Tuesday, April 17, 2018

తీర్ధయాత్ర-కాణిపాకం

సత్య ప్రమాణాలకు నెలవుగా.. అసత్యాలు చెప్పేవారికి సింహస్వప్నంగా *చిత్తూరు జిల్లా కాణిపాకం- శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయం* భాసిల్లుతోంది. *కాణిపాకం వద్ద బహుదా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది*.

సర్వమత ఆరాధ్యుడుగా కాణిపాకం వరసిద్ది వినాయకుడు పూజలందుకుంటున్నారు. ఈ స్వామికి హిందువులే కాదు. ఇతర మతస్థులూ మొక్కులు తీర్చుకుంటారు. ముఖ్యంగా స్వామివారి దర్శనార్థం నిత్యం వందల సంఖ్యలో ముస్లింలు రావడం విశేషం. దేవుడు ఒక్కడే అన్న నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాల్లో సైతం ఇతర మతస్థులు పాల్గొంటారు.

*క్షేత్రచరిత్ర/ స్థలపురాణం:*

సుమారు 1,000 ఏళ్ల కిత్రం ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పూర్వం విహారపురి అనే గ్రామంలో ధర్మాచరణ పరాయణులైన ముగ్గురు గుడ్డి, మూగ, చెవిటి వాళ్లుగా జన్మించారు. కర్మఫలాన్ని అనుభవిస్తూ.. ఉన్న పొలాన్ని సాగు చేసుకొంటూ జీవించేవారు. ఒక దశలో ఆ గ్రామం కరవు కాటకాలతో అల్లాడింది. గ్రామస్థులకు కనీసం తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. కరవును జయించాలని సంకల్పించిన ముగ్గురు సోదరులు తమ పొలంలో ఉన్న ఏతం బావిని మరింత లోతు చేయాలనుకున్నారు. ఆ మేరకు బావిలో తవ్వుతుండగా ఓ పెద్ద బండరాయి అడ్డుపడింది. దాన్ని తొలగించే యత్నంలో పార రాయికి తగిలి రాయి నుంచి రక్తం చిమ్మింది. రక్తం అంగవైకల్య సోదరులను తాకగానే.. వాళ్ల వైకల్యం తొలగింది. జరిగిన ఈ విచిత్రాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆ స్థలానికి వచ్చి బావిని పూర్తిగా తవ్వి పరిశీలించారు. బావిలో ‘గణనాథుని’ రూపం కన్పించింది. గ్రామస్థులు భక్తిశ్రద్ధలతో దాన్ని పూజించి స్వామివారికి కొబ్బరికాయలు సమర్పించారు. స్వామికి గ్రామస్థులు సమర్పించిన కొబ్బరికాయల నీరు ‘కాణి’భూమి( కాణి అంటే ఎకరం పొలం అని అర్థం) మేర పారింది. అప్పట్నుంచి విహారపురి గ్రామానికి ‘కాణిపారకరమ్‌’ అన్న పేరు వచ్చింది. కాలక్రమంలో అదే ‘కాణిపాకం’గా మారిందని ప్రశస్తి.

*ఈ బొజ్జ గణపయ్య.. ప్రమాణాల దేవుడయ్య!*

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు సత్య ప్రమాణాల దేవుడిగానూ ప్రసిద్ధికెక్కారు. స్వామివారి ఎదుట ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే.. వారిని స్వామియే శిక్షిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వ్యసనాలకు బానిసలైన వారు (తాగుడు, దురలవాట్లు) స్వామివారి ఎదుట ప్రమాణం చేస్తే వాటికి దూరం అవుతారని భక్తుల నమ్మకం. అసెంబ్లీలో సైతం రాజకీయ నేతలు ‘కాణిపాకం’లో ప్రమాణం చేద్దామా? అని సవాల్‌ విసురుకోవడం స్వామి మహిమను చెప్పకనే చెబుతోంది..!

*నిత్యం పెరిగే స్వామి:* 

వరసిద్ధి వినాయకుడు నిత్యం పెరుగుతున్నాడు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఉంది. యాభై ఏళ్లనాటి వెండి కవచం ప్రస్తుతం స్వామివారికి సరిపోవడం లేదు. 2002 సంవత్సరంలో భక్తులు స్వామివారికి విరాళంగా సమర్పించిన వెండి కవచం సైతం ప్రస్తుతం స్వామివారికి ధరింపచేయడం సాధ్యం కావడం లేదు.

కాణిపాకం శివ-వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతోంది. ప్రధాన గణనాథుని ఆలయం దగ్గర్నుంచి అనుబంధ ఆలయ నిర్మాణాలకు సంబంధించి విశిష్ట పురాణ ప్రాధాన్యం ఉంది. ఒకే చోట వరసిద్ధి వినాయకస్వామి ఆలయం, మణికంఠేశ్వర, వరదరాజులు, వీరాంజనేయ స్వామి వారి ఆలయాలున్నాయి.

