Tuesday, December 17, 2013

గురువంటేఎవరు? ఎవరిని గురువుగా భావించాలి?

గురువంటే ఎవరు? ఆధ్యాత్మిక ప్రపంచములో ఈప్రశ్నకు చాలా లోతైనసమాధానం వున్నది. గురువంటే అజ్ఞానాంధకారాన్ని తొలగించేవాడు అని అర్ధము. తాను అజ్ఞానములో మునిగి ఇతరుల అజ్ఞానాన్ని తొలగిఁచబూనటం సాధ్యం కాదు. కనుక గురువు అనే పదానికి అర్హతపొందటానికి అందరూ తగరు. కనుక ఎఅవరిని బడితేవారిని గురువుగా భావించి పరుగులు తీయటం ప్రమాదకరము. గుడ్డివాని చేయి మరొక గుడ్డివాడు దారిచూపమని పట్టుకున్నట్లవుతుంది. గురువు అనేపదముతో సంబోధించాలంటే ఆయనలో మూడు లక్షణాలు ఉండాలి.
1 సర్వజ్ఞత :- ఆయనకు సర్వము తెలిసి వుండాలి ఆయనకు తెలియనిది ఈసృష్టిలో లేదు.
2 సర్వ వ్యాపకత :- ఆయన అణువుమొదలు బ్రహ్మాఁడమంతా వ్యాపించగలిగివుఁడాలి. తాను లేని చోటు లేదు కనుక భగవంతుని విశ్వవ్యాపకతా లక్షణము ఆయనకు వర్తించాలి
3 సర్వ సమర్ధత :- తాను సిశ్యున్ని రక్షించటం కోసము ఏదయినా చేయగల సమర్ధత కలిగియుండాలి. అవసరమయితే బ్రహ్మాడ నియమాలను సహితం మార్చగలిగేంతగా.
ఇటువంటి వారిని మనపు పరమ గురువులని భావించాలి. భగవంతుని పట్ల భక్తిభావము శాస్త్ర ప్రమాణము ఆయనలో కనపడాలి.
అటువంటివారిని పరిశీలించి,పరీక్షించిమరీ ఆశ్రయించాలేతప్ప. కేవలం భావావేశముతో గురువు…గురువు అని నాలుగురోజులు తిరిగి తరువాత ఇంకొక గురువును ఎన్నుకునే గుణము ఆధ్యాత్మికమ్ గా పతన హేతువవుతుంది.
శిష్యువిత్తాపహారులైన గురువులు కలిలో కావలసినంతమంది దొరుకుతారు. శిష్యచిత్తాపహారులు అరుదుగావుంటారని మహాత్ముల మాట. ఉల్లిగడ్దకు కూడ ఉపదేశమిచ్చేటి కల్ల గురువులు భువిన పుట్టెరయా అని తాతగారు[వీరబ్రహ్మేంద్ర] స్వాములవారు చెప్పి వున్నారు.
కనుక గురువును అని ఒకరిని ఎన్నుకున్నతరువాత మరల వారిని విడిచి పెట్టటం జరిగితే పతనమేతప్ప మరల ఏసద్గురువు వారిని అంగీకరించడు. వానికి సద్గతిలేదు.
మరి కలిలో గురువును ఆశ్రయించే అవకాశము లేదా ? గురువును ఎలా ఎన్నుకోవాలి? మనము తరించే అవకాశములేదా?
గురువు ఆవశ్యకత ఆధ్యాత్మిక మార్గములో ఎంత అవసరమో మహాత్ములయిన షిరిడి సాయినాధులు, రాఘవేంద్రులు లాంటి మహాపురుషుల జీవిత గాధలు చదివితే మనకు అర్ధమవుతుంది.
గురువును మనం గుర్తించలేనప్పుడు ఒక సులభమయిన ఉపాయము వున్నది. గురుచరిత్ర పారాయణము చెస్తూ వుంటే మనలోని దుర్గుణాలు నశించి,మన మనోభావాలు శుధ్ధపడి గురు సేవకు అర్హతకలిగి అప్పుడు గురువే మనలను వెతుక్కుంటూ వస్తాడు. భగవ్ంతుని అలా అనన్యంగా సేవిస్తూవున్నా గురువలాగే పరిగెత్తుకొస్తాడు లేగదూడదగ్గరకు గోమాత పరిగెత్తుకొచ్చినట్లు. అని రామకృష్ణ పరమహంస వారు చెబుతారు. గురుచరుత్ర మహిమను కూడా ఆచార్య ఎక్కిరాల భరద్వాజగారు అలానే వివరించారు. కనుక మనం ఎవరిని పడితే వారిని గురువు గురువు అని పిలవకుండా మీగురువుకొక్కరికే ఆపిలుపును పరిమితం చేసుకొని పవిత్రభావనతో సేవించాలి.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఆండాళ్‌ (గోదాదేవి)-ఆళ్వారులు

ఆండాళ్‌ (గోదాదేవి)-ఆళ్వారుల (విష్ణుభక్తులు)
ఆండాళ్‌ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్‌ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్‌ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది.
తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరి యాళ్వారు)తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. ( గోదా -భూమి, గోదాదేవి – భూమిలో ఉద్భవించినది)
ఆ పసిపిల్ల దిన దిన ప్రవర్ధమానమగుచు అందరిని సంతోషపెట్టుచుండెడిది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణనుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ, ఇంకిత జ్ఞానము వచ్చు సరికి శ్రీమన్నారాయణుని తప్ప మనుజుల నెవ్వరిని వరించబోనని తన నిశ్చయము తెలిపినది.
తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యము చేయుచుండట చూసి గోదాదేవి పరవశించెడిది. తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యము చూచుకొనుచు తిరిగి ఆ మాలలను యధాస్థానమున నుంచెడిది. ఒక నాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్రశాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగ మందలించాడు. అమ్మా! స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా! అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు సమర్పించకుండుటకు విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ యెనరించిన చిన్ని అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు.
వటపత్రశాయి చిరునగవుతో విష్ణుచిత్తుని చూసి నీవు చింతించవలదు. సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చని మాలికలు మాకు వద్దు. ఆమె విషయము మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని చెప్పాడు.
గోదాదేవి యుక్త వయస్సు నొందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్రశాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనస్సులో ఊహించుకొని ధనుర్మాసములో తోడి బాలికలతో స్నానము చేసి వటపత్రశాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగను, తోడి చెలులు గోపికలుగను, వటపత్రశాయి శ్రీకృష్ణునిగను, తాను ఒక గోపాంగనగ భావించి వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యములతో దినమున కొక్క పాశురమును ద్రావిడ భాషలో (తమిళములో)వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచూ చెలులతో కాత్యాయనీ వ్రతము చేసింది. ఒక రోజున తన తండ్రిని 108 దివ్యతిరుపతలలోని మూర్తుల కళ్యాణగుణములను చెప్పవలసిందిగా కోరింది. పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.
ఆ వర్ణనలను వింటూంటే శ్రీరంగమున వేంచేసి యున్న శ్రీరంగనాయకుని మహాదైశ్వర్యవిభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడ దలచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహ మెట్లు జరుగుతుందని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్రశాయి నీకుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్ము అని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అరోజు రాత్రి విష్ణుచిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడెదను. సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళములతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగమునకు తీసుకొని వెళ్లిరి.
ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహము చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయములోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది.
శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని చూసి నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి ఇతర సత్కారములొనర్చి పంపాడు.
గోదాదేవికి ఆండాళ్‌ ( భక్తుల మేలుకొనునది), చూడి కొడుత్తామ్మాల్‌ (స్వామికి తాను ముడుచుకుని పూమాలలు ఇచ్చునది) అని పేర్లు వచ్చాయి.
గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగత్‌ విఖ్యాతినంది అన్ని వైష్ణవదేవాలయాలలోను ధనుర్మాసమందు ప్రతియేటా అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పది రోజులు పాశురములను పాడుచు లోకోత్తరముగ సేవలు చేయుచున్నారు. ఆమె తిరుప్పవై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతింపబడుచున్నవి. తిరుప్పావై దివ్య ప్రభందమే. 30 రోజులు పాడినవి మేలుపలుకుల మేలుకొలుపులు.
12alvars
ఆండాళ్‌ గురించి ముచ్చటైన విషయం తిరువాలుపాటి రాఘవయ్యగారు ముచ్చటించారు. ఒక రోజున విష్ణుచిత్తుడు గోదాదేవి వెనకాల శ్రీవిల్లి వుత్తూరులోని శ్రీకృష్ణాలయమున ప్రవేశించారు. గోదాదేవి నిచ్చల చిత్తముతో శ్రీకృష్ణుని ధ్యానించింది. మీరు సర్వాంతర్యాములు. 108 దివ్య తిరుపతులలోను మీరే ఉన్నారు. ఇచ్చట మీరు శ్రీకృష్ణులు. శ్రీ రంగములో శ్రీరంగ నాయకులు. మీరే శ్రీరంగనాథులయిన నన్ను మీ దేవేరిగా పరిణయమాడండి. మీకు 100 కప్పుల చెక్కర పొంగలిని, 100 కప్పుల వెన్నెను సమర్పించుకొందును అని అన్నది.
