Wednesday, March 21, 2018

కర్మయోగము గీతా మకరందము

🕉🕉🕉🕉🕉🕉🕉🕉✡🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

03-42-గీతా మకరందము.
        కర్మయోగము
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ :- కామము ఇంద్రియములను , మనస్సును , బుద్ధిని వశపఱచుకొని ,జీవుని (ఆత్మను) మోహపెట్టుచుండ ఇక దానిని జయించుటెట్లు ? ఇంద్రియములను వశపఱచుకొనుటెట్లు ? అను శంకకు సమాధానము చెప్పదలచి జీవునియొక్క యథార్థ స్వరూపమును , ఆతని నిజస్థానమును , శక్తిని వర్ణించుచున్నారు -

ఇన్ద్రియాణి పరాణ్యాహుః 
ఇన్ద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా  బుద్ధిః
యో బుద్ధేః పరతస్తు సః ||

తా :- (దేహాదులకంటె) ఇంద్రియములు గొప్పవి . ఇంద్రియములకంటె మనస్సు గొప్పది . మనస్సుకంటె బుద్ధి గొప్పది . బుద్ధి కంటె గొప్పవాడెవడో ఆతడే ఆత్మ అని యిట్లు పెద్దలు చెప్పుదురు .

వ్యాఖ్య :- ఇంద్రియములను తొలుదొల్త నిగ్రహించవలెనని క్రిందటి శ్లోకమున చెప్పబడెను . అయితే వానిని నిగ్రహించుటెట్లు? ఆ పద్ధతిని రెండు శ్లోకములద్వారా తెలుపుచున్నారు . ఒక  వస్తువును నిగ్రహించవలెననిన , దానికంటె పైస్థానమందున్ననే సాధ్యపడును , లేక దానికంటె శక్తివంతమైన వస్తువును చేబట్టిననే వీలగును . కావున ఇంద్రియములను జయించవలెననిన వానికంటె పరమైనట్టి స్థానమందు జీవుడు స్థితిని బొందవలెను . దేహము రథమువంటిది . అది జడమైనది . ఇంద్రియములు గుఱ్ఱముల వంటివి. అవి ఒకింత చైతన్యవంతములు . కావున దేహముకంటె ఇంద్రియములు గొప్పవి . అట్లే ఇంద్రియములు కంటె మనస్సున్ను ; మనస్సుకంటె బుద్ధియు , బుద్ధికంటె ఆత్మయు గొప్పవి . ఒకదానికంటె మఱియొకటి అధికచైతన్య వంతములు , శక్తివంతములునైయున్నవి . మఱియు ఒకదానికంటె మఱియొకటి ఉపరి భాగమున కలవు . అన్నిటికంటెపైన ఆత్మ కలదు . ఒకదృష్టితో చూచినచో ఆత్మతప్ప తక్కిన బుద్ధ్యాదు లన్నియును జడములే యగును . ఆత్మయొకటియే చైతన్యవంతమైనది . ఆత్మసాన్నిధ్యమును (అగ్నిసన్నిధియందు  ఇనుపగుండువలె) బుద్ధ్యాదులు చైతన్యవంతములుగ గన్పట్టుచున్నవి . ఆత్మేతరములగు  ఆ బుద్ధ్యాది సమస్తపదార్థములున్ను ప్రకృతికి (మాయకు) లోబడి వర్తించుచున్నవి . అవి దృశ్యములు . ఆత్మయొకటియే దృక్కు .
          కాబట్టి  అట్టి ఆత్మస్థానముననున్నచో తక్కిన ఇంద్రియాదు లన్నిటిని సులభముగ నిగ్రహించవచ్చును . అపుడే పూర్ణఇంద్రియనిగ్రహము సాధ్యమగును . ‘రసోఽప్యస్య పరం దృష్ట్వా నివర్తతే’ (2-59) అని భగవాను డిదివఱకే ఈ భావమును వ్యక్తము చేసి యున్నాడు .ఇది వేదాంతమునందలి కీలకమగుటచే ముముక్షువులెల్లరు దీనిని చక్కగ గ్రహించవలెను . కావున ప్రతివాడును దేహమునందుగాని, ఇంద్రియములందుగాని , మనస్సు నందుగాని , బుద్ధియందుగాని నివసించుట తగదనియు వాని యన్నింటికి సాక్షిగా ,పరముగానున్న ఆత్మనుజేరి అచటనే నివాసమేర్పఱచుకొనవలెననియు , అపుడే పూర్ణ ఇంద్రియనిగ్రహము ,తద్ద్వారా కామాదుల జయము తత్ఫలితముగ సంసారదుఃఖబంధవిచ్ఛేదము సంభవించుననియు ఇచట స్పష్టమొనర్పబడినది . జీవుడు తన గొప్ప అంతస్తును తాను గుర్తించవలెను . తాను సర్వోపరిస్థానమందుగల ఆత్మయే యను నిశ్చయభావము గలిగియుండవలెను . అట్టి నిశ్చయముచే ఇంద్రియాదుల జయము అతిసులభముగ సిద్ధించును . ఆత్మయందు స్థావరము నేర్పరచుకొని ఇంద్రియాదులను దుష్టమృగములను గురిపెట్టి కాల్చవలెను . ఆ చోటనుండి తప్ప తక్కిన యేస్థానమునుండికూడ వానిని పూర్ణముగ వశపఱచు కొనుట సాధ్యముకాదని తెలుపుచు బుద్ధికి పరమైన ఆత్మయందే సదా నిలుకడను బొందులాగున భగవాను డీశ్లోకమున, రాబోవు శ్లోకమున హెచ్చరికచేయుచున్నారు.       

