Friday, April 6, 2018

గుడికి ఎందుకు వెళ్ళాలి?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

పెద్దలను అర్ధం చేసుకోకుండా‌ అపార్ధం చేసుకోకండి


పూర్వము *భారవి అనే కవి వుండేవాడు.*
ఆయన చిన్నతనం లోనే కవిత్వం చెప్పేవాడు. కావ్యాలు వ్రాసేవాడు.
ఊర్లో వాళ్ళంతా చాలా మెచ్చుకునేవారు. 

భారవి తండ్రితో నీకొడుకు చాలా బాగా వ్రాస్తాడయ్యా అనేవారు.  

ఆయన  మాత్రం వాడింకా చిన్నవాడు యింకా నేర్చు కోవలిసింది చాలా వుంది. ఏదో వ్రాస్తాడులే అనేవాడు.

*భారవికి తండ్రి తనను మెచ్చుకోవడం లేదని చాలా అసంతృప్తి.*

తల్లి దగ్గర నాన్నగారు నన్ను తీసిపారేసినట్టు మాట్లాడుతారు.
వూర్లో వారంతా నన్ను మెచ్చుకుంటూ వుంటే తనేమో ఏమున్నది
యింకా వాడు చిన్నవాడు అన్నట్టు మాట్లాడుతారు.
అని చాలా సార్లు చెప్పుకున్నాడు.

 *ఎన్నాళ్ళయినా తండ్రి ధోరణి మారక పోయే సరికి భారవికి  తండ్రిమీద కసి పుట్టింది, ఆయనను చంపాలని నిశ్చయించుకున్నాడు*

 ఒకరోజు రాత్రి ఆయన వంటింట్లో భోజనం చేస్తున్నాడు
భార్య వడ్డిస్తూ వుంది.

 *భారవి, ఆయన పెరట్లోకి చెయ్యి కడుక్కునేందుకు వస్తే చంపెయ్యాలని పెద్ద బండరాయి పట్టుకొని పెరట్లో ఒక పక్క కాచుకొని కూర్చున్నాడు*

 అప్పుడు భారవి తల్లి భర్తతో మీరెందుకు వాడిని అస్తమాను చిన్నబుచ్చినట్లు మాట్లాడుతారు?వాడు చాలా బాధ పడుతున్నాడు. 

*వూరు ఊరంతా వాడిని మెచ్చుకుంటూ వుంటే మీరు మాత్రం వాడికేమీ తెలీదని అంటారట!*

అప్పుడు *తండ్రి నవ్వి.... పిచ్చిదానా! నాకు మాత్రం వాడిని చూసి గర్వంగా లేదనుకున్నావా?తండ్రి పొగిడితే బిడ్డకు ఆయుఃక్షీణం అంటారు. అంతే కాకుండా పొగడ్త మనిషిని పాడు చేస్తుంది, వాడి అభివృద్ధికి ఆటంకమవుతుంది. ఇంకా  యెంతో పైకి రావలిసినవాడికి గర్వం పెరిగి తనంతవాడు లేడని విర్రవీగుతాడు, దానితో వాడి అభివృద్ధి ఆగిపోదా? అన్నాడు.*

 అదివిని భారవికి బుర్ర తిరిగి పోయింది.

 *పశ్చాత్తాపంతో రగిలి పోయాడు. వెంటనే బండ అక్కడ పారవేసి లోపలికి వెళ్లి తండ్రి పాదాలమీద పడి భోరున ఏడ్చాడు.*

తాను తండ్రిని చంపాలనుకున్న విషయం చెప్పి నాకేదయినా శిక్ష వేయమని బ్రతిమాలుకున్నాడు.

 "పశ్చాత్తాపం తో నీపాపం పోయింది! శిక్ష ఎందుకు? అని తండ్రి చెప్తున్నా వినకుండా  తనకు శిక్ష వేయమని పట్టు బట్టాడు".

తండ్రి సరే అలాగయితే మీ అత్తవారింట్లో ఒక సంవత్సరం ఎవరికీ, చివరికి నీ భార్యకు కూడా ఎందుకు, ఏమిటి, ఏ కారణాలు చెప్పకుండా అక్కడవుండి రా! అన్నాడు. 

*ఇంత  చిన్న శిక్షనా? అన్నాడు భారవి.*

తండ్రి నవ్వి అది చాల్లే వెళ్ళుఅన్నాడు.

