Saturday, November 17, 2018

శివుడు అభిషేక ప్రియుడు



         శివో అభిషేక ప్రియ: 
(అంటే శివుడు అభిషేక ప్రియుడు)

"శివుడు అభిషేక ప్రియుడు" కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి 
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర 
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం...
అభిషేక ద్రవ్యాలు... ఫలితాలు
----------------------------------------
ఆవు పాలతో..... సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు... ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి.... ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) .... దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం ... పుత్ర లాభం
పుష్పోదకం... భూలాభం
బిల్వ జలం ... భోగ భాగ్యాలు
నువ్వుల నూనె... అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం ... మహా ఐశ్వర్యం
సువర్ణ జలం ... దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం .... సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం ... సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం .... శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)... ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ ... శివ సాన్నిధ్యం
గంగోదకం ... సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం... ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం... దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ... మంగళ ప్రదం
వీబూది .... కోటి రెట్ల ఫలితం

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

Monday, November 12, 2018

గృహ పరిసరాలలో శుభ ప్రధమైన, అశుభ ప్రధమైన మొక్కలు

నివాసం ఉంటున్న ఇంట్లో ఎలాంటి చెట్లుండాలి? ఏ చెట్టుంటే ఏ శుభం ఫలితం కలుగుతుంది? ఉండకూడని చెట్లేవైనా ఉన్నాయా? అనే ప్రశ్నలకు బ్రహ్మవైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం ఉత్తరార్థం నూట మూడో అధ్యాయంలో కనిపిస్తుంది.
శ్రీకృష్ణుడు స్వయంగా విశ్వకర్మకు ఈ చెట్ల విశేషాలను గురించి వివరించి చెప్పాడు. ద్వారకా నగర నిర్మాణ సందర్భంగా ఒక మహానగరాన్ని ఎలా నిర్మించాలో, ఆ నగరంలో ఏ దిక్కున ఏవి ఉండాలో ఎవరెవరి నివాసాలు ఎంతెంత ఎత్తు, వెడల్పు, లోతు లాంటి పరిమాణాలతో ఉండాలో వివరించాక చెట్ల ప్రస్తావన తెచ్చాడు శ్రీకృష్ణుడు.

ఇళ్ళ ఆవరణల్లో కేవలం శుభకరమైన చెట్లు, పూలతీగలు, ఫలాలనిచ్చే వృక్షాలు ఉండాలి అని విశ్వకర్మను కృష్ణుడు హెచ్చరించాడు. అప్పుడు విశ్వకర్మ నగర నిర్మాణం జరిగాక గృహాల ఆవరణల్లో ఏ మంచి చెట్లను ఉంచాలో, నగరం లోపల ఉద్యానవనాలలో ఎలాంటి పూలతోటలను, చెట్లను పెంచాలో వివరించమని భక్తితో కోరాడు. ఆ సందర్భంగా కృష్ణుడు శుభప్రదమైన మొక్కలు పూలతీగల, చెట్ల విశేషాలను చెప్పాడు. గృహస్థులు ఉండే గృహాల ఆవరణలో కొబ్బరి చెట్టు ధన ప్రదం. ఇంటికి ఈశాన్యంలోనూ, తూర్పుభాగంలోనూ ఈ చెట్లు ఉండాలి. తాటిచెట్టు ఎక్కడైనా ఉండొచ్చు. రాజు ఉండే ప్రాంగణాల తూర్పు దిక్కులో మామిడి చెట్టు ఉంటే సంపదలు కలుగుతాయి. మామిడి ఏ దిక్కున ఉన్నా శుభప్రదమే.