ప్ర :- ఆత్మయొక్క స్థానమును , శక్తిని నిరూపించుము ?
ఉ :- దేహమునకుపైన ఇంద్రియములు , ఇంద్రియములకు పైన మనస్సు , మనస్సునకుపైన బుద్ధి , బుధ్ధికిపైన ఆత్మ కలదు . ఇవి ఒకదానికంటె మఱియొకటి ఉత్తరోత్తర శ్రేష్ఠములై యొప్పుచున్నవి .

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

వారణాసి భూగృహంలో ఉగ్రవారాహీ విచిత్ర దేవాలయం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మీరు కాశి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్రవారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా? వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి.

కాకపోతే ఈ ఆలయం వేళలు ఉదయం 4:30 నుండి 8:30 వరకు మాత్రమే. కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు. తరువాత మూసేస్తారు. ఎందుకని అనేగా మీ సందేహం!

అమ్మవారు ఆ వారణాసి గ్రామదేవత. చీకటి పడింది మొదలు ఉదయం 3:30 వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది. అందువలన అమ్మవారి ఆలయంలో 4 గంటల పాటు పూజ చేసి క్రింద చిత్రంలో చూపిన విధంగా రెండు కన్నాల లో నుండి దర్శనం ఇస్తారు. ఒక కన్నం లో నుండి చూస్తే అమ్మవారి ముఖ భాగం, రెండవ కన్నం లో నుండి చూస్తే పాదాలు దర్శనం ఉంటుంది. అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ హారతి ఇచ్చేసి సెల్లార్ లో నుండి బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత ఆ కన్నాల లో నుండి దర్శనానికి అనుమతి ఇస్తారు. మొన్నీమధ్య జరిగిన ఓ సంఘటన ఇక్కడ చెప్పుకోవాలి.

క్రొత్తగా పెళ్ళైన జంట కొన్ని నెలల క్రితం అన్ని దేవాలయాలు దర్శనం చేస్తూ వారణాసి వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించారు. పూజారి ఎప్పటిలాగే కన్నంలో నుండి చూడమని చెబితే వినలేదు. పైపెచ్చు మూర్ఖపు వాదనకి దిగారు. అమ్మవారు ఉగ్రరూపంలో ఉంటుందా! భక్తులని చూడనివ్వదా! అంటే
కాదు నాయనా! శాంత కళ, ఉగ్ర కళ అని రెండు ఉంటాయి. శాంత కళతో ఉన్న అమ్మవారిని ఎదురుగా వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఉగ్ర కళ అంటే దుష్ట సంహరార్థం ఎత్తిన అవతారం. ఆ కళ ని సామాన్యులు తట్టుకోలేరు. నేను వెళితేనే ఆ కళ తట్టుకోలేక త్వరగా ముగించి వచ్చేస్తాను. సూర్యుడిని ఉదయం చూసినట్లు మధ్యాహ్నం చూడలేము. ఉదయం ఉన్నది ఆ సూర్యుడే. మధ్యాహ్నం ఉన్నది ఆ సూర్యుడే కదా అని చూస్తాను అంటే సాధ్యమేనా! కళ్ళు టపాసుల్లా పేల్లిపోతాయ్. దృష్టి పోతుంది. అలాంటిది దుష్ట శిక్షనార్థం ఎత్తిన అవతారాలు చూడాలంటే మన శక్తి సరిపోదు. చూడకూడదు. అని ఎంతో శ్రద్దగా చేబియే వినకుండా చూడనివ్వకపొతే కోర్ట్ కి వెళ్లి మీకు వ్యతిరేకంగా ఆర్డర్ తెచ్చుకుంటాం. అని మొండి పట్టుపట్టారు. దీంతో పోయే కాలం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ప్రవర్తన అని సెల్లార్ లో ఉన్న అమ్మవారి వద్దకి ఆ కొత్త జంటని తీసుకెళ్ళాడు. క్షణాల వ్యవధిలో పూజారి హారతి వెలిగించి ఇచ్చే లోపు ఇద్దరు కిందపడి మరణించారు.