 *భారవికి చిన్నతనంలోనే పెళ్లయింది. అప్పటికి యింకా  భారవి భార్య కాపురానికి రాలేదు.*

 సరేనని భారవి అత్తగారి వూరికి వెళ్ళాడు.
వాళ్ళు అల్లుడుగారు వచ్చారని చాలా మర్యాద చేశారు.

రోజుకో పిండివంట చేసి ఆదరించారు.నెల రోజులు గడుస్తున్నా అల్లుడు వెళ్ళటం లేదేమని
వాళ్ళు విసుక్కున్నారు.

 చిన్న చిన్న పనులు చెయ్యమని చెప్పడం ప్రారంభించారు. మర్యాదలు తగ్గాయి. బావ మరుదులు పొలం పనులు కూడా పురమాయించారు.

*అందరూ విసుక్కుంటూ మాట్లాడేవారు..*

దేనికీ బదులు చెప్పకుండా విసుక్కోకుండా అన్ని పనులు చేసేవాడు. 

*అతని భార్యను కూడా పొలం పనులకు పంపేవారు.భారవి భార్యకు చాలా బాధగా వుండేది. భర్తకు ఆవిడ మీరు మీ ఊరు వెళ్లిపోండని  యెంతో చెప్పి చూసింది.*

 భారవి సమాధానం చెప్పకుండా మౌనం వహించేవాడు. 

*ఇలా సంవత్సరం గడిచింది. అప్పుడు భారవి యింక నేను  మావూరికి పోయివస్తానని బయల్దేరాడు.*

 ఇంత  హఠాత్తుగా  ఎందుకు వెళ్లాలని అంటున్నాడో వాళ్లకు అర్థం కాలేదు. 

*భార్యకు, అత్తామామలకూ  విషయం వివరించి నాశిక్ష పూర్తి  అయింది అందుకని వెళుతున్నాను అని చెప్పాడు.*

 ఇది విని వాళ్ళు తమ ప్రవర్తనకు సిగ్గుపడ్డారు.

 *భారవి తనతండ్రి వేసిన శిక్ష తనలో ఎంతో ఓర్పును, నేర్పును, సహనాన్ని, అవగాహనను పెంచాయని గ్రహించాడు.*

తండ్రిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి! మీ అభివృద్ధిని కోరుకునే వారిలో ఆయనే ప్రథముడు. 

*చిన్నప్పుడు తల్లి కోప్పడిందని, తండ్రి దండించాడని వారి మీద కోపం పెంచుకోకండి!*

 అదంతా మీరు బాగుపడాలనీ, వృద్ధి లోకి రావాలనీ చేసి వుంటారని గుర్తు పెట్టుకోండి!

 "తల్లిదండ్రులను ద్వేషించకండి!
అంతకంటే పాపం
ఇంకోటి వుండదు"

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

కేశవ నామాలు-గణిత భూమిక


విష్ణుమూర్తికి24పేర్లున్నాయి.వాటిని  కేశవనామాలంటారని మనకు తెలుసు.ఇవి 24మాత్రమే ఎందుకు ఉన్నాయి?వీటికి కాలచక్రానికి,గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?చూద్దాం.

* విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా. ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.

* కేశవ నామాలలో మొదటి నామం కేశవ.కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో పద్మము, శంఖము ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో గద,చక్రం ధరించి ఉంటాడు.

* విష్ణువు యొక్క మరొక నామము మాధవ.ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతోగద,చక్రం ధరించి, ఎడమవైపు ఉన్న రెండు చేతులతో పద్మము,శంఖము ధరించి ఉంటాడు.

* మధుసూధన రూపంలో కుడివైపు చేతులతో చక్రం, శంఖము మరియు ఎడమవైపు చేతులతో గద,పద్మము ధరించి ఉంటాడు.

* ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు(పక్షానికొకసారి) పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.

* ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో ప్రస్తారాలు(permutations) అంటాం.అనగా 4 వస్తువులను 4! (4 factorial) విధాలుగా అమర్చవచ్చు.
4! = 4×3×2×1=24
శంఖాన్ని 'శ' తోను, చక్రాన్ని 'చ' తోను, గదను 'గ' తోను,పద్మాన్ని ' ప'తోను సూచిస్తే,ఆ 24 అమరికలు యీ క్రింది విధంగా వుంటాయి.

