Monday, August 19, 2013

మనిషి విలువలు మనిషికే తెలియదు


జన్మలన్నింటిలో మానవజన్మ ఉత్తమైనది.. ఉత్కృష్టమైనది! ఏ ఇతర ప్రాణులకు లేనన్ని ఉత్తమ గుణాలు, విలువలు, అవకాశాలు మనిషికిచ్చాడు దేవుడు. అలాగే తను శోధించి, సాధించవలసినవి ఎన్నో వున్నాయి. ఎన్నో విలువలతో కూడిన మానవ జీవితానికో లక్ష్యం.. గమ్యం వుంటుంది.. ఉండాలి! అప్పుడే మనిషి సుఖపడగలుగుతాడు. అటువంటి వ్యక్తులు... లక్ష్యసాధకులతో కూడిన సమాజమూ రాణిస్తుంది.

లక్ష్యసాధకులకు వ్యక్తిత్వం, విలువలు అవసరం. లక్ష్యసాధనకు కృషి అవసరం. వారిలో ఉన్నతమైన భావాలుంటాయి. హృదయం స్పందిస్తుంది. ఇటువంటి వారు మన సమాజంలో ఏ రంగంలోనైనా వుండవచ్చు!

విలువలను గురించి ప్రసంగించడం వేరు, విలువలతో బ్రతకడం వేరు. అందరికీ ‘నీతి- నియమాలను’ పాటించాలన్నమాట తెలుసు. కాని, దాన్ని ఆచరణలో పెట్టడం, కొనసాగించడం అంత సులువైన పని కాదు. ‘నీతి’ మంచిదని తెలుసు, కాని నీతిగా మసులుకోవడం తెలియదు. భక్తి ఉత్తమమైనదని తెలుసు.. ఆ భక్తి నిలుపుకోవడం తెలియదు. అన్నిటికి సాధన అవసరం. సాధనమున పనులు సమకూరు ధరలో అన్నారు. కాని సాధన కొనసాగించడమూ సాధ్యం కాదు. ‘మంచితనం’ అన్నిటికన్నా శ్రేష్ఠమైన విలువ అని తెలిసి కూడా మంచిగా జీవితం కొనసాగించలేరు!

‘నిజమే పలకాలి’ అన్నమాట, చిన్నతనం నుంచి జీర్ణంచుకుపోయిన విలువ! ‘నిజం చెప్పు నాయనా’ అని బోధించి, ‘నాకోసం ఫలానా వారొస్తే..’ నాన్న ఇంట్లో లేడు అని చెప్పు అని తండ్రి అంటే, అప్పుడా కొడుకు పరిస్థితి ఎలా వుంటుంది. వాడు దేనిని నమ్మాలి? దేనిని ఆచరించాలి. నాన్న చెప్పిన సూక్తినా? నాన్న చెప్పమన్న మాటనా?

విలువ యొక్క విశిష్టత ఆంతర్యంలో అందరికీ తెలుసు! విలువలు మనిషికి ఒక ఉన్నత స్థానాన్నిచ్చేందుకు దోహదపడతాయని, ఆదర్శప్రాయుని చేస్తాయని తెలుసు, కాని సమాజంలో ఈనాడు ఆ మాట మనిషికి జీర్ణం కావడం లేదు.

నిజం పలకాలనేది ఒక విలువ. అవసరమైనప్పుడు అబద్ధం చెప్పవచ్చు అనేది రెండవ విలువ! సంకట పరిస్థితులలో మనిషి ఏ విలువకు విలువనిస్తాడు? వంటబట్టని ఆహారం వాంతియైనట్లు, వంటబట్టని విలువలనే త్యజిస్తాడు. అబద్ధానే్న ఆలింగనం చేసుకుని అందలం ఎక్కిస్తాడు.

అన్యాయాలకు సేవ చేస్తాడు. ఎందుకంటే. మొక్కనాటగానే ఫలమందినట్లు.. అన్యాయాలు, అక్రమాలే తక్షణం ఫలితాన్నిచ్చి, అవసరాలు తీర్చి, అక్కున చేర్చుకుని, అందలం ఎక్కిస్తాయి. నిలకడమీద తేలే నిజాన్ని ఆశ్రయించేకన్నా, అబద్ధాలాడి ఆనందడోలలూగడం సమంజసంగా తోస్తుంది. దాదాపు ప్రపంచమంతా ఈ బాటలోనే నడుస్తోంటే.. విలువలు.. విలువలు అంటూ విలువలను పట్టుకుని వ్రేలాడుతానంటే ఆ మనిషికే విలువ లేకుండా పోతున్న రోజులివి! నలుగురితోపాటు నారాయణా అనుకుంటూ విలువలకు స్వస్తి చెప్పి దారి తప్పి నడిస్తే నారాయణుని చేరే దారీ తప్పినట్లే! మనుష్యుల మనస్తత్వాలు ఇలా మారడానికి కారణం జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోలేకపోవడమే!

మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చి శాశ్వతంగా వుండిపోడు. మనిషే కాదు ఈ ప్రపంచంలో ప్రతీది అశాశ్వతమే! అలా అని వాటిమీద ముద్రపడే వుంటుంది. కాని మనిషి దాన్ని గమనించకపోవడంవల్లే తను ఈ లోకంలో శాశ్వతంగా వుండిపోతానన్నట్లు భ్రమలలో పడి వస్తు సంచయనం చేస్తాడు.

మానవ జన్మ అరుదుగా లభించే జన్మ. ఎప్పటికీ మనిషి తిరిగి మనిషిగానే పుడతాడని ఖచ్చితంగా చెప్పలేనిది. బ్రతుకును తీర్చిదిద్దుకునే అవకాశమున్నది మానవజన్మలోనే! అందువల్ల అజ్ఞానం అంతం చేసుకుని జీవిత విలువలను తెలుసుకోవాలి. తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు.. వాటిని వంట పట్టించుకుని సక్రమంగా వినియోగించుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మానవ జన్మకు న్యాయం చేకూర్చినవారై సమాజంలో విలువున్న మనిషిగా గుర్తించబడడమేగాక భగవంతుని దృష్టిలోనూ పడి ధన్యులవుతారు. బ్రతుకు విలువ వెలకట్టలేనిది!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...