Thursday, October 25, 2018

ప్రాతఃకాల నియమాలు - ప్రాతఃస్మరణస్తోత్రం

ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః || ౧ ||

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతినిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తందేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ || ౨ ||

మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణంసనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమఇవ ప్రతిభాసితం వై || ౩ ||

అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతఃకాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||

మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.

Saturday, October 20, 2018

లోకాన్ని ఉద్దరించడానికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన చివరి మాటలు

కృష్ణుడు – ఉద్ధవుడు

ఈలోగా ‘అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి’ అని కృష్ణ పరమాత్మ చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి ‘కృష్ణా! మేము నీతోకలిసి ఆదుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం అయిపోతోందంటే నేను తట్టుకోలేక పోతున్నాను. నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి’ అన్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తారు. ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన కృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం. దీని తర్వాత యింక వారు మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పారు.

‘ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తేస్తుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలుదేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం. ఎవ్వడూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యడు. ప్రతివాడికీ కోపమే. ప్రతివాడికీ కోర్కెలే. కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించేసుకుంటారు. కోపముచేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి వీళ్ళ ఆయుర్దాయమును వీళ్ళు తగ్గించేసుకుంటారు. కలియుగంలో ఉండే మనుష్యులకు రానురాను ‘వేదము ప్రమాణము కాదు – యజ్ఞయాగాదులు చేయకండి – వేదము చేత ప్రోక్తమయిన భగవన్మూర్తులను పోషించకండి’ అని చెప్పిన మాటలు బాగా రుచించి కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. పూజలు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. తక్కువ పదార్ధమును తిని శరీరమును నిలబెట్టుకుని మరింత పవిత్రంగా పూజ చేసుకోవడం కోసమని ఉపవాసమనే ఆచారం వచ్చింది. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు. ఆచారం పక్కన పెట్టేసి ఆచారం లేని పూజ చేయడానికి యిష్ట పడతారు. ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటివలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు. ఆచారమును, సంప్రదాయమును విడిచిపెట్టిన పూజలయందు ఎక్కువ మక్కువ చూపించి తిరగడం ప్రారంభం చేస్తారు. మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులు అయిపోతారు.

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందఱో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ఈశ్వర నామమును విడిచిపెట్టకు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, యింద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను యింద్రియములకు లొంగని స్థితిని యిస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమము అయి వున్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన యింద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా నీవు యింద్రియ సుఖమును అనుభవించవచ్చు.
కానీ సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును నీవు తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొనిన నాడు నీ యింద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యదార్థ ధర్మములను పాటిస్తూ యింద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి యింట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి యింట్లో పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని అనుకుంటావు. నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా నీ అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
అపుడు ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు కాబట్టి వాడు నాయందే చేరిపోతున్నాడు. కాబట్టి ఉద్ధవా, నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.

Wednesday, October 17, 2018

ఆధ్యాత్మిక జీవనం

వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమిగా పేరు పొందిన భరతభూమి, భారతీయ సంస్కృతి, నాగరికతలు ఎంతో ఉత్కృష్టమైనటువంటివి. ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు మన సంస్కృతీ నాగారికతల ఔన్నత్యాన్ని గుర్తించి ప్రశంసించినవే!

