Saturday, March 10, 2018

శివుడే స్వయంగా స్ధాపించిన హిందువుల పవిత్ర నగరం ‘వారణాసి’

ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు . స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు . గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం  మధ్య ఉన్నందున కాశీ కి  "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో  "బారనాసి" అని రాశేవారు. అది తరువాత ‘బవారస్’గా మారింది. వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే  నామాలతో ప్రస్తావించారు.

సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. పూరాతత్వ పరిశోధనల లెక్కల ప్రకారం వారణాశి పరిసర ప్రాంతాలలో క్రీస్తు పూర్వం  11-12 శతాబ్ధాలలోనే  నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తోంది. ఇది ఆర్యుల మత, తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతోంది.

ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా... ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 

వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే  ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం,  దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం  చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. అయితే 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని  రెండు గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న  ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు  ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.

కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు.  ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో ‘సంకట్ మోచన్ హనుమాన్ మందిరం’ కూడా అతి ముఖ్యమైనది . ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు .. కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం....

కలశ స్ధాపన ప్రాముఖ్యత


కలశాన్ని త్రిమూర్త్యాత్మకంగా భావించి పూజించడం, విజయం కోసం ఆశీస్సులు కోరడం హిందువుల సాంప్రదాయం. మానవ జీవితాన్ని నీటితో నిండిన కుండతో పోలుస్తారు. అంటే అది ప్రాణానికి ప్రతీక. అందువలన ప్రార్థనలలో, పుణ్యకార్యాలలో, పట్టాభిషేకాలలో, నూతన గృహ ప్రవేశాలలో, తీర్థయాత్ర ప్రారంభ సమయాలలో ఇలాంటి అనేక సందర్భాలలో కలశ ఆరాధన లేదా కలశ పూజ చేయడం ఆనవాయితీగా మారింది.

మంత్ర జలంతో నింపబడిన కలశాన్ని పూజా మందిరంలో స్థాపించాలి. అందుకోసం కలశానికి చుట్టూ పసుపు రాసి, మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి. కలశ జలంలో గంధం, అక్షతలు, పుష్పాలు ఉంచాలి.

కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర స్సమాశ్రితః |
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాః స్మృతాః | |
కుక్షౌతు సాగరా స్సర్వే సప్త ద్వీపా వసుంధరా |
ఋగ్వేదో థ యజుర్వేద స్సామవేదో హ్యధర్వణః | |
అంగైశ్చ సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః |
ఆయాంతు దేవ పూజార్థం సకల దురిత క్షయ కారకాః | |

అర్ధం: కలశ ముఖంలో విష్ణుమూర్తి, కంఠ భాగంలో శివుడు, మూల భాగంలో బ్రహ్మదేవుడు, మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉన్నారు. కలశంలోని జలాల్లో సాగరాలన్నీ, సప్తద్వీపాలతో కూడిన భూమి, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలు, వేదాంగాలతో సహా సమస్త దేవతా గణాలు ఆశ్రయించి ఉన్నారు.సమస్త పాపాలను తొలగించడానికి వారంతా వచ్చెదరు గాక.

హిందూ సంస్కృతీ, సంప్రదాయాల ప్రకారం.. ప్రాచీనకాలం నుంచి గృహ ప్రవేశాలకు, వివాహ శుభకార్యాలకు, నిత్య పూజా విధానాలలో, ఇంకా ఇంతరత్ర శుభకార్యాలలో కలశాన్ని తయారుచేసి, పూజిస్తారు. ఈ కలశాన్ని దివ్యమైన ప్రాణశక్తితో నిండివున్న జడ శరీరానికి ప్రతీకగా పేర్కొంటారు. అందువల్లే ఇది హిందూ శాస్త్రాలలో పూర్వం నుంచి తమ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

ఇత్తడి లేదా రాగి లేదా మట్టితో తయారుచేయబడిన ఒక పాత్రను నీటితో నింపుతారు. ఆ పాత్రకు మొదట్లో మామిడి ఆకులు, వాటిపైన కొబ్బిరికాయను వుంచుతారు. తెలుపు లేదా ఎరుపు రంగు గల దారాన్ని ఆ పాత్ర మెడచుట్టూ పూర్తిగా లేదా సమచతురస్రాకారపు ఆకారంలో చుట్టబడి వుంటుంది. ఇలా ఈ విధంగా తయారుచేబడిన పాత్రను ‘‘కలశం’’ అంటారు. అటువంటి పాత్రను నీటితో లేదా బియ్యంతో నింపినప్పుడు.. దానిని ‘‘పూర్ణకుంభం’’గా పేర్కొంటారు.

