Wednesday, February 21, 2018

కర్మలు

ఆగామి కర్మలు బంధం కాకుండా
                  మనం ఇప్పుడు చేసే కర్మలన్నీ ఆగామి కర్మలే. ఎటువంటి కర్మ చేసిన ఆ కర్మఫలం అనుభవించక తప్పదు. ఇది కర్మ సిద్ధాంతం . అందువల్ల కర్మలు చేస్తూ కూడా ఆ కర్మఫలం మనకు అంటకుండా, బంధం కాకుండా తప్పించుకొనే ఉపాయాలను భగవానుడు మనకు భగవద్గీతలో తెలియచేసాడు.
అవి : 
1. కర్త్రత్వాభిమానం లేకుండా కర్మలు చేయుట
2. నిష్కమలంగా, ఫలాసక్తి లేకుండా కర్మలు చేయుట.
కర్మణ్యేవాధి కరస్తే మాఫలేషు కదాచన |
మకర్మఫలహేతుర్భు, మాతే సంగోస్త్వకర్మణి ||      (భగవద్గీత 2:47)
కర్మలను ఆచరించుట యందె నీకు అధికారము కలదు కానీ, వాటి ఫలితములపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణమూ కారాదు.అట్లని కర్మలను చేయుట మానరాదు.
౩. లోకా కళ్యాణం కొరకు, భగవత్ప్రీతి కొరకు కర్మలు చేయుట.
4. ఈస్వరార్పితంగా కర్మలు చేయుట.
 ఈ విషయన్నే రమణ మహర్షి “ఉపదేశసారం” లో ఇలా తెలియచేసారు.
“ఈస్వరార్పితం నేచ్ఛయాకృతం | చిట్టా శోధకం, ముక్తి సాధకం ||”
అంటే పైన చెప్పిన ప్రకారం కర్త్రుత్వాభిమానం లేకుండా కర్తవ్యతాభావంతో, నిష్కామంగాను, ఫలాశాక్తిలేకుండాణను, లోకహితార్థంగాను, ఈశ్వరార్పితంగాను కర్మలు చేసే విధానమే కర్మయోగం అంటారు.
అంటే కర్మను కర్మగా గాక, కర్మయోగంగా చేయుట ద్వార మనం చేసే కర్మలు సంకుచితం కాకుండా, మనకు బంధాలు కాకుండా చేసుకోవాలి.కనుక మనంచేసే కర్మలను ఒకటికి రెండుసార్లు బుద్దితో యోచించి, శాస్త్రం ఎలా చెబుతుందో తెలుసుకొని, మన మనోబుద్దులు అందుకనుగుణంగా సవరించుకొని కర్మలు చేయాలి.ఎక్కుపెట్టిన బాణం వంటిది ఆగామి కర్మ. ఇది చేయటం మన చేతుల్లో వున్నది గనుక జాగ్రత్త పడాలి. బంధాల నుండి తప్పించుకోవాలి. కనుక ఆగామి కర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.

ప్రారబ్ధ కర్మలు బంధం కాకుండా ఎట్లు : జీవుడు శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అప్పటికి ఉన్న సంచిత కర్మలలోనుండి ఏవి పక్వానికి వస్తాయో ఆ కర్మలను ప్రారబ్ధ కర్మలు అంటారు.ఆ ప్రారబ్ధ కర్మలను అనుభవించటానికి తగిన శరీరాన్ని ధరించి జీవుడు ఈ లోకంలోనికి వచ్చిపడుతాడు. ఆ ప్రారబ్ధ కర్మలన్నిటిని తప్పక అనుభవించాల్సిందే. అలా అనుభవిస్తేనే ఆ కర్మలు ఖర్చు అయ్యేది. అనుభవిస్తేనే ప్రారబ్ధ కర్మల నుండి విముక్తి. ప్రారబ్ధ కర్మలు అంటే ధనస్సు నుండి విడిచిన బాణం వంటివి. 
కనుక ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవత్ స్మరణతో భక్తి యోగం ద్వార అనుభవించి ఖర్చుచేసుకోవాలి. 

