Monday, April 16, 2018

శ్రీ గురు సూక్తము


   ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయాక్లిష్టకారిణే, నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే||ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో, వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః|| ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే, నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః|| ఓం హయాస్యాద్యవతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః, కృతార్ధతాంగతాస్తాంవై నారాయణముపాస్మహే||

               ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః, చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువంభజే|| ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మవిద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః, తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం|| ఓంయోగజ్ఞం యోగినావర్యం బ్రహ్మజ్ఞానవిభూషితం, శ్రీమద్వశిష్ఠతనయం శక్తింవందే మహామునియే|| ఓం ధర్మజ్ఞంధార్మికం ధీరం ధర్మాత్మానందయానిధిం, ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశరమునింభజే|| ఓం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం, వేదాబ్జభాస్కరం వందేశమాదినిలయం మునిం|| ఓం పరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్రమకల్మషం, నిత్యవైరాగ్యసంపన్నం జీవన్ముక్తమ్ శుకంభజే|| ఓం మాండూక్యకారికాకర్తా యోభాతిబ్రహ్మవిద్వరః, శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహుః|| ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధింమునిం గోవిందభగవత్పాదాచార్యవర్య ముపాస్మహే || ఓం హరలీలావతారాయ శంకరాయపరౌజసే, కైవల్యకలనా కల్పతరవే గురవేనమః|| ఓం బ్రాహ్మణే మూర్తిమతే శృతానాంశుద్ధిహేతవే, నారాయణయతీన్ద్రాయ తస్మై గురవేనమః||   

              సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం, అస్మదాచార్యపర్యంతం వందేగురుపరంపరాం|| ఓం సచ్చిదానందరూపాయ శివాయపరమాత్మనే, నమో వేదాంతవేద్యాయ గురవేబుద్ధిసాక్షిణే|| ఓం నిత్యానందైకకందాయ నిర్మలాయచిదాత్మనే జ్ఞానోత్తమాయ గురవే సాక్షిణే బ్రాహ్మణేనమః||

              గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞానసంభవః, విజ్ఞానంయత్ప్రసాదేన గురుశబ్దేనకథ్యతే|| స్వదేశికస్వైవచ నామకీర్తనమ్ భవేదంతస్య శివస్యకీర్తనమ్,  స్వదేశికస్వైవచ నామచింతనం భవేదంతస్య శివస్యచింతనం|| కాశిక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం, గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః|| గురుసేవా గయాప్రోక్తా దేహసాక్షాదక్షయోవటః, తత్పాదం విష్ణుపాదంస్యాత్ తత్ర దత్తమచస్తతం|| స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిమ్ పుష్ఠివర్ధనం, ఏతత్సర్వం పరిత్యజ్య గురురేవ సమాశ్రయేత్|| గురువక్త్రే  స్థితావిద్యా గురుభక్త్యాచ లభ్యతే, త్రైలోక్యేస్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః|| గుకారశ్చగుణాతీతో రూపాతీతోరుకారకః, గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే|| గుకారః ప్రధమవర్ణో మాయాదిగుణభాసకః, రుకార్యోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం||

              సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజం, వేదానార్ధప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుమ్|| యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతేస్వయం, సః ఏవ సర్వ సమ్పత్తిః తస్మాత్ సంపూజయేత్ గురుమ్|| సంసారవృక్షమారూఢాః పతన్తినరకార్ణవే, యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవేనమః|| ఏకఏవ పరోబంధుర్విషయే సముపస్థితే, గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవేనమః||  భవారణ్య ప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంతచేతసః, యేన సందర్శితపంథాః తస్మై శ్రీగురవేనమః|| తాపత్రయాగ్నితప్తానాం అశాంతప్రాణినాం భువి, గురురేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః|| శివేరుష్టే గురుత్రాతా గురౌరుష్టే నకశ్చినః, లబ్ద్వాకులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్|| అత్రినేత్రశివః సాక్షాత్ ద్విబాహుశ్చహరిఃస్మ్రుతః యో-చతుర్వదనోబ్రహ్మ శ్రీగురుః కధితప్రియే|| నిత్యంబ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరమ్, భాసయన్ బ్రహ్మభావంచ దీపోదీపాన్తరం యథా||

