Thursday, October 25, 2018

ప్రాతఃకాల నియమాలు - ప్రాతఃస్మరణస్తోత్రం

ప్రాతః స్మరామి హృదిసంస్ఫురదాత్మతత్త్వం
సచ్చిత్సుఖం పరమహంసగతిం తురీయమ్ |
యత్స్వప్నజాగరసుషుప్తమవైతి నిత్యం
తద్బ్రహ్మ నిష్కళమహం న చ భూతసంఘః || ౧ ||

సచ్చిదానందరూపము, మహాయోగులకు శరణ్యం, మోక్షమునిచ్చునదీ అగు ప్రకాశవంతమైన ఆత్మ తత్త్వమును ప్రాతఃకాలమునందు నా మదిలో స్మరించుచున్నాను. ఏ బ్రహ్మ స్వరూపము స్వప్నమూ, జాగరణ, సుషుప్తి అను వాటిని తెలుసుకొనుచున్నదో నిత్యమూ భేదము లేనిదీ అగు బ్రహ్మను నేనే. నేను పంచ భూతముల సముదాయము కాదు.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాంతినిఖిలా యదనుగ్రహేణ |
యన్నేతినేతి వచనైర్నిగమా అవోచుః
తందేవదేవమజమచ్యుతమాహురగ్ర్యమ్ || ౨ ||

మనస్సుకు, మాటలకు, అందని ఆ పరబ్రహ్మను ప్రాతఃకాలమునందు సేవించుచున్నాను. ఆయన అనుగ్రహము వల్లనే సమస్త వాక్కులు వెలుగొందుచున్నవి. వేదములు నేతి నేతి (ఇది కాదు ఇది కాదు) వచనములచే ఏ దేవుని గురించి చెప్పుచున్నవో, జనన మరణము లేని ఆ దేవ దేవునే అన్నిటికంటే గొప్ప వాడుగా పండితులు చెప్పారు.

ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం
పూర్ణంసనాతనపదం పురుషోత్తమాఖ్యమ్ |
యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజంగమఇవ ప్రతిభాసితం వై || ౩ ||

అజ్ఞానాంధకారము కంటే వేరుగా సూర్యుని వలే ప్రకాశించు పూర్ణ స్వరూపుడు, సనాతనుడు, అగు పురుషోత్తముని ప్రాతః కాలమునందు నమస్కరించుచున్నాను.అనంత స్వరూపుడగు ఆయన యందే ఈ జగత్తంతయూ తాడులో సర్పము వలే కనపడుచున్నది.

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతఃకాలే పఠేద్యస్తు స గచ్ఛేత్పరమం పదమ్ ||

మూడూ లోకములను అలంకరించునవి, పుణ్యకరములు అగు ఈ శ్లోకములను ఎవరైతే ప్రాతః కాలమునందు పటించునో వారు మోక్షమును పొందును.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...