మారేడు, పనస, రేగు, నిమ్మచెట్లు తూర్పు దిక్కులో ఉంటే సంతానప్రదం. ఇవి దక్షిణంలోనూ, ఇతర దిక్కులలోనూ ఉన్నప్పుడు ధనప్రద ఫలితాన్నిస్తాయి. ఈ చెట్లన్నీ గృహస్థుడికి ఎంతో వృద్ధిని చేకూరుస్తాయి. అల్లనేరేడు, దానిమ్మ, అరటి తూర్పు దిక్కులో ఉంటే ఇంట్లో ఉండే వారికి బంధువులతో సఖ్యత కుదురుతుంది. ఇవే దక్షిణం దిక్కులో ఉంటే మిత్రప్రాప్తి కలుగుతుంది. సంపంగి చెట్టు ఇంటి ఆవరణలో ఏ దిక్కునైనా ఉండొచ్చు. సొర, మంచి గుమ్మడి, మోదుగ, దోస, ఇంటి ఆవరణలో ఉంటే మంగళప్రదాలు. మారేడు, వంగ శుభప్రదాలు. పండ్లనిచ్చే తీగెల రకాల మొక్కలు ఎక్కడైనా ఉండొచ్చు. శనగ ధాన్యపు మొక్కలు ఉన్నందువల్ల దోషం లేదు. చెరకు ఎక్కడున్నా పర్వాలేదు. అలాగే అశోక, శిరీషం, కదంబ వృక్షాలు శుభప్రదం. పసుపు, అల్లం మొక్కలు శుభకరాలు.

గ్రామంలోనూ, నగరంలోనూ కరక్కాయ చెట్టు ఉండడం శుభప్రదం. ఉసిరి చెట్టు కూడా ఇలాంటి ఫలితాన్నే ఇస్తుంది. ఉదయాన్నే లేచి తులసి చెట్టు చూసిన వ్యక్తికి బంగారం దానం చేసిన ఫలితం లభిస్తుంది. మాలతి, మొల్ల, కుందం, మాధవి, మొగిలి, నాగకేసరం, మల్లె, పొగడ, విష్ణుక్రాంతం అనే చెట్లు ఇంటి ఆవరణలో ఉండటం మంచిది. వీటితో ఉద్యానవనాలను కూడా పెంచవచ్చు. ఇవి తూర్పు దక్షిణ దిశల్లో ఉంటే మంచి ఫలితం లభిస్తుంది. గృహస్థుడు ఇలాంటి చెట్లను పూల పండ్ల తీగలను తన ఇంటి ఆవరణలో ఉండేలా చూసుకోవాలి.

అలాగే బూరుగ, చింత, వేప, వావిరి చెట్లను ఇంట్లో పెంచకూడదు. ఇవి అశుభకరాలు. ఉమ్మెత్త, రావి, ఆముదం, లాంటి చెట్లుకూడా ఇంట్లో ఉండటం మేలు కాదు. భూమిలోకి ఎక్కువ దూరం వేళ్ళు పాతుకొనిపోయే చెట్లను ఇంట్లో పెంచకూడదు. బూరుగ చెట్టు ­రి వెలుపల అడవికే పరిమితం. ఇంట్లో మర్రి చెట్టు ఉంటే దొంగల భయం కలుగుతుంది. చింతచెట్టు ఇంట్లో ఉంటే ధనహాని. ఇలాంటి చెట్లు ఇళ్ళలో కాక వీధులలోనూ, వనాలలోనూ ఉండవచ్చు. బూరుగ విషయంలో అది ఇంట్లోకాని నగరంలో కాని ఉంటే దుఃఖప్రదం. కనుక అది లేకుండా జాగ్రత్త వహించాలి అని శ్రీకృష్ణుడు విశ్వకర్మకు వివరించి చెప్పాడు. పురాణకాలం నాడే పర్యావరణ వన సంరక్షణ గురించిన పూర్తి అవగాహన ఉన్నట్టు వివరిస్తుంది.