శ్రీరామానుజుల వారు తమ సంచారములో శ్రీవిల్లి వుత్తూరులో శ్రీకృష్ణుని సందర్శించారు. కృష్ణునకు ఈ విధంగా విన్నవించారు. స్వామీ! జగత్పితా! మా సోదరి ఆండాళ్‌ (గోదాదేవి) తనను శ్రీరంగనాథుడు స్వీకరించిన మీకు 100 కప్పుల చెక్కెరపొంగలి, 100 కప్పుల వెన్నను సమర్పించుకొందును అని చెప్పింది. ఆమె మొక్కు తీరకుండా నుండగూడదు. నేను ఇప్పుడు మీకు ఆమె సోదరునిగా ఆమె మ్రొక్కును చెల్లించుచున్నానని 100 కప్పులు కాదు 100 కుండలు చెక్కెరపొంగలిని, 100 కుండలు వెన్నెను శ్రీవిల్లి వుత్తూరు వటపత్రశాయి శ్రీకృష్ణులకు సమర్పించి అందరి భక్తులకు ఆ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఆ దినము నుండి శ్రీరామానుజులు గోదాగ్రజలుగా ప్రసిద్ధి నొందారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శ్రీ దత్తాచల క్షేత్రం

దత్తాత్రేయని అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి తపోభూమి, ఆయన ప్రధాన శిష్యులు నామధారకుల వారు తపస్సు చేసి, నిర్యాణం పొందిన పుణ్యభూమి శ్రీ దత్తాచల క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ నెల 12 నుంచి ఐదు రోజుల పాటు బ్రహోత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న దత్తాచలక్షేత్రం, బ్రహ్మోత్సవ విశేషాలు.
భాగ్యనగరానికి 60 కిలోమీటర్ల దూరంలో మెదక్ జిల్లాలోని మాధుర గ్రామంలోని శ్రీ దత్తాచల క్షేత్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మాధురలోని శ్రీ దత్తాచల క్షేత్రం దత్తాత్రేయ స్వామి మరో అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న పుణ్యభూమి. అలాగే నృసింహ సరస్వతి పరమ శిష్యులైన నామధారకుల వారు ఈ క్షేత్రంలోనే సుదీర్ఘకాలం తపస్సు చేసుకుని, నిర్యాణం చెందారు. ఇంతటి మహిమాన్విత క్షేత్రంలో నిర్వహిస్తున్న దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 12న దత్త, సుదర్శన హోమాలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. 14న తొగుట పీఠాధిపతి శ్రీ మాధనవానంద సరస్వతి చేతుల మీదుగా సుదర్శన హోమాలు, ప్రవచనాలు జరుగుతాయి. 15న శ్రీదత్త, రుద్ర సహిత చండీయాగం నిర్వహిస్తారు. దత్తాత్రేయుని జయంతి అయిన మార్గశిర పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు.
తపోభూమి..దత్తాచల క్షేత్రం
సుమారు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీదత్తాచల క్షేత్రం దత్తాత్రేయుని అవతారం నృసింహ సరస్వతి స్వామి, వారి పరమ శిష్యులు నామధారకుల వారు సుదీర్ఘకాలం తపస్సు చేసుకున్న తపోభూమి. నృశింహ సరస్వతి స్వామి వారు పూర్వం శ్రీ దత్తాచల క్షేత్రంలో కొంతకాలం తపోదీక్ష చేపట్టారు. ఆ తరువాత ఆయన మహారాష్ట్రలోని గాణుగాపురం వెళ్లారు. ఆయన శిష్యులలో ముఖ్యుడు అయిన నామధారకుల వారు దైవాంశ సంభూతులు, వేదాధ్యయనపరులు. నృసింహ సరస్వతి స్వామి ఉపదేశం మేరు నామధారకులు వారు దత్తాత్రేయుల బోధల్ని ప్రచారం చేయసాగారు. దత్తాచలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న మంజీరా నది తీరంలో ఉన్న అటవీ ప్రాంతంలో నామధారకులు తపస్సు చేసుకునే వారు. ఆ సందర్భంలో అప్పటి రాజు నిజాం తన కూతురు రాచపుండుతో బాధపడుతుండటంతో విశ్రాంతి కోసం అటవీ ప్రాంతానికి తీసుకువచ్చారు. తపస్సు చేస్తున్న నామధారకుల వారిని చూసి, తన కుమార్తె జబ్బును నయం చేయాల్సిందిగా నిజాం ప్రార్థించాడు. “నేను సన్యాసిని. నా వద్ద మహిమలు ఏవీ లేవు.
