Monday, March 26, 2018

ఏ తిథినాడు ఏ దేవుని పూజించాలి?

వరాహ పురాణము

వరాహ పురాణం లో శ్రీ మహా విష్ణువు ఏ తిథినాడు ఏదేవతను ఆరాధిస్తే ఎంతటి పుణ్య ఫలం కలుగుతుందనే విశేషాల గురించి భూదేవి కి వివరించాడు.

*ఏ తిథినాడు ఏ దేవుని పూజించాలి?*

*పాడ్యమి :-*

తిధులలోమొదటిదైన పాడ్యమి నాడు అగ్ని ని పూజించాలి.

*విదియ :*

విదియ నాడు అశ్విని దేవతలను ఆరాధించాలి. అశ్వినీ దేవతలు విదియనాడు జన్మించారు. ఏడాదిపాటు అశ్విని దేవతలను ఉద్దేశించి విదియ వ్రతాన్ని నియమ నిష్టలతో చేయడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది.

*తదియ :*

గౌరీ దేవిని పూజించాలి. గౌరీ కళ్యాణం తదియ నాడుజరిగినందు వల్ల, గౌరీ దేవికి ఆ తిధి అంటే ఇష్టం. తదియ నాడు గౌరీ కళ్యాణ కథ చదవడం వలన పెళ్లికాని కన్యలకు శీఘ్రవివాహం జరుగుతుంది. వివాహితలకు అఖండ సౌభాగ్యం కలుగుతుంది.

*చవితి:*

వినాయకుడు పుట్టిన తిధి. వినాయక చవితి నాడేకాకుండా ప్రతీ చవితినాడు వినాయకుడిని పూజించవచ్చు.

*పంచమి:*

పంచమి నాడు నాగులు జన్మించాయి. నాగదోషాలు ఉన్నవారు ప్రతీ పంచమినాడు పుట్టలో పాలు పోసి ఉపవాసం ఉండి, నాగ పూజచేస్తే నాగుల వల్ల భయం ఉండదు.

*షష్టి :*

కుమారస్వామి /సుబ్రహ్మణ్య స్వామి జన్మతిధి. షష్టినాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించి బ్రహ్మచారికి భోజన తాంబూలాలను సమర్పించడం వలన సర్వకార్య విజయం,సంతాన యోగం కలుగుతాయి.

*సప్తమి:*

సూర్యుని జన్మ తిధి. రధసప్తమి నాడే కాకుండా ప్రతీ శుద్ధసప్తమి నాడు సూర్యుడిని ఆరాదించి క్షీరానాన్ని నైవేద్యంగాపెడితే ఆయురారోగ్యాలు కలుగుతాయి.

*అష్టమి:*

దుర్గాదేవి అష్టమాకృతులు ఆవిర్భవించిన తిధి. అష్టమినాడు దుర్గాదేవిని పూజించడం వలన శత్రుభయం ఉండదు.

*నవమి:*

నవమినాడు సీతారాములని పూజించడం శ్రేష్టం. నవమి స్వామి జన్మతిథి. ఆరోజున దంపతి తాంబూలాన్ని ఇవ్వడం వలన అనుకూల దాంపత్యం చేకూరుతుంది.

*దశమి:*

దశమి నాడు దిక్కుల సృష్టి జరిగింది. ఇంద్రాది దేవతలు ఈ దిక్కులకు పాలకులు. దిక్పాలకులను పూజిస్తే పాపాలుతొలగుతాయి.

*ఏకాదశి:*

కుబేరుడు పుట్టిన తిధి. ఈ తిధిన కుబేర పూజ చేస్తేఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది

*ద్వాదశి:*

విష్ణువు కి ఇష్టమైన తిధి. ఈ తిధి రోజే విష్ణు మూర్తి,వామన రూపం లో జన్మించారు. ద్వాదశి నాడు ఆవునెయ్యి తో వ్రతం చేస్తే పుణ్యం లభిస్తుంది. ఈ రోజున ఆంజనేయుని పూజించడం కూడా శుభకరం.

*త్రయోదశి:*

ధర్ముడు పుట్టిన తిధి. ఈ రోజున ఇష్టదైవారాధన చేయాలి.

*చతుర్దశి:*

రుద్రుని తిధి. ఆనాడు రుద్రార్చన చేసినట్లైతే శుభప్రదం. కృష్ణ చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది. ఆ తిధిశివుడికి ప్రీతికరం.

*అమావాస్య:*

పితృదేవతలకు ఇష్టమైన తిధి. అమావాస్యనాడు పితృదేవాతలకు తర్పణాలను ఇవ్వడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది.

_*పౌర్ణమి:*_

పౌర్ణమికి చంద్రుడు అధిపతి. పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి కి చంద్రుడిని పూజించినచో ధన ధాన్యాది అష్టైశ్వర్యాలూ సిద్ధిస్తాయి. మానసిక బాధలు తొలగుతాయి.