* 1) శచగప 2) శచపగ 3) శపచగ 4) శపగచ5)శగచప 6)శగపచ

* 7)చపగశ 8)చపశగ 9)చగపశ 10)చగశప
11)చశగప 12)చశపగ

* 13)గపశచ 14)గపచశ 15)గచశప 16)గచపశ 17)గశపచ 18)గశచప

* 19)పచగశ 20)పతశగ 21)పశగచ 22)పశచగ 23)పగశచ 24)పగచశ.

( పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.)

* ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌,మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.
      కేశవ,నారాయణ, మాధవ, గోవిందా, విష్ణు, మధుసూధన,త్రివిక్రమ,వామన,శ్రీధర,హృషీకేశ,పద్మనాభ, దామోదర, సంకర్షణ,వాసుదేవ,అనిరుధ్ధ,ప్రద్యుమ్న,పురుషోత్తమ, అధోక్షజ,నారసింహ, అచ్యుత, జనార్ధన,ఉపేంద్ర, హరి,శ్రీకృష్ణ.

ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 24 పక్షాలు అంటే 12 నెలలు అనగా ఒక సంవత్సరం పడుతుంది.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

మెడిటేషన్


ఆత్మ స్వరుపులందరికి ఆత్మాభివందనములు .
ఈ పృద్వి మీద ఏ వస్తువుకైనా చలనము కావాలంటే శక్తి కావలి .ఈ ప్రకృతి అంతా శక్తి మయమే .పంచ భూతాలైన భూమి ,నీరు ,అగ్ని ,వాయువు ,ఆకాశము వివిధ శక్తి స్వరూపాలే .ఒక విత్తనము మొలకెత్తాలంటే పృథ్వి శక్తి ,జలశక్తి కావలి .ఈ రెండు లేకుంటే విశ్వమే లేదు .ఈ సకల చరాచర జీవులలో కొన్ని జీవరాశులకు మాత్రమే ఆలోచనా జ్ఞానం కలిగి ఉన్నవి .అందులో మానవులకు మాత్రమే అత్యంత ఙ్ఞాన సముపార్జన ,ఆలోచనా శక్తి ఈ విశ్వము ప్రసాదించింది .ఎంత శక్తి వున్నా అది సక్రమముగా పనిచేయాలంటే శరీరంలో ఉన్న శక్తి కేంద్రాలన్నీ సార్ధవంతముగా పనిచేయాలి .

మనవ శరీరంలో కొన్ని సున్నితమైన పాయింట్లు ఉన్నాయి .వాటిని 7 శక్తి కేంద్రాలు అంటారు .వాటినే చక్రాస్ అంటారు .మహ యోగులెందరో ఈ చక్రాలను పద్మలుగా అభివర్ణిస్తారు .వీటినే షట్చక్రాలు అంటారు .

1 . మూలాధార చక్రం
2 . స్వాధిష్ఠాన చక్రం
3 . మణిపూరక చక్రం
4 . అనాహత చక్రం
5 . విశుద్ధి చక్రం
6 . ఆజ్ఞ చక్రం
7 . సహస్రార చక్రం
ఈ చక్రాలు భౌతికంగా మానవ శరీరంలో అనేక జీవ ప్రక్రియలను నిర్దేశిస్తాయి .ఈ చక్రాలు మనిషి బౌతికంగా గాని ,ఆధ్యాత్మికముగా గాని పరిపూర్ణత సాధించడానికి దోహదం చేస్తున్నాయి .ఈ చక్రాలను ఎప్పటికపుడు శక్తివంతం చేసుకుంటూ  ఉండాలి .అవసరమైన యోగాసనములు ,ప్రాణాయామములు ,మనస్సు పరిశీలన ,ఆత్మపరిశీలన ద్వారా ఈ చక్రాలను శక్తివంతము చేసుకొవలెను .