మీరు దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. సమస్తమైన ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ పుష్కరిణిలో తీర ్థం దత్రాత్రేయున అనుగ్రహజలం. వాటిని సేవించండి” అని చెప్పారు. నిజాం కుమార్తె ఆ తీర్థం సేవించగా కొంతకాలానికి ఆమెకు జబ్బు నయం అయింది. దాంతో నిజాం నామధారుకుల వారికి కొంత భూమిని దానంగా ఇచ్చారు. ఆ తరువాత నామధారకుల వారు తన వారసుల్ని పిలిచి, నేను దత్తాచలంలో తపోనిష్ఠలో ఉంటాను. తపోభంగం చేయవద్దని కోరి, ఆ గుట్టలోని గుహలో తపస్సు చేస్తూ జీవితాన్ని చాలించారు. ఆ తరువాత తన కుమారుడు సూర్యభట్టుకు స్వప్నంలో కనిపించి తాను దత్తాత్రేయునిలో ఐక్యం అయ్యానని, ఏటా దత్తజయంతి సందర్భంగా దత్తాచల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కోరారు. అప్పటి నుంచి నామధారకుల వారసులు శ్రీదత్తాచల క్షేత్రంలో శక్తిమేరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 12 నుంచి 17 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
దత్తాత్రేయునికి ఆలయం
పటాన్‌చెరుకు సుమారు 40 కిలోమీటర్ల దూరంలో, హత్నూర మండల కేంద్రానికి చేరువన దత్తాచల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నృసింహ సరస్వతి స్వామి, నామధారుకుల వారు తపస్సు చేసుకున్న గుహ, నామధారకుల వారి సమాధి ఉన్నాయి. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని అభివృద్ది చేసి, శ్రీదత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ నిర్మాణం చేయాలని క్షేత్ర నిర్వాహకులు సంకల్పించారు. గ్రామస్తుల సహకారంతో పనులు కొంతవరకు చేపట్టారు. దత్తాత్రేయ స్వామివారి ఆలయంతో పాటు ఈ క్షేత్రంలో పుష్కరిణి పునరుద్ధరణ, నిత్యాన్నదాన సత్రం, గోశాల, వేదపాఠశాల, సత్రం నిర్మించే యోచనలో ఉన్నారు. బ్రహోత్సవాల్లో పాలుపంచుకోవాలనుకునే వారు, దత్తాత్రేయ క్షేత్ర అభివృద్ధికి తోడ్పడే వారు సభాపతి శర్మ, 9000167890లో సంప్రదించవచ్చు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

అరుణాచలం

శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణ గిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు.
అరుణాచలంలో అగ్నిలింగం ఉంటుంది. పేరు బట్టి ఆలోచిస్తే- అగ్నిలింగం దగ్గర అగ్నిహోత్రం ఉండాలి. కానీ అరుణాచలంలో శివలింగ దర్శనం చేసుకుంటే అక్కడ మనకి అగ్నిహోత్రం కనిపించదు. అటువంటప్పుడు దానిని అగ్నిలింగం అని ఎదుకు పిలుస్తారు అనే సందేహం కలగవచ్చు. అక్కడ రాశీభూతమయిన జ్ఞానాగ్ని ఉంది. అందుకే మన పెద్దలు జీవ కోటి యాత్రలో ఒక చోట అడ్డంగా గీత ఉంటుంది అని చెబుతారు. ఆ గీతకు ముందున్నది అరుణాచల ప్రవేశానికి ముందు గడిపిన జీవిత యాత్ర. ఆ గీతకు తరువాతది అరుణాచల ప్రవేశం జరిగిన తరువాతి జీవయాత్ర. అరుణాచలంలో అంతరాలయంలోని శివ లింగానికి కొంచెం దగ్గరగా కూర్చుంటే ఉక్కపోసేసి చెమటలు పట్టేసి వేడితో సతమతమయిపోతున్నట్టుగా అనిపిస్తుంది.
amaraLingeswarua swamy (1) amaraLingeswarua swamy (2)
ఒకానొకప్పుడు శంకరుడు మానవులకు నాలుగు వరాలిచ్చాడు. వీటిలో మొదటిది- “దర్శనాత్ అభ్రశదసి”. చిదంబరంలో పరమేశ్వరుడి జ్ఞానంతో దర్శించటం. ఇది కుదరకపోతే “జననాత్ కమలాలయే”. కమలాలయే అంటే తిరువారూర్. అక్కడ పుడితే మోక్షం లభిస్తుంది. కానీ పుట్టడం మన చేతిలో లేదు కదా! అందువల్ల ” కాశ్యాంతు మరణాన్ ముక్తిహి కాశీ”. వారణాసిలో ప్రాణం వదిలి పెట్టేస్తే మోక్షం ఇచ్చేస్తానన్నాడు. మరణం కూడా మన చేతుల్లో ఉండదు. అందువల్ల “స్మరణాత్ అరుణాచలే” అన్నాడు. అరుణాచల శివుడిని తలుచుకుంటే పాపరాశిని ధ్వంసం చేస్తాను అన్నాడు. అరుణాచల క్షేత్రం అంత గొప్పది.
