Tuesday, December 17, 2013

శుక్రవారాల నోము నోచుకోవడానికి కారణమైన కథ ?

నోములన్నింటిలోకి ‘శుక్రవారాల నోము’కి ఎంతో ప్రాధాన్యత … ప్రాముఖ్యత వున్నాయి. ఈ నోము నోచుకునే వారు ఉదయాన్నే స్నానంచేసి, తులసి కోట దగ్గర దీపారాధన చేసి 20 ప్రదక్షిణలు చేయాలి. ఈ రోజున ఎవరింటికి గానీ, ఏ వూరికి గాని వెళ్లకూడదు. ప్రతి శుక్ర వారం కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటూ, 20 వారాల పాటు ఈ నోమును కొనసాగించాలి. ఆ తరువాత ‘లక్ష్మీ తులసి’ దగ్గర 20 దీపాలు పెట్టి, 20 మంది ముత్తయిదువులకు బొబ్బర్లు వాయన దానమివ్వాలి. అలాగే ఒక బ్రాహ్మణుడికి నూతన వస్త్రాలను … దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వాలి. ఇక ఈ నోము నోచుకోవడానికి కారణమైన కథ ఒకటి ప్రచారంలో వుంది. పెళ్లయిన కొత్తలో ఓ యువతి పుట్టింటికి వెళ్లింది. ఆమెను తీసుకు వెళ్లడానికి వచ్చిన భర్త, ఉన్న పళంగా బయల్దేరమంటూ తొందర పెట్టాడు. ఆ రోజున శుక్రవారం కావడం వలన, అమ్మాయిని పంపించడం ఆనవాయతీ కాదంటూ అత్తామామలు అడ్డుపడ్డారు. అయినా అతను వినిపించుకోకుండా, తన భార్యను తీసుకుని ఎద్దుల బండిలో బయలుదేరాడు.
ఈ విషయంగా ఆ దంపతులిద్దరూ బండిలో గొడవపడుతూనే వున్నారు. అప్పటికే బాగా పోద్దుపోవడంతో ఒక ఊళ్లో ఆగిపోయి, ఓ పెద్ద మనిషి ఇంట్లో ఆశ్రయం పొందారు. వచ్చిన దగ్గర నుంచి వాళ్ల ధోరణిని ఆ పెద్దమనిషి గమనిస్తూనే వున్నాడు. మరునాడు ఉదయం వాళ్లిద్దరూ బయలుదేరుతుండగా, ఆ పెద్దమనిషి బండి దగ్గరికి వచ్చాడు. ఆడపిల్ల లక్ష్మీదేవితో సమానమనీ, అందువలన వాళ్లు కంట తడి పెట్టకుండా చూసుకోవాలని ఆ యువతి భర్తతో చెప్పాడు. ఆడపిల్ల పుట్టింటిని వదిలి పెట్టేటప్పుడు సహజంగానే కన్నీళ్లు పెట్టుకుంటుందనీ, అందువల్లనే ఆమెను శుక్రవారం తీసుకెళ్లకూడదని అన్నాడు.
ఈ విధంగా చేయడం ఇటు పుట్టింటి వారికి … అటు అత్తింటి వారికి మంచిది కాదని చెప్పాడు. పెద్దలమాట కాదన్నందువలన కలహాలు ఏర్పడతాయనీ, శుక్రవారం బయలుదేరడం వల్లనే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయని చెప్పాడు. ఇంటికి వెళ్లిన తరువాత శుక్రవారపు నోము నోచుకోమనీ, ఫలితంగా సమస్యలన్నీ పరిష్కారమవుతాయని అన్నాడు. అంతలో ఆయన భార్య కూడా వచ్చి ఆ నోము విధి విధానాలను గురించి చెప్పింది. దాంతో ఆ యువతి ఇటు పుట్టింటి వారి కోసం … అటు అత్తింటి వారి కోసం శుక్రవారాల నోము నోచి ఉత్తమమైన ఫలితాలను పొందింది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...