సంచిత కర్మలు బంధం కాకుండా ఎట్లు : ఆగామి కర్మలు చేయటంలో మనకు స్వతంత్రం వుంది. కనుక కర్మయోగం అనే ఉపాయంతో ఈశ్వరార్పణంతో చేస్తాము. ప్రారబ్ద కర్మలను భగవత్ స్మరణతో భక్తి యోగం అనే ఉపాయంతో అనుభవిస్తాము. కానీ ఇవి ఎప్పుడో ఇంతకూ ముందు జన్మలవి , ఇప్పుడు ఖర్చు చేద్దాం అంటే పక్వానికి రాలేదు.కనుక వీటిని అన్నిటి నుండి సంపూర్ణంగా తప్పించుకొని కర్మబంధనం లేకుండా వుండాలంటే , మళ్ళీ జన్మంటూ లేకుండా ముక్తి పొందాలంటే, మోక్షం పొందాలంటే, శాస్వతనందాన్ని పొందాలంటే , ఆ పరమాత్మునిలో ఐక్యం కావాలంటే ఈ సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి ? ఎక్కడ ? జ్ఞానాగ్నిలో, “జ్ఞానాగ్ని దగ్ద కర్మాణాం” అని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయుట ఒక్కటే మార్గం.ఈ ఉపయాన్నే జ్ఞానయోగం అన్నారు.   

జ్ఞానం అంటే ఏమిటి ? నీ స్వస్వరూప జ్ఞానమే జ్ఞానం.అంటే నీ యొక్క అసలు రూపమే సచ్చిదానంద స్వరూపం, అంటే నీవు ఈ మాంసక్రుతులతో కూడిన ఈ శరీరం కాదు , నువ్వు ఆత్మవు అయిన ఆ సచ్చిదానంద స్వరుపుడివి అని తెలుసుకోవడం.ఇలా మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుకొని, మన స్వరూపాన్ని మనం గ్రహించినప్పుడు, అప్పడు సర్వభయాలనుండి, బంధాలనుండి, సంచితకర్మల నుండి విముక్తి పొందడమే ముక్తి. అదే మోక్షం. ఇలా స్వస్వరుపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం . ఆ జ్ఞానంవల్ల జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానగ్నిలో సర్వకర్మలు దహించుకు పోతాయి. తెలుసుకున్నంత మాత్రాన దగ్ధమై పోతాయ అన్న సందేహం వలదు. తప్పకుండ దగ్ధమై పోతాయి.

దేవరుణం ఎలా తీర్చుకోవాలి

భారతీయ సంప్రదాయం

రుణ శేషం, శత్రు శేషం ఉండకూడదు అంటారు. ఈ జన్మలో ఎవరికైనా రుణపడితే, వచ్చే జన్మలో వాళ్ళ ఇంట్లో కుక్కగా పుట్టి ఆ బాకీ తీర్చుకుంటామని పెద్దలు చెప్తుంటారు. ఇంతకీ రుణం అంటే ఇమిటి? బంధుమిత్రుల వద్ద డబ్బు అప్పుగా తీసుకోవడం అని మాత్రమే చాలామందికి తెలుసు. కానీ మరొకరి వస్తువులు లేదా పదార్ధాలు తీసుకుని, తిరిగి ఇవ్వకున్నా అది కూడా బాకీపడటమే అవుతుంది. ఈ సాధారణ రుణాల సంగతి అలా ఉంచితే అనుబంధాల రీత్యా కూడా ఋణపడతాం. ఈ రుణానుబంధాల్లో మొదటిది దేవరుణం.

జీవరాశుల్లోకెల్లా ఉత్కృష్టమైంది మానవ జన్మ. ఎందుకంటే, మనిషికి మాత్రమే మనసు, మేధస్సు ఉన్నాయి. మరి ఇంత ఉన్నతమైన మానవజన్మను మనకు ప్రసాదించిన దేవుడికి తప్పకుండా రుణపడతాం. అందువల్ల దేవ రుణం తప్పకుండా తీర్చుకోవాలి. అది మన కర్తవ్యం.

దేవుడు మనకు కేవలం జన్మను మాత్రమే ఇవ్వలేదు. ప్రకృతిని ప్రసాదించాడు. జీవితంలో కావలసినవన్నీ ఇస్తున్నాడు. నలుసంత గింజలో వట వృక్షాన్ని ఇమిడ్చాడు. మన శరీర ప్రక్రియను మించిన అద్భుతమైన యంత్రం ఉందా? మరి ఈ అపురూపమైన మానవజన్మను సక్రమంగా వినియోగించుకుంటే సుఖం, శాంతి ఉంటుంది. మన పుట్టుక సార్ధకమౌతుంది.

దేవ రుణం ఎలా తీర్చుకోవాలి అంటే, దేవునికి సంపదలేం సమర్పించనవసరం లేదు. ఆరాధనతోనే రుణం తీర్చుకోవాలి. రోజూ సంధ్యావందనం చేయాలి. సంధ్య సమయంలో తప్పనిసరిగా యజ్ఞ కర్మ ఆచరించాలి. సమిధలు, మూలికల మిశ్రమం, ఆవునెయ్యి ఉపయోగించి, యజ్ఞ కర్మ ఆచరించాలి.