అచలం అంటే కొండ. ఆ కొండకు ప్రదక్షిణం చెయ్యాలంటే పధ్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. ఆ కొండ కింద ఉన్నభాగాన్ని అరుణాచల పాదాలని పిలుస్తారు. అక్కడికి వెళ్ళిన భక్తులు ఆ కొండకి ప్రదక్షిణం చేస్తారు. అక్కడ ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే- కోట్ల జన్మలలో చేసిన పాపాలన్నీ దగ్ధమవుతాయి. భగవాన్ రమణులను చూడ్డానికి ఎవరయినా అరుణాచలం వెళ్తే ఆయన మొదటగా ‘గిరి ప్రదక్షిణం చేశారా?’ అని అడిగేవారు. ప్రదక్షిణానికి ఆయన ఒక నిర్వచనం చెప్పేవారు. ప్రదక్షిణంలో మొదటి అక్షరం ‘ప్ర’ అంటే సమస్త పాపరాశిని ధ్వంసం చేయటం. ‘నేను అరుణగిరికి ప్రదక్షిణ చేయడానికి బయలుదేరుతున్నాను..’ అని ఈశ్వరునికి నమస్కరించి మొదటి అడుగు తీసి ఇలా వెయ్యగానే, పాపరాశి ధ్వంసమవుతుంది.
రెండో అక్షరం ‘ద’ అంటే కోరికలు తీర్చటం. శివుడిని నమ్మి ప్రదక్షిణం మొదలుపెట్టారో వారికి జీవితంలో కావాల్సినవి ఇస్తాడు. మూడో అక్షరం ‘క్షి’ అంటే – ఈజన్మలో అనుభవించవలసినటువంటి పాపాలను ధ్వంసం చేయటం. ఇక నాలుగో అక్షరం ‘ణం’. అరుణగిరికి ప్రదక్షిణం చేసిన వాడికి పాపం పుణ్యం ఉండదు కనుక వాడు మోక్షానికి అధికారి అవుతాడు. గిరి ప్రదక్షిణం అనేటటువంటిది మనం అక్కడ ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి. అరుణ పర్వతానికి మీరు ఎన్నిమార్లు ప్రదక్షిణము చేసినా, ఒక్క పర్వతానికే చేయకూడదు. పర్వతానికి చుట్టూ ఉన్న అన్ని ఆలయాలను దర్శనం చేస్తూనే ప్రదక్షిణం చేయాలి. గిరి ప్రదక్షిణానికి బయలుదేరినప్పుడు మొట్టమొదట దక్షిణ దిక్కున కనబడే లింగం యమలింగం.
దక్షిణ దిక్కు యమధర్మరాజు ఉంటాడు. దక్షిణ దిక్కున ఉన్న యమధర్మరాజు అన్రుగహంతో ఆయువు వృద్ధి అవుతుంది. ప్రదక్షిణం చేస్తున్నప్పుడు నైఋతి దిక్కుకు వెళ్ళేటప్పటికి అక్కడ నైఋతి లింగం ఉంటుంది. అది రోడ్డు మీదికి కనపడదు. రోడ్డుకి కాస్త లోపలికి ఉంటుంది. నైఋతి లింగం దగ్గర కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవడమో, ఒక శ్లోకమో, పద్యమో, శివ సందర్భమో చెప్పుకోవాలి. ఇక ఉత్తర దిశగా ఉన్నది కుబేర లింగము. ఇక్కడ ప్రార్థన చేస్తే ఐశ్వర్య సంపత్తి కలుగుతుంది.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఉజ్జయిని

పూర్వకాలంలో ఉజ్జయినికి అవంతి అనిపేరు. అవంతి అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. వీటిలో మొదటిది స్త్రీ. రెండోది అక్క. ఇక్కడ ఉన్న అవంతి సాక్షాత్తూ జగదాంబ అయిన అమ్మవారి స్వరూపము. మన దేశంలో ఉన్న ఏడు మోక్ష పట్టణాలలో అవంతి ఉజ్జయిని కూడా ఒకటి. ఈ ఉజ్జయిని ఒకపక్క మహాకాళుడితో త ఎంత ప్రసిద్ధి పొందిందో మహాకాళి వల్ల కూడా అంతేప్రసిద్ధి పొందింది. ‘కాళ’ అనే శబ్దం లయకారకమై ఉంటుంది. పుట్టించడం ఎలా ఉంటుందో తినేయడం కూడా అలానే తినేస్తుంది. అందుకే భగవద్గీతలో పరమాత్మ ‘నేను కాలస్వరూపుడనై ఈ జగత్తును భక్షించుచున్నాను’ అంటాడు. నిన్న కనపడిన వస్తువు ఈ వేళ కనపడకపోయినట్లయితే దానికి ఇవాళ్లి తేదీని మరణ తేదీగా వేశారని గుర్తు. కాలమే ప్రాణులనన్నిటినీ ్రగహిిస్తూ ఉంటుంది. అటువంటి కాలం స్త్రీ స్వరూపంలో చెప్పినప్పుడు కాళిక అవుతుంది.