Sunday, November 11, 2018

వన భోజనాల విశిష్ఠత

ప్రకృతి   వనభోజనం,   *కార్తీక   మాసం,
పూజా    విధుల్లో    ముఖ్యమైనది  ..
*కార్తీక   మాసంలో   వనభోజనం*   ఆచరించడం   ఆధ్యాత్మిక,   సామాజిక   భావనలను   పెంచుతుంది.   ముక్తికే   కాదు,   సమైక్యతకు,   చక్కని   ఆరోగ్యానికి   దోహదపడుతాయి,    పర్యావరణ   పరిరక్షణకు   తోడ్పడుతాయి,.   వన  భోజనం   అంటే   పచ్చటి   ఆకుల   మధ్య   ప్రకృతిలో   మమేకమై,   ప్రకృతికి   నివేదించి,.    అందరూ   కలిసి   ఆనందంగా   ఆరగించడం,     వండిన   పదార్థాలను   దేవునికి   నివేదించి,.   వృక్షాల   నీడలో   సామూహింగా   భోజనం   చేయడం_

*ఇలా   వనభోజనం   చేయడంవల్ల   ఆధ్యాత్మిక   ఫలితాలు,   ఆరోగ్యంతో   పాటు   ప్రజల్లో   ఆత్మీయతానురాగాలు   పెంపొంది,   సామాజిక,     సామరస్యతకు,   సమైక్యతకు,   దోహదం   చేస్తుంది,*

ఆనందానికి   సంకేతం   పచ్చదనం,   దాన్ని   పంచుకుంటూ   ఆనందాన్ని   మనసులో   నింపుకొంటూ,   చిన్నపిల్లల   నుంచి   పెద్దవారి   వరకు,    వేద,   పురాణాల   వచనం,   ఆట,  పాటలతో, నృత్య,  గీతాలతో   ఆనందంగా   గడుపుతు,   చెట్టు   కింద    చక్కగా  వంట   చేసుకుని,   పరమేశ్వరుడికి ..  మహా   నైవేద్యం   పెట్టి,   అందరూ   ఒక్కటిగా   నిలబడి   అన్నం  తిని,   ఆ   ప్రకృతి   అన్రుగహాన్ని .., *శివ,  కేశవుల*   అన్రుగహాన్ని     పొందడానికి,    వనభోజనం   చేయాలి_

     గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...

నాగుల చవితి రోజు పుట్టలో పాలు ఎందుకు పోస్తారో తెలుసా..?

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ‘వెన్నుబాము’ అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో “పాము” ఆకారమువలెనే వుంటుందని “యోగశాస్త్రం” చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ‘ సత్వగుణ’ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ‘నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుందని పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

_*నాగుల చవితి పూజా విధానం*_

నాగులచవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకొని ఇంట్లో దేవుని వద్ద నువ్వులనూనెతో దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమనుగానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి. పూజకు మందారపూలు, ఎర్రటి పువ్వులు, కనకాంబరములు, నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడం ద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో “ఓం నాగేంద్రస్వామినే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్టవద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో ఆవుపాలు పోసి పూజ చేయాలి. పూజ అయిన తరువాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, November 9, 2018

కార్తీక చతుర్ధి-నాగుల చవితి

దీపావళి తరువాత వెంటనే వచ్చే చక్కటి పండుగ ‘నాగుల చవితి’. నాగుల చవితి నాడు ప్రొద్దున్నే లేచి, మా గ్రామం లో పిల్లలూ పెద్దలు అందరూ వూరి చివర గరువులో ఉన్న పెద్ద పుట్ట దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అందరు పుట్టకి పూజ చేసి, పాలు, అరటి పళ్ళు, పుట్ట కలుగు లో వేసేవారు. కొందరు కోడి గ్రుడ్లు కూడా వేసే వారు. పుట్ట మన్ను భక్తిగా చెవులకు పెట్టుకునే వాళ్ళం. ఇంటి దగ్గర మా అమ్మగారు, పూజ గది గోడకు చలిమిడి, చిమిలి తో నాగేంద్రులను తయారుచేసి అతికించి పాలు పోసి పూజ చేసేవారు. 

