Friday, August 23, 2013
వారానికున్న ఏడురోజుల్లో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క విశిష్టత ఉంది. దాని ప్రకారం ఒక్కో దేవతకూ ఒక్కో రోజు ప్రీతికరమైనది. అందుకే ఏ రోజున ఏ దేవుడిని లేదా దేవతను పూజించాలో, మన జనన మరణాలపై ప్రభావం చూపే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు అనుకూలమైన రోజు ఏదో, వ్రతం ఏదో ముందుతరాలవారు చెప్పారు. మనమూ వారిని అనుసరిద్దాం! ఆ శుభఫలాలను అందుకుందాం!
రోజుకో దేవతారాధనతో జీవితాలను సుగమం, శ్రేయోదాయకం చేసుకోవడం అత్యంత సులువు.
ఆదివారవ్రతం: చర్మ, నేత్రవ్యాధుల నిర్మూలనకు, సంతానక్షేమానికి, వైవాహిక జీవిత అనుకూలతకు ఆదివారంనాడు సూర్యారాధన చేయాలి. అందుకోసం ఆదివారంనాడు ఉపవాసం ఉండి, సూర్యారాధన లేదా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఒక వ్రతంలాగ ఆచరించాలి. ఈ వ్రతాన్ని శుక్లపక్ష ఆదివారంనాడు ఆరంభించి, ఆ సంవత్సరంలో వచ్చే అన్ని ఆదివారాలూ ఆచరించాలి. అలా ఆచరించలేనివారు కనీసం 12 వారాలైనా చేయాలి.
వ్రతవిధానం: ఆదివారంనాడు ఉదయమే మేల్కొని తలారా స్నానం చేసి సూర్యునికి ఎదురుగా నిల్చుని సూర్యమంత్రాన్ని లేదా ఆదిత్యహృదయాన్ని మూడుసార్లు చదవాలి. ఆపైన గంగాజలాన్ని, లేదా శుద్ధోదకాన్ని, ఎర్ర చందనాన్ని, దర్భలను సూర్యనారాయణుడికి సమర్పించుకోవాలి. ప్రతి ఆదివారమూ ఉపవాసం ఉంటే మంచిది. లేని పక్షంలో ఉద్యాపన చేసే రోజున మాత్రం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. పగలు పూజానంతరం ఎవరైనా దంపతులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి.
సోమవార వ్రతం: అడగగానే వరాలనందించే బోళాశంకరుడిని, మనఃకారకుడు అయిన చంద్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు సోమవార పూజ శ్రేష్ఠమైనది. శ్రావణ, వైశాఖ, కార్తీక, మార్గశిర మాసాల్లో శుక్లపక్ష సోమవారం నాడు ఈ పూజను ప్రారంభించాలి. 16 వారాలు లేదా కనీసం 5 వారాలపాటు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం: చెరువు, నది, సముద్రం, కొలను లేదా బావి నీటిలో ‘ఓం నమశ్శివాయ’అని స్మరించుకుంటూ స్నానం చేయాలి. శివపార్వతుల అష్టోత్తరం, అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ తెల్లటి పూవులు, శ్వేతగంధం, బియ్యంతో చేసిన పిండివంటలు, పంచామృతాలు, శ్వేతాక్షతలు, గంగాజలం, బిల్వపత్రాలతో పూజించాలి. ఈరోజు ఉపవాసం ఉంటే మంచిది. చంద్రగ్రహ ప్రతికూల ప్రభావం తొలగేందుకు తెలుపు వస్త్రాలు, ముత్యం పొదిగిన వెండిఉంగరాన్ని ధరించాలి. పూజాసమయంలో చంద్రాష్టోత్తరాన్ని పఠించాలి. చివరివారంలో దంపతులకు భోజనం పెట్టి, చందన తాంబూలాలతోపాటు పాలు, పెరుగు, తెలుపురంగు వస్తువులను లేదా ఫలాలను దానం చేయాలి.
మంగళవారం: ఆంజనేయుడి అనుగ్రహం పొందడానికి, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆశీస్సులను అందుకోవడానికి, కుజగ్రహ సంబంధమైన దోషాలను తొలగించుకోవడానికి మంగళవారవ్రతం ఆచరించాలి.
వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. కనీసం 21 వారాలపాటు చేయాలి. ఈ వ్రతాచరణ ద్వారా శత్రుజయం సిద్ధిస్తుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. రక్తపోటు తదితర రోగాలు, దీర్ఘవ్యాధులు, రుణబాధలు ఉపశమిస్తాయి. రాగిపాత్ర, ఎరుపు రంగు పూలు, ఎర్రటి వస్త్రాలు, కొబ్బరికాయలు ఈ పూజలో ఉపయోగించాలి. కుజగ్రహ దోష నిర్మూలనకోసం ఈ వ్రతాచరణ చేసేవారు కుజాష్టోత్తరం లేదా మూలమంత్రం పఠించాలి.