మనిషి నిరంతరమూ శరీరమే నేను అనుకుంటూ నేను అని అహంకరించుకుంటూ ,ఎందుకు పుట్టాడో ,ఎందుకు బ్రతుకుతున్నాడో ,ఎందుకు కష్టాలు వస్తున్నాయో ?,ఎందుకు అనారోగ్యాలు  వస్తున్నాయో ,ఎందుకు చనిపోతున్నామో కూడా తెలుసుకొకుండా బ్రతుకుతున్నడు .శరీరము అంటే ఏమిటి ? శరీరంలో అసలు ఏమి ఉంటాయి ? శరీరములో చక్రాలఅంటే ఏమిటి అవి ఎలా పనిచేస్తాయి ,అవి వేటిమీద ప్రభావితమై ఉంటాయి ? వాటిని ఏ విధముగా శక్తివంతము చేసుకోవాలి అని వాటిమీద ఏమాత్రము శ్రద్ద లేదు ఎదో లెగిసాము ,తిన్నాము ,పని చేసాము ,పడుకున్నాము ,మరలా లెగిసాము .కాళీ లేకపోయినా కాళీ చూసుకుని సినిమాకి వెళ్ళామా ,లేక షికారుకు వెళ్లమా ,ఇదే జీవితం అనుకుంటున్నడు .

ఒక్కసారి చక్రాల వంక చూడండి .వాటితో మమేకమవ్వండి .వాటిని ఉపయోగించుకుని భగవంతునితో మమేకమవ్వండి .ఎందుకు            బ్రతుకుతున్నామో కాదు .ఎందుకు బ్రతకాలో తెలుస్తుంది .ఎలా బ్రతకాలో తెలుస్తుంది .ఏవిధముగా ఆనందముగా వుండాలి తెలుస్తుంది .ఏ విదముగా ఆరోగ్యముగా ఉండాలో తెలుస్తుంది .ఏ విదముగా శరీరము వదలలో తెలుస్తుంది .  ఇది జీవితంలో తెలుసుకోవడమంటే .ఇది జీవితంలో సాదించడమంటే .ఇది జీవన్ముక్తి అంటే .ఇదే ఋషి జీవితమంటే .అంతేగాని సకల చరాచర జీవులు బ్రతుకుతున్నాయి ,మనవులు బ్రతుకుతున్నరు .వాటికి మానవుడికీ ఏవిధమైన భేదము కనిపించకుండా పొతుంది .వాటికి మానవుడికి భేదము వుంది .అది ఏమిటంటే వాటికి బట్టలు లేవు ,మానవుడికి ఉన్నాయి .కొన్ని జీవులు  గుడు కట్టుకోవు ,కొన్ని కట్టుకుంటాయి ,కాని మానవులందరుకి గూడు ఉంటుంది .అదే భేదము .అంతకు మించి భేదము లేదు .

యోగిక్ మెడిటేషన్ నేర్చుకొండి .భగవంతునితో మమేకమవ్వండి .మీకు ఏమి కావాలన్న సాధించుకోవచ్చు .

కొందరు దేవతల ద్వాదశ నామ స్తోత్రాలు* !! !! *శ్రీ నారసింహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమం వజ్రదంష్ట్రంశ్చ ద్వితీయం నరకేసరి
తృతీయం జ్వాలామాలాంశ్చ చతుర్ధం యోగిపుంగవం
పంచమం ధ్యానమగ్నంచ షష్ఠం దైత్యవిమర్దనం
సప్తమం వేదవేద్యంచ అగ్నిజిహ్వం తధాష్టమం
నవమం మంత్రరాజంచ దశమం భయభంజనం
ఏకాదశం ప్రహ్లాదవరదంచ ద్వాదశం తిమిరాపహం ||

*సర్వం శ్రీ లక్ష్మీనారసింహచరణారవిందార్పణమస్తు*

*శ్రీ గణపతి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం ఏకదంతంచ  ద్వితీయం షణ్ముఖాగ్రజం
తృతీయం అనింద్యారూఢంచ చతుర్ధం మోదకప్రియం
పంచమం ఆద్యపూజ్యంచ షష్ఠం విఘ్ననివారకం
సప్తమం వేదవేద్యం చ అష్టమం స్ఫూర్తిదాయకం
నవమం కవిరాజం చ దశమం నాట్యకౌశలం 
ఏకాదశం గణనాథం చ ద్వాదశం శూర్పకర్ణకం  ||

*సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం ఆంజనేయంచ ద్వితీయం లంకనాశనం
తృతీయం  రామభక్తంచ చతుర్ధం యోగిపుంగవం
పంచమం కార్యదీక్షంచ షష్ఠం వాక్యవిశారదం
సప్తమం ధ్యానమగ్నంచ అష్టమం బుద్ధికౌశలం
నవమం సురవంద్యంచ దశమం భానుతేజసం
ఏకాదశం  మిత్రశిష్యంచ ద్వాదశం భక్తకామదం  ||