కార్తీక మాసం శివకేశవులకే కాక సుబ్రహ్మణ్యస్వామికి కూడా విశేషమైనదిగా చెప్పుకోవచ్చును. ఈ మాసం పేరే కార్తికేయుని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అందుచేత ఈ మాసం లోని శుద్ద చవితి నాడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. ఈ రోజును ‘నాగుల చవితి’, ‘మహా చతుర్ధి’అంటారు. ఈ రోజు పచ్చి చలిమిడి, చిమిలి చేసుకుని, ఆవు పాలు, పూలు, పళ్ళు కూడా తీసుకుని, పాము పుట్ట దగ్గరకు వెళ్లి, నాగదేవతకు దీపారాధన చేసి, పూజ చేసి, పుట్ట కన్నులలో ఆవు పాలు పోసి, చలిమిడి, చిమిలి కూడా వేసి, రెండు మతాబులు, కారపువ్వులు లాంటివి వెలిగించుకుంటారు. పుట్ట దగ్గరకు వెళ్ళటం అలవాటు [ ఆచారం ]లేని వారు ఇంట్లోనే పూజా ప్రదేశం లో గోడకి చిమిలి నాగేంద్రుడు, చలిమిడి నాగేంద్రుడు ని పెట్టుకుని, పూజ చేసుకుని, పాలు పోసి, చలిమిడి, చిమిలి, పాలు, పళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు. ఇలా గోడ మీద నాగేంద్రుడిని ‘గద్దె నాగన్న’ అని భక్తి తో పిలుచుకుంటారు. సంతానం కోసం ప్రార్ధన చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామినే వేడుకోవాలి. ఎందుకంటే వినాయకుడు విఘ్నాధిపతి వలెనే సంతాన సంబంధమైన సమస్యలను పరిష్కారం చేసేది సర్పరూప సుబ్రహ్మణ్య స్వామియే అని భక్తుల నమ్మకం! 

దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ!

“పాహి పాహి సర్పరూప నాగ దేవ దయామయా!సత్సంతాన సంపత్తిం! దేహిమే శంకర ప్రియా !అనంతాది మహానాగరూపాయ వరదాయచ!తుభ్యం నమామి భుజగేంద్ర! సౌభాగ్యం దేహిమే సదా!శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహిమాం!శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్షమాం!

నాగుల చవితిని భక్తిశ్రద్ధలతో చేసుకుంటే సర్వ పాపాలు పోతాయి. అంతే కాకుండా రాహు కుజ దోషాల నుండి విముక్తి పొందుతారు. వివాహం కానీ కన్యలు నాగుల చవితి చేసుకుంటే శీఘ్ర వివాహం జరుగుతుందని నమ్ముతారు. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుందని, మానసిక రుగ్మతలున్న వారికి మనోక్లేశం తొలిగి, ఆరోగ్య వంతులవుతారనీ, చెవి సంబంధించిన వ్యాధులు, చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్ముతారు. అందుకే ఈ రోజు పుట్ట మన్నును శ్రద్ధగా చెవులపై ధరిస్తారు.యోగసాధన ద్వారా కుండలనీశక్తి ని ఆరాధించడమే నాగులచవితి !ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. 

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.దీనినే జ్యోతిష్య పరంగా చూస్తే! 

కుజ, రాహు దోషాలున్నవారు, సాంసారిక బాధలున్నవారు, ఈ కార్తీకమాసంలో వచ్చే షష్టీ, చతుర్దశిలలో మంగళవారము నాడుగాని, చతుర్దశి బుధవారం కలసివచ్చే రోజుకాని దినమంతా ఉపవాసము ఉండి నాగపూజ చేయుటలో చేకూరే ప్రయోజనాలు రెండు ప్రధానంగా. పామును చంపిన పాప పరిహారం, ఆ పాపం వంశానికి తగులకుండా ఉండటం. తైత్తిరీయసంహిత నాగపూజావిధానాన్ని వివరించింది. వేపచెట్టు / రావిచెట్టు మొదట నాగవిగ్రహం ఉండటం పరిపాటి. ఈ విగ్రహాన్ని రెండు పాములు పెనవేసుకున్న ఆకారంతో తీరుస్తారు. ఈ రెండు పాములే ఇళా, పింగళా కి ప్రతీకలు. నాగులను సంతానం కోసం పూజించటం సంప్రదాయం. విప్పిన పడగతో, శివలింగంతో 8వంకరల సర్పవిగ్రహం సుషుమ్నానాడికి, ఊర్ధ్వగామి అయిన కుండలినికి సంకేతం. 