ఈ ప్రకృతి, అందులోని చరాచారాలన్నింటిలోనూ దైవాన్ని దర్శించగలగడం, పూజించడం మన ప్రత్యేకత. అంతేకాకుండా మనం పాటించే ఆచారవ్యవహారాలు, సాంప్రదాయాలు, మనం జరుపుకునే పండుగలు, పర్వదినాలు అన్నింటిలోనూ ఎన్నో ఉత్తమమైన విషయాలు దాగున్నాయి. ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. అంతేకాదు, ప్రతిరోజూ నిద్రలేవడం నుంచి తిరిగి రాత్రి నిద్రకు ఉపక్రమించేంత వరకూ పాటించాల్సిన నియమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రాలు, పురాణాల్లో పేర్కొనబడ్డాయి.
వీటన్నింటినీ ఆచరించడం వల్ల మానసిక ప్రాశాంతత కలుగుతుంది. మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యల నుంచి దూరమై, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రాచీనకాలంనుంచీ వస్తున్న సాంప్రదాయాన్ని గమనిస్తే, తెల్ల వారుఝామునే నిద్రలేవడం అనేది భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. ఈ కాలాన్ని ‘బ్రాహ్మీముహూర్తం’ అని అంటారు. సూర్యుడు ఉదయించడానికి సుమారు ఒకటిన్నర గంట ముందు ఉండే కాలాన్నీ బ్రాహ్మీముహూర్తం అని చెప్పవచ్చు. అంటే సుమారు నాలుగు – నాలుగున్నర గంటల మధ్యకాలం. ఈ కాలంలో ప్రతిదినం నిద్రలేవడం అనేది మంచిది. నిత్య జీవితంలో అనుసరించాల్సిన నియమాల్లో ఇది ప్రధానమైనది. బ్రాహ్మీముహూర్త సమయంలో నిద్రించడంవల్ల పుణ్యఫలాలన్నీ నశిస్తాయి అని చెప్పబడుతోంది.
నిద్రలేస్తున్న సమయంలో భగవంతుని స్మరించుకోవడం మంచిది. నిద్రలేచి కూర్చుండగానే “కర్మదర్శనం” చేయాలని శాస్త్రవచనం. అంటే కుడిచేతిని చూసుకోవాలి. చూస్తూ –
“కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కర వృష్టే చ గోవిందః ప్రాతే కరదర్శనమ్”
అనే శ్లోకాన్ని పఠించాలి.
అంటే, అరచేతి చివర లక్ష్మీదేవి, మధ్యలో సరస్వతీదేవి, చేతి మొదట్లో శ్రీమహావిష్ణవు ఉంటారని భావం. నిద్రలేస్తూనే అరచేతిని దర్శిస్తూ, పై శ్లోకాన్ని పఠించడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతి, శ్రీమహావిష్ణువులను దర్శించినట్లు లెక్క. అంతేకాకుండా నిద్ర లేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవడం శ్రేష్ఠం.
ఈ విధంగా నిద్రలేచి, పడకమీద కూర్చుని చేతిని చూసుకున్న అనంతరం దైవప్రార్ధన చేయడం ముఖ్యం. అంటే, ఎవరికీ ఇష్టమైన దేవతలను వారుస్మరించుకుంటూ, వారిని స్తుతిస్తూ గుర్తున్న శ్లోకాలను మననం చేసుకోవడం మంచది. అంతే కాకుండా, గతంలో దర్శించినటువంటి పుణ్యక్షేత్రాలను గుర్తుకు తెచ్చుకుని, కళ్ళు మూసుకుని వాటిని దర్శించినట్లు ఊహించుకుంటూ, వాటిని కళ్ళముందు సాక్షాత్కరింపజేసుకుని ప్రార్థించవచ్చు.
ఈ విధంగా ఉదయాన్నే దైవస్మరణ చేయడం వల్ల ఆ రోజంతా మానసిక ప్రశాంతతను పొందడంలో పాటూ పుణ్యఫలాలను కూడా పొందవచ్చు.
తర్వాత భూమిపైన కాళ్ళుమోపుతూ –
“సముద్రవసనేదేవి పర్వతస్తమండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే” అనే శ్లోకాన్ని పఠిస్తూ భూదేవికి నమస్కరించాలి. అంటే – “సముద్రము వాస్తంగా కలిగి, పర్వతాలను స్తనములుగా కలిగిన శ్రీమహావిష్ణువు భార్య అయినా ఓ భూదేవి! నీకు నమస్కరిస్తున్నాను. నా కాళ్ళు నీకు తగులుతున్నందుకు నన్ను క్షమించు” అని అర్థం.
పంచభూతములైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశాలన్నీ మనకు దైవంతో సమానం. తొలిరోజుల నుంచి వీటిని పూజించడం జరుగుతోంది. వాటిల్లో భూమి ఒకటి. ఈ భూమిని భూదేవిగా భావిస్తాం. భూదేవి శ్రీమహావిష్ణువు యొక్క సతీమణి. నిత్యం మన భారాన్ని మోస్తున్న మహాతల్లి. ప్రతిదినం ప్రాతఃకాలాన భూమిపైన కాలు మోపుతూ, ఆ చల్లని తల్లిని ప్రార్థించడంవల్ల, భూదేవి ఆశీస్సులతో పాటూ శ్రీమన్నారాయణుడి కరుణాకటాక్షాలు కూడా లభిస్తాయి.
నిద్రలేస్తూ ముఖం కడుక్కుని మంచినీళ్లు సేవించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కనీసం సుమారు ఒక లీటరు మంచినీరు తాగడం ఆరోగ్యదాయకమని ఆయుర్వేదం కూడా చెబుతోంది. నీటిని సేవించడం అనేది మలమూత్రాదుల విసర్జనకు, ‘పళ్ళుతోముకోవడాని కంటే ముందే చేయాలి. అది కూడా ముందురోజు రాత్రి రాగిచెంబులో నీరు పోసి ఉంచి, మారునాటి ఉదయమే సేవించడం శ్రేష్టం. లేదంటే మట్టికుండలోని నీరుసేవించాలి. ఈ విధంగా నీటిని సేవించిన అనంతరమే మాలమూత్ర విసర్జనలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా ప్రతిదినం నిద్రలేవగానే, పళ్ళు కూడాతోమకుండా నీరు త్రాగడం వల్ల చాలా అనారోగ్యాలు దరిచేరవని ఆయుర్వేదశాస్రం చెబుతోంది. అంతేకాకుండా, నేటి ఆధునిక వైద్యులు, శాస్త్రజ్ఞులు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. అనంతరం స్నానంచేయాలి. ఈ స్నానవిధికి సంబంధించి మన సాంప్రదాయాలు అనేక నిబంధనలను ఏర్పాటుచేశాయి. ప్రతిదినం వేకువఝామునే స్నానం చేయాలనేది శాస్త్రవచనం. స్నానం చేసే సమయంలో “సంకల్పం” చెప్పుకోవాలని నిబంధన. (పూజలు, వ్రతాలు వంటివి చేసే సమయంలో ఏ విధంగా ఆస్మిన్ వంమాన వ్యావహారిక చాంద్రమానేన….అని చెప్పుకున్నట్లు) ప్రతిదినం చల్లని నీటిలో స్నానమాచరించాలి. అభ్యంగనస్నానం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే తలస్నానం నిత్యం ఆచరించవలెనని. స్నానం చేసే సమయంలో పూర్తిగా బట్టలు విప్పి నగ్నంగా స్నానంచేయరాదు. నగ్నంగా స్నానం చేస్తే నరకబాధలు అనేకం అనుభవించాల్సి వస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. ప్రధానంగా ఉపవాసం ఉండే రోజుల్లో, పితృకర్మలు చేయు రోజుల్లో , అంటే ఆబ్దికం వంటివి జరిపంచే రోజుల్లో, తర్పణాలు, పిండప్రదానాలు చేసే రోజుల్లో తలంటుకుని స్నానం చేయరాదు. ఇంకా సంక్రమణ దినాలు, తదియ, సప్తమి, షష్ఠి, అష్టమి, నవమి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఉన్న రోజుల్లోనూ, ఆది, మంగళ, గురు, శుక్రవారాల్లో తలంటుకుని స్నానం చేయరాదు. మిగతా రోజుల్లో చేయవచ్చు. ఈ దినాల్లో తలంటుకుని మాములుగా తలస్నానాలు ఆచరించవచ్చు. అలాగే కార్తీక, మాఘ, వైశాఖ మాసాల్లో కూడా తలంటుస్నానం చేయరాదని శాస్త్రవచనం.
“గుణాదశ స్నాన పరస్యసాధో
రూపంచ పుష్టిశ్చ బలంచ తేజః
ఆరోగ్య మాయుశ్చ మనోసురుద్ వ