ఈ మధ్య చాలామందిలో ఈ మొండితనం ఎక్కువైంది. శాస్త్రాలు ఇలా చెప్పాయి అంటే అలా ఎందుకు చెప్పాలి? మేము కోర్ట్ కి వెళ్లి వ్యతిరేకంగా తెచ్చుకుంటాం అంటున్నారు. దీనివలన ఎవరికీ నష్టం? మీతో పాటు మీవంశ నాశనం కూడ చేతులారా తెచ్చుకున్నట్లే.. మీవల్ల కేవలం మీవల్ల మీ వంశాలు తరతరాలు నాశనం అవుతున్నాయి. దుఃఖాల పాలై కష్టాల కడలిలో మునిగిపోతున్నారు. ఆనాడంటే జాతకాలు చూసి పూర్వికులు ఏమి చేయడం వలన ఏమి జరిగితుందో చెప్పేవారు. ఈనాడు అలాంటి జాతకాలు చూసి చెప్పేవారు లేరు. దీనివలన మూర్ఖత్వం ఎక్కువై పైశాచికంగా మారిపోతున్నారు. సమాజం మీద ద్వేషం పెంచుకుంటున్నారు. ఇది మీకు కాని మీ వంశానికి కాని మంచిది కాదు.

శాస్త్రం ఇలా చెప్పింది అంటే ఆలానే చేయాలి. ఎదురెళితే నష్టపోయేది మీరే మీ వంశంలోని వారే. దుష్టశక్తులను అంతం చేయాలంటే శాంతంగా ఉంటే దుష్టశక్తులు ఊరుకుంటాయా?మీరు శాంతంగా ఉన్నారు కాబట్టి మేము శాంతంగా ఉంటాం అంటాయా? ఇంకా రెచ్చిపోతాయి.

ఈ ఉగ్రవారాహి అమ్మవారిని పూజిస్తే దుష్టశక్తుల బెడద ఉండదు. ఎవరైనా దుష్ట ప్రయోగాలు మీమీద చేసినా వారికే బెడిసి కొడతాయి. కోర్ట్ కేసులు సమసిపోతాయి. అని శాస్త్రం..

ఎలా వెళ్ళాలి?
పడవలో వెళితే మన్మందిర్ ఘాట్ దగ్గర దిగి మెట్లెక్కి కుడిచేతి వైపు నుండి వెళ్ళొచ్చు.
రోడ్ మీద నుండి అయితే దశాశ్వమేధ ఘాట్ దగ్గర దిగి అక్కడ ఎవరిని అడిగినా చెబుతారు..

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ రామ నవమి మహిమ మరియు ప్రాముఖ్యత

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీరామ నవమి హిందువులకు అత్యంత ముఖ్య మైన పండుగ. హిందువులు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో ఈ పండగను జరుపుకుంటారు .

శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినాడు. ఆ మహనీయుని జన్మ దినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము, రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగినదని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈరోజునే జరిగింది.

ఈ చైత్ర శుద్ధ నవమి నాడు తెలంగాణ లో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు.

రామా అనే రెండక్షరాల రమ్యమైన పదం పలుకని జిహ్వ-జిహ్వే కాదు. శ్రీరామ నవమి పండుగను భారతీయులందరూ పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో, పల్లెపల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవడం ఓ సంప్రదాయం. భక్తుల గుండెల్లో కొలువై, సుందర సుమధుర చైతన్య రూపమై, కోట్లకొలది భక్తుల పూజలందుకొంటున్నాడు శ్రీరామచంద్రుడు.

శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.

సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యముగల క్షేత్రం భద్రాచలం దివ్య క్షేత్రం. భద్రుడు అనగా రాముడు అని అచలుడు అంటే కొండ అని అందుకే రాముడు కొండపై నెలవై ఉన్న దివ్య ధామము కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధిచెందిన పుణ్య క్షేత్రం.

శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడే గడపడమే ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి.

భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వము సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాలనుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణము, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమినాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్ట్భాషేకం రామునికి జరిగింది.

కోదండ రామకళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంటా....శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్ట్భాషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని పదభక్తికి మెచ్చి, హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామగ్రామాన రామాలయం నెలకొని ఉన్నాయి. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు.

శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

ప్రతియేడు భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణము చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతందనేది భక్తుల విశ్వాసం.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ...........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మనుష్య జీవితం- పరమార్ధం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

ఏబంధాలు లేకుండా ఏకాకి గా తపమాచరించు
ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి
మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో
అతని ఇంట పుత్రుడై జన్మిస్తాడు.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు. జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు. ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు. వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి. వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు. నాటినుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు. పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. పెద్దయాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు. రాజు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు. అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో... అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు. ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు. ప్రతి జాముకీ ఇలాటి హితవు ఒకటి ఉండాలి.
ఇంతకీ రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు. మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు. పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు. అతడు వెంటనె ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది. వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు. తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు

తస్మాత్ జాగ్రత జాగ్రత !

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర |
               అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
      సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
      జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా :-  కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు  విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
      ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
      విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
      యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత  జాగ్రత||

తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
      తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాదయః|
      ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
      తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
      ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
      సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ...........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

దిష్టి మంత్రం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పల్లె ప్రజలు నరదృష్టి కి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు.ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి.నీ దిష్టి, నా దిష్టి....థూ.థూ..థూ అంటూ దిష్టి తీస్తారు.ఆటోలు, లారీల వెనకాల 'బురీ నజర్‌వాలా తెరా మూహ్‌ హో కాలా' (దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా!) లాంటి వాక్యాలు రాస్తారు.'ఎవరి చూపు పడిందో ? పాడు కళ్లు,పాపిష్టి కళ్ళు వామ్మోఅని భయపడతారు.షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకుని, అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట.దృష్టిదోషం ,చెడుచూపు ,దయ్యం చూపు ,దిష్టి కి విరుగుళ్ళు గా ఎండు మిరపకాయలు, రాళ్ల ఉప్పు,నల్ల తాడు, నిమ్మకాయల దండ,పసుపు, సున్నం కలిపిన నీళ్లు,ఇంటి గుమ్మానికి వేళ్ళాడదీసిన గుమ్మడికాయ,తలుపుపై వెలసిన దెయ్యం బొమ్మ,కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ,చంటి బిడ్డ నుదిటిపై పావలా కాసంత నల్లటి చుక్క,పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క,మెడలో తావీజు... పచ్చిమిరపకాయలు,ఈతాకుల చీపురు, పాత చెప్పు లాంటివి వాడుతారు. హారతులివ్వడం, గుమ్మడికాయలు పగులగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి. లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి వే యడం లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినడం.. కర్పూరం బిళ్లను చుట్టూ తిప్పి దానిని వెలిగించటం నుదుటన అగరుతో బొట్టు పెట్టడం, మొలతాడు కట్టడం, మెడలో ఆంజనేయస్వామి లేదా ఇతర దేవతా మూర్తుల ప్రతిమలను కట్టడం కొత్తదుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లేదా ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టటం తినే ఆహార పదార్థాన్ని ఏడుమార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించటం ఆంజనేయస్వామిని ఉపాసించడం, ఈశ్వరారాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గ, కాళి, గౌరి తదితర దేవతలను ఆరాధించడం సంధ్యాసమయంలో దీపం పెట్టడం, అగరుబత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు లిఖించిన తాయెత్తును తీసుకొచ్చి, దానిని పిల్లల జబ్బకు లేదా మెడలోకట్టటం లాంటివి చేస్తారు.

ఈ విధంగానే కాక పసిబిడ్డలకు విబూదిని నుదుట శరీరం పైన రాస్తూ కింద ఇచ్చిన మంత్రం చదువుతూవుంటే కూడా మంచి ఫలితం ఇస్తుంది అంటారు.

*వాసుదేవో, జగన్నాధో, పూతనాతర్జనో హరిః*
*రక్షతు త్వరితో బాలం ముంచముంచ కుమారకం.*
*కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన*
*ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయో.*

*మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన*
*యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి,*
*బాలగ్రహాన్విశేషణ ఛిందిఛింది మహా భయాన్*
*త్రాహిత్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం.*

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ .......