పూర్వం సృష్టి ఆవిర్భవానికి ముందు... పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువు తన శేషశయ్యపై పవళించి (స్పష్టంగా, నిటారుగా) వున్నాడు. ఆ సమయంలో అతని నాభి ప్రాంతం నుంచి వెలువబడిన పద్మం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. అలా ఆ విధంగా ఉద్భవించిన బ్రహ్మ.. ఈ యావత్ ప్రపంచాన్ని సృష్టించాడు.

అదేవిధంగా కలశంలో వున్న నీరు సృష్టి ఆవిర్భవంలో ప్రథమంగా పుట్టిన నీటికి ప్రతీకగా నిలుస్తుంది. విశ్వంలో వున్న అన్యప్రాణాలకు, జడ పదార్థాలకు ఇది అంతర్గత సృష్టికర్త. అలాగే ఆకులు, కొబ్బరికాయలు సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. కలశానికి చుట్టబడిన దారం సృష్టిలో బంధించిబడిన ‘‘ప్రేమ’’ను సూచించబడుతుంది. అందుకే కలశాన్ని శుభసూచికగా పూజించబడుతుంది.

పూర్వం రాక్షసులు, దేవతలు పాలసముద్రాన్ని వధించినప్పుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ‘‘కలశం’’ అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.

అనంత ఫలదాయకం "అర్ఘ్య ప్రధానం"

మన తల్లిదండ్రులు,తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి ఆర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు. నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా!

సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. రెండు చేతులు దోసిలిగా పెట్టి, ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి మరియు ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో ఆర్ఘ్యం అందించేవారు. వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా.సూర్యభగవానుని చూసేవారు.

సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు ( నీటి ప్రవాహం చిత్రం) వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి. శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుడు కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు. మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది. మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి (వాయు), నీరు (జల), భూమి (పృథ్వి) , అగ్ని (శక్తి) మరియు అంతరిక్షము (ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం.

పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు ఉదా. గుండె జబ్బులు , కళ్ళు, కామెర్లు, కుష్టు మరియు బలహీనమైన మెదడు. మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది. సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు. సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగుతుంది.

ప్రతీ రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి ఆర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీస్కుని

సిందూరవర్ణాయ సుమండలాయ సువర్ణవర్ణాభరణాయ తుభ్యమ్‌ |.
పద్మాభనేత్రాయ సపంకజాయ బ్రహ్మేంద్రనారాయణకారణాయ ||
సురత్నపూర్ణం ససువర్ణతోయం సకుంకుమాద్యం సకుశం సపుష్పమ్‌ |. ప్రదత్తమాదాయ సహేమపాత్రం ప్రశస్తమర్ఘ్యం భగవన్‌ ప్రసీద || 

అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచి పెట్టాలి. కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని, పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది. దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయశాన్ని నివేదెన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి.

Friday, March 9, 2018

ఎవరు బ్రాహ్మణులు - ఏది బ్రాహ్మణవాదము ...?