బుధవారవ్రతం: స్థితికారకుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందగోరేవారు, బుధగ్రహ వ్యతిరేక ఫలాల కారణంగా విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో వెనుకబడుతున్నవారు ఈ వ్రతాచరణ చేయాలి.
వ్రతవిధానం: ఏ మాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం నాడు ప్రారంభించి, 21 వారాలపాటు ఈ వ్రతాన్ని ఆచరించాలి. బుధవారం పూజచేసేవారు వంటకాలలో ఉప్పును ఉపయోగించకూడదు. ఆకుకూరలు, పచ్చ అరటిపండ్లు, పచ్చద్రాక్ష మొదలైన ఆకుపచ్చరంగులో ఉండే ఆహార పానీయాలను మాత్రమే సేవించాలి. పచ్చరంగు వస్త్రాలు, పచ్చరంగు కూరలు, పండ్లు, పచ్చరంగు వస్తువులు దానం చేయాలి. గోవులకు పచ్చగడ్డిని తినిపించడం శ్రేష్ఠం. ముడి పెసలతో చేసిన పదార్థాలను లేదా పిండివంటలను నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
గురువారవ్రతం: మానసికప్రశాంతత, ఆధ్యాత్మిక ఉన్నతి, అపారజ్ఞానం, పాండిత్య అభివృద్ధిని పొందాలనుకునేవారు గురువార వ్రతాచరణ చేయాలి. ఇందుకోసం దక్షిణామూర్తి, షిర్డిసాయి, రాఘవేంద్రస్వామి, దత్తాత్రేయుడు లేదా తమ గురువును ఆరాధించాలి. గురుగ్రహ వ్యతిరేక ఫలితాలైన విద్యాఉద్యోగ ప్రతికూలతలు, అవమానాలు, అవహేళనలనుంచి తప్పించుకోవాలనుకునేవారు గురువార వ్రతం చేయాలి.
వ్రతవిధానం: ఏ నెలలోనైనా శుక్లపక్షంలోని మొదటి గురువారం నాడు ఆరంభించి కనీసం పదహారు వారాలు లేదా మూడేళ్లపాటు చేయాలి. స్నానానంతరం పసుపు రంగు వస్త్రాలు, పసుపు రంగు కంకణాన్ని ధరించి, కంచులోహ పాత్రలో పసుపు అక్షతలను, పసుపు పూవులను, పసుపును, పసుపు కలిపిన చందనాన్ని వినియోగించి సంబంధిత స్వామి అష్టోత్తరాలతో పూజించాలి. అనంతరం పసుపు రంగు అరటి, మామిడి లేదా ఆ వర్ణంలో ఉండే ఇతర ఫలాలను నివేదించాలి. గురుగ్రహ అనుకూలతను పొందగోరేవారు గురుగ్రహ మూలమంత్రాన్ని జపించాలి. ఆహారంలో ఉప్పును వినియోగించకూడదు, ఒక పూట తప్పనిసరిగా ఉపవాసం ఉండి, స్వామికి నివేదించిన పదార్థాలను స్వీకరించాలి.
శుక్రవార వ్రతం: దుర్గ, లక్ష్మి, సంతోషిమాత, గాయత్రి తదితర దేవతల అనుగ్రహాన్ని పొందడానికి, శుక్రగ్రహ వ్యతిరేక ఫలాలను తొలగించుకోవడానికి శుక్రవార పూజ శ్రేష్ఠమైనది.
వ్రతవిధానం: ఈ పూజను శ్రావణమాసం
లేదా ఏమాసంలోనైనా శుక్లపక్షంలో వచ్చే తొలి శుక్రవారంనాడు ఆరంభించి 16 వారాలపాటు చేయాలి. ప్రశాంతమైన, సుఖవంతమైన వైవాహిక జీవితాన్ని ప్రసాదించే ఆ చల్లనితల్లికి శ్రీసూక్త పారాయణ చేస్తూ, తెలుపు రంగు పూలు, తెల్లని చందనం, తెల్లని అక్షతలతో పూజ చేసి క్షీరాన్నం, చక్కెర నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరించాలి. శుక్రగ్రహ అనుకూలత కోరుకునేవారు మూలమంత్రాన్ని పఠించాలి.
