మనిషి ఆశాజీవి. అది అతడి సహజ లక్షణం, అవసరం. ఆశ లేకుంటే, సంకల్పం కలగదు. అది లేనిదే ప్రయత్నం మొదలు కాదు. ప్రయత్నంపైనే కార్యసాఫల్యం ఆధారపడి ఉంది. కార్యశీలి కాని మనిషి మనిషే కాడు.
సంపద, ఆరోగ్యం, పదవి, అధికారం, నాయకత్వం, కీర్తి- ఏదో ఒకటి అతడు ఆశిస్తుంటాడు. పొందగలిగినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరో అడుగు ముందుకేస్తాడు. ఇంకా ఎంతెంతో సాధించాలనుకుంటాడు. సంతృప్తి కలగదు. మాన్యుల్లో ఆశ ఆశయంగా మారి, సమాజ శ్రేయస్సుకు కారణమవుతుంది. సామాన్యుల సంగతి వేరు.
ఒక ఆశ పుట్టిందంటే, మానవుడు అంతటితో సంతృప్తి చెందడు. లభించిన వైభవం, సుఖశాంతులు చాలని అనుకోడు. ఇంకా ఏదో కావాలన్న తపన, ఆవేదన, నిరీక్షణతో సతమతమవుతుంటాడు. పొయ్యిలో ఒక్కో కర్ర పెడుతున్నకొద్దీ మంట పెరుగుతుంటుంది. అలాగే అతడి కోరికలు, ఆశలు తీరినా మనసులో కొత్తవి ఊరుతూనే ఉంటాయి. అప్పుడే ఆశ అత్యాశగా మారి, మనిషిని అధఃపాతాళం వైపు తీసుకెళుతుంది. ఆశ తృష్ణగా మారిందంటే, బతుకు పెడదారి పట్టిందన్నమాటే!
అత్యాశ వైపు మనిషి చిత్రమైన పరుగు ‘భారతం’లోని యక్ష ప్రశ్నల్లో కనిపిస్తుంది. ఇంద్రుడు తన పదవి నిలబెట్టుకునేందుకు ఎందరో రుషుల తపస్సును భంగం చేయడానికీ వెనకాడలేదు. ధర్మమా, అధర్మమా అనే యోచనను అత్యాశ చెరిపివేసింది. స్త్రీ సౌందర్యానికి ప్రలోభం చెంది సుందోపసుందులు ఒకరినొకరు హతమార్చుకుంటారు. అమృతాన్ని సంగ్రహించాలన్న అత్యాశకు పోయి రాహుకేతువులు అంతరిస్తారు. అత్యాశ దురాశగా మారిందంటే, ఎదుటివాడికి ఎంతటి హాని చేయడానికైనా మనిషి సిద్ధపడతాడు. ఎంతమంది సర్వనాశనమైనా, తానే విశ్వవిజేత కావాలన్న దురాశకు అలెగ్జాండర్ దాసుడయ్యాడు. అతడి బతుకు ఎలా ముగిసిందో అందరికీ తెలిసిందే. దురాశకు లోబడినవాడు ఎంతటి ఘాతుకానికైనా సందేహించడు. రావణుడు, దుర్యోధనుడు, హిరణ్యకశిపుడు, బలిచక్రవర్తి, విశ్వామిత్రుడి చరిత్రలే అందుకు ఉదాహరణలు.
అత్యాశ అశాంతినిస్తుంది. దురాశ దుఃఖాన్ని, విధ్వంసాన్ని కలిగిస్తుంది. అతి సంశŸయేచ్ఛ అనర్థానికి దారితీస్తుందని ‘నీతి చంద్రిక’లోని ‘మిత్రలాభం’లో నక్క కథ వివరిస్తుంది. ఆహారం కోసం అన్వేషిస్తున్న దానికి ఒకేచోట చనిపోయి పడిఉన్న అడవి పంది, పాము కనిపిస్తాయి. బోయవాడి శవమూ కంటపడుతుంది.వాటన్నింటినీ కొంచెం కొంచెంగా తింటూ హాయిగా బతకవచ్చని నక్క అనుకుంటుంది. అంతలో దానికి బోయవాడి విల్లు కూడా కనిపిస్తుంది. ఆ వింటికి కట్టిన నారి- ఒక జంతువుకు చెందిన నరం. ముందు నరాన్ని తినాలనుకున్న నక్క, ఆ వింటి మొదలును కాలితో తొక్కిపడుతుంది. పైచివరను నోట పట్టుకొని, నరాన్ని కొరుకుతుంది. అది తెగటంతో, వింటిబద్ద నోటిలోకి చొచ్చుకుపోయి నక్క చనిపోతుంది. లోభిత్వం, దురాశ ఎంతటి వినాశనాన్ని తెచ్చిపెడతాయో స్పష్టం చేస్తుందా కథ!