            గురోర్ ధ్యానేనైవనిత్యం దేహీబ్రహ్మమయోభవేత్, స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తాసౌనాత్రిసంశయః|| జ్ఞానంవైరాగ్యమైశ్వర్యం యశఃశ్రీః సముదాహృతం, షడ్గుణైశ్వర్య యుక్తోహి భగవాన్ శ్రీగురుః ప్రియే|| గురుః శివో గురుః దేవో గురుర్బన్ధుః శరీరిణామ్, గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే|| యతః పరమకైవల్యం గురుమార్గేణ వైభవేత్, గురుభక్తి రతిఃకార్యాః సర్వదా మోక్షకాంక్షిభిః|| గురుర్దేవో గురుర్ధర్మో గురౌనిష్టా పరంతపః, గురోః పరతరంనాస్తి త్రివారం కధయామితే||

         నమో నమస్తే గురవే మహాత్మనే విముక్తసఙ్గాయ సదుత్తమాయ, నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా--పార దయామ్బుదామ్నే|| శిష్యాణామ్ జ్ఞానదానాయ లీలయాదేహధారిణే, సదేహోసి విదేహాయ తస్మై శ్రీగురవేనమః|| రాగద్వేషవినుర్ముక్తః కృపయాచ  సమన్విత, సమయానాంచ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ|| గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః, న గురోరధికం కశ్చిత్రిషులోకేషు విద్యతే|| దివ్యజ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం, పూజయాత్పరయా భక్త్యా తస్యజ్ఞానఫలంభవేత్||

      గురురేవపరబ్రహ్మ గురురేవపరాగతిః గురురేవపరావిద్యా గురురేవపరాయణం, గురురేవపరాకాష్ఠా గురురేవపరంధనం యస్మాత్తదుపదేష్టా సౌ తస్మాత్గురుతరోగురుః|| గురుభావపరంతీర్థం మన్యతీర్థం నిరర్థకం, సర్వతీర్థమయందేవి శ్రీగురోశ్చరణామ్బుజం|| సప్తసాగరపర్యంతం తీర్థస్నానఫలంతుయాత్, గురుపాద పయోబంధోః సహస్రాంశేన తత్ఫలం|| శోషణం పాపపంకస్య దీపనమ్ జ్ఞాన తేజసః,   గురోఃపాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం||

            "అజ్ఞానమూలహరణం జన్మకర్మనివారకం, జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్"

                   "ఇతి సంకలిత 'శ్రీ గురుసూక్తం' సమాప్తం"

                               "ఓం శాన్తిః శాన్తిః శాన్తిః"

మనుష్య జీవితం- పరమార్ధం

ఏబంధాలు లేకుండా ఏకాకి గా తపమాచరించు
ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి
మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు. నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో... అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాటి హితవు ఒకటి ఉండాలి.
ఇంతకీ రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు.

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

Sunday, April 15, 2018

శాశ్వత సత్యాలు

మనకేం కావాలో తెలియనపుడు ఎన్ని శాస్ర్తాలు నేర్చుకున్నా ప్రయోజనం లేదు. ఏ శాస్ర్తం గొప్పది, ఏ మార్గం గొప్పది, ఎవరు గొప్పవారు‌ అనే ప్రశ్నలు మానవుని ఆచరణ శూన్యతకు, పతనానికి కారణాలు.

భగవంతుని కన్నా శాస్ర్తమే ఎక్కువ. అనే వెర్రిలో పడరాదు. భగవంతుడిని మరువలేని శాస్త్రమే కావాలి. భగవంతుడు లేడు లేడు అని అరుస్తుంటారు కొంతమంది. అలా అంటూనే మరల భగవంతుణ్ణి తిట్టే వారు కూడా ఉన్నారు. మనకీ భగవంతునికి మధ్య పొరలు తొలగాలంటే మిగిలిన జీవులకు మనకు మధ్య పొరలుండరాదు.