నాగులచవితి రోజు పాములపుట్ట దగ్గరకి వెళ్ళి, పత్తితో వస్త్రాలు, యఙ్ఞోపవీతాల వంటి నూలు దారాలతో పుత్తలను అలంకరించి, పూజ చేసి, పుట్టలో పాలు పోయడం ఆనవాయితీ. సర్పం మండలాకారం లేక పూర్ణవృత్తం, పూర్తి శూన్యం, ఈ పూర్ణంలో పూర్ణం తీసివేస్తే శేషమూ పూర్ణం. ఆ శేషమే ఆదిశేషంగా, అనంతమనే శేషశాయిగా, విష్ణువుకి తల్పంగా ఏర్పడింది అని అంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధనలో కూడా సర్పం ఉంటుంది. మరోవిధంగా చెప్పాలంటే, మన శరీరమే నవరంద్రాల పుట్ట, అందులోని పాము (కుండలనీశక్తి) ని ఆరాధించడమే నాగులచవితి. ఈ పుట్టలో అడుగున మండలాకారంలో చుట్టలు చుట్టుకుని పడుకున్న పాము(కుండలనీశక్తి) కామోధ్రేకాలతో విషాన్ని కక్కుతూ ఉంటుంది, పాలు అనే యోగసాధన ద్వారా ఆ విషాన్ని హరించవచ్చు, అనేది ఈ నాగులచవితిలోని అంతర్ అర్ధం. కార్తీకమాసంలో సూర్యుడు కామానికి, మృత్యువుకూ స్థానమైన వృశ్చికరాశిలో సంచరిస్తాడు. ఈ కాలాన్ని, మృత్యువునూ జయించడానికి ఋషులు, యోగులు చేసే నాగారాధన, సిద్ది సాధనా కాలమే కార్తీకమాసం.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కార్తీక దీపము

కార్తీకపౌర్ణమి సాయంసమయంలో ప్రమిదలలో చమురుపోసి దీపములు వెలిగించే ఆచారము ఆసేతు హిమాచలము ఉంది. ప్రతియింటి గుమ్మమునందు ఈనాడు దీపాల వరుస మినుకు మినుకు మంటూ ఉంటుంది. 