*బ్రహ్మహత్యా పాతక నివారణార్థం:* 

స్వయంభువు వరసిద్ధి వినాయకస్వామి గుడికి వాయువ్య దిశగా ఉన్న మణికంఠేశ్వరస్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం. దీన్ని 11 వ శతాబ్దంలో చోళరాజు కుళొత్తుంగ మహారాజు నిర్మించినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడి ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారట! అద్భుత శిల్పకళ ఈ ఆలయం సొంతం. ఇక్కడ మహాగణపతి, దక్షిణామూర్తి, సూర్యుడు, షణ్ముఖుడు, దుర్గాదేవి విగ్రహాలు ప్రతిష్ఠించారు. ఆలయ గాలి గోపురం, ప్రాకార మండపాల్లో శిల్పకళ ఉట్టిపడే దేవతామూర్తుల ప్రతిమలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. లోపల మరగదాంబిక అమ్మవారి గుడి ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఏటా అమ్మవారి ఆలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు:మణికంఠేశ్వరస్వామి ఆలయంలో ప్రతి గురువారం దక్షిణామూర్తికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ప్రత్యేక అభిషేకం, అర్చనలు చేస్తారు.

*సర్పదోష పరిహారార్థం.. వరదరాజస్వామి ఆలయ నిర్మాణం*

స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి వరదరాజస్వామి ఆలయ నిర్మాణం జరిగింది. గణనాథుని ఆలయానికి ఎదురుగా ఉన్న ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి పురాణాల్లో ఓ కథ ప్రచారంలో ఉంది. జనమేజయ మహారాజు చేపట్టిన సర్పయాగ దోష పరిహారానికిగానూ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ మేరకు ఇక్కడ వరదరాజస్వామి ఆలయం నిర్మితమైనట్టు చెబుతారు. ఆలయంలోని మూలవిరాట్‌ ఆకారంలో సుందరశిల్ప కౌశల్యం ఉట్టిపడుతుంది. ఆలయంలో నిత్యం సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహిస్తుంటారు.

పంచామృతాభిషేకం టిక్కెట్‌ ధర: రూ. 550

*సేవాఫలితం*: స్వామివారిని పంచామృతాలతో అభిషేకం చేయడం పుణ్యఫలం. ఈ సేవల్లో పాల్గొనడం వలన అన్ని కష్టాలు తొలగుతాయి.

గణపతి హోమం టిక్కెట్‌ ధర: 500

*సేవాఫలితం*: ‘కలౌ చండీ వినాయకః’ అంటే ఈ కలియుగమున పిలవగానే పలికే దేవతలు.. చండి(దుర్గా), గణపతి. మన దైనందిన జీవితంలో ఎన్నో విఘ్నాలు, ప్రతి పనికి పోటీ, ఏదో ఒక ఆటంకం జరగవచ్చు. అన్ని విఘ్నాలను అధిగమించాలి. అంటే గణపతిని అగ్నియుక్తంగా పూజించాలి. స్వామివారి సన్నిధిలో గణపతి హోమం చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి. సకల శుభాలు కలుగుతాయి.

గణపతి మోదకపూజ టిక్కెట్‌ ధర: 300

గణపతి పురాణంలో సహస్రనామాల్లో ‘మోదక ప్రియాయనమః’ అని ఉంది. మోదకం అంటే కుడుములు అని అర్థం. హిందువులు ఏ శుభకార్యం చేయాలన్న ముందుగా వినాయకుడికి కుడుములు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయంలో గణపతి మోదక పూజ చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందుతారు.

సహస్ర నామార్చన, వ్రతపూజ టిక్కెట్‌ ధర: రూ. 150, రూ. 58

*సేవాఫలితం:* ‘కలౌ గణేశ’ స్మరణామున్ముక్తి అన్న నానుడిని అనుసరించి స్వామివారికి 1008 నామాలు అర్పించడం వల్ల విశేషఫలం కలుగుతుంది.

మూల మంత్రార్చన టిక్కెట్‌ ధర: రూ. 300

*సేవాఫలితం*: దీనినే నారికేళ పూ అంటారు. వినాయకుని గణాధిపతిగా నియమించిన తర్వాత.. అక్కడ విష్ణుమూర్తి దర్శనమిచ్చారు. వినాయకుడు విష్ణువు చేతిలోని సుదర్శన చక్రాన్ని తీసుకున్నాడు. విష్ణువు అడిగినా తిరిగి ఇవ్వలేదు. దీనికి బదులుగా ఏదైనా వరం కోరుకొమ్మని విష్ణుమూర్తి అంటే త్రినేత్రములు గల శిరస్సు కావాలని గణపతి కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుని సహాయంతో నారికేళాన్ని సృష్టించి ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే గణపతిని అవాహనం చేసి నారికేళంతో పూజిస్తే మహాగణపతి సంతుష్ఠి చెందుతారు. సకల విఘ్నాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.