యజ్ఞ కర్మ వల్ల మానసిక శాంతి కలగడమే కాదు, వాతావరణ కాలుష్యం నివారణ అవుతుంది. యజ్ఞగుండం ద్వారా వచ్చే పొగలు వాతావరణంలో పేరుకుపోయిన కాలుష్యాన్ని పోగొట్టి, స్వచ్చతకు దారితీస్తాయి. దీనివల్ల అతివృష్టి, అనావృష్టి సమస్యలు ఏర్పడవు.

కనుక యజ్ఞ కర్మ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఇల్లు, పరిసరాలు బాగుపడతాయి. చుట్టుపక్కల ప్రజలందరూ లబ్ధి పొందుతారు. పంటలు సమృద్ధిగా పండుతాయి. పశుపక్ష్యాదులు బాగుంటాయి. అంటువ్యాధులు వ్యాపించవు. అనారోగ్యాలు దరిచేరవు. అందుకే మన ఇతిహాసాలు, పురాణాల్లో హోమాలు, యజ్ఞాల ప్రస్తావన తరచుగా కనిపిస్తుంది.

ఇప్పుడు యజ్ఞం చేసేవారు అరుదైపోయారు. ఎప్పుడో నూటికికోటికి ఒకసారి యజ్ఞం మాట వినిపిస్తుంది. కానీ, ఇది సరికాదు. యజ్ఞం వల్ల ఒనగూరే లాభాల గురించి తెలిసిన తర్వాత అయినా యజ్ఞ కర్మ నిర్వహించడానికి ముందుకు రావాలి. యజ్ఞయాగాదులు చేయడమేంటి... మనం రాజుల కాలానికి వెళ్తున్నామా అనే అపోహ నుంచి బయటపడాలి. యజ్ఞాలు నిర్వహిస్తే, మనము, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. యంత్రాలు, వాహనాల వల్ల పేరుకుపోతున్న కాలుష్యాన్ని కొంతయినా నిరోధించగల్గుతాం. యజ్ఞయాగాదులు నిర్వహించడం ద్వారా దేవరుణం తీర్చుకున్నట్టు అవుతుంది అని చెప్తున్నాయి పురాణాలు. ఒకరకంగా దేవ రుణం తీర్చుకోవడం అంటే,
మనకు మనం మేలు చేసుకోవడమే!
కాదా, మీరే చెప్పండి?!

శ్రీ కృష్ణావతారం ప్రాశస్త్యం

భగవంతుని  అవతారాలలో  కెల్లా నీకిష్టమైన అవతారం ఏది? అని నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే తడుముకోకుండా వెంటనే నేను సమాధానం చెప్పగలను-- కృష్ణావతారం -- అని. నా జవాబు వెనుక కొన్ని కారణాలున్నాయి.  

పుణ్యభూమి అయిన మన దేశంలో అనేక మంది మహనీయులూ సిద్దులూ యోగులూ ప్రతి తరంలోనూ జన్మించారు. జన్మిస్తూనే ఉంటారు. అంతే గాక భగవంతుని అవతారాలు కూడా అనేకం మన దేశంలో వచ్చాయి. ఎన్ని భగవద్విభూతులు అవతారాలుగా వచ్చినప్పటికీ కృష్ణావతారం వంటి అవతారం మాత్రం ఇంకొకటి రాలేదు, రాబోదు అని మనం విశ్వసిస్తాం. మిగిలిన అవతారాలు అన్నీ అంశావతారాలు అనీ, కృష్ణుడొక్కడే పూర్ణావతారం అనీ మన  పురాణాలు చెబుతున్నాయి. 

శ్రీ మద్భాగవతం ఇలా అంటుంది.

శ్లో || ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి  యుగేయుగే 

ఈ అవతారములన్నీ భగవంతుని యొక్క అంశకళలు మాత్రమే. కానీ శ్రీ కృష్ణుడు సాక్షాత్తూ భగవంతుడే. ధర్మ  విరోదులచేత లోకం వ్యాకులం చెందినపుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.

కొన్ని అవతారాలలో  పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, ఇలా రకరకాలుగా  భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది. 

*🌻కృష్ణావతారం ప్రత్యేకతలు ఏమిటీ అంటే :--*🌻

1 .ధర్మాధర్మాలకు అతీతమైన భూమికలో లీలా వినోదంగా జీవితాన్నిగడుపుతూ ధర్మసంస్థాపన చెయ్యడం.

2.అన్నీ తెలిసీ ఏమీ తెలియనట్లు లీలా నాటకాన్ని నడపడం. 

3.అన్నీ ఆచరిస్తున్నప్పటికీ దేనికీ అంటకుండా దేన్నీ అంటించుకోకుండా  ఉండటం.

4.భౌతిక స్తాయిలో పూర్తిగా నిమగ్నమైనా కూడా తనదైన అతీత దివ్యస్వరూపంలో నిత్యమూ స్తితుడై ఉండటం.