అనాదిగ ఈ రోజున కనీసము ఒక దీపమైనా ఇంటింట వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తూ చెప్పవలసిన శ్లోకము ఒకటి ఉంది. ఆశ్లోకానికి అర్థము- ''ఈ రోజున ఎవరీ దీపమున ఆవాహన చేసిన మూర్తిని స్మరిస్తూ, దీపదర్శనం చేస్తారో- ఈ దీపజ్యోతి ఎవరిమీద ప్రసరిస్తుందో వారు పాపముక్తులై పునర్జన్మ లేని స్థితిని పొందురుగాక!'- అని.
అనేక స్థలములలో విగ్రహములలో ఈశ్వరుని ఆవాహన చేయురీతినే ఈరోజు దీపములో దామోదరుడనే మూర్తినో లేక ఉమాదేవీ సహితుడైన త్య్రంబకునో- ఆవాహనచేసి ప్రార్థిస్తారు. ఇది సంప్రదాయము. కేశవ, నారాయణ, మాధవ- అని చెప్పు నామములతో పండ్రెండవ నామము, దామోదరుడు, ఆయననో లేక ఉమాసహితుడైన త్య్రంబకునో ఆవాహన చేస్తారు.
కృత్తికా పూర్ణిమ నాడు దీపములో ఈశ్వరుని ఆవాహనచేసి- ఈ దీపజ్వాలను చూచినను సరే- ఈ దీపజ్వాలపైబడిననుసరే, చూచుటకు శక్తికల జీవులు, శక్తిలేని జీవులు - ఏవి అయినను-వాని పాపములు నశించాలి అని ప్రార్థన చేస్తారు. పాపములు తొలగి 'లోకా స్సమస్తా స్సుఖనో భవన్తు', అనే సంకల్పము ఋషులు వెలిబుచ్చారు. కృత్తికానక్షత్రము, పూర్ణిమతిథి-రెండూ ఈరోజు కలిసి వస్తున్నాయి. నక్షత్రము ఒకరోజున, పూర్ణిమ ఒకరోజున వచ్చుట కూడ ఉంది. దేవాలయాలకు కృత్తికా నక్షత్రమే ముఖ్యము. తిరువణ్ణామలైలో కృత్తికా నక్షత్రమన కృత్తికా దీపము వెలిగిస్తారు. ఇండ్లలో పూర్ణిమనాడు దీపాలు పెటతారు. దీపము వెలిగించి ఆ దీపకలికా జ్యోతిలో ఉమాదేవీ సహిత త్య్రంబకమూర్తినో, దామోదరమూర్తినో ఆవాహనచేసి- 'కీటాః పతంగాః' అనే శ్లోకం చదువుతారు.
ఈ దీపదర్శనమువలన మనుష్యుల పాపములేకాదు. పశుపక్షి కీటకముల పాపములు సైతము నశిస్తాయి. మన మలి పుట్టుక ఏదో మనకు తెలియదు. మనము ఏమ్రాను అయినా కావచ్చు. మశకమయినా కావచ్చు. అందుచేతనే సమస్త ప్రాణికోటికి పాపనివృత్తి - ప్రసాదించాలి - అని ప్రార్థన చేయుట.
చాలా దూరంలో ఉండేవారికి కూడ తెలిసేరీతిని పెద్ద గోపురమువలె చెత్తచెదారము వేసి మంట వేస్తారు. ఆలయములో నుండి ఈశ్వరుని ఆవాహనచేసిన ఒక దీపాన్ని తెచ్చి దీనిని తగులబెట్టుతారు. తిరువణ్ణామలైలో పర్వతశిఖరముపై - అణ్ణామలై దీపమని- మైళ్ళకొలది తెలిసే రీతిగా - దీపము వెలిగిస్తారు.