mahakaleshwar (1)
ఉజ్జయినిలోని రెండు స్వరూపాలూ కాల స్వరూపాలై ఉంటాయి. అందుకే ఒక వ్యక్తి- చెట్టు నుండి పండు పడిపోయినట్టు ఏ బెంగా లేకుండా శరీరం నుంచి విడివడేటటువంటి స్థితి కలగడానికి ఉజ్జయినికి తప్పనిసరిగా వెళ్లాలి. ఇది అందరికీ అవసరమయిన అందుబాటులో ఉండవలసిన క్షేత్రం. అందుకే భూమధ్యరేఖ వెడుతున్న చోట మధ్యలో ఈ క్షేత్రం ఉంటుంది. ఉజ్జయిని ఒకానొకప్పుడు అంతర్జాతీయ ఖ్యాతిని చూరగొన్నటువంటి పట్టణం. భోజరాజు, మహాకవి కాళిదాసులు ఇద్దరూ తిరిగినటువంటి ప్రాంతం ఉజ్జయిని. పూర్వకాలంలో ఆ ఉజ్జయిని పట్టణంలో వేదప్రియుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద ప్రియుడు నియమ నిష్ఠలతో ఉంటూ శివార్చన శీలుడై షట్కాలాలలోనూ శివపూజ చేసేవాడు. వేదధర్మాన్ని పాటించేవాడు. ఈ బ్రాహ్మణుడికి నలుగురు కుమారులు. ఈ నలుగురు కుమారులు కూడా ధర్మానుష్టానుపరులే. ఆయన పెద్ద కొడుకు పేరు ‘దేవప్రియుడు’. రెండవవాడి పేరు ‘ప్రియమేథుడు’. మూడో కుమారుడి పేరు ‘సుకృతుడు’. నాలుగవ కుమారుడి పేరు ‘సువ్రతుడు’. ఈ నలుగురూ పెద్దవారయ్యారు. ఒకసారి ఆ పక్కనే ఉన్న పర్వత శిఖరాలలో ఒక రాక్షసుడు బయలుదేరాడు. వాడి పేరు దూషణుడు. అందరినీ ఇబ్బంది పెడుతూ చిట్టచివరకు ఎవరూ ఈశ్వరార్చన చేయలేనటువంటి స్థితిని కల్పించాడు.
ఒక్క ఉజ్జయినిలో మాత్రం ఈ నలుగురు పిల్లలు శివార్చన చేస్తున్నారని తెలుసుకున్నాడు. తెలుసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చి, ‘మీరు పార్థివ లింగానికి అర్చన చేయడానికి వీలులేదు. మీరు నన్ను మాత్రమే అర్చించాలి. నాకు మాత్రమే పూజలు చేయాలి. పశుపతి ఎంతటివాడు? ఇటువంటి వాళ్ళను ఎందరినో నేను గెలిచాను. మీరు శివపూజను విడిచిపెడతారా లేక లింగాన్ని ధ్వంసం చెయ్యనా’ అని బెదిరించాడు. కానీ ఆ నలుగురు ఏ మాత్రం బెదరలేదు.
దూషణుడు ఆ నలుగురు బ్రాహ్మణుల మీద కత్తి ఎత్తాడు. అయినా వారు బెదరలేదు. ‘హర ఓం హర హర’ అంటూ శివ పారాయణ చేస్తూ కూర్చున్నారు. అప్పుడు అక్కడ ఉన్న చిన్న పార్థివ లింగం నుండి మహాకాళ స్వరూపంతో పరమేశ్వరుడు బయటకు వచ్చి, ఒక్కసారి హుంకరించాడు. ఆ హుంకారానికి దూషణుడి సైన్యాలు బూడిదరాశులై పడిపోయాయి.
కానీ ఆ వేడికి అక్కడే కూర్చున్న ఈ నలుగురు బ్రాహ్మణ పిల్లలు మాత్రం బెదరలేదు. వారు ఆ మహాకాళ రూపానికి స్తోత్రం చేశారు. అప్పుడు భక్తుల ప్రార్థన మేరకు శివుడు మహా కాళ లింగ రూపంలో వెలిశాడు. ఉజ్జయినిలో శివ లింగాలు మూడంతస్థులుగా ఉంటాయి. అన్నింటి కన్నా కింద ఉండేది మహా కాళ లింగం. మధ్యలో ఉండేది ఓంకార లింగం, ఆపైన ఉండేది నాగేంద్ర స్వరూపమయిన లింగం. ఉజ్జయినిలో ఒక చిత్రం ఉంది. సంవత్సరానికి ఒకసారి వర్షాకాలానికి ముందర ‘పర్జన్యానుష్ఠానం’ అని ఒక అనుష్ఠానం చేస్తారు. ఇది పూర్తి అవగానే ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి వర్షం కురుస్తుంది. ఇప్పటికీ ఉజ్జయినిలో ఈ తంతు కొనసాగుతోంది. ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు వెలిసిన ప్రాంతం కిందనే శంఖుయంత్రం అనే చాలా ఆశ్చర్యకరమయిన యంత్రం ఉందని పెద్దలు నమ్ముతారు. శంఖం విజయానికి గుర్తు. అందుకే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం అయే ముందు ధృతర్రాష్టుడు సంజయుడిని కౌరవులు ఏమి చేస్తున్నారని అడుగుతాడు. అపుడు సంజయుడు పాండవులందరూ శంఖాలు ఊదుతున్నారని చెప్పాడు. ఎవరు శంఖాన్ని ఊదాడో వానికి విజయం కలుగుతుంది. ఈశ్వరార్చనలో శంఖాన్ని ఊదుతారు. మహాకాళేశ్వర లింగం కింద శంఖయంత్రం ఉంది. అందుకని మహాకాళేశ్వరుడి దగ్గరకు వెళ్ళి దర్శనం చేసుకున్నవాడు ఎటువంటి విజయాన్నయినా పొందుతాడు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉజ్జయినిలో ఉన్నటువంటి అంతరాలయంలో రెండు జ్యోతులు వెలుగుతుంటాయి. ఆ రెండు జ్యోతులను అఖండ దీపాలని పిలుస్తారు. ఉజ్జయిని దేవాలయంలో ఒక చిత్రమయిన మందిరం ఉంది. దానిని భస్మ మందిరమని పిలుస్తారు. అక్కడ ఆవుపేడతో విభూతిని తయారుచేస్తారు. భస్మమందిరంలోకి ఆవుల్ని తీసుకు వచ్చి వాటి పేడను ఎంత వరకు కాలిస్తే అది చక్కటి విభూతిగా మారుతుందో అటువంటి విభూతిగా మార్చి ఆ విభూతితో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఉజ్జయినిలో చేసేటటువంటి విభూత్యాభిషేకం రెండు రకాలుగా ఉంటుంది. తెల్లని పలచని బట్టలో మెత్తటి విభూతిని పోసేసి మూట కట్టేస్తారు. ఆ మూటను శివలింగం పైన పట్టుకుంటారు. మరో మూటతో దానిని కొడతారు.
Mahakaleshwar-Temple-Ujjain
అలా కొట్టినప్పడు ఒక్క శివలింగం ఉన్న చోటే కాదు, మొత్తం అంతరాలయం అంతా భస్మంతో నిండిపోతుంది. అలా నిండిపోతున్నప్పుడు శంఖాలు, భేరీలు, పెద్దపెద్ద మృదంగాలను కూడా మ్రోగిస్తారు. అపుడు అక్కడ మీరు ఒక అలౌకికమయిన స్థితికి వెళ్ళిపోయినటువంటి అనుభూతిని పొందుతారు. రెండవ రకం అభిషేకంలో పురుషుల్ని సంప్రదాయక దుస్తులతో తెల్లవారు జామున దేవాలయం లోపలికి పంపిస్తారు.అప్పుడే శ్మశానంలో కాలిన శవం తాలూకు భస్మాన్ని అర్చకులు పట్టుకు వచ్చి ఇస్తారు. ఆ భస్మపాత్రను అందరికీ ఇస్తారు. చుట్టూ కూర్చుని ఆ శవ భస్మంతో స్వామికి అభిషేకం చేస్తారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

శని రాజునైనా బిక్షకునిగా మారుస్తుంది

జాతకంలో శని ప్రభావం ఎక్కువగా ఉంటే కుటుంబ సంబంద బాందవ్యాలపై తగువుపెట్టి చివరకు ఒంటరితనాన్ని అనుభవిస్తు సన్యాసి జీవితాన్ని అనుభవిస్తు తపస్సు చేసుకుంటు వైరాగ్య జీవితాన్ని గడుపుతాడు.
ప్రతిరోజూ మధ్యాహ్నం బెల్లం కలిపిన నల్లనువ్వులు కాకులకు ఆహారంగా పెట్టడం ద్వారా శనిగ్రహ ప్రభావంచే కలిగే ఈతిబాధలు, ఆర్థిక పతనం, వ్యాపారంలో నష్టం, ఉద్యోగావకాశాలు చేజారిపోవడం వంటి దుష్ఫలితాల నుంచి తప్పుకోవచ్చు.
అలాగే శనిగ్రహ దోష నివారణకు హనుమంతుడిని ప్రతి శనివారం దర్శించుకుని నేతితో దీపమెలిగించడం మంచిది. ఇంకా శనివారం రోజున నువ్వుండలు కానీ, లేదా నువ్వులతో చేసిన ఏదైనా పిండివంటలను సాధువులకు దానం చేయండి.