సంకటహర గణపతి వ్రతం టిక్కెట్‌ ధర: రూ. 151

*సేవాఫలితం*: గణేశ పురానంలో ఈ వ్రతానికి విశేష స్థానం కల్పించారు. దీన్ని శ్రీ కృష్ణుడు, బ్రహ్మదేవుడు తదితరులు ఆచరించారు. సంతానం, వ్యాపార అభివృద్ధి, సకల విఘ్నాలు తొలగడం, ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో జయం కలగడానికి దీన్ని ఆచరిస్తారు.

పూలంగి సేవ టిక్కెట్‌ ధర: రూ. 1,000

*సేవాఫలితం*:

వివిధ రకాలైన పుష్పాలను గర్భాలయం, అంత్రాలయం, అర్ధమండపం, స్వామివారికి విశేష పుష్పాలకంరణ చేస్తారు. రంగుల పుష్పాలతో స్వామివారిని పూజించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం, సౌభాగ్యం కలుగుతాయి.

అక్షరాభ్యాసం టిక్కెట్‌ ధర: రూ. 116

*సేవాఫలితం*:

చదువుల తండ్రి వినాయకుడు. అలాంటి వినాయకుడి ఆలయం వద్ద అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లల చదువులు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో నిత్యం అక్షరాభ్యాసం జరుగుతుంటుంది.

అన్నప్రాసన టిక్కెట్‌ ధర: రూ.116

*సేవాఫలితం*:

పిల్లలకు అన్నప్రాసనం, విశిష్ఠరోజున చేస్తారు. విఘ్నాలను తొలగించే వినాయకుని ఆలయంలో అన్నప్రాసన చేయడం శుభం. ఇక్కడ అన్నప్రాసన చేయడం వల్ల పిల్లలకు జీవితంలో మంచి జరుగుతుంది. మొదటి పూజలు అందుకునే వినాయకుడి ఆలయంలో అన్నప్రాసన చేస్తే మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

వివాహ ఆహ్వానపత్రికలకు పూజలు టిక్కెట్‌ ధర: రూ. 51

*సేవాఫలితం*:

వివాహం చేసుకునే నూతన జంటలకు సంసార జీవితంలో ఎలాంటి ఒడిదొడుకులు జరగకుండా ఉండాలని వినాయకుని చెంత పూజలు చేస్తారు. మొదటి వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి పూజలు చేస్తే విఘ్నాలు తొలగుతాయి.

*వసతి.. రవాణా సౌకర్యాలు*: 

కాణిపాకం గ్రామం చిత్తూరు నుంచి 12 కి.మీ.లు.. తిరుపతి నుంచి 75 కి.మీ.ల దూరంలో ఉంది. అత్యధికులు కాణిపాకం దర్శనం అనంతరం కాకుండా.. అటు తిరుమల.. శ్రీకాళహస్తిల సందర్శనకు వెళ్తుంటారు కనుక.. కాణిపాకంలో బస చేసే భక్తులు తక్కువే. ఒకవేళ ఎవరైనా ఇక్కడ బస చేయాలనుకుంటే.. కాణిపాకం వరసిద్ధి వినాయక దేవాలయం గదులతో పాటు తితిదే ఆధ్వర్యంలోని గదులూ అందుబాటులో ఉన్నాయి. ఇటు జిల్లా కేంద్రం చిత్తూరుతో పాటు అటు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి.

తిరుపతి నుంచి.. చిత్తూరు నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులతో పాటు.. ప్రైవేటు వాహనాలూ విస్తృతంగా లభిస్తాయి.

దగ్గరలోని రైలు.. విమాన మార్గ సదుపాయం అంటే.. తిరుపతినే ప్రధాన కేంద్రంగా చెప్పుకోవాలి.

ఆంజనేయుడు పంచముఖుడు ఎందుకయ్యాడు


                                                                   తలచుకున్నంత మాత్రాన సకల కష్టాలనూ చిటికెలో రూపుమాపేవాడు ఆంజనీ పుత్రుడు. కొలిచినంత మాత్రాన సకల అభీష్టాలనూ నెరవేర్చేవాడు ఆ హనుమంతుడు. మనుమంతుని పంచముఖుని రూపంలో ఆరాధించడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నదే. కానీ ఇదేమీ కొత్తగా చేరిన ఆచారం కాదు! శ్రీరాముని రక్షించడం కోసం ఆంజనేయుడు పంచముఖునిగా మారిన వైనం రామాయణంలోనే కనిపిస్తుంది. ఆనాటి నుంచే ఆంజనేయుని పంచముఖునిగా కొలుచుకునే సంప్రదాయం మొదలైంది.