‘తృష్ణారాహిత్యమనే సద్బుద్ధిని మనిషి అలవరచుకోవాలి. తాను పడే శ్రమకు ధర్మబద్ధంగా ఏ ప్రతిఫలం లభిస్తుందో, దానితోనే సంతృప్తి చెందాలి. అత్యాశను, దురాశను వదిలిపెట్టాలి’ అని జగద్గురువు ఆదిశంకరులు ప్రబోధించారు.
పవిత్ర సంకల్పబలం, అత్యాశారహితమైన కృషి, దురాశారహిత ప్రవర్తనను బట్టి ఫలితం లభిస్తుంది. సంకల్పమైనా, ఆశయమైనా ధర్మబద్ధంగా ఉండాలి. అంతవరకు మానవ జీవన ప్రస్థానం విజయవంతంగా సాగుతుంది. ధర్మరహితంగా అతడు ఏదీ ఆశించకూడదు. అప్పుడు విజయపరంపర అతణ్ని వీడదు. కోరికలు, ఆశల్ని తగ్గించుకున్నవాడే ‘సంతృప్తి’ అనే సంపదను పెంచుకుంటాడు. నలుగురి మెప్పూ సంపాదిస్తాడు. వ్యసనాలు దురాశ కలిగిస్తాయి. అవి అనంతమైనప్పుడు, మనిషిని అన్నివిధాలా అధముణ్ని చేస్తాయి.
ఆశను అంతవరకే ఉంచాలి తప్ప, మృత్యుపాశంగా మార్చుకోకూడదు. ప్రమిదలోని వత్తి లాంటిది ఆశ. తగినంత తైలం పోస్తేనే వెలుగునిస్తుంది. వత్తి మునిగేలా నూనె పోస్తే, దీపం కొండెక్కి చివరికి చీకటే మిగులుతుంది. సదాశయం లేని ఆశ- వాసన లేని పువ్వు వంటిది. మనిషికి అది అనవసరం!
Monday, March 26, 2018
అత్యాశ...దురాశ
శ్రీ ఆది శంకరాచార్యుల వారు , శిష్యులతో కాశి విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.
శ్రీ ఆది శంకరాచార్యులు
గంగా నదిలో స్నానము చేసి, దర్శనానికి ఆలయము లోపలకి వెళ్లి, విశ్వేశరుని ఎదుట
“నేను 3 దోషములు/పాపములను చేశాను. నన్ను క్షమించు” అని ప్రాధేయ పడ్డారు.
ఇది విన్న శిష్యులు “ఆచార్యులవారు, ఏమి పాపమలు చేశారని ప్రాయశ్చిత్త పడుతున్నారు ?” అని అనుకున్నారు.
ఒక శిష్యుడు,ఏమిటి ఆ పాపము నేను తెలుసుకోవాలి అని ఆచార్యుల వారిని అడిగాడు. దానికి శ్రీ ఆది శంకరాచార్య ఇలా సమాధానము చెప్పారు.
1. “నేను భగవంతుడిని సర్వాంతర్యామి, సర్వవ్యాపి అని వాక్కుతో స్తుతించాను. సృష్టి అంతా నిండి ఉన్న ఆ విశ్వేస్వరుడిని చూడడానికి మటుకు కాశి నగరానికి వచ్చాను. అంటే మనసా వాచా కర్మణా నేను నమ్మిన సత్యాన్ని నిత్య జీవితంలో ఆచరించలేక పోయాను.
అది నేను చేసిన మొదటి దోషం.