శృంఖలాదేవి_ఆలయం


"శృంఖలాదేవి ఆలయం ఎక్కడ వుండేది సరిగ్గా తెలియడం లేదుగానీ,ప్రస్తుతం పశ్చిమబెంగాల్ లోని హుగ్లీ జిల్లా ప్రాంతం ’ప్రద్యుమ్నం’గా భావిస్తున్నారు. కొందరు హుగ్లీ జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో కొలువుదీరి వున్న దేవియే ’శృంఖలాదేవి’ అని పేర్కొంటున్నారు. పాండువా కలకత్తా నగరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో వుంది.
(కొంత మంది శృంగేరీఅని, కొంతమంది గంగాసాగర్ లోని ఆదినాధ క్షేత్రం అని ,గంగా సాగర్ ఆదినాథ్ క్షేత్రమనీ,కొంతమంది గుజరాత్ లోని చోటిల్లా అని,విభిన్న కథనాలు ఉన్నాయి).. అయితే ప్రస్తుతం పాండువాలోని ఈ ప్రదేశంలో హజ్రత్ షా దర్గా - మినార్ మాత్రమే ఉంది... అవసాన దశలో ఉన్న ఆలయంలోని కొన్ని ప్రదేశాలు మాత్రం పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉన్నాయి..
అష్టాదశ శక్తి పీఠాలలో మూడవ పీఠం ... ప్రద్యుమ్నేశృంఖలాదేవి
శక్తి పీఠాల్లో కొన్నింటిని గురించి పండితుల్లోనూ, చరిత్రకారుల్లోనూ విభేదాలు వున్నాయి. ఆవిధంగా విభేదాలు ఉన్న క్షేత్రాల్లో ప్రద్యుమ్నం ప్రధానమైంది. ప్రద్యుమ్నం ఎక్కడ వుందనే విషయమై వీరిలో ఏకాభిప్రాయం లేదు.
ఇప్పటికీ ఇక్కడ ఏ ఆలయం లేనప్పటికీ ప్రతి మాఘమాసంలో మేళతాళాలతో ఉత్సవాలు/తిరున్నాళ్ళ జరుగుతుంటాయి... ఒక పేరుగాంచిన శక్తి పీఠం ఇలా ఏ ఆదరణకు నోచుకోక పోవడం ఒక ఆలయం లేకపోవడం.. మన దౌర్భాగ్యం..
స్థలపురాణం:
త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి శృంఖలాదేవిని ప్రతిష్ఠించినట్లు కథనం. పూర్వం వంగదేశమును రోమపాదుడు అనే రాజు పరిపాలించేవాడు. రాజ్యం సస్యశ్యామలమై ఉండేది. అయితే ఒకసారి తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడి ప్రజలు విలవిలలాడసాగారు. కరువును గురించి తీవ్రమైన ఆలోచనలు చేసిన రోమపాదుడు ఋష్యశృంగుని గురించి విన్నాడు. ఋష్యశృంగుడు – విభాండకుడు, చిత్రరేఖల కుమారుడు. తపోబల సంపన్నుడు. ఆయన ఎక్కడ కాలుమోపితే అక్కడ సస్యశ్యాలమే! ఈ విషయం గురించి విన్న రోమపాదుడు, ఋష్యశృంగుని తీసుకువచ్చేందుకు కొందరు యువతులను ఆశ్రమానికి పంపాడు.
అంతవరకూ ఆశ్రమం వదలి బయటకు వెళ్ళని, ముని కుమారులను మినహా యితరులను చూసి ఎరుగని ఋష్యశృంగుడు యువతులను, వారి అందాలను చూసి ఆశ్చర్యపడి, వారి ఆశ్రమాలు ఎంత అందంగా వుంటాయో చూడాలనే ఉత్సాహం కలుగగా, వారి వెంట వంగదేశం చేరుకున్నాడు. ఋష్యశృంగుడి పాదం మోపడంతోనే కరువుపోయి, వర్షాలు కురిసి రాజ్యం సస్యశ్యామలం అయింది. రోమపాదుడు తన కుమార్తె శాంతాదేవిని ఋష్యశృంగునికిచ్చి వివాహం చేశాడు. ఈవిధంగా కొంతకాలం వంగదేశంలో గడిపిన ఋష్యశృంగుడు శృంఖలాదేవిని ప్రతిష్ఠించి పూజించినట్లు కథనం.
శృంగుడు ప్రతిష్ఠించిన దేవత కనుక శృంగలా దేవి అని పేర్. కాలక్రమంలో ఆ పేరు శృంఖలాదేవి అయింది. ’శృంఖల’ అంటే
శృంఖల అంటే రెండు రకాల అర్థాలున్నాయి.. మొదటిది.. బంధనానికి ఉపయోగించే గొలుసు (సంకెళ్ళు.)అని..
రెండవది బాలింతలు నడుముకు కట్టుకునే గుడ్డ అని అర్థం..
ఇక్కడ అమ్మవారు బాలింతలా నడుముకు గుడ్డ కట్టుకుని దర్శనమిస్తారు...
శృంఖలాదేవి భక్తుల సమస్యల సంకెళ్ళు తొలగించే తల్లిగా పేరుపొందింది. సాధారణంగా బాలింతలు నడుముకు గుడ్డ కట్టుకుంటారు. దీనికి బాలింత నడికట్టు అని పేరు. దీనికే శృంఖల అనే పేరు వుండడం వల్ల క్రొత్తగా ప్రసవించిన బాలింత చంటి బిడ్డకు పాలిచ్చి కంటికి రెప్పలా ఎలా కాపాడుతుందో ఈ తల్లి కూడా అలాగే కాపాడుతుందని భక్తుల నమ్మకం. కొంతకాలం తర్వాత ఋష్యశృంగుడు ఈ ప్రాంతంనుంచి వెళ్ళిపోవడంతో గ్రామంలోని శృంఖలాదేవితో పాటు కలకత్తాకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో వున్న ’గంగాసాగర”లోని గంగాదేవి కూడా శక్తిపీఠమే అని చెప్తారు.
ఈ శక్తి పీఠంలో, ఆమె శక్తిని 'ఋష్య శృంగ మహర్షి' స్థాపించిన కారణంగా ఈ పీఠానికి శృంగలా దేవి పీఠం అనే పేరు వచ్చిందని అంటారు. కాలక్రమంలో ఇదే శృంఖలా దేవి పీఠంగా మారింది.