మైరావణ వృత్తాంతం: రామాయణంలో రావణుడు సీతను అపహరించడం, సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బెడిసికొట్టడం... తెలిసిందే! సీతను చేజిక్కించుకునేందుకు రామరావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది. రాముడు సాధారణ మానవుడే కదా అనుకుంటూ పోరులోకి దిగిన రావణుడు, యుద్ధం గడుస్తున్న కొద్దీ తన సైన్యం పల్చబడిపోవడాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. తన కుమారుడైన ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేలకూలడంతో బెంబేలుపడిపోతాడు. వెంటనే పాతాళలోకానికి అధిపతి అయిన తన బంధువు మైరావణుని సాయం కోరతాడు. మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన హనుమంతుడు వారి చుట్టూ ఎంత కాపలాను ఉంచినా.... అందరి కళ్లూ కప్పి రామలక్ష్మణులను పాతాళలోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు.

హనుమంతుని పయనం: రామలక్ష్మణులను వెతుక్కుంటూ తాను కూడా పాతాళానికి చేరుకుంటాడు హనుమంతుడు. అక్కడ మైరావణుని రాజ్యానికి రక్షగా నిలుచున్న మకరధ్వజుడు అనే వింతజీవిని చూస్తాడు. ఇంతకీ ఆ మకరధ్వజుడు మరెవ్వరో కారనీ... తన శరీరం నుంచి వెలువడిన స్వేదాన్ని ఓ జలకన్య గ్రహించడం వల్ల జన్మించిన తన కుమారుడేనని తెలుస్తుంది. అయినా ఉద్యోగధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు, హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు. ఇరువురి మధ్యా జరిగిన భీకర పోరులో హనుమంతునిదే పైచేయి అవుతుంది.

మైరావణుని సంహారం: మైరావణుని రాజ్యంలో ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధాన్ని ఆరంభిస్తాడు. కానీ ఒక ఉపాయాన్ని సాధిస్తే తప్ప మైరావణునికి చావు సాధ్యం కాదని తెలుసుకుంటాడు. మైరావణుని పురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి చావు మూడదని తెలుస్తుంది. అందుకోసం తూర్పు, పశ్చిమము, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వముఖం... ఇలా అయిదు దిక్కులా అయిదు ముఖాలను ధరించి, అయిదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు. పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం, శూలం, గద వంటి వివిధ ఆయుధాలను ధరించి... మైరావణుని అంతం చేస్తాడు. అతనే పంచముఖాంజనేయుడు.

పంచముఖాల ప్రాశస్త్యం: అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. అలాంటి అయిదు సంఖ్య గురించి చెప్పేదేముంది. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. అలాగే అ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు.

వైశాఖ పర్వం శుభప్రదం


భక్తులందరూ అత్యంత శుభప్రదమైనదిగా భావించే అక్షయ తదియ, పరశురామ జయంతి, సింహాచలం అప్పన్న నిజరూప దర్శనం, బసవేశ్వర జయంతి, శంకర జయంతి, రామానుజ జయంతి, గంగోత్పత్తి, విద్యారణ్య జయంతి, హనుమజ్జయంతి, నారసింహ జయంతి తదితర పర్వదినాలన్నింటికీ ఆలవాలం వైశాఖ మాసం. చంద్రమానాన్ని అనుసరించే ప్రజలు చైత్రశుద్ధ పాడ్యమిని సంవత్సరారంభంగా ఏ విధంగా భావిస్తారో సౌరమానాన్ని ఆచరించే జనులు వైశాఖమాసం మొదలయ్యే రోజును అంటే వైశాఖశుద్ధ పాడ్యమిని సంవత్సరాదిగా భావిస్తారు. వైశాఖమాసంలో ప్రతిరోజూ పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం విశేష ఫలితాన్నిస్తుందని పద్మ పురాణం చెబుతోంది. కార్తీక మాసంలో లాగే స్నానానికి, దానానికి, శుభకార్యాలకీ ఈ మాసం అత్యంత అనువైనది. వైశాఖ స్నానానికి పుణ్యతీర్థం, చెరువు, సరస్సు లేక బావి... వీటిల్లో ఏదైనా యోగ్యమైనదే! సంకల్ప పూర్వకంగా వైశాఖ స్నానాన్ని ఆచరించడం మంచిది. నెల పొడవునా స్నానం చేయలేకపోతే కనీసం శుక్లపక్ష త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ – ఈ మూడు తి«థుల్లో అయినా స్నానం చేయటం సకల పాప క్షయకరం. స్నానం తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో తులసిదళాలతో విష్ణుపూజ చేయాలి. ఈ విధంగా త్రికాలపూజ చేసే వారికి పునర్జన్మ ఉండదని పద్మపురాణ వచనం. వైశాఖంలో సముద్రస్నానం ఎంతో ప్రశస్తమైనదని శాస్త్ర వచనం.