5.దేనినీ అసహ్యించుకోకుండా దేనికీ లొంగకుండా ఉండటం.

6.తన చిలిపిపనులతో అల్లరిచేష్టలతో అందరి హృదయాలనూ కొల్లగొట్టడం.

"భౌతికంలోకి దివ్యత్వం దిగిరావాలి" అన్న అరవిందుల ఆకాంక్ష కృష్ణావతారంలో నిజమైనట్లు అనిపిస్తుంది. కాకపొతే కృష్ణుడు భగవంతుని అవతారం. అరవిందులు ఆశించినది మానవ పరిణామక్రమసాధనలో పరిపూర్ణత. అరవిందుల పూర్ణయోగాన్ని అందులోని స్తాయిలనూ భూమికలనూ శ్రీకృష్ణుడే ఆయనకు దర్శనమిచ్చి  స్వయంగా బోధించాడని తన "Synthesis of Yoga" అన్న గ్రంధంలో అరవిందులు చెప్పారు.

భగవద్గీత కూడా అప్పటివరకూ ఉన్న రకరకాలైన వేదాంత మార్గాలను సాధనా విధానాలను క్రోడీకరించడానికి చేసిన ప్రయత్నం లాగా మనకు కనిపిస్తుంది. యుద్ధ రంగంలో కొన్నిగంటల వ్యవధిలో పద్దెనిమిది అధ్యాయాలుగల గీతను కృష్ణుడు అర్జునునికి నిజంగా బోధించాడా? ఇది నిజమేనా? అన్న అనుమానాలూ దీనిమీద చర్చలూ అనవసరమైన విషయాలు. యుద్ధమధ్యంలో వేదాంతచర్చ జరిగి ఉండవచ్చు ఉండక పోవచ్చు. కాని అప్పటివరకూ అందుబాటులో ఉన్న వివిధ వేదాంతసాంప్రదాయాలను ఒకచోట క్రోడీకరించాలన్న వ్యాసభగవానుని ప్రయత్నం చాలా ఉన్నతమైనది. అప్పటినుంచీ ఇప్పటిదాకా భగవద్గీత ఎన్ని లక్షలమందికి ఆత్మోన్నతిని ఇచ్చిందో మనం ఊహిస్తే, ఒకవేళ యుద్ధరంగంలో వేదాంతచర్చ అసంబద్ధం అనుకున్నప్పటికీ, భగవద్గీతా రూపంలో జరిగినది ఎంత గొప్ప ప్రయత్నమో ఎంత నావెల్ ఐడియానో మనకు తెలుస్తుంది.

శ్రీకృష్ణావతారం వల్ల లోకానికి మూడు ముఖ్యమైన ప్రయోజనాలు ఒనగూడాయి అని నా భావన. 

ఒకటి - వేదాంతం గ్రంధాలకే పరిమితం కాదు అది ఆచరణాత్మకమే అని తన అద్భుతమైన జీవితం ద్వారానిరూపించడం. దేవుడు మానవునిగా దిగివచ్చిన అన్ని అవతారాలలోనూ బాధలు పడ్డాడు. విలపించాడు. మానవునిలాగే ఆవేశ కావేశాలకు లోనైనాడు. శరీరంలో ఉన్నంతవరకూ శరీర తాదాత్మ్యాన్ని అనుభవించాడు. శ్రీరాముడు కూడా " ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం" అంటూ తాను మానవుణ్ణి, దశరధుని కుమారుణ్ణి అని మాత్రమే తాను తలుస్తున్నట్లుగా అంటాడు. కాని శ్రీ కృష్ణావతారంలో మాత్రం, శరీరధర్మానుసారం . ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని  యుద్ధాలు చేసినప్పటికీ, ఎంత మంత్రాంగం నడిపినప్పటికీ, తాను భగవంతుణ్ణి అన్న స్పృహ మాత్రం ఆయనను ఎప్పుడూ వీడనట్లు కనిపిస్తుంది. కనుకనే " అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే (నేనే అంతటికీ ప్రభువును అంతా నన్ను అనుసరించే నడుస్తున్నది)" ,"అహమాత్మా గుడాకేశా  సర్వభూతాశయ స్తితః , అహమాదిశ్చ మధ్యంచ భూతానాం అంతయేవచ (సర్వభూతములలో ఉన్న ఆత్మను నేనే. సర్వభూతముల ఆది, మధ్య, అంతం అన్నీ నేనే)" అని గీతలో చెప్పగలిగాడు. ఇటువంటి మాటలు గీతలో కోకొల్లలుగా కనిపిస్తాయి. ఇలా చెప్పగలగడం సామాన్య విషయం కాదు.అందుకే ఆయన  మాయామానుష విగ్రహుడయ్యాడు.