ఆది శంకరాచార్యుల వారు శారదాదేవిని మాహిష్మతీ నగరం నుంచి తీసుకు వస్తోన్న క్రమంలో, ఇక్కడి శక్తి తరంగాలను గమనించి ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేసినట్టు చరిత్ర చెబుతోంది. గంగాసాగర సంగమం కావడంతో, ఇక్కడ ఎక్కువగా పితృ దేవతలకి ఆబ్దికాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడి అమ్మవారిని దర్శించడం వలన మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం.ఏమైనప్పటికీ పురిటి బిడ్డల్లాగా తన భక్తులను రక్షించే కరుణా కల్పవల్లి – శ్రీ శృంఖలాదేవి!
సతీదేవి ఉదరం పడిన ప్రాంతంలో వెలసిన శక్తిపీఠం ఇది.
“ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలానామ భూషితే!
శ్రీవిశ్వమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ!!
జై మాతాజీ!!

"ఓం శ్రీ మాత్రే నమః
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే

అతీతలోకాలు - అదృశ్యశక్తులు

చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు  అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది.  ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన  ఇంద్రియశక్తులను  యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు.  వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు.

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే  ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.

ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు.

అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.
 

మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే  మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.

అత్యాశ...దురాశ


మనిషి ఆశాజీవి. అది అతడి సహజ లక్షణం, అవసరం. ఆశ లేకుంటే, సంకల్పం కలగదు. అది లేనిదే ప్రయత్నం మొదలు కాదు. ప్రయత్నంపైనే కార్యసాఫల్యం ఆధారపడి ఉంది. కార్యశీలి కాని మనిషి మనిషే కాడు.
సంపద, ఆరోగ్యం, పదవి, అధికారం, నాయకత్వం, కీర్తి- ఏదో ఒకటి అతడు ఆశిస్తుంటాడు. పొందగలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరో అడుగు ముందుకేస్తాడు. ఇంకా ఎంతెంతో సాధించాలనుకుంటాడు. సంతృప్తి కలగదు. మాన్యుల్లో ఆశ ఆశయంగా మారి, సమాజ శ్రేయస్సుకు కారణమవుతుంది. సామాన్యుల సంగతి వేరు.
ఒక ఆశ పుట్టిందంటే, మానవుడు అంతటితో సంతృప్తి చెందడు. లభించిన వైభవం, సుఖశాంతులు చాలని అనుకోడు. ఇంకా ఏదో కావాలన్న తపన, ఆవేదన, నిరీక్షణతో సతమతమవుతుంటాడు. పొయ్యిలో ఒక్కో కర్ర పెడుతున్నకొద్దీ మంట పెరుగుతుంటుంది. అలాగే అతడి కోరికలు, ఆశలు తీరినా మనసులో కొత్తవి ఊరుతూనే ఉంటాయి. అప్పుడే ఆశ అత్యాశగా మారి, మనిషిని అధఃపాతాళం వైపు తీసుకెళుతుంది. ఆశ తృష్ణగా మారిందంటే, బతుకు పెడదారి పట్టిందన్నమాటే!