 

ఈ మాసంలో ఏకభుక్త వ్రతాన్ని అంటే ఒక పూట భోజనం చేసి, మరోపూటఏదైనా అల్పాహారం తీసుకుంటూ, విష్ణుపూజ చేసేవారికి కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయని వామన పురాణం చెబుతుంది. పాడి ఆవును, పాదుకలు, చెప్పులు, గొడుగు, విసనకర్ర, శయ్య, దీపం, అద్దం– వంటి వాటిని దానంగా ఇవ్వాలి. వీలైనంత మందికి భోజనం పెట్టి నీటితో నింపిన కలశాలను, యవలను దక్షిణ సహితంగా దానం ఇవ్వాలి. అందుకు శక్తి లేనివారు సంకల్ప సహితంగా స్నానం చేసి, పులగం వండి పదిమందికి భోజనం పెట్టాలి. ఆచారాలపై విశ్వాసం లేకున్నా, వైశాఖంలో చలివేంద్రాలు నిర్వహించటం, బాటసారులకు చెరుకు రసం, మామిడి పండ్లు, దోసకాయలు, మజ్జిగ తేట, సుగంధ ద్రవ్యాలు దానం చేయడం, పేదలకు చెప్పులు, గొడుగు, పల్చని వస్త్రాలు, చందనం, పూలు, పండ్లు, నీటితో నింపిన కుండని దానం చేయటం వల్ల గుండె నిండుతుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

Monday, April 16, 2018

కాలమానము

క్రీస్తుశకం నాలుగవ శతాబ్దానికి చెందినదిగా భావించే సూర్య సిద్ధాంతంలో మూర్త, అమూర్త అని రెండు రకాల కాలమానాలు కనిపిస్తాయి. మూర్త కాలమానంలో ‘ప్రాణ’ (breathing period) అతి చిన్నదైన ప్రమాణం. దానిననుసరించి మిగిలిన కాల విభాగాలు ఇలా ఉంటాయి:

6 ప్రాణ కాలాలు = 1 విఘడియ/వినాడి (24 సెకండ్లు)
60 విఘడియలు/ వినాడి = 1 ఘడియ/నాడి (24 నిమిషాలు)
60 ఘడియలు/నాడి = 1 అహోరాత్రము (24 గంటలు) = 1 రోజు

ఒక ‘ప్రాణం’ అంటే పది గురు (దీర్ఘ) అక్షరాలను పలికే సమయం అన్న నిర్వచనం కూడా ఈ పుస్తకంలో కనిపిస్తుంది.

అమూర్త కాలమానంలో ‘త్రుటి’ అతి సూక్షమైన కాలపరిణామం అని మాత్రమే సూర్యసిద్ధాంత గ్రంథం చెబుతుంది. ఈ గ్రంథంలో ఇంతకుమించి అమూర్త కాలమానం గురించి ఏ వివరాలు కనిపించవు. అయితే, 12వ శతాబ్దానికి చెందిన భాస్కరుడు రాసిన సిద్ధాంత శిరోమణి అన్న గ్రంథంలో అమూర్త కాలమానానికి వివరణ ఇస్తూ ఈ రకమైన కాలవిభజన చూపిస్తాడు:

100 త్రుటి = 1 తత్పర
30 తత్పర = 1 నిమేష
18 నిమేషాలు = 1 కాష్ఠ
30 కాష్ఠాలు = 1 కలా
30 కలలు = 1 ఘటిక
2 ఘటికలు = 1 క్షణ
30 క్షణాలు = 1 అహోరాత్రము

అంటే రోజులో 2916000000వవంతు త్రుటి. అలాగే, ఆధునిక లెక్కల ప్రకారం త్రుటి సెకండులో 33750వవంతు.

అయితే, భాస్కరుని 12వ శతాబ్దం దాకా ఈ రకమైన విభజన లేదని మనం అనుకోవడానికి వీలులేదు. 4వ శతాబ్దం తరువాత వచ్చిన భాగవత పురాణం లోనూ, విష్ణుపురాణం లోనూ ఈ విధమైన సూక్ష్మ కాలచర్చ కనిపిస్తుంది. ఉదాహరణకు, భాగవత పురాణంలో విపులంగా వివరించిన ఈ విభజన చూడండి:

అణుర్ ద్వౌ పరమాణూ స్యాత్ త్రసరేణుస్ త్రయః స్మృతః
జాలార్కరశ్మ్యవగతః ఖం ఏవానుపతన్నగాత్ (3.11.5)

రెండు పరమాణువులు ఒక అణువుగా, మూడు అణువులు ఒక త్రసరేణువుగా భావిస్తారు. ఈ త్రసరేణు కిటికీ గుండా ప్రసరించే సూర్యరష్మిలో ఆకాశం (ఖం) వైపు పైకి పయనిస్తూ మనం గమనించవచ్చు.