ఎవరో బూతులు తిట్టేవిధంగా తప్పుడు సంప్రదాయాన్ని ఆచరించమని బ్రాహ్మణిజం ఏనాడూ ఎవరికీ చెప్పలేదు. నాగరికత వికసిస్తోన్న తొలినాళ్ళలో శుచిగా ఉండమని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పింది. అలా లేనివాళ్లు దూరంగా ఉండాలన్న నియమాన్ని పెట్టింది శుచి, శుభ్రత పాటించడంకోసం మాత్రమే. ఇక మనిషి పరిణామక్రమం తొలినాళ్ళ నుంచే శ్రమవిభజన స్పష్టంగా వేళ్లూనుకుంది. ఓ దిమ్మరిగా సంచరించే మానవుడు, మరి కొంతమంది తనలాంటి వాళ్ళను కలుపుకొని సమూహంగా, ఆ తరవాత ఇంకొందరిని పోగేసుకుని తెగలుగా ఏర్పడి సంఘజీవిగా రూపాంతరం చెందుతున్న తరుణంలో వాళ్ల, వాళ్ల నైపుణ్యం, మేధస్సు ఆధారంగా పని విభజన జరిగింది. పాలించేతత్త్వం ఉన్న వాళ్లు క్షత్రియులు అని, బోధించే మేధస్సు కలిగిన వాళ్లు బ్రాహ్మణులు అని, వ్యాపార మెళకువలు తెలిసిన వాళ్లు వైశ్యులు అనీ, మిగిలిన వృత్తులలో చాతుర్యం కలవాళ్లు శూద్రులు అని వర్ణవిభజన జరిగి చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పడింది. ఈ ప్రక్రియ ముమ్మాటికీ సహజసిద్దంగా చోటు చేసుకుందే కాని బ్రాహ్మణిజానికి ఏమాత్రం సంబంధం లేని అంశం. ఆ కారణంతో నిందించి, తిట్లతో దుమ్మెత్తి పోయటానికి వర్ణ వ్యవస్థ ఏర్పాటులో బ్రాహ్మణులకు వీసమెత్తు పాత్ర కూడా లేదు. పైగా అది బ్రాహ్మణుల మేధస్సు చూసి మిగిలిన వాళ్లు అక్కసుపడటం మినహా ఇంకోటికాదు అని గుర్తించాలి.

ఇక తాము ఆచరించి, ఆ మంచి అలవాట్లను ఇతరులు కూడా ఆచరించాలని చెప్పడమే బ్రాహ్మణవాదం ముఖ్య ఉద్దేశ్యం.
కులబ్రాహ్మణులువేరు  బ్రాహ్మణులు,బ్రాహ్మణ వాదం వేరు.

బ్రాహ్మణులూ, బ్రాహ్మణవాదం రెండు అవిభాజ్యం. వాటిని విడదీసి చూస్తున్నాం, బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళంతా బ్రాహ్మణులు,బ్రాహ్మణవాదులు కారు, ఇందుకు ఫలానావాళ్లు ఉదాహరణ అనడం అవివేకం, మూర్ఖత్వం తప్ప మరొకటి కాదు. ఇక ఇక్కడ తర్కం అంతా బోధించేవాడి బోధనలు అన్నీ సబబేనా, ఐతే మాత్రం అసలు వాళ్లే ఎందుకు బోధించాలి అని ప్రశ్నించే అభ్యుదయ భావజాలంపైనే.

వీటికి సమాధానాలు రావాలంటే అసలు బ్రాహ్మణులు ప్రపంచానికి బోధించింది ఏమిటి ? దాంట్లో మంచి ఉందా లేక చెడునే బోధించారా ? అసలు బ్రాహ్మణవాదం సూత్రీకరించింది ఏమిటి ? అనే అంశాలను లోతుగా చర్చించాలి. ఆ మాటకొస్తే సర్వ కాల సర్వావస్థల్లో, నూటికి నూరు శాతం లోక కళ్యాణం కోసం తపిస్తూ, ఆహరహం సర్వే జనాః సుఖినో భవంతు అని ఆకాంక్షించిందే బ్రాహ్మణిజం అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

★ పూర్వ కాలంలో సంచార జీవిగా ఉన్న మానవునికి నదుల ప్రాధాన్యత వివరించి, సంఘజీవిగా మార్చింది బ్రాహ్మణిజం.

★ తాను తినే కందమూలాలతో పాటు పచ్చిమాసం తినే ఇతరులకు ఆహారాన్ని ఉడకబెట్టుకుని తింటే శ్రేయస్కరం అని బోధించింది బ్రాహ్మణిజం.

★ ఉడికించక ఆహరం అట్లానే తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ పసుపుతో తినే పదార్థాల్లో చెడు బాక్టీరియాను నివారించవచ్చు అని చెప్పిందే బ్రాహ్మణవాదం.