2. తైత్త్రియ ఉపనిషద్ లో “యతో వాచో నివర్తన్తే , అప్రాప్య మనసా సః ” భగవంతుడు మన బుద్ధికి ఆలోచనకి అందని వాడు” ఇది తెలిసి కూడా శ్రీ కాశి విశ్వనాధ అష్టకం వ్రాశాను. ఇది నేను చేసిన రెండవ తప్పు.
3. నిర్వాణ శతకం లో
“న పుణ్యం న పాపం, న సౌఖ్యం న దుఃఖం. న మంత్రో న తీర్తం, న వేదా న యజ్ఞః
అహం భోజనం, నైవ భోజ్యం న భోక్త. చిదానందరూపం శివోహం శివోహం“ అని వ్రాశాను.
అర్థము :
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖములు లేవు. మంత్ర జపములు తీర్థసేవలు , వేద యజ్ఞములు లేవు. భోజన పదార్థము, భోజనము, భోక్త (భుజించేవాడు) నేను కాదు!నేను చిదానంద స్వరూపుడను, శివుడను, శివుడను!
ఇంత వ్రాసికుడా నేను తీర్థయాత్రలు చేస్తున్నాను అంటే నేను వ్రాసినవి, చెప్పినవి నేనే పాటించటంలేదు. అందుకనే నేను చేసిన ఈ మూడు తప్పులని మన్నించమని ,ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటున్నాను.
నీతి :
మన ఆలోచన, తీరు, మాటా అన్ని ఒకే లాగా ఉండాలి అని శ్రీ ఆది శంకరాచార్యుల వారి కథ మనకి తెలియజేస్తోంది.
బయట ప్రపంచం మన పని తీరుని మట్టుకే చూస్తుంది. భగవంతుడు మాత్రం మన పని వెనక సంకల్పాన్ని , ఉద్దేశాన్ని కూడా చూస్తాడు.
“మనస్ ఏకం , వచస్ ఏకం , కర్మణ్యేకం!”
ఈ సూక్తి శ్రీ ఆదిశంకరాచార్యుల వంటి ఎందరో మహాత్ములు, స్వయంగా తమ జీవితంలో త్రికరణ శుద్ధితో, ఆచరించి మనకు చూపించిన యధార్ధమైన మార్గము
రామ రసం ప్రాముఖ్యత
దుష్టశిక్షణ, శిష్టరక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’గా విశేషంగా జరుపుకుంటాం.
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |
సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ఈ శ్లోకం మూడుమార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు. భక్తులకు శివసహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామనవమి రోజున ప్రతి గ్రామంలోను బెల్లం పానకం ... పెసర వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. సీతారాములకు జరిపే కళ్యాణ వైభవంలో మార్పులు వచ్చినా, తీర్థ ప్రసాదాలుగా ఆనాటి నుంచి ఈనాటి వరకూ పానకం ... వడపప్పును పంచడం వెనుక పరమార్థం లేకపోలేదు. శ్రీ రామనవమి నాటికి ఎండలు బాగా ముదురుతాయి. వేసవి తాపం వలన శరీరంలోని ఉష్ణోగ్రత పెరగడం వలన జీర్ణ సంబంధమైన వ్యాధులు తలెత్తుతుంటాయి. శరీరంలోని శక్తి చెమట రూపంలో బయటికి ఎక్కువగా పోవడం వలన నీరసం రావడం జరుగుతుంది.
ఇలాంటి అనారోగ్యాలను నివారించడం కోసమే ఈ రోజున బెల్లం పానకం ... పెసర బేడలతో వడపప్పును తీర్థ ప్రసాదాలుగా ఇస్తుంటారు. బెల్లం పానకం ... పెసరబేడలతో వడపప్పును స్వీకరించడం వలన అవి శరీరంలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంటాయి. శరీరానికి కావలసిన చల్లదనాన్ని... పోషకాలను అందిస్తూ ఉంటాయి.