త్రసరేణు-త్రికం భుంక్తే యః కాలః స త్రుటిః స్మృతః
శత-భాగస్తు వేధః స్యాత్ తైస్ త్రిభిస్ తు లవః స్మృతః (3.11.6)

మూడు త్రసరేణువుల కలయికకు (భుంక్త) పట్టే కాలాన్ని త్రుటి అంటారు. ఒక వంద త్రుటులను వేధ అని, మూడు వేధాలను లవమని అంటారు.

నిమేషస్ త్రిలవో జ్ఞేయ ఆమ్నాతస్తే త్రయః క్షణః
క్షణాన్ పంచ విదుః కాష్ఠాం లఘు తా దశ పంచ చ (3.11.7)

మూడు లవముల కాలాన్ని ఒక నిమేషము అంటారు. మూడు నిమేషాలు ఒక క్షణమని, అయిదు క్షణాలు ఒక కాష్ఠమని పదిహేను కాష్ఠాలు ఒక లఘువని తెలుసుకోవచ్చు.

లఘూని వై సమామ్నాతా దశ పంచ చ నాడికా
తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్ యామః సప్త వా నృణాం (3.11.8)

పదిహేను లఘువులు ఒక నాడిక. రెండు నాడికలు ఒక ముహూర్తము. ఆరు లేక ఏడు నాడికలు ఒక ప్రహార (లేదా ఒక యామము/జాము)గా నరులు పరిగణిస్తారు.

యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానాం అహనీ ఉభే
పక్షః పంచ-దశాహాని శుక్లః కృష్ణశ్చ మానద

నాలుగుజాములు పగలు, నాలుగు జాముల రాత్రి కలసి ఒక మనుష్యుల అహోరాత్రమౌతుంది. పదిహేను రోజులు శుక్లపక్షంగా, పదిహేను రోజులు కృష్ణపక్షంగా పరిగణిస్తారు.

తయోః సముచ్చయో మాసః పితౄణాం తద్ అహర్-నిశం
ద్వౌ తావ్ ఋతుః షడ్ అయనం దక్షిణం చ ఉత్తరం దివి

ఒక శుక్లపక్షము, ఒక కృష్ణపక్షము కలసి మాసం అవుతుంది. అది పితృ దేవతల కాలమానం ప్రకారం ఒక పగలు, ఒక రాత్రి. అటువంటి రెండు మాసాలు ఒక ఋతువవుతుంది. ఆరు ఋతువులు కలిస్తే ఒక దక్షిణాయనం, ఒక ఉత్తరాయణం.

అయనే చాహనీ ప్రాహుర్ వత్సరో ద్వాదశ స్మృతః
సంవత్సర-శతం నౄణాం పరమాయుర్ నిరూపితం

రెండు అయనాలను కలిపి వత్సరమంటారు. ఇది ద్వాదశ పితృ దినాలు అంటే ద్వాదశ మాసాలకు సమానం. శతసంవత్సరాలు నరుల జీవితకాలమని నిర్ధారించారు.

దాదాపు ఇదే విధమైన కాలమానం విష్ణుపురాణంలోనూ, జ్యోతిషశాస్త్రం లోనూ కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్రాన్ని వేదాంగంగా భావించినా దాని రచనాకాలం దాదాపు క్రీస్తుశక ఆరంభమని పండితుల భావన.

ఋగ్వేదం – కాంతి వేగం

మరి అయితే కాంతివేగం మాటేమిటి? దాని విలువను ఋగ్వేదంలో కచ్చితంగా లెక్కించారని వికీపీడియా ఘోషిస్తోంది కదా?

వికీపీడియాలో ఎంతో ఉపయోగపడే విలువైన సమాచారం ఉన్నా, అంతే నిరుపయోగమైన దుష్ప్రాపగాండా కూడా ఉంది. వికీపీడియాలో పండిత పామర భేదం లేకుండా ఏ వ్యాసాన్ని ఎవరైనా మార్చవచ్చు; ఏ వ్యాసానికి ఏ రకమైన సమాచారానైనా జతచేయవచ్చు. వినోదప్రాయంగా కొంతమంది వికీపీడియాలో తమకు తోచిన అశాస్త్రీయమైన సమాచారం జతచేస్తే, తమ వర్గం/జాతి ఆధిపత్యాన్ని ప్రచారం చెయ్యడానికి మరికొంతమంది పనిగట్టుకొని వికీపీడియాను సాధనంగా వాడుకొంటున్నారు. కాబట్టి వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని ఆ విషయంపై స్థూలంగా తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించి, లోతైన అవగాహనకు ప్రసిద్ధి చెందిన పండితుల/ప్రచురణకర్తల పుస్తకాలను సంప్రదించడం ఎంతైనా శ్రేయస్కరం.