*సర్వం శ్రీ ఆంజనేయ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ సుబ్రహ్మణ్య ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం షణ్ముఖంచ  ద్వితీయం గజాననానుజం
ద్వితీయం వల్లీవల్లభంచ చతుర్ధం క్రౌంచభేదకం
పంచమం దేవసేనానీంశ్ఛ షష్ఠం తారకభంజనం
సప్తమం ద్వైమాతురంచ అష్టమం జ్ఞానబోధకం
నవమం భక్తవరదంచ దశమం మోక్షదాయకం
ఏకాదశం శక్తిహస్తంచ ద్వాదశం అగ్నితేజసం ||

*సర్వం శ్రీ శరవణభవ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం  భారతీనామ  ద్వితీయం జ్ఞానరూపిణీం
తృతీయం వేదపూజ్యంచ చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ షష్ఠం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణాంశ్ఛ దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం  || 

*సర్వం శ్రీ మహాసరస్వతి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ మహాలక్ష్మీ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం మహాలక్ష్మీ నామ ద్వితీయం హరివల్లభం
తృతీయం తమోపహారిణీంశ్చ చతుర్ధం చంద్రసహోదరీం
పంచమం దారిద్ర్యనాశినీం నామ షష్ఠం భార్గవకన్యకాం  
సప్తమం బిల్వసుప్రీతాంశ్చ అష్టమం మదనమాతరం
నవమం వేదవేద్యంశ్చ దశమం శశిశేఖరానుజాం
ఏకాదశం కమలమధ్యాంశ్చ  ద్వాదశం మంగళప్రదాం  ||   

*సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ కృష్ణ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వాసుదేవం నామ ద్వితీయం బలరామానుజం
తృతీయం అకౄరవరదంచ  చతుర్ధం మురళీగానలోలనం
పంచమం సుదామమిత్రంచ షష్ఠం గోవర్ధనోద్ధరం
సప్తమం హాస్యచతురంశ్చ అష్టమం కంసమర్దనం
నవమం పీతాంబరధరంచ దశమం తులసీప్రియం 
ఏకాదశం చందనచర్చితంచ ద్వాదశం యోగీశ్వరేశ్వరం ||  

*సర్వం శ్రీ కృష్ణ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ రామ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం రాఘవం నామ ద్వితీయం దశరథాత్మజం
తృతీయం సామీరిసేవ్యంచ చతుర్ధం లక్ష్మణాగ్రజం
పంచమం సుగ్రీవమిత్రంచ షష్ఠం రావణమర్దనం
సప్తమం కాలరుద్రంచ అష్టమం పురుషోత్తమం
నవమం సత్యధర్మరతంచ దశమం మైథిలీప్రియం
ఏకాదశం అహల్యాశాపమోచనంశ్చ ద్వాదశం కరుణార్ణవం ||

*సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు*

*శ్రీ శివ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం మహేశ్వరం నామ ద్వితీయం శూలపాణినం
తృతీయం చంద్రచూడంశ్చ చతుర్ధం వృషభధ్వజం
పంచమం నాదమధ్యంచ షష్ఠం నారదవందితం
సప్తమం కాలకాలంచ అష్టమం భస్మలేపనం
నవమం మాధవమిత్రంచ దశమం భక్తవత్సలం
ఏకాదశం అభిషేకాసక్తంచ ద్వాదశం జటాజూటినం  ||

*సర్వం శ్రీ సదాశివ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ వేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వేంకటేశ్వరం నామ ద్వితీయం సప్తగిరీశం
తృతీయం పద్మావతీప్రియంచ చతుర్ధం ఆనందనిలయం
పంచమం స్కందసన్నుతంచ షష్ఠం త్రయీనుతం
సప్తమం యశోదానందనంచ అష్టమం మౌక్తికమండపస్థితం
నవమం  సాలగ్రామధరంచ దశమం శేషశాయినం 
ఏకాదశం అష్టదళపాదపద్మారాధనంచ ద్వాదశం వకుళాత్మజం ||

*సర్వం శ్రీ వేంకటేశ్వర చరణారవిందార్పణమస్తు*

*శ్రీ హయగ్రీవ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం హయగ్రీవం నామ ద్వితీయం జ్ఞానపంజరం
తృతీయం ప్రణవోద్గీధం చతుర్ధం భక్తకామదం
పంచమం సౌమనస్కశ్చ షష్ఠం హయగ్రీవభంజనం
సప్తమం లలితాఉపాసకశ్చ  అష్టమం శుద్ధస్ఫటికం
నవమం కంబుకంఠంచ దశమం అక్షమాలాధరం
ఏకాదశం జాడ్యనాశనంశ్చ ద్వాదశం వాగీశ్వరేశ్వరం  ||