జ్వాలాదర్శనముచేసే జనుల పాపములేకాక కీటాః - పురుగులు, పతంగాః - పక్షులు, మశకాః - దోమలు, వృక్షాః - చెట్లు, వీని కన్నిటికీ జన్మనివృత్తి కావాలి. చెట్లు చేమలు లతలు కొన్ని రోజు నీరు పోయకపోతే వాడిపోతాయి. శోషిస్తాయి. ఇది మనము ఎఱిగిందే. వాని జన్మసైతము నివృత్తి కావాలి. జల్సేజలములో ఉండే చేపలు, ఇతర జలజీవములు, స్థల్సేస్థావరాలైన జంతువులు- ''దృష్ట్యా ప్రదీపం న చ జన్మభాగినః''. త్ర్యంబకుని ఆవాహన చేసిన దీపము చూచినా, ఆ దీపజ్వాలయొక్క వెలుతురు వానిపైపడినా - పుష్టివర్థకుడైన మహేశ్వరుని కృపచే సమస్త జీవులకు పాపనివృత్తి కావలెనని కరుణాస్వరూపులైన మహర్షులు ప్రార్థించి ఉన్నారు.
ద్విపాదులైనను చతుష్పాత్తులైనను లోకం అంతా క్షేమంగా ఉండాలి. కొన్నిటికి పాదములే ఉండవు. వానిదొక వింత జన్మ. మరికొన్ని జీవాలకు వేలకొలది కాళ్లు. అవి సహస్రపాదులు. 'తే ద్విపాద్‌ చతుష్పావ్‌' అని వేదములో చెప్పబడింది. 'సకలము క్షేమముగా ఉండాలి' అని మనము ప్రార్థన చెయ్యాలి. మనము మాత్రము క్షేమము ఉంటే చాలదు. 'లోకాస్సమస్తాస్సుఖినోభవన్తు' అని అన్ని లోకాల సుఖమూ కూడ కోరాలి.
కృత్తికా దీపమునాడు చెప్పవలసిన శ్లోకము
కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః|
దృష్ట్యా ప్రదీపం నర జన్మభాగినః భవన్తి త్యం శ్వవచాహి విప్రాః||
పై శ్లోకమును విడివిడిగా భాగించి స్ఫుటంగా చెప్పడం. ఈ దీపకాంతి ప్రసరించిన మానవులు పశువులు పక్షులు కీటకములు అన్నీ తమ పాపాలను పొగొట్టుకొని క్షేమంగా ఉండాలి అనియే. అదే ఈ శ్లోక తాత్పర్యము. ఇది పరంపరగా వస్తూ ఉంది. ఈశ్వరుని ఆవాహన చేసిన ఈ దీప ప్రకాశమే పరమేశ్వర స్వరూపము, పాపవిమోచకము.
కృత్తికానక్షత్రము సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుని - జ్ఞాపకార్థమైఉంది. ఈ ఆరు నక్షత్రములకు వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఈ ఆరు నక్షత్రములే షణ్మాతృకలైన సుబ్రహ్మణ్యస్వామియొక్క తల్లులుగా చెప్పబడుతూ ఉన్నవి.
మరొక విశేషం, ఏమంటే - శివాలయంలోను, విష్ణ్వాలయంలోను కూడా చేసే ఉత్సవము - కృత్తికానక్షత్ర దీపోత్సవము ఒక్కటే. ఒక్కొక్క క్షేత్రములో ఒక్కొక్క ఉత్సవము విశేషము. కాని అన్ని గుడులలో, అన్ని క్షేత్రములలో - ఒకే రోజున విశేషముగా - మూర్తి భేదములేక చేసే ఉత్సవం ఇదే 'లోకా స్సమస్తాస్సుఖినో భవన్తు' అనే వాక్యానికి వ్యాఖ్యానమా? అన్నట్లు - ఈనాడు దీపదర్శనం చేసే సమస్త ప్రాణికోటికి జన్మనివృత్తి ఔతోంది. అందుచే మనము కృత్తికా పూర్ణిమనాడు (కార్తికమాసమున పూర్ణిమనాడు) దీపదర్శనముచేసి- దామోదరుని ఉమాసహిత త్ర్యంబక మూర్తిని ఆ దీపజ్వాలలో ఆవాహనచేసి ఆ ప్రకాశ ప్రసరణముచే పాపనివృత్తులమై లోకులక్షేమానికై ప్రార్థించుట కర్తవ్యము.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Thursday, November 8, 2018