జీర్ణ సంబంధమైన ... మూత్ర సంబంధమైన వ్యాధులు రాకుండా, వాత .. పిత్త ... కఫ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఒక రక్షక కవచంలా ఇవి పనిచేస్తుంటాయి. అందువలన బెల్లం పానకం ... వడపప్పే గదా అనే చులకన భావనతో ఇవి తీసుకోకుండా ఉండకూడదు. ఈ రోజున వీటిని తీర్థ ప్రసాదాలుగా స్వీకరించడం వలన సీతారాముల అనుగ్రహంతో పాటు ఆరోగ్య పరమైన ఔషధం లభించినట్టు అవుతుందని చెప్పొచ్చు.
మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా,ఆయా ఋతువులను,దేహారోగ్యాన్ని బట్టి మన పెద్దలు నిర్ణయించినవే . వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత ఋతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఋతువులో వచ్చే గొంతువ్యాధులకు… పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని వైద్యశాస్త్రం చెబుతోంది.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని కూడా చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ దెబ్బ’ తగలకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. అందుకని ఒక్క శ్రీరామనవమి రోజునే కాకుండా ఈ వేసవి లో వడపప్పు ,పానకం తీసుకుంటే మంచిది .
శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా...వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.
👏శ్రీరామ ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు.
వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ,
నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...
అజ మహారాజ వర్మణః పౌత్రాయ...
దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...
శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.
👏సీతాదేవి ప్రవర:-
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...
స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...
హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...
జనక మహారాజ వర్మణః పుత్రీం...
సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...
👉 ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి..గోత్రాభివృద్ధి కలుగుతుంది.
నీలోని గుడికి... 18 మెట్లు* *శ్రీ చాగంటి కోటేశ్వర రావు
మనిషి మనసులో దైవత్వం ఉంటే... మనిషి ఉనికి ఆలయం అవుతుంది. 2018లో ఈ 18 మెట్లను అధిరోహించి... మీలోని దైవత్వాన్ని చాటి చెప్పండి. మీలోని సుగుణాలతో... సమాజంలోపరివర్తనకు దారులు వేయండి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాల నుంచి జల్లెడ పట్టి... మీ కోసం అల్లిన విశిష్ఠ సుమమాల ఇది.
సృష్టిలో ఎదుటివారు చెప్పినది విని దాంట్లోని నిజానిజాలు తర్కించే శక్తి మానవుడి కొక్కడికే ఉన్నది. కానీ దురదృష్టం ఏమంటే నేటిరోజుల్లో నేను నమ్మిందే కరెక్టు, నా ఇష్టం వచ్చిందే నేను చేస్తాను అనడమే గొప్ప విషయంగా చలామణి అవుతోంది. మహాభారతంలో దుర్యోధనుని వెంట భీష్మద్రోణ కృపాచార్యులున్నా ఎందుచేత మట్టుపెట్టబడ్డాడనేదానికి ఒకటే కారణం చెబుతారు పెద్దలు. దుర్యోధనుడితో మహర్షులందరూ చెప్పారు... ‘‘నీవు చేస్తున్నది తప్పు. నీ పనివల్ల పాడైపోతావు. మా మాట విను. ఇలా చెయ్యకు’’ అన్నారు. అందుకాయన– ‘‘మీరు చెప్పేది మంచని తెలిసినా నేను పాటించను, మీరు చెప్పేది చెడని తెలిసినా నేను పాటించకుండా ఉండలేను’’ అన్నాడు. ఆ తత్వం పశువు కన్నా హీనం, అత్యంత ప్రమాదకరం.
1 . సంస్కారబలం ఉండాలి
సంస్కారమనే మాట గొప్పది. చదువు దేనికోసం? సంస్కారబలం కోసం. చదువుకు సంస్కారం తోడయితే మీరు లోకానికి ఏ హితకార్యమైనా చేయగలరు. యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. సంస్కారబలంతో మీకు తెలియకుండానే గొప్ప వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
2 . మోహాన్ని పోగొట్టుకోవాలి
మిమ్మల్ని పొగుడుతూ మాట్లాడేవాళ్లు ఎక్కడికెళ్ళినా దొరుకుతారు. మీ క్షేమం కోరి, మీతో కఠినంగా మాట్లాడేవ్యక్తి దొరకడం కష్టం. దొరికినా అటువంటి మాట వినేవారు ఉండరు. ఒకవేళ అలా ఇద్దరూ దొరికితే జన్మ సార్థకమౌతుంది. మోహంలో పడిన అర్జునుడికి భగవద్గీతంతా చెప్పాడు కృష్ణ పరమాత్మ. చివరన ‘నీకేం అర్థమయింది’ అని అడిగాడు. ‘‘నాకు మోహం పోయింది. స్మృతి కలిగింది. నేను యుద్ధానికి బయల్దేరుతున్నా’’ అన్నాడు అర్జునుడు.