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

పరమాత్మ-జీవాత్మలకు భేదం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

అజోపి సన్నవ్య యాత్నా భూతానా మీశ్వరోపి సన్
ప్రకృతిం స్వా మధిష్టాయ సంభవా మ్యాత్మమాయయా
భావం: నేను నిర్వికార నిరంజనుడైనను, చావు పుట్టుకలు లేనివాడనైనను అన్ని భూతములకు అధికారినైనను, నా మాయను వశము చేసికొని నా మాయవలన పుట్టుచున్నాను.
దీనిని బట్టి భగవానులకు సాకార నిరాకారములు రెండును గలవని రూఢియగుచున్నది. ఒక నాణెమునకు రెండు ప్రక్కలున్నచో అట్లే భగవానులు రెండు స్థితులతో ఎప్పుడు ఉన్నట్లు తెలియబడుచున్నది.

శ్రీరామకృష్ణ పరమహంస గురువునకు ఎరుక పడజేయదలచెను. తోతాపురి తన ఇష్టం వచ్చినప్పుడు సమాధిలో నుండగల స్థితిని సంపాదించి యుండెను. సమాధిలో ఉన్నప్పుడు అతడు బాహ్య ప్రపంచమును మఱచు చుండెను. ఒకనాటి రాత్రి తోతాపురి అమితముగా బాధపడుచుండెను. కూర్చుండినను, మరల లేచి నిలువబడినను, మరల పరుండి ఉన్నను అతని బాధ పోలేదు. ఆ సమయమున తన మనస్సును బ్రహ్మముపై ఏకాగ్రత పరచి దేహబాధను మరచుటకు తలపోసికొనియెను. కానీ మనస్సును ఆ స్థితికి తీసికొని వచ్చుటకు ముందే, మనస్సు జారి, దేహబాధను మరపించలేక పోయెను. ఎన్ని పర్యాయములు ప్రయత్నించినను నిష్ఫలమయ్యెను. దేహమును గురించి విసుగుపడి ‘‘ఈ పాడు దేహ సంబంధముచేత మనస్సు కూడ వశము కాకున్నది. ఈ దేహముతో సహవాసము చేసి నేనేల బాధపడవలయును? ఈ దేహమును మోయుట వలన నేమి ప్రయోజనము? కావున దీనిని గంగానది కర్పించి, బాధలను తుదముట్టజేసెదను’’ అని రూఢి పరచుకొని, తోతాపురి మనస్సును పరబ్రహ్మయందు చేర్చి గంగానదిలో దిగుటకు జొరబడెను. ఏమి ఆశ్చర్యము? ఎంత దూరము నడిచినను, గంగానది జలములు మోకాళ్ల నైనను తడుపలేదు. అవతలి ఒడ్డుకు చేరెను. ఆ రాత్రి గంగ ఎండి పోయినదా ఏమి? అర్ధరాత్రి సమయము. అవతలి ఒడ్డున ఇండ్లు, చెట్లు నీడల వలె నిలువబడి ఉండుట చూచెను. చకితుడై అతడిట్లు తలచెను. ‘‘ఈ రోజున నేను మున్గుటకు కావలసినంత జలమైనను లేకపోయెనేమాయాబల మింతయని చెప్పగలమా? భగవంతుని లీలచెంత చిత్రములు’’ అంతలోనే తన చుట్టుపక్కల ఎటు చూచిననూ జగన్మాద యగుకాళీ స్వరూపమే కనపడుచుండెను. ఆ జ్యోతిర్మయి ముఖమండలము చేతనే దిగంతరాళములు నిండి యుండెను. తన జీవిత కాలమంతయు బ్రహ్మమును గురించి ధ్యానించుచుండెనో ఆ బ్రహ్మమే ఈనాడు జగన్మాత అయ్యెను. మరల యథాస్థానమునకు చేరి తోతాపురి అగ్ని రగిల్చి చలికాచుకొనుచు కాళీ ధ్యానానంద నిమగ్నుడై యుండెను. ప్రాతఃకాలమయ్యెను. ఈ జరిగినదంతయు సవిస్తరముగా పరమహంస గారికి తెలియజేసెను. శ్రీరామకృష్ణ పరమహంస గారు చిరునవ్వు నవ్వి ఆ మా అమ్మను విశ్వసింపుమని చెప్పగా నీవు నమ్మనంటేనే నన్ను కూడా నమ్మవలదని చెప్పితివే ఇప్పుడు చూచితిమా? మాయమ్మ నిజమో! అబద్ధమో! బ్రహ్మము, శక్తి ఈ రెండును వేరుచేయబడునని కాననియు, అగ్ని, దాని యుష్ణమువలె ఉండుననియు మా యమ్మ చాలాకాలము నాడే బోధించినదిలే’’ యని తోతాపురికి చెప్పెను. కావున సాకార నిరాకారములు వేరుచేయబడనివని ఊహింపవలెను.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ............