పుష్యమి నక్షత్రం రోజున నల్లనువ్వులు, నల్లని వస్త్రంలో ఉంచి, రెండు కిలోల బియ్యం కూడా వేరే వస్త్రంలో మూటగా చుట్టి బ్రాహ్మణునికి దానం చేయండి. ఇలా చెస్తే శనిగ్రహ దోషాలచే కలిగే దుష్ఫలితాలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా నీలిరంగు పువ్వులు, నల్లని వస్త్రాలు, నూనె దానం, స్టీల్ పాత్రలు దానం చేయాలి
“ఓం హ్రాం హనుమతే నమ:
ఓం నమో రామచంద్రాయ నమ:”
అనే మంత్రాలను ప్రతినిత్యం పఠించినట్లైతే శనిగ్రహ నివారణ జరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది

అఖండ తేజోమూర్తి ఆంజనేయస్వామి

చారిత్రక కధనం ప్రకారం – కర్ణాటకలోని, హంపీవద్ద గల ‘ గుంలవ్య తోట ‘ అనే గ్రామానికి18 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ పర్వతంలోని ‘అంజని గుహ ‘లో , పంపానదీ తీరం వద్ద ఆంజనేయ స్వామి జన్మించినట్లు ఉంది. వాల్మీకి రామాయణంలోని యుధ్ధకాండలో కేసరి బృహస్పతి కుమారుడనీ, రామరావణ యుధ్ధసమయంలో ఆయన రాముని సేనలో చేఱి యుధ్ధంచేసినట్లు ఉంది. అయోధ్యలో దశరధ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు , యజ్ఞపురుషుడు ప్రసాదించిన పాయసాన్ని, మహారాజు ముగ్గుఱు రాణులకూ పంచగా, సుమిత్రభాగమున్నపాత్రను ఒక గ్రద్ద తన్నుకుని ఆకాశంలో వెళుతూ విడచి వేయడంతో అదివెళ్ళి శివుని భక్తితో ప్రార్ధిస్తున్న అంజనాదేవి దోసిట్లోపడినట్లూ, ఆమె దాన్ని దైవప్రసాదంగా భావించి భక్తితో స్వీకరించగా , ఆమెకు ఆంజనేయులు జన్మించినట్లు రామాయణంలోఉంది. అందుచేతే శ్రీరాముడు హనుమను తన నాల్గవ సోదరునిగా ఆదరించారు.

images
ఆంజనేయులు బాల్యంలో సూర్యుని పండుగా భావించి నోట కఱచుకోగా, దేవేంద్రుని వజ్రాయుధ ఘాతానికి చెంప ఉబ్బడంతో ‘ హనుమ ‘అనే నామం వచ్చినట్లు కూడా చెప్తారు. సూర్యుని హనుమ తన గురువుగా భావించి సేవించి ,ఆ సూర్యదేవుని నుండి సకల శాస్త్రజ్ఞానం పొంది , గురుదక్షిణగా సూర్య కుమారుడైన , సుగ్రీవుని సేవించను అంగీకరిస్తాడు. ఇది ఆయన సత్య వాగ్ దీక్షకూ, గురుభక్తికీ తార్కాణం.
మహిరావణుడు యుధ్ధసమయంలో రామలక్ష్మణులను పాతాళంలో దాచినపుడు , ఆoజనేయస్వామి వెళ్ళి, మహిరావణుడు వెలిగించిన ఐదు అఖండ దీపాలను ఆర్పవలసివచ్చి పంచముఖాలతో – అనగా వరాహ ముఖంతో ఉత్తర దిశన, నరసింహ ముఖంతో దక్షిణ దిశన, గరుడముఖంతో పడమర దిశన, హయగ్రీవముఖంతో ఆకాశంవైపు, తన హనుమ ముఖంతో తూర్పు దిశన ఉన్న ఐదు దీపాలను ఒకేసారి ఆర్పేందుకు ‘ పంచముఖ ఆంజనేయులుగా రూపుదాల్చారు. ఇది ఆయన స్వామి కార్య దీక్షకు నిదర్శనం .
యుధ్ధానంతరం హనుమ హిమాలయ పర్వతం మీద నివసిస్తూ ‘హనుమద్రామాయణాన్ని’ తన గోళ్ళతో వ్రాసినప్పుడు వాల్మీకి మహర్షి వచ్చి, ఆ రామాయణాన్నిచదివి, అసంతృప్తిని వ్యక్తపఱచగా , హనుమ కారణం అడుగుతాడట!, అప్పుడు వాల్మీకి మహర్షి ‘ఈ రామాయణంలో హనుమ పాత్రను చిత్రించనందున అది అసంపూర్తిగా ఉన్నది కనుక తనకు అసంతృప్తికలిగించినదని ‘ చెప్పారు. అప్పుడు హనుమ తన రామాయణాన్ని ఉపసంహరించుకున్నారు ! ఎంత నిరాడంబరత !! అందుకే హనుమను ధ్యానిస్తే మంచి గుణాలు కలుగుతాయని, గర్వాహంకారాలు పోతాయనీ అంటారు. అందుకే అందఱూ హనుమను పూజిస్తారు రామునితో సమానంగా ! అందుచేత భారతదేశంలోనే గాక ప్రపంచ దేశాలలో కూడా హనుమాన్ ఆలయాలు విలసిల్లి ఉన్నాయి

ఇట్లు 
మీ  సుబ్రహ్మణ్య శర్మ 

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...