3 . తప్పొప్పుల కూడిక
ఈప్రపంచంలో ఎవరూ ఒప్పులకుప్ప కాదు. నాలో దోషం తెలుసుకుంటే క్షమార్పణ అడుగుతా. మారీచుడు చెప్పాడు రావణుడికి... ‘‘నీకేంలోటు, ఇంతమంది భార్యలున్నారు. కాంచనలంక ఉంది, భటులున్నారు. రాముడి జోలికి వెళ్ళకు. వెళ్ళావా, అన్నీపోతాయి’’ అన్నాడు. అన్నీ విన్న రావణుడు ‘‘నువు చెప్పేది అయిపోయిందా. అయితే విను. నువ్వు చచ్చిపోవడానికి ఎలాగూ సిద్ధం. నామాట వింటే రాముడిచేతిలో చచ్చిపోతావు. వినకపోతే నా చేతిలో చస్తావు. ఎలా చచ్చిపోతావో చెప్పు’’ అన్నాడు. అంతేతప్ప నేను వింటానని అనలేదు. అలా అననందుకు అంత తపశ్శక్తి ఉన్న రావణాసురుడు చివరకు ఏమయిపోయాడు?
4. మాట వినడమన్నది తెలుసుకోవాలి
మహాభారతం సమస్తసారాంశం ఇదే. దుర్యోధనుడి దగ్గరకెళ్ళి మహర్షులందరూ చెప్పారు, కొన్ని గంటలపాటూ చెప్పారు... అన్నీ విన్నాడు. అన్నీ విని వెటకారమైన మాటొకటన్నాడు. అహంకారబలం అది – ‘‘నాకు ధర్మం తెలియదా! తెలుసు. కానీ అలా చెయ్యాలనిపించడం లేదు. అయినా నేను తప్పులు చెయ్యడమేమిటి! నాకు చెబుతారెందుకు’’ అన్నాడు. మహర్షులు మాట్లాడుతుంటే సరిగా వినకుండా తొడలుకొట్టాడు, చివరకు తొడలు విరిగి పడి పోయాడు.
5 . పెద్దలమాట శిరోధార్యంగా స్వీకరించు
తల్లి, తండ్రి, గురువులు, అనుభవజ్ఞులు, సమాజంలోని పెద్దలు చెప్పేది శ్రద్ధగా వినాలి. అయితే వారెప్పుడూ నీ దగ్గరే ఉండి ఇలా చెప్పడం సాధ్యపడుతుందా ? సాధ్యమే, ఎలానో తెలుసా? నేను చంద్రశేఖరేంద్ర భారతీ స్వామివారి అనుగ్రహభాషణం చదువుతుంటే, నా పక్కనే వచ్చి కూర్చుని స్వామి నాతో మాట్లాడుతుంటాడు. పరమాచార్య ప్రసంగాలు చదవండి, భారతీతీర్థస్వామి వారి ప్రసంగాలు చదవండి. పీఠాధిపత్యం వహించిన వారి వాక్కులు చదవండి. రామకృష్ణ పరమహంస, ఎపిజె అబ్దుల్ కలాం గారి మాటలు చదవండి.