దు: స్వప్న ఘాతశ్చ తవశ్చ మేధా” అని దక్షస్మృతిలో చెప్పబడింది. అంటే – స్నానం వలన రూపం, పుష్ఠి, బలము, తేజస్సు, ఆరోగ్యం, దీర్ఘఆయుర్ధాయం, చిత్తప్రసన్నత, దుఃస్వప్న నాశనము, తపస్సు, గ్రంథాధారణ చేసేందుకు తగిన బుద్ధి, శక్తి అనే పది ప్రత్యక్ష లాభాలు కలుగుతాయని అర్థం.
అట్లే విష్ణుస్మృతిలో –
అజ్ఞానాద్యాది వా మోహద్రాత్రే
యుద్దరితం కృతమ్
ప్రాతః స్నానానికి తత్సర్వం
శోధయంది ద్విజోత్తమా!! అని పేర్కొనబడింది. అంటే, అజ్ఞానం వలనగానీ, మొహం వలనగానీ, రాత్రులందు చేసే పాపకార్యాలవలన శరీరదోషాలు ప్రాప్తిస్తాయి. ప్రాతః స్నానంతో ఆ దోషాలు తొలగిపోతాయి అని అర్థం.
అంతటి పవిత్రమైన స్నానం చేసే సమయంలో ఈ క్రింది శ్లోకాన్ని పఠించవలెను.
తీక్షణదంష్ట్ర! మహాకాయ!కల్పాందత దహనోపమ!
భైరవాయ నమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్వసి
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు
గంగా గంగేతి యోబ్రూయాత్ యోజయానాం శతైరపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి
యో సా సర్వగతో విష్ణుః చిత్ స్వరూపీ నిరంజనః
న ఏవ ద్రరూపేణగంగాంభో నాత్రా సంశయః
అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్ఠం.
లేదంటే కనీసం –
“గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరి జలెస్మిన్ సన్నిధిం కురు” అనే శ్లోకాన్నైనా పఠించి స్నానం చేయడం మంచిది.
స్నానానంతరం “విభూతి” ని, కుంకుమను, గంధములను నుదుట ధరించాలని భారతీయ సాంప్రదాయం.
“భూతిర్ధూతికరీ పవిత్ర జననీ పాపౌఘవిధ్వంసివే
సర్వోపద్ర నవనాశినీ శుభకరీ సర్వార్థ సంపత్కరీ
భూత ప్రేత పిశాచ రాక్షసగణారిష్టాది సంహారిణీ
తేజోరాజ్యవిశేష మొక్షణకరీ భూతిం పదా ధార్యతాం!!” అని చెప్పబడింది.
విభూతి సంపదలను ప్రసాదిస్తుంది. పవిత్రతను కలిగిస్తుంది. పాపాలన్నింటినీ నాశనం చేస్తుంది. సర్వ అరిష్టాలను తొలగించి సకలశుభాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. గ్రహాబాధలు, భూతప్రేతపిశాచాది బాధలను దూరం చేసి తేజస్సును ప్రసాదిస్తుంది. ముక్తిని చేకూరుస్తుందని చెప్పబడింది. విభూతిని ధరించే సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించాలి.
“త్రాయుషం జమదగ్నేః
కశ్యపశ్య త్రాయుషమ్
యద్దేవేషు త్ర్యాయుషమ్
తన్నోస్తు త్రాయుషమ్”
అంటే జమదగ్ని, కశ్యపుడు దేవదేవుల యొక్క ఆయుర్దాయం కంటే మూడురెట్లు ఆయుర్దాయం కలుగుగాక అని అర్థం.
“శ్రీకరంచ పవిత్రంచ
శోకరోగ నివారణ
లోకే వశీకరణం పుంసాం
భస్మం త్రైలోక్యపావనమ్”
ముల్లోకాలను పావనం చేసే మంగళప్రదమైన భస్మధారణంతో సకల రోగాలు, పాపాలు, సకల శోకాలు నిర్మూలనం కాగవలని అర్థం.
అలాగే, గంధం ధరించే సమయంలో –
“శంఖ చక్ర గదాపాణే
ద్వారకానిలయాచ్యుత
గోవింద పుండరీకాక్ష
రక్షమాం శరణాగతిమ్!!”
అనే శ్లోకాన్ని పఠించాలి.
కుంకుమను ధరించే సమయంలో –
ఓంకార పంజర శుకీం
ఉపనిషాదుద్యాన కేళికలకంఠీమ్!
ఆగమ విపిన మయూరీ
మార్యా మంతర్విభావయే గౌరీం!!
అనే శ్లోకాన్ని పఠించడం శ్రేష్టం.
స్నానంతరం ఈ విధంగా విభూతి, కుంకుమ గంధాలను ధరించిన తరువాత, ఇష్టదేవతా పూజను, అర్చనలు చేయాలి. అంతేకాకుండా, ఈ చరాచరజగత్తుకు వెలుగును, ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దేవుడైన సూర్యునికి నమస్కరించుకోవాలి.
