జీవుడు జమకాబడిన సంచిత కర్మ పూర్తిగా తరిగిపోయేంత వరకూ జనన మరణాల చక్రం నుండి మోక్షం పొందలేడు.
భూమిపైన జనన మరణాల చక్రం అనేది 84 లక్షల జీవాకృతుల నుండి ఏర్పడుతుంది, వాటిల్లో ఒకటి మాత్రమే మానవ జన్మ. మనుషులుగా మాత్రమే మనం మన గమ్యస్థానం కోసం సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఏదో ఒకటి చేసే స్థానంలో ఉంటాము. మంచి పనుల వల్ల, స్వచ్చమయిన ఆలోచనల వల్ల, ప్రార్థన వల్ల, మంత్రము మరియు ధ్యానం వల్ల, మనం కర్మ యొక్క ప్రభావాన్ని ప్రస్తుత జీవితంలో తగ్గించుకోగలిగి, మన గమ్యాన్ని బాగు చేసుకోగలము. మన కర్మ ఏ రకంగా, ఏ వరుసక్రమంలో పరిపక్వం చెందుతుందో అన్న విషయం తెలిసిన ఆధ్యాత్మిక గురువు మనకి సాయపడగలడు. మనుషులుగా మనం మంచి పనులు చేయడమనే అభ్యాసం ద్వారా మన ఆధ్యాతిమ పురోగమనాన్ని త్వరితం చేసుకోగల అవకాశం ఉంది. మనకు జ్ఞానము లేదా స్పష్టత లేక పోవడం వలన మనము చెడు కర్మను ఉత్పత్తి చేస్తాము.
నిర్దయగా ఉండటం చెడిపోయిన ఫలాలను ఉత్పత్తి చేస్తుంది, వాటిని పాపం అంటారు, మంచి పనులు తియ్యటి ఫలాలను తీసుకువస్తాయి, వాటిని పుణ్యము అంటారు. మనం చేసే పనులకు తగ్గట్లుగా మనం తయారవుతాము: సన్మార్గపు కార్యాల వలన సన్మార్గులుగానూ, దుర్మార్గపు కార్యాల వల్ల దుర్మార్గులుగానూ మారతాము.

ఇట్లు 
గుట్టి సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...