6 .బాగుపడినా, పాడయిపోయినా కారణం–జడత్వమే
జడమనే మాట ఒకటుంది. జడం–అంటే చైతన్యముంటుంది, కానీ ప్రతిస్పందన ఉండదు. ఒక రాతిలో చైతన్యం లేదని చెప్పలేం. కానీ దానిలో ప్రతిస్పందన ఉండదు. మీరు వెళ్ళి ఒక చెట్టును కొట్టారనుకోండి. మీకు వినబడకపోవచ్చు కానీ, దానిలో ప్రతిస్పందన ఉంటుంది. ఈ ప్రతిస్పందించగల శక్తి జడత్వానికి విరోధి. జడత్వం–అంటే చైతన్యం ఉండి కూడా ప్రతిస్పందించలేని బతుకు. ఒక మాటంటే ప్రతిస్పందన ఉండదు. అలాంటి ప్రతిస్పందనలేని లక్షణంలో నుంచి జడత్వం ఆవహిస్తుంది. అసలు లోకంలో ఒక వ్యక్తి వృద్ధిలోకి వచ్చినా, ఒక వ్యక్తి పాడయిపోయినా కారణమేమిటని అడిగింది శాస్త్రం. అందుకు జడత్వమే కారణం.
7. ఆదర్శాలు చెప్పడమే కాదు... ఆదర్శంగా మారాలి
ఎప్పుడు ఏం చేస్తున్నా శ్రీరామాయణంలో చెప్పిన విషయాలను ఆదర్శంగా తీసుకుని ఆచరణలోకి తీసుకు వచ్చే ఒక కార్యశీలిని ‘నడిచే రామాయణం’ అంటారు. తాను చెప్పడం వేరు, తానే ఆ వస్తువుగా మారడం వేరు. చెప్పడం అందరూ చెప్తారు. ‘‘సర్వోపదేవ ఉపదేశాయ సర్వే వ్యాసపరాశరః:’’. ఇంకొకడికి చెప్పమంటే ప్రతివాడూ వ్యాసుడే, ప్రతివాడూ పరాశరుడే. కానీ నీవు చెప్పినదాంట్లో నీవెంత ఆచరిస్తావన్నదాన్నిబట్టి నీవు ఆదర్శంగా మారడమనే వస్తువు సిద్ధిస్తుంది.
8. ఎవరిలోపాన్ని వారే దిద్దుకోవాలి
నాకు ఇలా ఉండటం తప్ప ఇంకోలా రాదనుకోవడం చాలా భయంకరమైన స్థితి. అది దిద్దుకోవలసిన స్థితి. మనిషి తాను తనలో ఉండకూడని లోపాన్ని దిద్దుకుంటే పదిమందికీ అతను పనికొస్తాడు. పదిమంది మీతో మాట్లాడటానికి అవకాశం ఇస్తే, మీరేమీ చేయాలో మీరు నిర్ణయం చేసుకోగలరు. మీ అభిప్రాయానికి ఒక స్పష్టత వస్తుంది. అసలు అందరూ మీ దగ్గరికి రావడానికి భయపడిపోయే స్థితిని కలిగిస్తే, ‘‘మీరు ఎక్కడ ఎలా ఉండి ఏం ప్రయోజనం’’ చెప్పండి.
9. కోపాన్ని తగ్గించుకోవాలి
మీ కోపాన్ని మీకు మీరుగా పరిశీలించి దిద్దుకోవాలి తప్ప. నాకు కోపం వచ్చేసిందండీ. నేను కోపిష్టివాడినండీ అన్న తరువాత మీ ఆ కోపాన్ని తగ్గించగలిగే వాడు ఉండడు. దానికన్నా శత్రువు లేడు. నేను ఇలా ఉండవచ్చా? ఇంతటి కోపమేమిటి నాకు. ఈ కోపం వల్ల నేను సాధించేదేమిటి? అని కోపం వచ్చినప్పుడు మీరు కాసేపు ఏకాంతంలో కూర్చుని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. మీకు వచ్చిన కోపాన్ని మీరు పరిశీలనం చేసుకొని కోపాన్ని విడిచిపెట్టగలిగిన వాడెవరో వాడు దేశానికి, సమాజానికి పనికొచ్చి తీరుతాడు.
10. జీవితం ప్రణాళికా బద్ధంగా ఉండాలి
అధికారులు కింది వారిని సంప్రదించాలి. పని చేయడంలోని సాధకబాధకాలను తెలుసుకోవాలి. అధికారి చేతిలో వేలకోట్ల రూపాయల నిధులు విడుదల చేసే అధికారం ఉంటుంది. అవి సక్రమంగా ఖర్చుకావాలి. ప్రజలకు ఉపయోగపడాలి. అందుకు సరైన ప్రణాళిక ఉండాలి. రేపు మీరే ఆ అధికారి అయితే? అందుకే కత్తికి రెండు వైపులనూ అర్థం చేసుకుని ప్రణాళిక రచన చేయడానికి తగిన నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి.