*సర్వం శ్రీ హయగ్రీవ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ వరాహ స్వామి  ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం వరాహదేవ నామ ద్వితీయం భూవల్లభం
తృతీయం మహారౌద్రంచ  చతుర్ధం శాంతమానసం
పంచమం ఆదివ్యాధినాశనంశ్చ  షష్ఠం హిరణ్యాక్షభంజనం 
సప్తమం గదాధరంశ్చ  అష్టమం క్రోడరూపిణం     
నవమం గ్రహపీడానివారణంశ్చ దశమం యజ్ఞస్వరూపిణం
ఏకాదశం విప్రవంద్యంశ్చ  ద్వాదశం విశ్వమంగళం || 

*సర్వం శ్రీవరాహదేవ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ దుర్గ ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం దుర్గా నామ ద్వితీయం తాపసోజ్జ్వలాం
తృతీయం హిమశైలసుతాంశ్చ చతుర్ధం బ్రహ్మచారిణీం
పంచమం స్కందమాతాచ షష్ఠం భీతిభంజనీం
సప్తమం శూలాయుధధరాంశ్చ అష్టమం వేదమాతృకాం
నవమం అరుణనేత్రాంశ్చ దశమం వనచారిణీం
ఏకాదశం కార్యసాఫల్యశక్తింశ్చ ద్వాదశం కామకోటిదాం ||

*సర్వం శ్రీ దుర్గాదేవి చరణారవిందార్పణమస్తు*

*శ్రీ రాజరాజేశ్వరి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం రాజరాజేశ్వరీ నామ ద్వితీయం శశిశేఖరప్రియాం
తృతీయాం మన్మదోద్ధారిణీంశ్చ చతుర్ధం అర్ధాంగశరీరిణీం
పంచమం రజతాచలవాసినీంశ్చ  షష్ఠం హరిసోదరీం
సప్తమం  వనచారిణీంశ్చ అష్టమం ఆర్తిభంజనీం
నవమం పంచకోశాంతరస్థితాంశ్చ దశమం మనోన్మనీం
ఏకాదశం మహాప్రళయసాక్షిణీంశ్చ ద్వాదశం షోడశకళాం  ||

*సర్వం శ్రీ రాజరాజేశ్వరీ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ దక్షిణామూర్తి ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం
తృతీయం వటవృక్షనివాసంచ చతుర్ధం సనకసనందనాదిసన్నుతం
పంచమం నిగమాగమనుతంచ షష్ఠం బ్రహ్మజ్ఞానప్రదం
సప్తమం అక్షమాలాధరంశ్చ అష్టమం చిన్ముద్రముద్రం
నవమం భవరోగభేషజంశ్చ దశమం కైవల్యప్రదం
ఏకాదశం భాషాసూత్రప్రదంశ్చ  ద్వాదశం మేధార్ణవం ||

*సర్వం శ్రీ మేధాదక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు* 

*శ్రీ సూర్య ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం  సూర్యనారాయణం నామ ద్వితీయం రోగనాశనం
తృతీయం అహస్కరంచ చతుర్ధం జ్ఞానవర్ధనం
పంచమం పర్జన్యమిత్రంచ షష్ఠం కశ్యపనందనం
సప్తమం సర్వశుభదంచ అష్టమం శతృభంజనం 
నవమం  కిరణకారణంచ దశమం విశ్వతేజసం
ఏకాదశం వేదవాహనంచ ద్వాదశం రామసేవితం ||

*సర్వం శ్రీ సూర్యనారాయణ చరణారవిందార్పణమస్తు*

*శ్రీ ఆయ్యప్ప ద్వాదశ నామ స్తోత్రం*

ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్ధం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్ఠం గిరిజాత్మజం 
సప్తమం ధర్మనిష్టంచ ఆష్టమం ధనుర్బాణధరం  
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం  
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం  ||

