Friday, November 30, 2018

తురగా రామకవి


రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని ప్రసిద్ధి. ఆయన 1720 ప్రాంతం వారు.
ఆడిదం సూరకవి సమకాలికుడు.
చాటు కవిత్వానికి ప్రసిద్ధులు.

జీవిత విశేషాలు:

భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వారు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవారు. అయనకి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట.

ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చారట. అంతకుముందే ఆయన వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట.

 అందుకు కోపగించిన కవిగారు రాజు గారి కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట.

 కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మొహమాటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.

ఈ కవి లేటవరపు పోతురాజ అనే క్షత్రియుని యింటికి వెళ్లగా అతడు కవి గారి కి ఏమైనా ఇయ్యాల్సి వస్తుందని, ఇంటిలో వుండి కూడా లేడని భార్య తో చెప్పించాడట. అప్పుడు రామకవి,

 కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నించారట. వెంటనే పోతురాజు చనిపోయినాడట. దహన నిమిత్తం బంధువుల ఇంటి నుండి శవమును తీసుకుని పోతున్నప్పుడు అతని భార్య వచ్చి కవి గారి కాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా  రామకవి కరుణించి,

 మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కాడి మీదనుండి దిగివచ్చాడట!

రామ్ కవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు గారు వారి స్వగ్రామము ఉంగుటూరు లో  ఒక పెద్ద యిల్లు కట్టించి, దానిని చూపించటానికి కవి గారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక గదిలో విడిచి బావమరిది ని ఆట పట్టించాలనుకుని తాను వేరొక గది లో దాక్కున్నారు. కవి గారు ఆ పెద్ద ఇల్లంతా తిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,

  అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.

అనగానే కావుకావని అరుస్తూ ఇంటికి నలుమూలల  పట్టపగలు పిశాచాలు సంచరించటానికి వచ్చాయట.

రామకవి ఇల్లు కట్టించుకొంటునప్పుడు దారిని పోయేవారిని అందరినీ పిలిచి తన గోడకు ఇటుకలు అందించమని చెప్పీవారు! ఒకనాడు ఆ దారిన అడిదము సూరకవి గారు పోతుండగా రామ కవి గారు వారిని పిలిచి తక్కినవారిని అడిగినట్లే వారి ని కూడా కొన్ని ఇటుకలు అందిచ్చి పొమ్మని అడుగగా  కోపింతో రామకవి అని తెలియక, సూరకవి

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"
అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,
"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకలు వేసారట. అంతట సూరకవి గారు అడిగింది  రామకవి గారు అని తెలిసికొని  వారి నోటి వాక్కు కు భయపడి, కొన్ని ఇటుకలు అందించి  మరీ వెళ్ళారట.!

ఇవి అన్ని కేవలం కల్పిత కథలనే వాళ్ళు ఉన్నారు..

ఇటువంటి మహా మహిమగల వాడన్న వేములవాడ భీమకవి కోమటి పేర కృతి చేసి స్తుతించినట్లే  ఈ రామకవి కూడా కంసాలి పేర కృతి చేసి స్తుతించారు..

ఆయన మరియు అయ్యంకి బాలసరస్వతి అనే మరొక కవి కలిసి రచించిన నాగరఖండము అనే 5 అశ్వాసముల గ్రంథం ఒకటి కనబడుచున్నది.

ఈ ఇద్దరు .కవులు తమ గ్రంథము యొక్క యాశ్వాసాంత గద్యము ను ఈ ప్రకారముగా వ్రాసుకొన్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈ నాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడు అనే స్వర్ణకారుడి కి అంకితము ఇచ్చారు. అతను బెజవాడకు ప్రభువు గా ఉండినట్ల ,క్రింది పద్యము వల్ల తెలుస్తోంది.

రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈ ధవళేశ్వరపు మార్కండుడు మహమ్మదు కుతుబ్ షాహి కాలములో ఉన్నట్లు నాగరఖండము యొక్క అవతారికలో ఈ క్రింది పద్యమున చెప్పబడింది.

క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

నాగరఖండము అను గ్రంథమున కవితా శైలి:

నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగములు ఉన్నా  మొత్తం మీద కవిత్వము హృద్యముగానే ఉన్నది. నాగరఖండము నుండి కొన్ని పద్యములు

ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
   తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
   స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
   న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై.

 ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
   త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
   నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
   ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా.

 ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
   ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
   యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
   హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా.

 కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
   రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
   హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
   యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్.

కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
   నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
   దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
   ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్.

Thursday, November 29, 2018

మీలో ఎంత మందికి తెలుసు? "ఆడిదము సూరకవి"

మన తెలుగు సాహితీ చరిత్రలో చెప్పుకో దగిన కవులలో “అడిదము సూరకవి” ఒకరు. ఈయన 18వ శతాబ్ధమునకు చెందిన వారు. కవితా వృత్తిచే ఆంధ్రదేశమంతటా పేరు పొందిన  బ్రాహ్మణులు శివ శ్యామలా దేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారు. వీరికి 14 తరాల నుండి రాజాస్థానం లభించింది. వీరు కళింగ దేశంలోని విద్వత్కవి వంశములోని వారు.

అసలు అడిదము వారి వంశం మొదట మోదుకూరు పిమ్మట గంధవారణం, అనే ఇంటి పేర్లు ఉండేవట. తదుపరి వీరి పూర్వీకులైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని(కత్తిని) కానుకగా పొందారట. అప్పడినుండి “అడిదం” వారని ప్రసిద్ధి వచ్చిందట.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డారు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.

ఇతడు లోకంలో తిట్టు కవిగాను, లోకజ్ఞుడు గాను, విఖ్యాతుడైనప్పటికీ “రామలింగేశ శతకం” వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం రచించారు. ఆయన నీలాద్రి కవికి 9వ తరం వాడు. ఆయన సంభాషణాత్మక చాటువును ఇలా వ్రాసారు.

“ఊరెయ్యది చీపురు పలి
పేరో సూర కవి ఇంటి పేరడిదము వార్
మీ రాజు విజయ రామ మ
హా రాజతడేమి సరసుడా ? భోజుడయా ?”

ఇలా ఈ పద్యాన్ని బట్టి తనకి తనే స్వయం గా చాటువులో చెప్పుకున్నారన్న సంగతి విదితమౌతోంది. అంతే కాదు ఈయన విజయనగర ప్రభువు పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తూనే పెద్దాపుర ఆస్థానంలో ఈ కవి గారు చెప్పిన సుప్రసిద్ధ చాటువు ఇది.

అంతే కాదు మన సూర కవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటువు కుడా ఇదే .

“రాజు కళంక మూర్తి,రతిరాజు శరీర విహీను,డంబికా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమవర్తి,వి
బ్రాజిత పూసపాడ్విజియ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్ !”

ఈ పద్యం వినగానే సభలో ఉన్న రాజులందరు తమని తరాజులంటున్నాడని రోష పడ్డారట. అప్పుడు “తాను పేర్కొన్న రాజు చంద్రుడు, వానికి మచ్చ రతిరాజు అనగా మన్మధుడు, అతగాడికి శరీరమే లేదు, ఇక శివుడికి కట్టు బట్టల్లేవు, సింహం గుహల్లొ నివాసం, వీళ్ళు రాజు లేమిటి?” అని వారినే తాను రాజులు గా చెప్పినట్టు చమత్కరించారట.

ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పినందుకు ఆయన విద్వత్తుకు మెచ్చి విజయ రామరాజు కనకాభిషేకం చేయించాడట. ఐతే ఆనాటి ఆనవాయితీ గా తనకు అభిషేకించబడిన ఆ బంగారు నాణాలను ఆ కవి తీసుకోవాలని రాజాజ్ఞ. కానీ సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మిక్కిలి సంతసించి “తమ దయవలన ఇంత వరకు స్నానం చేసిన ఉదకమును పానము చేయ లేదు. తమరి ఆజ్ఞని సిరసావహించనందుకు మన్నించమని తీసుకోవడనికి సమ్మతించలేను” అన్ని ఆ నాణాలు తీసుకోలేదట. అందుకు ముగ్ధుడైన రాజు తగు రీతిన సత్కరించాడట. బహుశ అప్పడి నుంచే “డబ్బు నీళ్ళలా వాడటం” అనే నానుడి వచ్చిందని ప్రతీతి. అంటే దీని బట్టి మన సూర కవి దారిద్ర్యానికి అధికారానికీ తల వొగ్గలేదన్న మాట.

18వ శాతాబ్దం తొలి పాదంలో సుమారు 1720 లలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవారు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నారు.

 సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర గారు రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితుల ఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –

గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖాను మీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచారు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నారు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య, భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మన అబ్బాయి బాచన్న మీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజ ధోరణిలో

క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్

బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట, తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ.

సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.

అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజ ధోరణిలో ఆశువుగా చెప్పిన పద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.

ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు.

ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయ రామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా.

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చు కోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.

సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వం చెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచారు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

ఇక ఆయన “పొణుగుపాటి వేంకట మంత్రి” అనే మకుటంతో 39 కంద పద్యములు కళింగ దేశ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్నాయట. ఈయన శృంగవరపు కోట జమిందారు శ్రీముఖి కాశీపతిరావు గారి వద్ద దివానుగా ఉండేవాడట. అంతే కాదు మన సూర కవి గారు ఈ మంత్రి గారి ఇంట ప్రతి ఏటా మూడు నాలుగు మాసాలు గడుపుతూ ఉండేవాడట. మచ్చుకి ఒకటి రెండు కంద పద్యములు…

1. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నెకెక్కును
విన్నావా పొణుగు పాటి వేంకట మంత్రీ !

2. చుక్కలవలె కర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణుగు పాటి వేంకట మంత్రీ !

3. పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయ నట్టి భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
వెగటు సు మీ పొణుగు పాటి వేంకట మంత్రీ !

కంద పద్యానికి చౌడప్ప అలవరించిన తేట దనానికి మెరుగులు దిద్దడం సూరకవి కందములో అందముగా అగుపిస్తుందట. ఇక పోతే చుక్కలవలె అన్న పద్యం “కన్యాశుల్కం”లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేంత ప్రసిద్ధమైనదట. ఈయన చాటువులు సమకాలీన కవితా రంగం పై గంట పట్టిన ప్రతి వాడూ వ్రాయడాన్ని గురించి ఇలా విమర్శించాడట.

“దేవునాన మున్ను దేశాని కొక కవి
ఇప్పుడూర నూర నింట నింట
నేవు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసి కవులు పద్మ నాభా !” అని ఎత్తి చూపారట.

సూర కవి “తిట్టు కంసాలి సుత్తి పట్టు” అన్నట్టు గా సూర కవి చాటువులు విజయనగర సమీపంలోని రామచంద్రాపురంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయట.

ఆయన రామలింగేశ శతకం సమకాలీన సాంఘిక జీవనానికి దర్పణం వంటిది.

అంతే కాదు, ధన ధాన్యాలను దోచుకునే రాజులను
“పదుగురు కోతి వెంబడి సంచ రింపరే-వాహకుల్లేరె శవంబునకును
గంగి రెద్దుకులేని ఘన తూర్య రావముల్-కలిమి గల్గదె వారి కామినులకు
న్యాయ పద్ధతి నడువని యవనిపతికి నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొరకు”

-అంటూ ఈ శతకము నుంచి ఉదహరింప బడినవి. వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట,
రాజీవాక్షుండు అవిరళముగ శేషుని పై పవళించుట
నల్లి బాధ పడలేక సుమీ
-అన్న పద్యంలో చాటువు హాస్యం కుడా మిళిత మై ఉండటం గమనార్హం.

 ఈయన తిట్టు పటిమను గురించి తిట్టు కవిగా

“గంటకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడ గితినా పఠీలుమని తూలి పడన్ కుల రాజముల్
విడువ కనుగ్రహించి నిరుపేద ధనాధిపు లార్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే”
-అంటూ ఆయన రాజాస్థానాలను సందర్శించి విజయాన్ని చేపట్టి నట్టు తెలుస్తోంది

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

ఈయనకు శాపానుగ్రహ సమర్థుడు అనే బిరుదు కలదు. దేశం లో అనేక ప్రాంతాల్లో సందర్శించారు. సంవత్సరం లో ఆరు మాసాలు దేశ సంచారము చేసేవారట. సూరకవి తన సమకాలీన పండితులనెందరితోనో, వాగ్వివాదాలు చేసి, గెలిచారట.

సూరకవి బహు గ్రంధకర్త. ఆయన రచనలు.

కవిజనరంజనము

కవిసంశయ విచ్ఛేధ

చంద్రలోకం

ఆంధ్ర నామ శేషము

రామలింగేశ శతకము

పొణుగుపాటి వేంకట మంత్రి శతకము

రామదండకము

 ఈయన 1785 లో పరమపదించారు.

Wednesday, November 28, 2018

"దక్షిణామూర్తి స్తోత్రం"

గురుగ్రహ దోష నివారణకు

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్

Monday, November 26, 2018

పూజ..? యజమాని ఉత్తరీయం..? గోచీపోసి పంచె..?


సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.

అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.

ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ,వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం.

మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది."వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి. 

ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే   యజమాని యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే.

కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు.దేవాలయంలోనైనా అంతే. దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. అలా చెయ్యకపోతే  భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. అందువలన పురుషులు(యజమాని)పూజ చేసెపుడు ఉత్తరీయం వేసుకోవాలి, గోచీపోసి పంచె కట్టుకోవాలి.....

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Sunday, November 25, 2018


శ్రీ దేవీ ఖడ్గమాలా పుష్పార్చన ---- అమ్మా! శుద్ధ సత్త్వ రూపిణియై దశ సంస్కార రహితయైన విమలాదేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాలభాస్కరసమమగు అరుణవర్ణం కలిగి, అరుణ వస్రాన్ని ధరించి, మందారాది అరుణపుష్పాలయందు ప్రీతి కల దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! జయమే స్వరూపంగా గలిగి భక్తులకు జయాలను ప్రసాదించు తల్లీ మీకు నమస్కరించుచున్నాను . అమ్మా! చరాచర విశ్వానికీ, సృష్టిస్థితి సంహారాలు చేయునట్టి త్రిమూర్తులకూ సైతం ఈశ్వరి అయిన సర్వేశ్వరీ దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడగు శివుడు -జగత్కారణ స్వరూపిణియగు సగుణ బ్రహ్మశక్తియే మాత. ఇట్టి శివశక్త్యాత్మక సామరస్య సూచక కౌళినీ స్వరూపిణియగు దేవీ మీకు నమస్కరించుచున్నాను.అమ్మా! శ్రీ చక్రాధిష్టాత్రియై తేజరిల్లుతూ తన ఉపాసకులకు రోగములు రాకుండ కాపాడు నట్టియు, జన్మాంతర ఆదివ్యాధులను కూడా రూపుమాపునట్టిదియు అయిన మహేశ్వరీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! శ్రీ చక్రాంతర్గత నవావరణ దేవతలలో గల రహస్యయోగినీ బృందానికి అధిష్టాత్రియైన మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాణములను దాల్చి భక్తులను రక్షించు మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! చాపాయుధధారిణీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! మహాకామేశ్వరి,మహావజ్రేశ్వరి,మహాభగమాలిని,సర్వసిద్దిప్రద చక్రస్వామిని అతి రహాస్యయోగిని,శ్రీ శ్రీ మహాభట్టరకే,సర్వనందామయి చక్రస్వాభిని,పరఅపర రహాస్య యోగిని,దేవీ మీరు మా పుష్పాలంకరణ స్వీకరించండి తల్లీ! ఈ గులాబీ మొక్క చూడమ్మా! నీ కోసం ఎన్ని పువ్వులు పూచిందో! ఈ రోజు ఈ పువ్వులను మీకు సమర్పించాలని మొక్కతల్లి తన బిడ్డలను అందముగా తయారుచేసి, అమ్మ దగ్గర వినయ విదేయతలు, భక్తితో మెలగమని, అమ్మకు తలలు వంచి నమస్కరించమని, తమ బిడ్డలకు బుద్ధులు చెబుతుంది ఈ మొక్క తల్లి. తల్లి మాట జవదాటని ఆ చిన్ని గులాబీలు తలలు వంచి వినయవిదేయలతో మీకు నమస్కరించుచున్నాయి. కొన్ని గులాబీలు లేత ఎరుపురంగులో, కొన్ని గులాబీలు కుంకుమరంగులో శోభిస్తున్నాయి అమ్మ. తమ బిడ్డలు దూరం అవుతున్నాయి అని తెలిసినా, ''అమ్మ దగ్గరికే కదా వెళ్ళేది'' అని ధైర్యంతో వున్నదమ్మా ఆ మొక్క తల్లి. తను కన్నీరు పెట్టుకుంటే ఆ చిన్ని చిన్ని గులాబీలు ఎక్కడ తల్లడిల్లి పోతాయోనని, తన కన్నీటిని తనలోకే పంపుకుని, ఆ చిన్ని చిన్ని గులాబీలను తన ఒడిలో చేర్చుకుని, వాయు స్పర్సతో, తను ఊగుతూ, బిడ్డలని ఊపుతూ, జోల పాట పాడుతుంది ఆ తల్లి. అమ్మా! ప్రేమలు మాకేనేమో అనుకున్నాను. ఈ మొక్కలకు కూడా ఉంటాయని అర్ధం అయ్యిందమ్మా! ఆ మొక్కతల్లి త్యాగానికి, ధైర్యానికి, శాంతికి యేమని కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాటలు రావడంలేదు తల్లి. నా భావాన్ని ఆ మొక్కతల్లి దగ్గర నివేదించుకున్నాను అమ్మ. అప్పుడు నాకేమి అనిపించిందంటే! ఆనందముతో వాయుదేవుడు ఎంత వేగముగా వచ్చినా, తను మాత్రం చిన్నగానే ఊగుతుంది. తామర పువ్వు రాలిపడిపోతాయో నని భయంతో, ఆ తల్లి భూమాతకు ఎన్నోసార్లు ఆ తామరపువ్వులను నివేదన చేసింది. ఇప్పుడు ఈ నవరాత్రులలో ఈ చిన్ని చిన్ని తామర పువ్వులను నేలరాలకముందే మీ సన్నిధికి చేర్చాలని తన భావనని తెలియచేసింది మొక్కతల్లి. అమ్మా! ఆ మొక్కతల్లికి నమస్కరించి, ఇప్పుడు సంతోషముతో మీ నామజపం చేస్తూ మీకు ఈ పువ్వులను మీకు సమర్పించాలని అనిపించింది అమ్మ. ఇప్పుడే పువ్వులు కోసుకుని తీసుకుని వస్తాను అమ్మా. ఆలస్యం అయ్యిందని ఆగ్రహించకు తల్లి. ఇప్పుడు సంతోషముతో ఈ పువ్వులను మీకు సమర్పిస్తాను, తల్లికి దూరం అయిన ఆ బిడ్డలను అక్కున చేర్చుకోని ఓదార్చి నీలో కలుపుకో అమ్మ. బిడ్డలకు దూరం అయిన ఆ తల్లికి మనోధైర్యాన్ని ఆ తల్లికి ఇచ్చి తన కర్తవ్యాన్ని తను చేసేటట్లుగా ఉత్సాహాన్నిచ్చి చివరికి నీలో కలుపుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. అమ్మా ! ఇంకేమి చెప్పను మాటలు రాని మౌనంతో పువ్వులు సమర్పిస్తూ పూజ చేస్తున్నాను. ఇంతకు మించి నాకు ఏమి కావాలి అమ్మ. ధన్యురాలిని అమ్మ. మీకు నమస్కరించుచున్నాను. మా నమస్కారాన్ని స్వీకరించు అమ్మా!శ్రీ జోగుళాంబాదేవి
అలంపుర క్షేత్రే!!!!!!
*సేకరణ: నా మిత్రబృందం *
నమ్మకం