లీలానాటకసూత్రధారి అనిపించుకున్నాడు. ప్రపంచం ఒక లీల అన్న విషయం తెలిసినవాడు గనుక చిరునవ్వుతో అన్నింటినీ చక్కబెట్టాడు. శత్రువులకూ మోక్షాన్నిచ్చాడు.

రెండు- అత్యద్భుతమైన మధురభక్తిమార్గాన్ని లోకానికి అందించడం. కృష్ణప్రేమభక్తి మాధుర్యంలో ఓలలాడి ఎందరు భక్తవరేణ్యులు దివ్యానందాన్ని చవిచూసారో లెక్కలేదు. వేదాంతంలో అత్యున్నతమైనదిగా తలచే మోక్షాన్ని కూడా తక్కువ స్తాయిదిగా తలచి త్రుణీకరించగల శక్తి మధురభక్తి సొంతం. దివ్యమైన మధురప్రేమానుభావం ముందు మోక్షం కూడా వెలవెలా బోతుంది అన్నది వాస్తవమే. ప్రేమానందంలో మునిగి మత్తులైన ధన్యాత్ములు అద్వైతప్రతిపాదిత మోక్షాన్ని కూడా నిరసించారు. భక్తి మార్గ ప్రవర్తకులైన మధ్వ, రామానుజ,చైతన్య, నింబార్క, వల్లభాదులు, మీరా, సూరదాస్, మొదలైన మహాభక్తులు అద్వైతమోక్షం అనేది ప్రేమభక్తి కంటే ఎక్కువ ఏమీ కాదన్నారు. శ్రీ రామకృష్ణులు కూడా ఒక పాటను ఎప్పుడూ ఆలపించేవారు " నేను మోక్షాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ వెనుకాడను. కాని నిర్మలమైన ప్రేమభక్తిని మాత్రం అంత త్వరగా ఎవరికీ ఇవ్వను." అంటూ ఆ గీతం సాగుతుంది. ముల్లోకాలలో ఎంత గొప్పసంపద అయినా అది ప్రేమభక్తికి సాటిరాదు. ప్రేమభక్తి ఉన్నవానికి భగవంతుడు కట్టుబడతాడు. అట్టి భక్తుణ్ణి వదిలి భగవంతుడు ఎక్కడికీ పోలేడు. అటువంటి భక్తిమార్గం కృష్ణావతారం ద్వారా లోకానికి ఇవ్వబడింది.

మూడు - సమస్త వేదాంతసిద్ధాంతాలనూ భగవద్గీతా రూపంలో సమన్వయపరచడం. ఇప్పటివరకూ వచ్చిన ఆచార్యులు పండితులు అందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాసినవారే. ఎందుకంటే సమస్త వేదవేదాంతాల సారం గీతలో నిక్షిప్తమై ఉన్నది. దానికి వ్యాఖ్యానం వ్రాయగలిగితే సమస్త వేదాలనూ స్ప్రుశించినట్లు అవుతుంది అని వారందరూ భావించారు. గీతలు ఎన్నున్నా భగవద్గీత ఒక్కటే సమస్త  వేదవేదాంత సారంగా వెలుగుతూ వచ్చింది. హిందూ ధర్మాన్ని అధ్యయనం చెయ్యాలనుకునేవారు ఏ గ్రంధం చదివినా చదవకపోయినా భగవద్గీత చదివి అర్ధం చేసుకుంటే చాలు, హిందూధర్మం మొత్తం అర్ధం అవుతుంది. ఇది కూడా లోకానికి కృష్ణ ప్రసాదమే.

కాకపోతే ఇటువంటి మహత్తరమైన అవతారాన్ని మనం సరిగ్గా అర్ధం చేసుకోలేక పోవడం ఎప్పటిలాగే మన దురదృష్టం. కృష్ణుడు అబద్దాలు చెప్పాడనీ, మోసాలు చేసాడనీ, గోపికలతో సరసాలు సాగించాడనీ, రాసలీల అనేది కామకేళి అనీ పిచ్చిపిచ్చి మాటలు, కథలు ప్రచారంలో ఉన్నాయి. రాముడు చేసినట్లు చెయ్యండి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యండి - వ్యతిరేకంగా మాత్రం చెయ్యకండి. అన్న శ్లేషాత్మకవ్యాఖ్యలూ ప్రచారంలో ఉన్నాయి. ఇవన్నీ కృష్ణుని ఔన్నత్యం అర్ధంకాక అజ్ఞానులు అనుకునే పిచ్చిమాటలు. కృష్ణావతార మహత్యాన్ని అణుమాత్రం గ్రహించగలిగినా ఆ కధల వెనుక ఉన్న అద్భుతమైన ఔన్నత్యాన్ని మనం చూడగలుగుతాం.