అత్యాశ వైపు మనిషి చిత్రమైన పరుగు ‘భారతం’లోని యక్ష ప్రశ్నల్లో కనిపిస్తుంది. ఇంద్రుడు తన పదవి నిలబెట్టుకునేందుకు ఎందరో రుషుల తపస్సును భంగం చేయడానికీ వెనకాడలేదు. ధర్మమా, అధర్మమా అనే యోచనను అత్యాశ చెరిపివేసింది. స్త్రీ సౌందర్యానికి ప్రలోభం చెంది సుందోపసుందులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. అమృతాన్ని సంగ్రహించాలన్న అత్యాశకు పోయి రాహుకేతువులు అంతరిస్తారు. అత్యాశ దురాశగా మారిందంటే, ఎదుటివాడికి ఎంతటి హాని చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. ఎంతమంది సర్వనాశనమైనా, తానే విశ్వవిజేత కావాలన్న దురాశకు అలెగ్జాండర్‌ దాసుడయ్యాడు. అతడి బతుకు ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే. దురాశకు లోబడినవాడు ఎంతటి ఘాతుకానికైనా సందేహించడు. రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, విశ్వామిత్రుడి చరిత్రలే అందుకు ఉదాహరణలు.
అత్యాశ అశాంతినిస్తుంది. దురాశ దుఃఖాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తుంది. అతి సంశŸయేచ్ఛ అనర్థానికి దారితీస్తుందని ‘నీతి చంద్రిక’లోని ‘మిత్రలాభం’లో నక్క కథ వివరిస్తుంది. ఆహారం కోసం అన్వేషిస్తున్న దానికి ఒకేచోట చనిపోయి పడిఉన్న అడవి పంది, పాము కనిపిస్తాయి. బోయవాడి శవమూ కంటపడుతుంది.వాటన్నింటినీ కొంచెం కొంచెంగా తింటూ హాయిగా బతకవచ్చని నక్క అనుకుంటుంది. అంతలో దానికి బోయవాడి విల్లు కూడా కనిపిస్తుంది. ఆ వింటికి కట్టిన నారి- ఒక జంతువుకు చెందిన నరం. ముందు నరాన్ని తినాలనుకున్న నక్క, ఆ వింటి మొదలును కాలితో తొక్కిపడుతుంది. పైచివరను నోట పట్టుకొని, నరాన్ని కొరుకుతుంది. అది తెగటంతో, వింటిబద్ద నోటిలోకి చొచ్చుకుపోయి నక్క చనిపోతుంది. లోభిత్వం, దురాశ ఎంతటి వినాశనాన్ని తెచ్చిపెడతాయో స్పష్టం చేస్తుందా కథ!
‘తృష్ణారాహిత్యమనే సద్బుద్ధిని మనిషి అలవరచుకోవాలి. తాను పడే శ్రమకు ధర్మబద్ధంగా ఏ ప్రతిఫలం లభిస్తుందో, దానితోనే సంతృప్తి చెందాలి. అత్యాశను, దురాశను వదిలిపెట్టాలి’ అని జగద్గురువు ఆదిశంకరులు ప్రబోధించారు.
పవిత్ర సంకల్పబలం, అత్యాశారహితమైన కృషి, దురాశారహిత ప్రవర్తనను బట్టి ఫలితం లభిస్తుంది. సంకల్పమైనా, ఆశయమైనా ధర్మబద్ధంగా ఉండాలి. అంతవరకు మానవ జీవన ప్రస్థానం విజయవంతంగా సాగుతుంది. ధర్మరహితంగా అతడు ఏదీ ఆశించకూడదు. అప్పుడు విజయపరంపర అతణ్ని వీడదు. కోరికలు, ఆశల్ని తగ్గించుకున్నవాడే ‘సంతృప్తి’ అనే సంపదను పెంచుకుంటాడు. నలుగురి మెప్పూ సంపాదిస్తాడు. వ్యసనాలు దురాశ కలిగిస్తాయి. అవి అనంతమైనప్పుడు, మనిషిని అన్నివిధాలా అధముణ్ని చేస్తాయి.
ఆశను అంతవరకే ఉంచాలి తప్ప, మృత్యుపాశంగా మార్చుకోకూడదు. ప్రమిదలోని వత్తి లాంటిది ఆశ. తగినంత తైలం పోస్తేనే వెలుగునిస్తుంది. వత్తి మునిగేలా నూనె పోస్తే,  దీపం కొండెక్కి చివరికి చీకటే మిగులుతుంది. సదాశయం లేని ఆశ- వాసన లేని పువ్వు వంటిది. మనిషికి అది అనవసరం!

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...