మనం ఉండటం అంటే మనము ఉన్నట్లు అనిపించడమే గాని అదికాక మనం అంటే ఏమిటో చెప్పు? ఎవడి అస్తిత్వము వాడికి ఉండడమే ఉండటం.

నువ్వు సర్వ శక్తి సంపన్నుడవు అంటే ఒక్కొక్కడు అంగీకరించడు . ఎందుకో తెలుసా? అలా అని నమ్మితే ఆ శక్తిని సద్వినియోగం చేయవలసిన బాధ్యత తన నెత్తిన పడుతుందేమోనని.

ఒక్కొక్కడికి తోచదు ఎవరైనా చెపుతూ ఉంటే వినడు. వినగలిగే మంచితనం, సహనం ఉండాలి. వినడానికి అహంకారం పడక, బుద్ధి గలిగి వినగలిగితే వినే ప్రతిమాట మంత్రమే-- మార్గమే.

తెలిసి తప్పు చేసినవాడు, ఇతరుల తప్పులను పట్టుకు కూర్చునే వాడు, చేసిన తప్పులను గూర్చి తపస్సు‌ చేసేవాడు, శరీరం మీద అభిమానం, మృత్యుభీతి ఉన్న వాడు బ్రహ్మ విద్యకు అర్హుడు కాడు.......

........✍🏻 గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

సదా స్మరణీయులు మన సప్త ఋషులు

కశ్యపోత్రి భరద్వాజాః విశ్వామిత్రోథ గౌతమః!*
వశిష్టో జమదగ్నిశ్చ సప్తైతే ఋషయః స్మృతాః!!*

భారతీయ పరంపరాగత ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉన్నాడు. ప్రాచీన రుషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ రుషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ రుషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు రుషులున్నారు.
ఎంతోమంది రుషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు,
2.అత్రి,
3.భరద్వాజుడు,
4.విశ్వామిత్రుడు,
5.గౌతముడు,
6.జమదగ్ని,
7.వసిష్ఠుడు...

వీరు ఏడుగురు పూజనీయులు.

రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు. వ్యాసుడు నాలుగు తలలు లేని బ్రహ్మ, రెండు బాహువులు గల విష్ణువు, మూడో కన్ను లేని శివుడని అంటారు.

1. సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి (మరీచి కళల పుత్రుడు)

దక్షప్రజాపతి పుత్రికల్లో పదమూడు మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్షలతాత్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2. సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి:*

బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3. భరద్వాజుడు :*

ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4. విశ్వామిత్రుడు రాజర్షి:*

త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5. గౌతముడు:*

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు రుషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర రుషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6. జమదగ్ని రుషి:*

రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశాడు.

7. ఏడో రుషి వసిష్ఠుడు:*

ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.

సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు. ఏడు సముద్రాలు, ఏడు కుల పర్వతాలు, ఏడుగురు రుషులు, ఏడు ద్వీపాలు, ఏడు భువనాలు, ప్రాతఃకాల స్మరణతో శుభాలను కలగజేస్తాయంటారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

Friday, April 13, 2018

శని త్రయోదశి ప్రాముఖ్యత

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.

జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది.

బౌతిక దృష్టి లో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిస్పక్షపాతం గా ఉన్న న్యాధిపతి లా శని దండన విధిస్తాడు.

శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది.

క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలాహలాని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.

ఆ సమయం లో శివుడు , మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడంట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది.

ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం చంద్రున్ని దోషాకరుడు అని అంటారు,రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం ప్రదోషమంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం.

ప్రదోష కాలం లో చేసే పూజాపునస్కారాలు దానధర్మాలు మామూలు సమయం లో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి, అలాగే ఈ సమయం లో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషం గా లబిస్తుంది.