“జపాకుసుమ సంకాశం
కాశ్యపేయం మహాద్యుతిమ్
తమోరీమ్ సర్వపాపఘ్నం
ప్రణతోస్మి దివాకరమ్!!”
ఎర్రనిపువ్వులు, ఎరుపు రంగు ప్రతీకారమైన కశ్యపుని సంతానమైన దివాకారునికి నామస్కరిస్తున్నాను. నా పాపాలను పటాపంచలు చేసి, నన్ను రక్షించగలవంటూ సూర్యునికి నమస్కరించవలెను. ఈ శ్లోకమే కాకుండా…
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర!! దివాకర్ నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే!!
అనే శ్లోకాన్ని పఠించి అయినా నమస్కరించవచ్చు. అనంతరం, తులసి వృక్షం వద్ద దీపాన్ని వెలిగించి, ప్రదక్షిణలు చేసి ఈ క్రింది శ్లోకంతో నామస్కరించడం మంచిది.
యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహామ్
నమస్తులసీ కళ్యాణీ నమో విష్ణుప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయని
అని పఠిస్తూ నమస్కరించాలి.
అలాగే, శమీవృక్షం, రావిచెట్టు, వేపచెట్టు వంటి దేవతావృక్షాలు, ఇంటి పెరట్లోగాని, చుట్టుప్రక్కలాగాని ఉన్నట్లయితే, వాటికి కూడా నమస్కరించడం వల్ల సత్ఫలితాలు కలుగుతాయి. మధ్యాహ్నం, రాత్రిపూట భోజనం చేసే ముందు, భోజనం చేసే సమయంలోనూ కొన్ని నిబంధనలను పాటించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. భోజనానికి తూర్పు ముఖం గానూ, లేదంటే దక్షిణ ముఖంగాను కూర్చుని భుజించడం మంచిది. తూర్పుముఖంగా కూర్చుని భుజిస్తే ఆయుష్షు, దక్షిణముఖంగా కూర్చుని భుజిస్తే యశస్సు కలుగుతాయని చెప్పబడుతోంది. భోజనానికి కూర్చునే ముందు, కాళ్ళు, చేతులు, నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. బిగుతుగా ఉండే దుస్తులను ధరించారాదు. తలపైన టోపీ వంటివి ధరించారాదు. నెలపైన పద్మాసనస్థితిలో కూర్చుని భుజించడం మంచిది. భోజనానికి ముందు ఈ క్రింది నియమాలను పాటించాలి.
భోజన పదార్థములన్నీ విస్తారాకులోగానీ, పళ్ళేలలోగాని వడ్డించిన అనంతరం, నీటిని కుడిచేతిలోనికి తీసుకుని, గాయత్రీ మంత్రాన్ని జపించి, ఆ నీటిని తినబోవు భోజనంపై చల్లాలి. అనంతరం మళ్ళీ చేతిలోకి నీరు తీసుకుని –
“సత్యం త్వరైన పరిషించామి” – అని అంటూ కుడిచేతిని ఎడమవైపు నుంచి కుడిచేతివరకు ప్రదక్షిణగా విస్తరించుట్టూ ఆ నీరు విడువవలెను.
అదే రాత్రిపూట భోజనం చేసే సమయంలో –
“ఋతంత్వా సత్యేవ పరిషించామి” అని అంటూ నీటినిం విడువవలెను. అనంతరం ఐదుసార్లు ఎన్నో కొద్దీ కొద్దిగా తీసుకుని –
“ఓం ఉదావాయస్వాహా, ఓం ఆపావాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయస్వాహా, ఓం సమానాయ స్వాహా” అనే మంత్రాలను పఠిస్తూ నోట్లో వేసుకుని నమలకుండా మింగాలి.
ఈ విధంగా చేయలేనివారు, కనీసం భోజన సమయంలో ఈ క్రింది శ్లోకాలనైనా పఠించాలి.
“త్వదీయం వాస్తు గోవిందా
తుభ్యంఎవ సమర్పయామి!
గృహానికి సముఖోభూత్వా
ప్రసీత పరమేశ్వరం||”
ఓ గోవిందా! నీ వస్తువును నీకే అర్పిస్తున్నానుశీ నీవు నాయందు ప్రసన్నుడవై, ప్రసన్నముఖంతో దీనిని గ్రహించు అని అర్థం.
“బ్రహ్మర్పణం బ్రహ్మహవిః