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

హృదయార్పణం

🕉🕉🕉🕉🕉🕉🕉✡🕉🕉🕉🕉🕉🕉🕉
*మనిషి తనకు మానవజన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటాడు.*
*పూజా సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూ ఉంటాడు.*
*ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతా సూచకం అయితే కావచ్చునేమోగానీ, అసలు మనిషి భగవంతుడికి సమర్పించగల శక్తిమంతుడేనా?*
*ఇలా ఆలోచిస్తే, ఎంతమాత్రం కాదని చెప్పవచ్చు.*
*భగవంతుడిదే ఆ యావత్‌సృష్టి. అలాంటివాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే.*
*కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు వూరుకోదు.*
*పూర్వం ఒక యోగి భగవంతుణ్ని అర్చించడానికి సిద్ధమయ్యాడు.*
*అప్పుడు అతడిలో వివేకం ఉదయించింది.*
*పూజలో ఒక్కొక్క ఉపచారాన్నీ చేస్తూ భగవంతుడితో ఇలా విన్నవించుకున్నాడు- 'పరమేశ్వరా!*
*నీవు బ్రహ్మాండమంతా నిండి ఉన్నావు. కనుక నిన్ను ఎలా ఆవాహన చేయాలి?*
*అన్నింటికీ ఆధారమై నీవు ఉండగా నీకు ఆసనం ఎక్కడ వేయాలి?*
*నిరంతరం స్వచ్ఛంగా ఉండే నీకు కాళ్లు కడుక్కోవడానికి నీళ్లెందుకు?*
*పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా?*
*నిత్యనిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి?*
*ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి?*
*గోత్ర వర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా?*
*ఏ లేపనాలూ అవసరం లేని నీకు గంధం ఎలా పూయాలి?*
*నిత్య పరిమళుడవైన నీకు పూలు పెట్టడం ఎందుకు?*
*మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాలా?*
*నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా?*
*జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా?*
*నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు?*
*విశ్వానికే ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా?*
*అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి?*
*అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి?*
*వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నేను నిన్ను ఎలా స్తుతించాలి?'*
*ఈ పలుకుల్లో నిజం లేకపోలేదు.*
*భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే.*
*వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణనలోకి రానే రాదు.*
*అయినా భగవంతుడు మనిషి చేసే పూజలను స్వీకరిస్తున్నాడంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది.*
*నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు.*
*వస్తువులు అంతకన్నా కావు.*
*ఆయన మనిషి నుంచి హృదయార్పణను కోరతాడు.*
*భక్తితో స్మరిస్తే చాలునంటాడు.*
*కానీ మనిషి మనసు చంచలం. చపలం. స్థిరంగా ఒకచోట ఉండదు.*
*లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం కాదు.*
*అందుకే....... శంకరభగవత్పాదులు-*
*'ఓ పరమేశ్వరా! నా మనసు ఒక కోతి వంటిది.*
*అది ఎప్పుడూ సంసారవాంఛ అనే అడవిలో తిరుగుతూ ఉంటుంది.*
*భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టుకొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉంటుంది.*
*క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తుంటుంది.*
*అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను.*
*దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ అధీనంలో ఉంచుకో' అని ప్రార్థిస్తారు.*
*సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది.*
*'ఓ పరమేశ్వరా! బంగారుకొండ మేరుపర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు.*
*కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి.*
*షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు.*
*సమస్త మంగళాలనూ కలిగించే జగన్మాత సర్వమంగళయై నీ పక్కనే ఉంది.*
*కనుక నీకు నేనేమీ ఇవ్వలేను.*
*నా దగ్గర ఉన్నది ఒక్క మనసే. అది నీకు సమర్పిస్తున్నాను!'*
*అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు.*
*అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు.*
*భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు.*
*అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కావు.*
*హృదయార్పణమే పూజ.*
*నిశ్చల ధ్యానమే భక్తి*
*అంతేకానీ లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కావు. ఈ సత్యాన్ని మనిషి గ్రహిస్తే మేలు!
Written by _
గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...