భగినీ హస్త బోజనం

అనుబంధాలకు ఆప్యాయతలకు
అరమరికలులేని అనురాగాలకు
నిలువెత్తు నిదర్శనం భగినీహస్తభోజనం
వివాహభందాలతో దూరమైన సోదరిని
కనీసం ఎడాదికోక్కసారైన కలుసుకుని
వారితోగడిపే అవకాశం అదే మన సంస్కృతీ
ఎన్నిపనులున్నా వదలరాదు ఈ సంప్రదాయం.
‘భగిని’ అంటే...చెల్లెలైనా కావచ్చు., అక్క అయినా కావచ్చు. ‘హస్తభోజనం’ అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.కార్తీక శుక్ల విదియ తిథి రోజున ’భగినీ హస్త భోజనం’ అన్న
పండుగను జరుపుకుంటారు. దీన్నే భాయ్ దూజ్ అనీ, భాత్రు ద్వితీయ అనీ, భాయ్ టీక అని అంటారు. అంటే సోదరి చేతి వంటతో సోదరి ఇంట్లో భోజనం చేయడం.
సూర్యుని బిడ్డలైన యమునానది మరియు యమధర్మరాజు అన్నాచెల్లెళ్ళు. యమునమ్మకి ఎప్పట్నించో అన్నని ఇంటికి పిలచి సత్కారం చేయాలని కోరిక, యమధర్మరాజుగారు వేళతప్పక ధర్మం తప్పక పని చేసే వ్యక్తి కాబట్టి తీరిక దొరకక ఆమె కోరిక చాలానాళ్ళు తీరకుండా ఉంటుంది. అలా యమునమ్మ ఎదురుచూసి ఎదురుచూసి ఉండగా యమధర్మరాజు, చెల్లెలు యమున ఇంటికి ఒకరోజు సకల పరివార సమేతంగా వచ్చారు ఆరోజుకార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన సోదరుని ఆతల్లి చక్కగా ఆదరించి పూజించి, చిత్రగుప్తాదులతో సహా అందరినీ ఆదరించి ఆమె తన చేత్తో చక్కని వంట చేసి వడ్డన చేసింది. అందుకు సంతృప్తిని పొందిన యమధర్మరాజు ఆనందంతో చెల్లెలిని ఏదైనా వరం కోరుకోమనగా... యమునమ్మ ఆనాటి నుండి కార్తీక శుక్ల విదియ నాడు చెల్లెలి ఇంటికి వెళ్ళి చెల్లెలి చేతి వంట తినే సోదరునికి నరకలోక ప్రాప్తి, అపమృత్యుదోషం అనేవి లేకుండా ఉండేటట్టు వరమియ్యమని కోరగా, యమధర్మరాజుగారు ఆమె కోర్కెని విని ఆనందించి సోదరులు సోదరియొక్క సౌమాంగళ్యానికి ఎప్పుడూ క్షేమం కోరుకోవాలి కాబట్టి ఈనాడు ఏ సోదరి తన ఇంట సోదరునికి తన చేతివంటకాల్ని వడ్డించి తినిపిస్తుందో ఆమె వైధవ్యాన్ని పొందకుండా పుణ్యవతిగా, అఖండ దీర్ఘ సౌమాంగళ్యంతో వృద్ధినొందుతుందని వరమిచ్చారు. అందువలనే ఈ తిథికి *యమ ద్వితీయ* అని పేరు వచ్చింది. తరవాత యమునమ్మనుపరివార సమేతంగా తన పురానికి మరునాడు ఆహ్వానించి కానుకాదులిచ్చి, చక్కని షడ్రసోపేతమైన విందు, ఘనంగా సారె పెట్టి చెల్లెలిని పంపించాడు.
ఒకప్పుడు సమష్టి కుటుంబాల్లో సభ్యులందరూ ఒకరినొకరు ప్రేమతో, ఆప్యాయతతో పలకరించుకుంటూ పండగల్లో కలిసి భోంచేస్తూ, కబుర్లతో సత్కాలక్షేపం చేస్తూ పరస్పర సంబంధాలను, అనుబంధాలను శక్తిమంతం చేసుకునేవారు. అటువంటి హార్దిక బంధాలు అన్నీ ఇవాళ ఆర్థిక సంబంధాలుగా మారి యాంత్రిక, కృత్రిమ జీవన విధానానికి దోహదపడుతున్నాయి. అందువల్లనే కుటుంబసభ్యుల మధ్య పరస్పర అవగాహన, మంచి- మర్యాద, అనురాగమూ ఆప్యాయతా సన్నగిల్లిపోతున్నాయి. కనీసం సంవత్సరానికోనాడైనా తోబుట్టువులు కలిసి భోజనం చేసి, ప్రేమతో పలకరించుకుని, సద్భావనలను పెంపొందించుకోవలన్నది ఈ * భగినీ హస్త భోజన * విశిష్టత.
ఇటువంటి పవిత్రమయిన ఆచారాన్ని పాటించటము వలన ఆధ్యాత్మిక లాభాలే కాక , సామాజిక బంధాలుకూడా మరింత దృఢపడి. సమాజములో శాంతిసౌభాగ్యాలు వెల్లి విరుస్తాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...