ఇక ఋగ్వేదంలో కాంతివేగాన్ని గురించి తరచుగా ఉటంకించే శ్లోకం ఇది:

తరణిర్విశ్వదర్శతో జ్యోతిష్కృదసి సూర్య।
విశ్వమా భాసి రోచనం ॥ ఋగ్వేదం 1.050.04

దానికి సాయణాచార్యుడు రాసిన భాష్యం ఇది:

తథా చ స్మర్యతే యోజనానాం సహస్త్రం ద్వే ద్వే శతే ద్వే చ యోజనే ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమోఽస్తుతే॥

ఋగ్వేద శ్లోకానికి అర్థం: ఎంతో వేగంగా పయనిస్తూ అందమైన వెలుగును సృష్టించేవాడా! విశ్వమంతటా వెలుగును పంచేవాడా! ఓ సూర్యుడా!

సాయణుడు రాసిన భాష్యానికి అర్థం: నిమిషార్ధ సమయయంలో 2,202 యోజనాలు ప్రయాణం చేసే సూర్యునికి నమస్సులు!

నిజానికి ఋగ్వేదశ్లోకంలో కాంతివేగం గురించి గానీ, దాన్ని విలువకట్టే ప్రయత్నం కానీ కనిపించదు. అయితే 14వ శతాబ్దికి చెందిన సాయణుడు రాసిన భాష్యంలో మాత్రం సూర్యుని వేగానికి ఒక విలువ ఆపాదించే ప్రయత్నం కనిపిస్తుంది. ఆయన భాష్యం ప్రకారం సగం నిమిషంలో 2,202 యోజనాలు సూర్యుడు ప్రయాణం చేస్తాడని చెబుతున్నాడు. నిజానికి ఇక్కడ ఆయన కాంతి వేగం గురించి చెప్పలేదు. సూర్యకాంతి వేగం అనికూడా చెప్పలేదు; సూర్యుని వేగం అని మాత్రమే ప్రస్తావించాడు. కానీ, ఆయన సూర్యుని వేగం అన్నప్పుడు అది సూర్యకాంతి వేగం అయ్యే అవకాశం ఉందని మనం భావించవచ్చు.

అయితే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిమేషమన్న కాలమానానికి, యోజనమన్న దూరానికి కచ్చితమైన విలువలు లేవు. యోజనం 9.6 కిలోమీటర్ల నుండి 14.4 కిలోమీటర్ల వరకూ ఉండవచ్చు. నిమేషము వివిధ గ్రంథాలను బట్టి 0.213 సెకండ్లు, 0.457 సెకండ్లు, 0.533 సెకండ్లు గానో లెక్క కట్టవచ్చు. ఈ విభిన్నమైన విలువలను బట్టి మనం సూర్యుని వేగం సెకండుకు 118 మిలియన్ల మీటర్లు గానో, 138 మిలియన్లు, 297 మిలియన్ల మీటర్లుగా నిరూపించవచ్చు. ఈ విలువ లెక్కగట్టడానికి సాయణుడు కానీ, అతని పూర్వులు గాని అవలంభించిన విధానమేమిటో బొత్తిగా బోధపడదు. అదీగాక ఒకవేళ సాయణుడు కాంతివేగపు విలువను నేటి ఆధునిక శాస్త్రవేత్తలు లెక్కగట్టిన 299.792 మిలియన్ల వేగానికి దగ్గరిగానే లెక్క కట్టినాడని నమ్మినా అది 600 సంవత్సరాల లెక్కే అవుతుంది గానీ, ఋగ్వేదపు లెక్క కాదు కదా!

అన్నమయ్య “కంటి శుక్రవారము ఘడియలేడింట” అన్న పాటలో ‘ఘడియలేడింట’ అన్నప్పుడు ఏ సమయాన్ని సూచిస్తున్నాడు?