*సర్వం శ్రీ అయ్యప్ప చరణారవిందార్పణమస్తు*

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

నీవు ఎవరు

64లక్షల జీవకణాలు అత్యంత వేగంగా తల్లిలోకి ప్రవేశిస్తే అందులో ఒకేఒక్క జీవకణ మాత్రమే గర్భంలోకి ప్రవేశిస్తుంది. అదికూడా మొండాన్ని కోల్పోయి శిరస్సుతో మాత్రమే ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తరువాత కేవలం 24గంటల్లో అండాన్ని పట్టుకొని బ్రతకకపోతే ముక్కలై బయటికి వచ్చేస్తుంది. అదొక పోరాటమే. ఆ పోరాటం నీకు దేవుడిచ్చిన సమయం కేవలం 24గంటలు మాత్రమే. నిలిచావా బ్రతుకుతావు. లేదా ముక్కలై బయటికి వచ్చేస్తావ్..
అలా రూపం లేకుండా వెళ్లిన కణం రూపాంతరం చెంది రూపంతో బయటికి వస్తుంది. రూపాన్ని పొందుతుంది. కాళ్ళు చేతులు కదపలేని, నోటితో చెప్పలేని స్థితి. ఏమి చేసినా భరించాలి. క్రమంగా దేహం పెరుగుతుంది. దేహం మీద మోహం పెరుగుతుంది.
ఈ దేహం నేనె అంటాం.

కానీ ఎలా?
నీ దేహంలో ఏ భాగం నీ మాట వింటుంది?
ఏ భాగము వినదు.
వినాలి అని ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది.
చిన్నప్పుడు 2 అడుగులుగా ఉన్న దేహం క్రమంగా పెరుగుతూ 6అడుగులు అవుతుంది.
అందంగా మారుతుంది. క్రమంగా అందం మందమై ముదిరిపోయి ముడతలు పడి, ఒక్కొక్క అవయవం క్రమంగా వేగాన్ని తగ్గించుకొని పనిచేయడానికి మొరాయిస్తాయి.
ఈ దేహం నీదే కదా! ఎందుకు మొరాయిస్తుంది?
ఈ దేహం నీదేకదా! ఎందుకు ఒకప్పుడు ఉన్న రూపం ఈరోజు లేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు నీమాట వినడంలేదు?
ఈదేహం నీదేకదా! ఎందుకు వదిలేసి వెళ్లిపోతున్నావ్?

ఎందుకంటే ఈ దేహం నీది కాదు. నీకు ఆదేవుడిచ్చిన పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే.
ఆ ఉపకరణాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి తప్ప ఈదేహం నాదే. నేను శాశ్వతంగా ఉండిపోతాను అనే భ్రమకి లొంగకూడదు.
ఏ కారణం చేత వచ్చామో తెలియనప్పుడు నీకున్న బాధ్యతలు నువ్వు సక్రమంగా నిర్వర్తించు. శాస్త్రాలు ఏమి చెప్పాయో వాటిని అనుసరించు. ఈ సృష్టి పరమాత్మదని తెలుసుకొ..
రూపం లేకుండా తల్లి గర్భంలోకి ప్రవేశించాం.
రూపం పొంది ఎన్నో కార్యాలు చేసి ఉండవచ్చు.
చివరికి రూపం ధరించిన రూపం ఇక్కడే వెళ్ళిపోతాం.
ఇక్కడ ఉన్నది నువ్వు కాదు. నీకు పరమాత్మ ఇచ్చిన ఉపకరణం మాత్రమే అనే యధార్థం తెలుసుకుంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.

రూపానికి ముందు నువ్వున్నావు.
రూపంలో నువ్వున్నావ్.
రూపం వదిలేశాకా నువ్వుంటావు.
ఎక్కడో ఓ చోట నువ్వు అనేవాడివి లేకపోతె అసలు రూపమే ఉండదు.
ఈ దేహం దేవుడిచ్చిన ఒ అద్భుత వరం. ఆయనే ఆ దేహానికి ఏమి కావాలో ఇస్తాడు. ఆయనే తయారు చేశాడు. ఆయనే సమయం అవ్వగానే నాశనం చేస్తాడు. ఈదేహంలో ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దేహాన్ని ఇష్టం వచ్చినట్లు చేయడానికి అధికారం లేదు. ఈ దేహంలో ఉన్న అన్ని భాగాలూ అయన అజ్ఞ ప్రకారమే నడుస్తున్నాయి, అయన ఆగమన్నప్పుడు ఆగిపోతాయి.

కాబట్టి ఆ నువ్వు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్.....

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...