బ్రహ్మగ్నే బ్రహ్మణా హుతమ్!
బ్రహ్మైవ తేన గంతవ్యం
బ్రహ్మకర్మ సమాధినా||
ఆహారాన్ని భుజించే ముందు, నివేదన చేసిన అనంతరం, పైశ్లోకాన్ని పఠించిన అనంతరం, భుజించాలి. అంతేకాకుండా –
“అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాందేహ మాశ్రితః| ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధమ్||”
నేను జఠరాగ్ని రూపంగామారి, ప్రాణుల శరీరాలను ఆశ్రయించి, ప్రాణా పానములతో కూడినవాడినై, నాలుగు రకాలైన అన్నాన్ని పచనం చేస్తున్నానని చెప్పి భుజించడం మంచిది. భోజనం చేయడం ముగించిన అనంతరం –
అమృతాపి ధానమాసి రౌరవే ఆపుణ్యానిలయే పద్మార్డుద| నివాసినామ్ ఆర్థినాం ఉదకం దత్తం అక్షయ్యముపతిష్టతు” అని శ్లోకాన్ని పలుకుతూ నీటిని అప్రదక్షిణంగా విస్తరిచుట్టూ తిప్పాలి.
భోజనం చేయడం ముగించి లేచిన అనంతరం చేతులు, కాళ్ళను కడుక్కోవాలి. నోట్లో నీటిని పోసుకుని పుక్కిలించాలి. అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి.
“ఆగస్త్యం వైనతేయఇపశ్చ
శవఞ్చ బడబానలమ్
ఆహార పరిపాకార్థం స్మరే
ద్దీమఞ్చ పఞ్చమమ్”
అగస్త్యుడు, గరుత్మంతుడు, శనీశ్వరుడు, బడబానలుడు భీములను స్మరించడం వాళ్ళ ఆహారం సమంగా జీర్ణం కాగలదని అర్థం. అలాగే పిల్లలకు ఆహారం పెట్టిన అనంతరం –
“జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అని పొట్టను రుద్దాలి.
పెద్దలు కూడా పొట్టపైన చేతిని ఉంచి రుద్దుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించవచ్చు.
సాధారణంగా సాయంత్రం సూర్యాస్తమయం అవుతూనే ఇంటిముందు లైట్లు వేయడం, దీపాన్ని వెలిగించడం ఆచారం. లైట్లు వేయగానే దేవుడి పటంవైపు చూసి నమస్కరిస్తుంటాం. అంతేకాకుండా, దీపాన్ని వెలిగించాక గానీ, లైట్లు వేశాక గానీ –
“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం సర్వ తమోపహమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యాదీప నమోస్తుతే!!
అనే శ్లోకాన్ని పఠించాలి.
అంతేకాకుండా,
“దీపంజ్యోతి పరబ్రహ్మః
దీపం జ్యోతి జనార్ధన
దీపేన హారతే పాపం
సంధ్యాదీప నమోస్తుతే!!”
“దీపమే పరబ్రహ్మ, దీపమే జనార్ధనుడు. సకల పాపాలను హరింపజేస్తుంది – దీపం. అటువంటి సంధ్యాదీపానికి నామస్కరిస్తున్నాను” అని దీపానికి నమస్కరించాలి.
అలాగే, సాయంత్రం లక్ష్మీదేవిని, ఇషా దేవతలను పూజించవచ్చు.
తులసికోట వద్ద దీపాలను వెలిగించి, ప్రదక్షిణం చేసి నమస్కరించవచ్చు. సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించేముందు లేదా లైటు వేసే సమయంలో ఇంటి ప్రధాన వాకిలిని తెరచి ఉంచాలి. పెరటివైపునున్న వాకిలిని మూసి ఉంచాలి.
“యదాతు మానసిక్లాంతే కర్మాత్మానః క్లామాన్వితాః!! విషయేభ్యో నివర్తంతే తదాస్వపితి మానవః!!”
అని చరకసంహితలో పేర్కొనబడింది. మనస్సు అలసట చెందినటువంటి స్థితిలో ఇంద్రియాలన్నీ తమ తమ కర్తవ్యాలను మన మనస్సునకే కైవసం అవ్వడంవల్ల శారీరక మానసిక పనులు చేయలేక విశ్రాంతిని కోరుతాయి. అదే నిద్రావస్థ.
ప్రతిమనిషి కనీసం ఆరుగంటలు నిద్రించాలని శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. నిద్రించే ముందు కొన్ని నియమాలను పాటించాలి.