శనివారవ్రతం: వేంకటేశ్వరస్వామి అనుగ్రహం పొందగోరేవారు, శని, రాహు, కేతు గ్రహ సంబంధమైన వ్యతిరేక ఫలితాలు తొలగి ఆయా గ్రహాలకు సంబంధించిన అనుకూల ఫలితాలను కోరుకునేవారు శనివార వ్రతం చేయాలి.
వ్రతవిధానం: శ్రావణమాసం లేదా పుష్యమాసంలో వచ్చే తొలి శనివారంనాడు ఈ వ్రతం ప్రారంభించి కనీసం 19 వారాలపాటు వ్రతాచరణ చేయాలి. వేంకటేశ్వర అష్టోత్తరం లేదా సహస్రనామ పూజ చేయాలి. గ్రహసంబంధమైన అనుకూలతను కోరుకునేవారు ఆముదం, నువ్వులనూనె, గేదెనెయ్యి కలిపి, నలుపు, ఎరుపు, నీలిరంగు ఒత్తులతో దీపారాధన చేయాలి. నీలం రంగు పూలతో పూజ చేయడం శ్రేయస్కరం. ఈ పూజకు మాత్రం ఉపవాసం తప్పనిసరి. పగలు అల్పాహారం తీసుకున్నా, రాత్రి పూర్తిగా పండ్లు, పాలతో సరిపెట్టుకోవాలి. ఆఖరివారం ఉద్యాపనగా నలుపురంగు వస్త్రాలు, పత్తి, ఇనుము, తైలం మొదలైనవి దానంగా ఇవ్వాలి.
ఏ పూజ, వ్రతం చేసేటప్పుడయినా ఫలితం కోసం గాక శ్రద్ధాభక్తులతో చేయాలి. అప్పుడే మన కోరిక నెరవేరుతుంది. హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉండాలి. చన్నీటి స్నానం, మితాహారం, భూశయనం, బ్రహ్మ చర్యం, మద్య, మాంసాలకు, అశ్లీల సంభాషణలకు, దృశ్యాలకు దూరంగా ఉండాలి.
సంధ్యావందనం
సంధ్యావందనం
ఉపనయనం జరిగి యజ్ఞోపవీతం ధరించిన వర్ణాల వారు చేయవలసిన దైనందిన వైదిక కర్మలలో సంధ్యావందనము ఒకటి. సంధ్యా వందనమనగా సంధియందు (పగలు రాత్రియు కలసియున్న సంధికాలము) చేయదగినది. సంధ్యావందనము చేయకుండా యితర కర్మలను చేయరాదు. సంధ్యావందనము కర్మలో సూర్యుని అర్ఘ్యం ఇవ్వడం, మరియు గాయత్రీ జపం కొన్ని అంశాలు.సంధ్యా వందనము రోజునకు మూడుసార్లు చేయవలెను. రోజులో మొదటిసారి సంధ్యా వందనము రాత్రి యెక్క చివరిభాగము నక్షత్రములు ఉండగా చేయుట. నక్షత్రములు లేకుండా చేయుట మధ్యమము. సూర్యోదయమైన తరువాత చేయుట అధమము. కాని మనము సూర్యోదయమైన తరువాత చేయుట ఆచారముగా వచ్చుచున్నది. ఇక రెండవసారి మధ్యాహ్న సంధ్యా వందనము సూర్యోదయమైన 12 ఘడియలు తరువాత చేయుట ఉత్తమము. సూర్యోదయమము అయిన తరువాత 8 నుంచి 12 ఘడియలు మధ్య చేసిన మధ్యమము. సూర్యోదయమైన 19 నుంచి 24 ఘడియలు మధ్య చేయుట అధమము. సాయం సంధ్యావందనము సూర్యుడు అస్తమించుచుండగా చేయుట ఉత్తమము, నక్షత్ర దర్శనము కాకుండ చేయుట మధ్యమము, నక్షత్ర దర్శనము అయిన తరువాత చేయుట అధమము. సంధ్యా వందనము పురుడు, మైల, పక్షిణి సమయములందు అర్ఘ్యప్రదానము వరకు చేయాలి. ప్రయాణాల్లో వీలుపడనిచో మానసికముగా సంధ్యా వందనము చేయవచ్చును. రోజూ తప్పక సంధ్యా వందనము చేవలెను.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
ఉపనయనము
ఉపనయనము హిందువులలో అబ్బాయిల వేదాభ్యాసానికి ముందుగా చేసే ప్రక్రియ. ఉపనయనాన్ని ఒడుగు
అని కూడా అంటారు. ఇది అధికంగా పురుషులకు చేస్తారు. బాల్యావస్థ నుండి
బ్రహ్మచర్యావస్థకు మారే సమయాన ఇది చేయడం ఆనవాయితీ. అప్పటి వరకు నియమ నిష్ఠ
లతో పనిలేకుండా సంచరించే బాలుడు నియమ నిష్ఠలతోకూడిన జీవితంలో
ప్రవేశించడానికి చేసే శాస్త్రీయమైన ప్రక్రియ ఇది. ఉపనయనానికి ముందు ఒక జన్మ
తరువాత ఒక జన్మగా కూడా వ్యవహరించడం వలన ఉపనయనానికి అధిక ప్రాముఖ్యతను
ఇచ్చే బ్రాహ్మణుని సమాజంలో ద్విజుడు అని నామాంతరంతో వ్యవహరిస్తుంటారు.
