Tuesday, December 17, 2013

శ్రీ దత్తాచల క్షేత్రం

దత్తాత్రేయని అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తపోభూమి, ఆయన ప్రధాన శిష్యులు నామధారకుల వారు తపస్సు చేసి, నిర్యాణం పొందిన పుణ్యభూమి శ్రీ దత్తాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు బ్రహోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దత్తాచలక్షేత్రం, బ్రహ్మోత్సవ విశేషాలు.
భాగ్యనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లాలోని మాధుర గ్రామంలోని శ్రీ దత్తాచల క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మాధురలోని శ్రీ దత్తాచల క్షేత్రం దత్తాత్రేయ స్వామి మరో అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న పుణ్యభూమి. అలాగే నృసింహ సరస్వతి పరమ శిష్యులైన నామధారకుల వారు ఈ క్షేత్రంలోనే సుదీర్ఘకాలం తపస్సు చేసుకుని, నిర్యాణం చెందారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో నిర్వహిస్తున్న దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 12న దత్త, సుదర్శన హోమాలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 14న తొగుట పీఠాధిపతి శ్రీ మాధనవానంద సరస్వతి చేతుల మీదుగా సుదర్శన హోమాలు, ప్రవచనాలు జరుగుతాయి. 15న శ్రీదత్త, రుద్ర సహిత చండీయాగం నిర్వహిస్తారు. దత్తాత్రేయుని జయంతి అయిన మార్గశిర పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
తపోభూమి..దత్తాచల క్షేత్రం
సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదత్తాచల క్షేత్రం దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి స్వామి, వారి పరమ శిష్యులు నామధారకుల వారు సుదీర్ఘకాలం తపస్సు చేసుకున్న తపోభూమి. నృశింహ సరస్వతి స్వామి వారు పూర్వం శ్రీ దత్తాచల క్షేత్రంలో కొంతకాలం తపోదీక్ష చేపట్టారు. ఆ తరువాత ఆయన మహారాష్ట్రలోని గాణుగాపురం వెళ్లారు. ఆయన శిష్యులలో ముఖ్యుడు అయిన నామధారకుల వారు దైవాంశ సంభూతులు, వేదాధ్యయనపరులు. నృసింహ సరస్వతి స్వామి ఉపదేశం మేరు నామధారకులు వారు దత్తాత్రేయుల బోధల్ని ప్రచారం చేయసాగారు. దత్తాచలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీరా నది తీరంలో ఉన్న అటవీ ప్రాంతంలో నామధారకులు తపస్సు చేసుకునే వారు. ఆ సందర్భంలో అప్పటి రాజు నిజాం తన కూతురు రాచపుండుతో బాధపడుతుండటంతో విశ్రాంతి కోసం అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. తపస్సు చేస్తున్న నామధారకుల వారిని చూసి, తన కుమార్తె జబ్బును నయం చేయాల్సిందిగా నిజాం ప్రార్థించాడు. “నేను సన్యాసిని. నా వద్ద మహిమలు ఏవీ లేవు.
మీరు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ పుష్కరిణిలో తీర ్థం దత్రాత్రేయున అనుగ్రహజలం. వాటిని సేవించండి” అని చెప్పారు. నిజాం కుమార్తె ఆ తీర్థం సేవించగా కొంతకాలానికి ఆమెకు జబ్బు నయం అయింది. దాంతో నిజాం నామధారుకుల వారికి కొంత భూమిని దానంగా ఇచ్చారు. ఆ తరువాత నామధారకుల వారు తన వారసుల్ని పిలిచి, నేను దత్తాచలంలో తపోనిష్ఠలో ఉంటాను. తపోభంగం చేయవద్దని కోరి, ఆ గుట్టలోని గుహలో తపస్సు చేస్తూ జీవితాన్ని చాలించారు. ఆ తరువాత తన కుమారుడు సూర్యభట్టుకు స్వప్నంలో కనిపించి తాను దత్తాత్రేయునిలో ఐక్యం అయ్యానని, ఏటా దత్తజయంతి సందర్భంగా దత్తాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కోరారు. అప్పటి నుంచి నామధారకుల వారసులు శ్రీదత్తాచల క్షేత్రంలో శక్తిమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 17 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దత్తాత్రేయునికి ఆలయం
పటాన్‌చెరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, హత్నూర మండల కేంద్రానికి చేరువన దత్తాచల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి స్వామి, నామధారుకుల వారు తపస్సు చేసుకున్న గుహ, నామధారకుల వారి సమాధి ఉన్నాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేసి, శ్రీదత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేయాలని క్షేత్ర నిర్వాహకులు సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో పనులు కొంతవరకు చేపట్టారు. దత్తాత్రేయ స్వామివారి ఆలయంతో పాటు ఈ క్షేత్రంలో పుష్కరిణి పునరుద్ధరణ, నిత్యాన్నదాన సత్రం, గోశాల, వేదపాఠశాల, సత్రం నిర్మించే యోచనలో ఉన్నారు. బ్రహోత్సవాల్లో పాలుపంచుకోవాలనుకునే వారు, దత్తాత్రేయ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడే వారు సభాపతి శర్మ, 9000167890లో సంప్రదించవచ్చు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...