★ నివసించే పరిసరాలను పేడతో అలికితే ఆప్రాంతంలో క్రిములు, కీటకాలు నశించి అక్కడి నివసితులకు రోగాలు రాకుండా ఉంటుందని సూత్రీకరించింది బ్రాహ్మణ వాదం.

★ వైద్యాన్ని, ఆయుర్వేదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది బ్రాహ్మణవాదం.

★ ఊరు పొలిమేరలో అమ్మవారి ప్రతిష్ట చేస్తే దుష్టశక్తులు ఊళ్ళోకి ప్రవేశించవనీ, అనేక అరిష్టాలు గ్రామం దరి చేరకుండా ఉంటాయని సూచించింది బ్రాహ్మణవాదం.

★ ఆడది శక్తి స్వరూపిణి అంటూ, స్త్రీలను గౌరవించాలి, పరాయి మహిళలు తల్లితో సమానం అని ఉద్భోధించి, ఆనాటి తెగల్లో స్త్రీ, పురుషుల మధ్య ఆచరణలో ఉన్న సెక్స్ విశృంఖలత్వాన్ని కట్టడి చేసింది బ్రాహ్మణవాదం.

★ కట్టుబాట్లులేని పాశ్చాత్య సంస్కృతిలోని సెక్స్ పాశవికం మన దగ్గర లేకుండా చేసింది బ్రాహ్మణిజం.

★ చావు, పుట్టుకలు, పాప, పుణ్యాలను ప్రభోధించింది బ్రాహ్మణవాదం.

★ ఒక మనిషి చస్తే అయ్యో పాపం అనడం, ఆయన/ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అనడం బ్రాహ్మణవాదం.

★ చనిపోయిన వాళ్ళ శరీరాలను దహనం చేయాలి, ఖననం చేయాలి అనే సంస్కారాలను సమాజానికి నేర్పింది బ్రాహ్మణిజం.

★ విశ్వశాంతికి, ప్రక్రుతి వైపరీత్య పరిస్థితుల నుంచి మానవాళిని కాపాడుకోవటానికి, కరువు పరిస్థితుల్లో ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడానికి ఆనాటి రోజుల్లోనే శాస్త్రీయంగా, శాస్త్రోక్తంగా యజ్ఞ యాగాదులు చేయించింది బ్రాహ్మణవాదం.

★ ఇక అన్యులకు గుడి ప్రవేశాలను నియంత్రించి, నిషేధించింది బ్రాహ్మణులు అనడం, దాన్ని బ్రాహ్మణవాదానికి ఆపాదించడం ఓ పెద్ద కుట్ర, శుద్ధ తప్పు.

★ గుడి నిషేధం మధ్య యుగాలనాడు సమాజంపై ముమ్మాటికీ రాచరికం విసిరిన పంజా తాలూకు మరక.

★ విభిన్న కులాలకు చెందిన ఋషులను, మహర్షులను వాళ్ల కులాలకు అతీతంగా ప్రచారంలోకి తెచ్చి, వాళ్ళను కొలిచింది బ్రాహ్మణవాదం.

★ బ్రాహ్మణుడు ఏనాడూ తన కులం వాళ్లను దేవుళ్ళను చేయలేదు.

★ మీకు తెలిసిన దేవుళ్ళలో ఎవరైనా ఒక్క బ్రాహ్మణుడు ఉన్నారేమో ఆలోచించండి. అదే సమయంలో ఇతర కులాల్లో దేవుళ్ళు ఉన్నారా ఆలోచించండి. వాళ్లకు దేవుళ్ళ హోదా ఇచిన ఔన్నత్యం బ్రాహ్మణిజం.

★ తన మనుగడకు దోహదపడుతున్న ప్రకృతిని ఆరాధించి, దైవంగా కొలువాలనీ, అగ్ని, గాలి, నీరు, భూమి, ఆకాశాలను పంచ భూతాలుగా అభివర్ణించి పూజించాలని చెప్పింది బ్రాహ్మణవాదం.

★ ఇలా మొట్టమొదలు ప్రపంచానికి నడత, నడక, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ నేర్పింది బ్రాహ్మణవాదమే.