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఇట్లు
క్షత్రియులు, వైశ్యులు ఇప్పటికీ దీనిని ఆచరిస్తున్నా, అధిక ప్రాముఖ్యతతో నిర్దిష్ట విధులతో బ్రాహ్మణులు దీనిని అధికంగా ఆచరిస్తున్నారు. మిగిలినవారిలో ఇది ఒక ఆనవాయితీగా మారింది. వివాహపూర్వం ఒక తంతుగా మాత్రం దీనిని ఇప్పుడు ఆచరిస్తున్నారు. పూర్వకాలం గురుకులాభ్యాసం చేసే అలవాటు ఉన్న కారణంగా ఉపనయనం చేసి గురుకులానికి బాలురను పంపేవారు. అక్కడవారు విద్యను నేర్చుకుని తిరిగి స్వగృహానికి వచ్చి గృహస్థాశ్రమంలో ప్రవేశించేవారు.
ఉపనయనము అయ్యేవరకు పురుషుడు స్వయంగా ఎటువంటి ధర్మకార్యం నెరవేర్చటానికి అర్హుడుకాడు. యజ్ఞయాగాది క్రతువులు నెరవేర్చటానికి ఉపనయనము చేసుకున్న తరువాతే అర్హత వస్తుంది. క్షత్రియులకు ధర్మశాస్త్రాలభ్యసించడం అత్యవసరం కనుక ఉపనయన క్రతువు జరిపించి, విద్యాభ్యాసం ఆరంభించేవారు. పితరులకు కర్మకాండ, తర్పణం లాంటి కార్యాలు చేయడానికి ఉపనయనం అత్యవసరం. కొన్ని సందర్భాలాలో తల్లి తండ్రులు మరణావస్థలో ఉన్న సమయాలలో అత్యవసరంగా ఉపనయనం జరిపించి, కర్మకాండ జరిపించే అర్హతనిస్తారు. సన్యసించడానికి ఉపనయనం ప్రధానమే. కనుక హిందూ ధర్మంలో ఉపనయనం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న ఒక ప్రక్రియ. హిందూ ధర్మంలో ఇది బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు తప్పక నిర్వహించవలసిన బాధ్యత.
ఉపనయనము హిందువులలో కొన్ని కులాలలో మాత్రమే జరిగే ప్రక్రియ. ఇది సాధారణంగా బ్రాహ్మణులకు, వైశ్యులకు మరియు క్షత్రియులకు జరుగుతుంది. ఉపనయనం జరిగిన రోజున బాలుని తండ్రి బాలునికి చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశిస్తాడు. ఉపనయనం జరిగిన నాటి నుండి వటువు ప్రతి నిత్యం గాయత్రిని పూజిస్తూ బ్రహ్మచర్యం పాటించాలి. వేదాభ్యాసానికి ముందు తప్పనిసరిగా ఉపనయనం చేయవలెను. వివాహానికి ముందు బ్రహ్మచర్యాన్ని స్నాతక ప్రక్రియ ద్వారా వదిలి, గృహస్థాశ్రమంలోనికి ప్రవేశిస్తాడు వరుడు.
ఉపనయన విధులు బ్రాహ్మణులకు, క్షత్రియులకు మరియు వైశ్యులకు వేరు వేరుగా ఉంటాయి.