11. వినండి, వినడం నేర్చుకోండి
ఒక సమస్యను బాగా పరిశీలించి, అవసరం అయితే కిందికి వచ్చి విని దానిని విశ్లేషణం చేసే నైపుణ్యం ఉండాలి. ఎవరైనా మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి రంధ్రాన్వేషణ చేయడం అన్నది జీవితంలో అలవాటు అయిపోయిందనుకోండి. అంతకన్నా ప్రమాదకరమైన అలవాటు ఇంకోటి లేదు. మీ జీవితంలో పైకి రావాల్సిన మార్గాలన్నీ మూసేసుకున్నట్టే. ఎవరు మాట్లాడుతున్నారన్నది కాదు. ఆ మాటలలో మనకు ఏమైనా సారాంశం అందుతుందా? అని ఎదురు చూసి, అందులో ఒక్క మంచి మాటను పట్టుకుని జీవితాన్ని మార్చుకోగలిగితే... వారి జీవితం చక్కబడుతుంది.
12. మీరు ఏది ఎందుకు చేస్తున్నారో స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి
నేను ఒక మాట చెబుతాను. మహాపురుషుడు వేరు, ఆ మహాపురుషుడు రాసిన పుస్తకం వేరు కాదు. వాల్మీకి వేరు, వాల్మీకి రామాయణం వేరు కాదు. ఇవి కలిసే ఉంటాయి. ఒక చంద్రశేఖరేంద్రస్వామివారు ఎప్పుడూ మీ పక్కన ఉండాలంటే ఆయన సందేశాల పుస్తకం మీ దగ్గర ఉండాలి.
13. మృత్పిండంలా కాదు... రబ్బరు బంతిలా ఉండాలి
పదిమందికి ఉపయోగపడకుండా ఎప్పుడు పోతారో తెలుసాండి. మీలో తట్టుకునే శక్తి లేనప్పుడు. మట్టి ముద్దను మీరు ఇలా పట్టుకుంటే పొరపాటున మీ చేతిలోంచి జారికిందపడిపోయిందనుకోండి. ఇహ అది పైకి లేవదు. అదే రబ్బరు బంతి అయితే ఎంత కిందపడిందో అంతపైకి లేస్తుంది. చిన్న పొరపాటు కూడా జరగకుండా మీ జీవితం ముందుకు సాగదు. మీరు ఎంత గొప్పవాళ్లయినా మీకు వంక పెట్టకుండా ఉండలేరు. ఎవరో ఒకరు వంకపెట్టారని మీరు మృత్పిండమై పాడైపోకండి. మీవల్ల ఏదో ఒకనాడు పొరపాటు జరగవచ్చు. జరిగిననాడు మట్టి ముద్దలా కిందపడిపోకండి.
14. నిరాశను దరిచేరనివ్వకండి
అబ్దుల్ కలాంగారి కెరీర్ ఎక్కడ నుండి ప్రారంభం. ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి. ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి ఆయన నిరాశతో ఋషికేశ్‌లోని ఒక స్వామిజీ దగ్గరికి వెళ్లి కూర్చున్నారు. స్వామిజీ అలా వెళుతూ నీరసంగా కూర్చున్న కలాంగారిని పిలిచి అడిగారు. ఏం ఎందుకలా కూర్చున్నావని. ఈయనన్నారు. ‘‘నేను ఫలానా ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లాను, అది పొందడం నాకిష్టం. కాని నేను సెలెక్ట్ అవ్వలేదు. ఏదో ఈ ఇంటర్వ్యూ అని మరో దానికి వెళ్లాను, సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నాకీ ఉద్యోగం చేయాలని లేదు. నాకిష్టంలేదు’’ ఆ స్వామీజీ ఒక చిరునవ్వు నవ్వి అన్నారు. ‘‘నీవు కోరుకుంటున్నదే దొరకాలని ఎందుకనుకుంటున్నావు. ఏమో ఈశ్వరుడు నీ ద్వారా ఈ జాతికి యేం చేయించాలనుకుంటున్నాడో’’ ఆ మాట ఆయన మీద పనిచేసింది. అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యాడు.