శ్రీరాముడు రావణునితో
యుద్ధం చేసి అతనిని సంహరించాడు
యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు
కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు

అర్థరాత్రి అయింది .......
రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు
ఒక్కొక్క రాయి తీసికొని సముద్రం నీటిలో వేస్తున్నాడు
ప్రతి రాయి మునిగిపోతుంది .........

రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం
గమనించిన హనుమంతుడు
తాను రాముని వెంట వెళ్ళాడు
రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించారు
రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ
ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు
అని ప్రశ్నించాడు

హనుమా ! నువ్వు నాకు
అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు
అదేమిటి స్వామి ! నేను మీకు అబద్ధం చెప్పానా ?
ఏమిటి స్వామి అది ?
ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు
వారధి కట్టేటప్పుడు నా పేరు
జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని
అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు
నిజమేనా ? .. అన్నాడు రాముడు
అవును స్వామీ !..

నా పేరు జపింవి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే
నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు
తేలడం లేదు ? మునగడానికి కారణమేమిటి ?..
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా !..
అడిగాడు రాముడు

హనుమంతుడు వినయంగా
చేతులు కట్టుకుని ఇలా అన్నాడు
రామచంద్ర ప్రభూ ! ....
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము
మీ మీద నమ్మకంతో వేశాము
మా నమ్మకం వలన అవి తేలాయి
మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు
అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు
అందుకే అవి మునిగిపోయాయి
నమ్మకం విలువ అది .....

గుట్టీ సుబ్రహ్మణ్యశర్మ.....

నవ దుర్గా స్తోత్రం


హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...