కృష్ణుడు పిల్లలలో పిల్లవాడు, యువకులలో యువకుడు, జ్ఞానవృద్ధులలో వృద్ధుడు, రాజులకురాజు, వీరులలో వీరుడు, వేదాన్తులలో వేదాంతి, ఆదర్శవంతుడైన కుమారుడు, స్నేహితుడు, సోదరుడు, ప్రేమికుడు, భర్తా, రాజూ, సేవకుడూ, యోగీ, శిష్యుడూ, గురువూ అన్నీ తానే. ఒక్క వ్యక్తిలో ఇన్ని పరిపూర్ణతలు ఆవిర్భవించడం పరమాద్భుతం. ఒక్క భగవంతుడు మాత్రమే ఇన్నికోణాలలో పరిపూర్ణతను ప్రకటించగలడు.

ఇది ప్రపంచంలో ఏ మానవునికీ సాధ్యమయ్యే విషయం కాదు. చిన్నబాలునిగా తన ముద్దుమాటలతో, అల్లరి చేష్టలతో గోకులాన్ని కట్టిపడేశాడు.ప్రేమికునిగా గోపికలకూ రాధకూ మహత్తర ప్రేమభక్తిని చవిచూపించాడు.

వీరునిగా యుద్ధాల్లో పాల్గొన్నాడు. సోదరునిగా అన్నకు అండగా నిలబడ్డాడు.రాజుగా ధర్మాన్ని నిలబెట్టాడు, సేవకునిగా సారధ్యం వహించాడు, కుమారునిగా తండ్రి ఋణం తీర్చుకున్నాడు, స్నేహితునిగా కుచేలునీ, బంధువుగా పాండవులనూ ఆదరించాడు, ఉత్తమశిష్యునిగా సాందీపని ఆచార్యుని ఋణం తీర్చుకున్నాడు. ఉత్తమ గురువుగా అర్జునునీ ఉద్దవునీ ఉద్దరించాడు. తననే నమ్మిన రుక్మిణికి, అష్టమహిషులకూ, పదహారువేలమంది భార్యలకూ న్యాయం చేశాడు. ధర్మయుద్ధాన్ని నడిపించాడు. ఒక్కడే పాశ్చాత్యరాజుల దాడులను, కుట్రలనూ ఎదుర్కొన్నాడు. దుర్మార్గులను అంతం చేసాడు. చివరిగా తనవారు తన ఎదురుగానే కొట్టుకుని చచ్చిపోతుంటే నిర్వికారంగా చూస్తూ మౌనంగా ఉన్నాడు. తాను వచ్చినపని అయిపోయిన అనంతరం ఎవరికీ చెప్పకుండా, ఏ విధమైన మోహాలూ లేకుండా, అందర్నీ వదిలి,  దేహాన్ని వదిలి తన స్వధామాన్ని చేరుకున్నాడు. అందుకే "కృష్ణస్తు భగవాన్ స్వయం" అన్న మాట అక్షరాలా నిజం. 

కృష్ణునిలోని ఇన్ని కోణాలనూ చక్కగా అర్ధం చేసుకున్నప్పుడే కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం అని మహనీయులు ఎందుకు అన్నారో మనకు కొద్దిగానైనా అర్ధం అవుతుంది.

ప్రపంచ మాతృభాష దినోత్సవము

ఫిబ్రవరి 21వ తేదీ ---- తల్లిభాష పండగ!

సృష్టిలో ప్రతి ప్రాణికి తనకంటూ ఒక భాష ఉంటుంది. మానవులకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయా ప్రాంతాలనుబట్టి రకరకాల భాషలు ఉంటాయి. ఎవరికివారే ఘనులు కాబట్టి అందరూ తమ జాతి, తమ భాష గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు. జాతుల సంగతి ఎలా ఉన్నా భాష విషయానికి వస్తే ఏ భాష అభివృద్ధికైనా సాహిత్యమే పట్టుగొమ్మ. సాహిత్యానికేమో రచయిత, ప్రచురణకర్త, పుస్తక విక్రేత, పాఠకుడు మూలస్తంభాలు. ఇందులో ఏ ఒక్క స్తంభం దెబ్బతిన్నా సాహిత్యం పునాదులు కదిలినట్లే.

1947లో...భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. ప్రతియేటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీ య మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి మద్ధతుతో 17-11-1999న యునెస్కో ఈ ప్రకటన చేసింది. 1999లో యునెస్కో సభ్య త్వ మండలికి ఎన్నికైన బంగ్లాదేశ్‌ ఈ దినోత్స వ నిర్వాహణను గూర్చిన ప్రతిపాదన చేసింది.