15. మంచి మంచి పుస్తకాలు చదవండి
ఏ పుస్తకం పడితే అది చదవకండి. వివేకానందుని ఉపన్యాసాలు చదవండి. మీకెంతో ధైర్యం వస్తుంది. పేడలో పురుగుపుట్టి పెరిగినట్లు బ్రతకకూడదు. మంచిగా బ్రతకడానికి కలేజా కావాలి. రామకృష్ణ పరమహంస కథలు చదవండి. చాలామందిలో తెలుగు మాట్లాడాలా? ఇంగ్లిషు మాట్లాడాలా అన్న సందిగ్ధం మొదలైంది. ఇంగ్లిషు బాగా చదువుకుని పాసవండి. చక్కగా తెలుగులో మాట్లాడండి. మీరు పెద్దయ్యాక రామాయణ గ్రంథప్రతుల్ని వేయి ముద్రించి పంచిపెట్టండి. ఆదివారాలు సాహితీ సభలకు వెళితే చక్కగా తెలుగులో మాట్లాడండి. పోతన గారి నాలుగు పద్యాలు చెబుతూ ప్రసంగం చేయండి. గురువుల పట్ల, పెద్దల పట్ల మర్యాదను సంతరించుకోండి.
16. ఆరాధించడం కాదు... ఆదర్శంగా తీసుకోవాలి
ప్రపంచ ప్రఖ్యాత బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌కు ఉత్థాన పతనాలున్నాయి. ఎంత కిందకి పడిపోయాడో అంతపైకి లేచాడు. టెండూల్కర్ క్రికెట్ చూడటం కాదు. టెండూల్కర్ వెనుక ఆ స్థాయికి ఎదగడానికి ఉన్న కారణం చూడండి. ఒక బాల్ వస్తున్నప్పుడు గ్రద్ద ఆకాశంలో ఉండి కోడిపిల్లను చూస్తున్నట్టు చూస్తూ ఉంటాను. బంతి ఎక్కడ పడుతుంది. దీన్ని ఏ డైరెక్షన్లో కొట్టాలి? అని... అంతే! స్ట్రోక్ అప్లై చేస్తాను అన్నాడు. అలా మీరు కూడా మీ గురువుల గురించి చెప్పేటటువంటి శీలాన్ని అలవాటు చేసుకోండి.
17. విజయాన్నీ, వైఫల్యాన్నీ సమానంగా తీసుకోవాలి
మనం చేసే ప్రతి ప్రయత్నంలో విజయం, వైఫల్యం ఉంటుంటాయి. ఒక చోట విజయం వరిస్తే ఇక నా అంతటి వాడు లేడని రొమ్మువిరుచుకుని తిరగకూడదు, అక్కరలేని భేషజాలకు పోయి పాడయి పోకూడదు. అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయత్నం ఫెయిల్ అయినట్లు కనబడుతుంటుంది. అలా ఫెయిలవడం నీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం కావాలి. కాబట్టి ఎప్పుడైనా ఎవరికైనా వైఫల్యం సంభవిస్తే బెంగపెట్టుకుని స్తంభించి పోకూడదు. మళ్ళీ ఉత్సాహంగా పూనికతో వృద్ధిలోకి రావాలి.
18. పొగడ్తకు పొంగిపోకండి
ఎప్పుడైనా సరే పొగడ్తకు మించిన మత్తు ఉండదు. పొగడ్తకు మించి లోకంలో పాడవడానికి మరొక కారణం కూడా కనిపించదు. జీవితంలో పొగడ్త అన్నది ఎంతమోతాదులో పుచ్చుకోవాలో అంతే మోతాదులో పుచ్చుకోవాలి. మందులే కదా అని మోతాదుకు మించి తీసుకుంటే విషమై చచ్చిపోతారు. అలాగే నీవు వృద్ధిలోకి రావడానికి పొగడ్త కూడా ఎంతవాడాలో అంతే వాడాలి.
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....