Monday, March 26, 2018

అత్యాశ...దురాశ


మనిషి ఆశాజీవి. అది అతడి సహజ లక్షణం, అవసరం. ఆశ లేకుంటే, సంకల్పం కలగదు. అది లేనిదే ప్రయత్నం మొదలు కాదు. ప్రయత్నంపైనే కార్యసాఫల్యం ఆధారపడి ఉంది. కార్యశీలి కాని మనిషి మనిషే కాడు.
సంపద, ఆరోగ్యం, పదవి, అధికారం, నాయకత్వం, కీర్తి- ఏదో ఒకటి అతడు ఆశిస్తుంటాడు. పొందగలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరో అడుగు ముందుకేస్తాడు. ఇంకా ఎంతెంతో సాధించాలనుకుంటాడు. సంతృప్తి కలగదు. మాన్యుల్లో ఆశ ఆశయంగా మారి, సమాజ శ్రేయస్సుకు కారణమవుతుంది. సామాన్యుల సంగతి వేరు.
ఒక ఆశ పుట్టిందంటే, మానవుడు అంతటితో సంతృప్తి చెందడు. లభించిన వైభవం, సుఖశాంతులు చాలని అనుకోడు. ఇంకా ఏదో కావాలన్న తపన, ఆవేదన, నిరీక్షణతో సతమతమవుతుంటాడు. పొయ్యిలో ఒక్కో కర్ర పెడుతున్నకొద్దీ మంట పెరుగుతుంటుంది. అలాగే అతడి కోరికలు, ఆశలు తీరినా మనసులో కొత్తవి ఊరుతూనే ఉంటాయి. అప్పుడే ఆశ అత్యాశగా మారి, మనిషిని అధఃపాతాళం వైపు తీసుకెళుతుంది. ఆశ తృష్ణగా మారిందంటే, బతుకు పెడదారి పట్టిందన్నమాటే!
అత్యాశ వైపు మనిషి చిత్రమైన పరుగు ‘భారతం’లోని యక్ష ప్రశ్నల్లో కనిపిస్తుంది. ఇంద్రుడు తన పదవి నిలబెట్టుకునేందుకు ఎందరో రుషుల తపస్సును భంగం చేయడానికీ వెనకాడలేదు. ధర్మమా, అధర్మమా అనే యోచనను అత్యాశ చెరిపివేసింది. స్త్రీ సౌందర్యానికి ప్రలోభం చెంది సుందోపసుందులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. అమృతాన్ని సంగ్రహించాలన్న అత్యాశకు పోయి రాహుకేతువులు అంతరిస్తారు. అత్యాశ దురాశగా మారిందంటే, ఎదుటివాడికి ఎంతటి హాని చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. ఎంతమంది సర్వనాశనమైనా, తానే విశ్వవిజేత కావాలన్న దురాశకు అలెగ్జాండర్‌ దాసుడయ్యాడు. అతడి బతుకు ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే. దురాశకు లోబడినవాడు ఎంతటి ఘాతుకానికైనా సందేహించడు. రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, విశ్వామిత్రుడి చరిత్రలే అందుకు ఉదాహరణలు.
అత్యాశ అశాంతినిస్తుంది. దురాశ దుఃఖాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తుంది. అతి సంశŸయేచ్ఛ అనర్థానికి దారితీస్తుందని ‘నీతి చంద్రిక’లోని ‘మిత్రలాభం’లో నక్క కథ వివరిస్తుంది. ఆహారం కోసం అన్వేషిస్తున్న దానికి ఒకేచోట చనిపోయి పడిఉన్న అడవి పంది, పాము కనిపిస్తాయి. బోయవాడి శవమూ కంటపడుతుంది.వాటన్నింటినీ కొంచెం కొంచెంగా తింటూ హాయిగా బతకవచ్చని నక్క అనుకుంటుంది. అంతలో దానికి బోయవాడి విల్లు కూడా కనిపిస్తుంది. ఆ వింటికి కట్టిన నారి- ఒక జంతువుకు చెందిన నరం. ముందు నరాన్ని తినాలనుకున్న నక్క, ఆ వింటి మొదలును కాలితో తొక్కిపడుతుంది. పైచివరను నోట పట్టుకొని, నరాన్ని కొరుకుతుంది. అది తెగటంతో, వింటిబద్ద నోటిలోకి చొచ్చుకుపోయి నక్క చనిపోతుంది. లోభిత్వం, దురాశ ఎంతటి వినాశనాన్ని తెచ్చిపెడతాయో స్పష్టం చేస్తుందా కథ!
‘తృష్ణారాహిత్యమనే సద్బుద్ధిని మనిషి అలవరచుకోవాలి. తాను పడే శ్రమకు ధర్మబద్ధంగా ఏ ప్రతిఫలం లభిస్తుందో, దానితోనే సంతృప్తి చెందాలి. అత్యాశను, దురాశను వదిలిపెట్టాలి’ అని జగద్గురువు ఆదిశంకరులు ప్రబోధించారు.
పవిత్ర సంకల్పబలం, అత్యాశారహితమైన కృషి, దురాశారహిత ప్రవర్తనను బట్టి ఫలితం లభిస్తుంది. సంకల్పమైనా, ఆశయమైనా ధర్మబద్ధంగా ఉండాలి. అంతవరకు మానవ జీవన ప్రస్థానం విజయవంతంగా సాగుతుంది. ధర్మరహితంగా అతడు ఏదీ ఆశించకూడదు. అప్పుడు విజయపరంపర అతణ్ని వీడదు. కోరికలు, ఆశల్ని తగ్గించుకున్నవాడే ‘సంతృప్తి’ అనే సంపదను పెంచుకుంటాడు. నలుగురి మెప్పూ సంపాదిస్తాడు. వ్యసనాలు దురాశ కలిగిస్తాయి. అవి అనంతమైనప్పుడు, మనిషిని అన్నివిధాలా అధముణ్ని చేస్తాయి.
ఆశను అంతవరకే ఉంచాలి తప్ప, మృత్యుపాశంగా మార్చుకోకూడదు. ప్రమిదలోని వత్తి లాంటిది ఆశ. తగినంత తైలం పోస్తేనే వెలుగునిస్తుంది. వత్తి మునిగేలా నూనె పోస్తే,  దీపం కొండెక్కి చివరికి చీకటే మిగులుతుంది. సదాశయం లేని ఆశ- వాసన లేని పువ్వు వంటిది. మనిషికి అది అనవసరం!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...