నిద్రించే సమయంలో తడికాళ్ళతో పడుకోరాదు. తడికాళ్ళతో పడుకుని నిద్రిస్తే ఆయుష్షు క్షీణిస్తుంది అని శాస్త్రవచనం. తూర్పువైపుగానీ, దక్షిణంవైపు గానీ తల ఉంచి పడుకుని నిద్రించాలి.
ఇతరుల ఇంట్లో పడుకునే సమయంలో పడమర వైపు తల ఉంచి నిద్రించాలి.
ఎప్పటికీ ఉత్తరంవైపున తలఉంచి పడుకుని నిద్రించరాదు. ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యరీత్యా మంచిదని చెప్పబడుతోంది.
నిద్రలేచే సమయంలో కుడివైపు నుంచి నిద్ర లేవాలి.
నిద్రపోవడానికి ముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
“కరచరణకృతం వా కర్మా వాక్కా యజం వా
శ్రవణ సయసజంవా మానసంవా ప రాధామ్
విహిత మావిహితం వా సర్వమేతత్ క్షమస్వ
శివశివ కారుణాబ్దే హి మహాదేవ శంభో”
“చేతులతోగానీ, కాళ్లతోగానీ, మాటలవల్లగానీ, చేతలవల్లగానీ, శరీరంచేతగానీ, చెవులతోగానీ, కళ్ళతోగానీ, మనస్సుతోగానీ, తెలిసిగానీ, తెలియకగానీ, చేసిన నా సర్వ అపరాధాలను కారుణామయుడవైన ఓ శివుడా క్షమించు” అని ప్రార్థించి నిద్రించాలి.
బ్రాహ్మిముహూర్తంలో నిద్రలేచినప్పటి\నుంచి రాత్రి నిద్రించే వరకు, ఈ విధంగా విధులను ఆచరించడంవల్ల జీవితం సుఖవంతమవుతుంది.
అంతేకాకుండా, ఇంకా వివిధ సమయాల్లో వివిధ శ్లోకాలను పఠించడంవల్ల అనేక సత్ఫలితాలు లభిస్తాయి.
నిద్రించే సమయంలో స్వప్నాలు వచ్చినా…. చెడుకలలు రాకుండా ఉండేందుకు –
“రామం స్కంధం హనుమంతం
వైనతేయం వృకోదరం
శయనేయః పఠేనిత్యం
దుస్స్వప్నం తస్యనశ్యతి” అనే శ్లోకాన్ని పఠించాలి. ఉరుముతున్నప్పుడు, పిడుగులు పడుతున్న సమయంలో అర్జునునిని స్తుతించాలని పురాణకథనం.
అర్జున ఫల్గుణః పార్థః
కిరిటీ శ్వేత వాహనః
బీభత్సో విజయః కృష్ణః
సవ్యసాచీ ధనుంజయః అనే శ్లోకాన్ని పఠించాలి. ఆనారోగ్యంవల్ల ఏమైనా మందులు వేసుకునే సమయంలొ ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి.
“ధన్వంత్రిణం గరుత్మంతం – ఫణిరాజంత చ కౌస్తుభం|
ఆచ్యుతం చామృతం చంద్రం – స్మరేత్ ఔషధ కర్మణీ|
శరీరే జర్ఘరీ భూతే – వ్యాధిగ్రస్తే కళేబరే|
ఔషధం జాహ్నవీతోయం -వైద్యోనారాయణోహరిః||” ప్రతినెలా అమావాస్య తర్వాత వచ్చే క్రొత్తనెలలో చంద్రుదు ఉదయిస్తాడు. ఉదయిస్తున్న చంద్రబింబాన్ని నెలబాలుడు అని పిలుస్తారు. సాధారణంగా నెలబాలుని ఆకాశంలో చూస్తూనే, దేవుడి ఫోటోను గానీ ఇష్టమైనవారి ముఖాన్నిగానీ చూస్తుంటారు. అంతేకాకుండా, నూలు పోగును తీసి చంద్రుని వైపు వేస్తుంటారు.
అలాగే నెలబాలుని దర్శిస్తూనే ఈ క్రింది శ్లొకాన్ని పఠించడం మంచిది.
“క్షీరసాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర
హిరణ్మకుట వాసాయా బాలచంద్ర నమొస్తుతే||”
అలాగే, ఇంటినుంచి బయటకు వెళ్ళేముందు –
“యశ్శివో సమారూపాభ్యాం యా దేవి సర్వమంగళా
తయో సంస్మరణాతే పుంసాం సర్వతో జయమంగళం
లాభాస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవే
యేషామిందీవర్శ్యామే హృదయాస్థో జ్ఞార్ధనః” అనే శ్లోకాన్ని పఠించడం మంచిది.
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