ఈ సమయం లో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం అవి :

నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.

శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు
(నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,
ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం)

అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలిమద్యమాంసాదులను ముట్టరాదు.
వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము.

శనీశ్వర గాయత్రి:
“ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్‌”
(శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను)

ఈ విధం గా శని ని పూజించి ఆరాదిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయి.

పూర్వజన్మ కర్మ ఫలం:
ఓ వ్యక్తి పూర్వ జన్మలో చేసిన కర్మల ఫలితాలనే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తీ తన మహర్దశ, అంతర్దశలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాలనుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్ట్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహముంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు. ఆయన గనుక పట్టుకు న్నాడంటే అమీరులయినా బికారులవడం ఖాయం. అయితే, ఇక్కడ గుర్తుంచుకోవలసిన అంశం. చెడు కార్యాల్లో నిమగ్నమైనవారినే శనీశ్వరుడు పీడిస్తాడు.

ఫలితం అనుభవించాల్సిందే:
ఎంత దైవాంశసం భూతులైనా వారి వారి కర్మలననుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడుకార్యాలకు పాల్పడినవారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడు కర్మలకు సాక్షి అయితే, శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భంనుంచి వెలువడిన మరుక్షణం నుంచీ అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసినవారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకోనివారు శని భగవానుని క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శని దేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం. అలుపు సొలుపూ లేకుండా బిజీగా ఉండే లైఫ్‌లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి.

భయపెట్టే దేవుడు కాదు:
భగవంతుడు శనిదేవుణ్ణి జీవరాసుల కర్మల ఫలితాలను ఇచ్చే వర్రపదాయినిగా బాధ్యతలు అప్పగించాడు. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా, ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాతబుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ, భయపడకూడదు. ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశపారంపర్య లక్షణాలను వదులుకోడు. శని భగవానుడు మహర్షి కశ్యపునకు మనవడు. కశ్యపాత్మజుడైన సూర్యభగవానుడికి కుమారుడు. ఈ చుట్టరికమే ఆయనను మిగతా దేవతలకన్నా ప్రత్యేకమైనవాడిగా చేసింది. శనిదేవుడు మంచి మార్గంలో నచిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని బంధుగణమంతా గొప్ప అధిదేవతలు. సూర్యునికి కుమారుడు, విష్ణువు అంశ అయిన శనీశ్వరుడికి సంధ్య, ఛాయలు మాతృమూర్తులు. మను సౌవర్ణి, యమధర్మరాజులు సోదరులు. యమున, భద్ర నదులు సోదరీమణులు. వీరందరిలోని దైవాంశలు కలిగిన శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి.

ఓర్పు, సహనం ముఖ్యం:
మంచికన్నా చెడు రాజ్యమేలే కలియుగంలో శని అనుగ్రహం సంపాదిం చాలంటే, ఓర్పు సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాల నుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగినా చివరకు దక్కించుకునేది అశాంతినే! తాత్కాలిక విజయాలు సాధించినవారు శనిమహరాజు కోర్టులో తప్పక శిక్షించబడతారు. ఆయన కోర్టులో లంచాలకు, రికమెండేషన్లకు తావులేదు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే! అక్కడ ఏ దేవుడూ శనీశ్వరుడి బారినుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు. కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచిపనులు, ప్రార్థనలు, భక్తియుతులనే పిటిషన్లు తప్ప ఏవీ పనిచేయవు. శనిభగవానుడి తీర్పు సుప్రీంకోర్టు తీర్పేనని గుర్తుంచుకోవాలి. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసినవారిని పట్టి పీడించడంద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగేవారిని నేలకు దించుతాడు. స్వర్ణకారుడు పుటం వేసి బంగారాన్ని కాల్చి నగలను తయారు చేసినట్లుగా...శనీశ్వరుడు మానవుల్లోని మాలిన్యాన్ని కడిగేస్తాడు.

శని దండనాధికారి:
జ్యోతిష్య శాస్తర్రీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. బౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...