ఎన్నో భాషలు!

మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికిసగం ప్రమాదంలో పడ్డాయి. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం...గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతమైపోయాయి. వివిధ తెగల భాషలు కనుమరుగైపోయాయి. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో 'మాతృభాషల పరిరక్షణ అన్నది ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం' అని నిర్ధారించింది. 'కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే' అంటూ హెచ్చరించింది. ఆ లెక్కన తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

*తెలుగు భాష*

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది 'అమ్మ...' అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాటిది.

*ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.*

*ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.*

శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో వెుట్టవెుదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉచ్చారణకీ ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్‌ దొరగారు. 'సుందర తెనుంగై' అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. 'ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ... నాల్పస్య తపసఃఫలమ్‌' అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.

యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నా. దేశం వెుత్తం మీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే! ఏ దేశమేగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ మాతృభాషకు ప్రత్యామ్నాయం కానేకావు. ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది.

మాత్రుభాషలో విద్యాభోదన పిల్లలకు మానిసిక వత్తిడి నుండి మేలుచేస్తుందని మానసిక నిపునులు పదే పదే చెప్తున్నా మన సమాజము వినడం లేదు . దీనికి తోడుగా హిందీ కూడా నేర్పడము మరీ మంచిది కాదు . ప్రపంచ ప్రజలతో అనుసంధానముకోసం ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పనిసరి అయినందున మనవిద్యావిధానములో రెండేబాషలు ఉండి పాఠ్యాంశాలన్నీ తెలుగు (మాతృభాషలో)నే ఉండాలి. ఇంగ్లిష్ కమ్యూనికేషం భాష గా మాత్రమే మొదటి నుండీ నేర్పడము ఉత్తమమైన విద్యావిధానము

*తెలుగు వ్యాకరణం ఉపోద్ఘాతం*

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది.శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది.

వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటినుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది.

భారత రాజ్యాంగం గుర్తించిన ముఖ్యమైన నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు ఒకటి. మిగిలినవి తమిళం, కన్నడం, మలయాళం. భారతదేశంలో ద్రావిడ భాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. ఈ విషయంలో మొత్తం భారతదేశంలో హిందీ ప్రధమ స్థానం వహిస్తే తెలుగు రెండవ స్థానం పొందుతూంది. తెలుగు వారి సాహిత్యం అతి ప్రాచీనమైంది. రెండు వేల (2,000)సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది. తెలుగు నుడికారము, మృదుమధుర భావగర్భితము, అత్యంత హృదయానందకము.

ప్రపంచ భాషలలో ఎట్టి శబ్దాన్నైనా తనలో జీర్ణించుకోగల సత్తా, ఏ శబ్దాన్నైనా ఉచ్చరింపజేయగల శక్తి అటు సంస్కృతానికీ ఇటు తెలుగుకు తప్ప మరే భాషకూ లేదు. ఇట్టి తెలుగు భాషకు నన్నయభట్టు మొదలుకొని ఎందరెందరో కవులు వ్యాకరణాలు రచించారు. ఇంకా రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు వ్యాకరణాలలో మొట్టమొదటిది 11వ శతాబ్దంలో వెలువడిన "ఆంధ్ర శబ్ద చింతామణి". భారత రచనకు పూర్వమే నన్నయ దీనిని రచించాడనే వాదోపవాదాలు ఉన్నాయి. ఇది నన్నయ కృతమని కొందరు, కాదని మరికొందరూ వాదిస్తున్నారు. ఇది 80 అర్యావృత్తములతో సంస్కృతములో రచించబడింది.

క్రీ.శ. 13వ శతాబ్దంలో అధర్వణాచార్యులు ఆంధ్ర శబ్ద చింతామణి సూత్రాలకు వివరణలు, సవరణలు చూపుతూ వార్తికములు సంస్కృతంలో రచించారు. ఇంతేగాక ఇతడు తెలుగునకు సంస్కృత

భాషలో వికృతి వివేకము లేక అధర్వణ కార్తికావళి, త్రిలింగ శబ్దానుశాసనము అను రెండు వ్యాకరణాలను రచించాడంటారు. పై రెండు గ్రంధాలలోనూ లక్షణములేగానీ లక్ష్యములు లేవు. లక్షణ లక్ష్య సమన్వయంగా క్రీ.శ. 13వ శతాబ్దంలో కేతన (దశ కుమార చరిత్ర రచించిన కవి) ఆంధ్ర భాషాభూషణము తెలుగు మాటలకు తెలుగు భాషలో వ్రాయబడిన మొదటి గ్రంధము. 15వ శతాబ్దంలో విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. ఇదే కాలంలో వెల్లంకి తాతంభట్టు కవి లోక చింతామణి వ్యాకరణాంశాలతోపాటు కొన్ని లక్షణాలను చేర్చి తెలుగు పద్యాలలో రచించాడు. తరువాత 16వ శతాబ్దంలో ముద్దరాజు రామన పైవాటికన్నా కొంత మేలుగా "కవిజన సంజీవని" రచించాడు. ఇది కూడా పద్య రూపంలో ఉన్నా అక్కడక్కడ వచనాలతో వివరించబడింది.