ధర్మ సందేహాలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.

2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం  పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

నవవిధా భక్తి మార్గాలు


భగవంతుని పొందడానికి భాగవతంలో నవవిధభక్తి  అనగా 9 రకాలైన భక్తి మార్గాలు చెప్పబడినాయి. ఇందుకు ప్రామాణిక శ్లోకం భాగవతంలోని ప్రహ్లాద చరిత్ర ఘట్టంలో ఉన్నది. ఆ శ్లోకం:
శ్రవణం కీర్తనం విష్ణోః
స్మరణం పాద సేవనం
అర్చనం వందనం దాస్యం
సఖ్యమాత్మ నివేదనం 
'పై శ్లోకాన్ని పోతన తెనిగించిన విధం
తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనా
ర్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనం
బను నీ తొమ్మిది భక్తిమార్గంబుల సర్వాత్ముడైన హరిన్ నమ్మి స
జ్జనుడై యుండుట భద్రమంచు దలతున్ సత్యంబు దైత్యోత్తమా! 
అనగా భగవంతుని పూజింపడానికి అనేక విధాలైన మార్గాలున్నాయి.
శ్రవణ భక్తి: 
సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
కీర్తనా భక్తి: 
భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
స్మరణ భక్తి: 
భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
పాదసేవన భక్తి: 
భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
అర్చన భక్తి: 
ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.
వందన భక్తి: 
వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.
దాస్య భక్తి: 
ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.
సఖ్య భక్తి: 
సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.
ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి: 
ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

మనం భస్మం ఎందుకు ధారణ చేయాలి ?

భస్మం శివారాధన చేసేవాళ్ళో ,లేక శైవులో పరమేశ్వరుడికి ఇష్టం కాబట్టి పెట్టుకుంటారంటే చాలా పొరపాటు పడినట్లే
ఐశ్వర్యం గోషు సంపన్నం (మహాభారతం ) లో చెప్పబడినది. అంటే ఐశ్వర్యం గోవు తో పోల్చారు
గోవు ఎక్కడ ఉంటె అక్కడ ఐశ్వర్యం ఉంటుంది అనిఅర్ధం . కొంతమంది అడగవచ్చు .ఏమని ,
గోవు ఉంటె ఐశ్వర్యం ఉండటం ఏమిటి అని ,(మహాభారతం గోమాహాత్మ్యం పర్వం ) లో చెప్పబడినది గోమయం లో లక్ష్మి దేవి ఉంటుంది అని. ఆ గోమయాన్ని మనం ముఠాలు అనగా గుండ్రముగా తయారుచేసి దానిని హుతం చేసి అనగా కాల్చి వచ్చినటువంటి బూడిదని (భస్మాన్ని) మనం ధారణ చేస్తున్నాము.అంటే మనము సాక్షాత్తు లక్ష్మిదేవిని ధారణ చేస్తున్నాము.అందుకనే భస్మాన్ని (విభూతిర్భూతిరైస్వర్యం) అన్నారు భస్మము ధారణ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుంది అని పండితులు ,పెద్దలు, చెప్తూఉంటారు. కొన్ని పురాణాలలో
(త్రి పుమ్డ్రేన వినదానం త్రి పుమ్డ్రేన వినా జపం త్రి పుమ్డ్రేన వినా శ్రాద్ధం తోయం నిష్ఫలదాయకం )అన్నారు.
భస్మం లేకుండా చేసిన దానం ,భస్మం లేకుండా చేసిన జపం, భస్మం లేకుండా చేసిన శ్రాద్ధం ఫలితం ఇవ్వవు అని .
భస్మం ఎవ్వరైనా ధారణ చేయవచ్చు ,భస్మ ధారణ చేసి మహాలక్ష్మి ,పరమేశ్వర అనుగ్రహము పొంది అష్ట ఐశ్వర్యాలు పొందవచ్చు ,ఏ మాత్రము సందేహము లేదు.

కంచు పాత్రల్లో ఎవరు భోజనం చేయకూడదో వివరించండి ?

ఆ పాత్రల్లో మఠాదిపతులు  ,  మతప్రచారకులు,  సన్యాసులు, దీక్ష తీసుకున్నవారు తినకూడదు. కంచు అధికముగా శరీర పటుత్వాన్ని  పెంచుతుంది. తత్కారణంగా ఐహికమైన  విషయలపై   ఆసక్తిని పెంచుతుంది

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...