అలాగే,

పాడేము నేము పరమాత్మ నిన్నును
వేడుక ముప్పదిరెండువేళల రాగాలను

అన్నప్పుడు ఆయన చెబుతున్న ‘ముప్పదిరెండు వేళల రాగాలు’ ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో …

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

జాతకచక్రంలో సంతాన స్ఫుటం పరిశీలన

సంతానం కలుగక సమస్యలు అనుభవిస్తున్న దంపతుల జాతకాలను పరిశీలించి వారికి సంతాన సమస్యలు ఉన్నది లేనిది  సంతాన స్ఫుటం ద్వారా నిర్ణయించవచ్చును. దంపతుల జాతకచక్రములలోని గ్రహ స్ఫుటాలను వేరు వేరుగా తీసుకోవాలి. స్త్రీ జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని “క్షేత్రస్ఫుటం” అంటారు. పురుష జాతకచక్రం ఆధారంగా వేసే స్ఫుట నిర్ణయాన్ని “బీజస్ఫుటం” అంటారు. స్ఫుటం 360° డిగ్రీల కంటే ఎక్కువ వస్తే వచ్చిన స్ఫుటం నుండి 360° తీసివేయాలి. క్షేత్రస్ఫుటం లో క్షేత్రం అనగా “గర్భం” నిలిచి ఉండే స్ధానం. బీజస్ఫుటంలో బీజం అనగా “వీర్యం” అంటారు. బీజ, క్షేత్ర స్ఫుటములపైన, బీజ, క్షేత్ర స్ఫుట స్ధానముల నుండి పంచమ స్ధానం పైన పాపగ్రహాల, నపుంసక గ్రహాల దృష్టి ,యుతి లేక పోవటం మంచిది. బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురుదృష్టి,,యుతి. ఉండటం మంచిది. గోచారంలో బీజ, క్షేత్ర స్ఫుటములపైన గురు సంచారం గాని, దృష్టి గాని ఉన్నప్పుడు సంతానం కలగటానికి మంచి సమయంగా గుర్తించాలి.

క్షేత్ర స్ఫుటం:-సంతానకారకుడు గురువు, రక్తమాంసాలకు కుజుడు, సంతానం కనటానికి కావలసిన బలమును చంద్రుడు సూచిస్తాడు. కుజుడు, చంద్రుడు సరి రాశిలో ఉన్న బలం కలిగి ఉంటాయి. స్త్రీ జాతకచక్రంలోని చంద్రగ్రహ, కుజగ్రహ, గురుగ్రహ స్ఫుటములను మేషరాశి నుండి రాశి-భాగ-లిప్తలతో సహా తీసుకొని మూడుగ్రహ స్ఫుటాలను కలుపగా వచ్చిన స్ఫుటం రాశిచక్రంలో సరి రాశిని, నవాంశచక్రంలోను సరి రాశిని, అదే విధంగా సప్తమాంశ వర్గచక్రంలోను సరి రాశిని తెలియజేస్తే ఆ స్త్రీకి సంతానం కలుగుటలో బలం కలిగి ఉంటుంది. మూడు చక్రాలలోను వేరు వేరుగా సరి, బేసి, సరి వస్తే కొన్ని పరిహారాల ద్వారా సంతానం పొందవచ్చును. అలా కాక మూడు చక్రాలలోను బేసి రాశులను తెలియజేస్తే సంతాన అవకాశాలు తక్కువ.

బీజస్ఫుటం:- సంతాన కారకుడు గురువు, గర్భాధారణకు బలమును కలుగజేయు గ్రహం రవి, వీర్యమును సూచించు గ్రహం శుక్రుడు. రవి, శుక్రుడు బేసిరాశిలో ఉన్న బలం కలిగి ఉంటాయి. పురుష జాతకచక్రంలోని సూర్యగ్రహ, శుక్రగ్రహ, గురుగ్రహ స్ఫుటములను  మేషరాశి నుండి రాశి-భాగ-లిప్తలతో సహా తీసుకొని మూడుగ్రహ స్ఫుటాలను కలుపగా వచ్చిన స్ఫుటం రాశిచక్రంలో బేసి రాశిని, నవాంశచక్రంలోను బేసి రాశిని, అదే విధంగా సప్తమాంశ వర్గచక్రంలోను బేసి రాశిని తెలియజేస్తే ఆ పురుషుడికి సంతానం కలుగుతుంది. మూడు చక్రాలలోను వేరు వేరుగా బేసి, సరి, బేసి వస్తే కొన్ని పరిహారాల ద్వారా సంతానం పొందవచ్చును. అలా కాక మూడు చక్రాలలోను సరి రాశులను తెలియజేస్తే సంతాన అవకాశాలు తక్కువ.

రాశి, నవాంశ, సప్తమాంశ చక్రాలలో వేరు వేరుగా వచ్చిన, స్త్రీకి మూడు చక్రాలలోను బేసి రాశులను, పురుషుడికి మూడు చక్రాలలోను సరి రాశులను తెలియజేసిన  లేదా బీజం (పురుషులలో) బలహీనంగా ఉండి క్షేత్రం (స్త్రీలలో) బలంగా ఉన్న ఆ గ్రహాలకు వర్తించు ఔషదాలు, దానాలు, జప, హోమ, పూజా అర్చనాదుల ద్వారా సంతానం పొందే అవకాశం ఉంది.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...