17వ శతాబ్దంలో బాల సరస్వతి ఆంధ్ర శబ్ద చింతామణికి బాల సరస్వతీయము అను తెలుగు టీకను వ్రాశాడు. బాల సరస్వతీయం వల్లే ఆంధ్ర శబ్ద చింతామణి ప్రచారంలోకి వచ్చింది. ఇదే శతాబ్దంలో కాకునూరి అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణిని తెనిగించి అప్పకవీయము రచించాడు. ఇదే సమగ్ర లక్షణ గ్రంధమనిపించుకుంది. 17వ శతాబ్దంలోనే అహోబల పండితుడు పూర్వ కవుల గ్రంధాలను పరిశోధించాడు. కవి శిరోభూషణము అను గ్రంధమును సంస్కృతంలో చింతామణికి వ్యాఖ్యానం వ్రాశారు. దీనినే పండితులు అహోబల పండితీయం అన్నారు. ఈ శతాబ్దంలోనే మండ నరసింహ కవి సూత్ర వివరణము సంస్కృతంలోనూ, ఉదాహరణలు తెలుగులోను పెట్టి ఆంధ్ర కౌముదిని రచించాడు.సర్వ లక్షణ సార సంగ్రహం గణపవరపు వేంకటకవి (17వ శతాబ్దం) రచంచాడు. అదే పేరుతో 18వ శతాబ్దంలో కూచిమంచి తిమ్మకవి మూడు ఆశ్వాసముల పద్య గ్రంధమును ఎక్కువ వ్యాకరణ విశేషాలతో లక్షణ సంస్కారంతో రచించాడు. తరువాత కస్తూరి రంగకవి "ఆనందరంగరాట్చందము", ఆడిదం సూరకవి యొక్క "కవి సంశయ విచ్చేదము" వచ్చాయి. ఆయా కాలాలకు తగినట్టుగా ఈ గ్రంధాలు కనిపించినా 19వ శతాబ్దం నాటికి అన్నీ అసమగ్రాలుగనే కనిపించాయి. చింతామణి, అహోబిల పండితీయం సంస్కృతంలో వచ్చాయి. ఇవి సంస్కృతం తెలిసినవారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. తరువాత వచ్చిన ఆంధ్ర భాషాభూషణాదులు తెలుగు పద్యాలలో ఉన్నాయి. ఇవి తెలుగు తెలిసిన వారికి ఉపయోగపడినా ఎక్కువగా కావ్య లక్షణాలను నిరూపిస్తున్నాయి. కావ్యాలంకార చూడామణి, అప్పకవీయం మొదలైన వాటిలో వ్యాకరణాంశాలు బహుకొద్దిగా ఉన్నాయి.కావ్య వాజ్ఞ్మయం బహుముఖంగా విస్తరించుకుపోయింది. ముందువచ్చిన వ్యాకరణాలన్నీ 19వ శతాబ్దం నాటికి అసమగ్రాలుగా కనిపించాయి. ఇది గ్రహించి పరవస్తు చిన్నయ ప్రాచీన వ్యాకరణ మర్యాదలతో సంస్కృతంలో సూత్రప్రాయంగా తెలుగు వ్యాకరణం రచించాడు. ఇదేగాక ఇతడు సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించాడు. అనేక ప్రాచీన లక్షణ గ్రంధాలను పరిశీలించాడు. తెలుగు భారతము, భాగవతము మొదలైన గ్రంధాలలో ప్రయోగాలను తెలుసుకున్నాడు. వీటితోపాటు అనుభవాన్ని కూడా జోడించి క్రమపద్ధతిలో తెలుగు సూత్రాలతో మిక్కిలి సులభ శైలిలో వివరణలతోసహా బాల వ్యాకరణం రచించాడు. ఈ చిన్నయ బాల వ్యాకరణమే తరువాత వచ్చిన వ్యాకరణకర్తలకు అందరికీ ఆధారమైంది. ఇదే ఆంధ్ర భాషకు ప్రామాణికమైన వ్యాకరణ గ్రంధము.

ఆంధ్ర వాజ్ఞ్మయానికి చిన్నయ రచించిన బాల వ్యాకరణం సంస్కృత వాజ్ఞ్మయానికి సిద్ధాంత కౌముది వంటిది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...