★ అటు నిరంతరం విస్తృత పరిశోధనలు చేస్తోన్న మోడ్రన్ సైన్స్ కానీ, ఆచరణలో ఉన్న నాస్తికవాదం కానీ, అనుసరిస్తున్న హేతువాదం కానీ, అరువు తెచ్చుకున్న వామపక్ష భావజాలం కానీ చెప్పలేని చాలా ప్రశ్నలకు ఇదే బ్రాహ్మణవాదం సమాధానం చెప్పింది.

★ భూగ్రహం పరిసరాల్లో ప్రకాశించే సూర్య, చంద్రులు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, ఇతర గ్రహాలు, వాటి ఆవశ్యకత, సంచారం, గుట్టుమట్లు, వాటి మీదుగా ప్రసరించే అతినీల లోహిత కిరణాలు, భూగ్రహంపై వాటి ప్రభావాల తీరు లాంటి విషయాలెన్నిటినో ఆనాడే విపులీకరించి చెప్పింది బ్రాహ్మణిజం.

★ అనంత విశ్వం, దాని పుట్టు పూర్వోత్తరాలు, మానవుడు, మానవసృష్టి లాంటి  సమాధానం చెప్పలేని వాటిని దేవ రహస్యాలుగా పేర్కొంది.

బ్రాహ్మణవాదం తప్పు అని తేల్చాలనుకునే మేధావులు, నాస్తికులు, హేతువాదులు, సో కాల్డ్ కమ్యూనిస్ట్లు ముందు జనన మరణాల జీవ రహస్యాన్ని ఛేధించాలి, అనంత సృష్టి మూలాల అంతును విడమరచి లోకానికి చెప్పాలి. వాటిని శోధించి, ఛేదించి, బ్రాహ్మణులను, బ్రాహ్మణ వాదాన్ని తప్పు అనాలి. అంతేకాని ఉత్తగనే, అలవోకగా నోటికొచ్చింది వాగుతాము అంటే కుదరదు.

మనం నిత్యం ఆచరించే, మన సంస్కృతిలో భాగమైన వీటన్నిటినీ వదిలిపెట్టి సంబంధం లేని అంశాలను బ్రాహ్మణవాదంతో ముడిపెట్టి, ఆసంబద్ధ అభిప్రాయాలు ఏర్పరచుకొని, మీరు ఆనాడు చేసిందానికి, ఈనాడు మేం ఎంత చేసినా తక్కువే అని వితండవాదం చేస్తూ, బ్రాహ్మణుల పట్ల, బ్రాహ్మణవాదం పట్లా ఒక రకమైన కక్ష పూరిత ధోరణిని ప్రదర్శించడం ఏమాత్రం సరికాదు. అలా అనవసరమైన అంశాలను బ్రాహ్మణిజానికి ముడిపెట్టి, మూర్ఖత్వంతో ఒక్క మాట అనే నైతిక హక్కు ఎవరికీ లేదు.

Thursday, March 8, 2018

హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందేం?

🕉🕉🕉🕉🕉🕉

ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక అందరికీ ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అదేమిటంటే...

ఒక రోజు హనుమంతులవారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అలముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది.

సీతమ్మ చెంతకి అడుగులో అడుగు వేసుకుంటూ ‘అమ్మా! మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు’ అని అడిగాడు. ‘హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!’ అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకి.

సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకుని మురిసిపోయాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్షు పెరుగుతుందంటే... మరి ఒంటినిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, తన ఒంటినిండా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు.

శిరసు నుంచి పాదాల దాకా సింధూర వర్ణంలో మెరిసిపోతున్న ఆంజనేయుడు... నేరుగా రాముని దర్బారులో ప్రవేశించాడు. ఆ స్థితిలో హనుమంతుని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ‘ఏమిటి హనుమా! ఒంటి నిండా ఏమిటా రంగు’ అని చిరునవ్వుతో అడిగాడు.

‘స్వామీ! సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షూ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు... మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత శ్రేయస్సు కలుగుతుందో కదా! అందుకనే ఇలా...’ అంటూ చెప్పుకొచ్చాడు.

మనుమంతుని మనసులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ‘హనుమా! నువ్వు నా భక్తులందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో... వాళ్లు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు’ అంటూ ఆశీర్వదించారు.

అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూరవర్ణంలో మెరిసిపోవడం, ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదుటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తోంది.

🕉🕉🕉🕉🕉🕉

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...