బ్రాహ్మణులకు 5 సంవత్సరాలవయసులో ఉపనయనం చేసినట్లు అయితే "బ్రహ్మ వర్చస కామం పంచమ వర్షే" అథవా గర్బాష్టకంలో బ్రాహ్మణులకు ఉపనయనం చేయాలి. క్షత్రియులకు 11 సంవత్సరాల వయసులో, వైశ్యులకు 12 సంవత్సరాల వయసులో ఉపనయనము చేయడం ఉచితమని శాస్త్రనిర్ణయం. ఉపనయన సమయంలో బ్రాహ్మణులు నార వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి, జింకతోలును ఉత్తరీయంగా ధరించాలి. అలాగే బ్రాహ్మణుడు ముంజకసవుతో పేనిన మొలత్రాడును ధరించాలి. ముంజ కసవు దొరకనప్పుడు దర్భ గడ్డిని నీటితో తడిపి ఒక ముడివేసి ధరించవచ్చు. మొలత్రాడు విధిగా ముప్పేటగా ధరించాలి. నూలుతో కట్టిన తొమ్మిది పోగుల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. అలాగే బిల్వము లేక మోదుగ దండాన్ని కేశమువరకు ఉండేలా చేసుకుని ధరించాలి. ఉపవీతుడైన పిమ్మట భవతీ బిక్షాక్షాం దేహిఅని యాచించాలి. గురుకులానికి వెళ్ళిన బ్రాహ్మచారి యాచనతో దొరికిన ఆహారాన్ని గురువుకు సమర్పించి, తరువాత గురువు అనుమతితో భుజించాలి. అవశిష్టాన్ని పరిశుద్ధుడై తూర్పుముఖంగా కూర్చుని భుజించాలి. భుజించిన పిదప చేతులు శుభ్ర పరచుకుని ఆచమనం చేసి శరీరావయాలను నీటితో శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత వస్త్రంతో అవయవాలను తుడుచుకోవాలి. ముందుగా తల్లిని కానీ, సోదరిని కానీ తల్లి వైపు సోదరిని కానీ యాచించడం ఉత్తమం. అవమానించని వారిని యాచించడం ఉత్తమమని అంతరార్ధం. ఈ మాదిరి బ్రహ్మచారి యాచించడం మధూకరం అంటారు. ఇందుకు పేద గొప్పా తారతమ్యం లేదు. అందరూ గురు శుశ్రూషలో సమానమే. ఉపనయనమునకు బ్రాహ్మణులకు చైత్ర వైశాఖ మాసాలు ఉత్తమం.
అలాగే క్షత్రియులకు వెల్వెట్ వస్త్రాన్ని అంగవస్త్రంగా ధరించి కురుమృగ చర్మాన్ని ఉత్తరీయంగా ధరించాలి. ముర్వ కసవుతో చేసిన మొలత్రాడును అది లభించని పక్షంలో నీటితో తడిపిన రెల్లుని మూడు ముడులు వేసి ధరించాలి. జనపనారతో చేసిన తొమ్మిది వరసలుగల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. యజ్ఞోపవీతానికి జంద్యం అనే మరో పేరుకూడా ఉంది తమిళనాట ప్రతి సంవత్సరం జంద్యాల పండుగ జరుపుకుంటారు. తమిళనాట ఈ పండుగను ఆవణి ఆవట్టం అంటారు. వివాహానంతరం మొదటిసారిగా ఈ పండుగ అత్తవారింట జరుపుకోవడం ఆనవాయితే. యజ్ఞోపవీతాన్ని భుజంపై నుండి రెండవ చేతి క్రిందిగా ధరించాలి. శుభకార్యాలకు సవ్యంగానూ కర్మక్రియలు లాంటి పితృ కార్యాలు జరిపేటప్పుడు అపసవ్యంగా ధరించడం ఆనవాయితీ. అలాగే మర్రి లేక చండ్ర కొమ్మను కానీ నొసటి వరకు ఉండేలా దండాన్ని ధరించాలి. తరువాత బిక్షాం భవతి దేహి అని యాచించాలి. యాచించే ముందు సూర్యోపాసన చేసి అగ్నికి ప్రదక్షిణ చేసి యాచించాలి. క్షత్రియులకు జ్యేష్ట ఆషాఢాలు ఉపనయము చేయడానికి ఉత్తమమని భావన.
అలాగే వైశ్యులు ఉన్ని బట్టను అంగవస్త్రంగా ధరించి గొర్రెతోలును ఉత్తరీయంగా ధరించాలి. వైశ్యుడు జనపనారతో చేసినది అది లభ్యం కానిచో తుంగతో చేసిన మొలత్రాడును ముప్పేటగా చేసి అయిదు ముడులు వేసి ధరించాలి. మేక బొచ్చుతో చేసిన తొమ్మిది పేటల యజ్ఞోపవీతాన్ని ధరించాలి. జమ్మి లేక మేడి కొమ్మను ముక్కు వరకు ఉండేలా ధరించాలి. దండం వంకర లేనిది అగ్నిలో కాలనిది పైపట్టతో కూడినదై ఉండాలి. ఆశ్వయుజ, కార్తీక మాసాలు వైశ్యులకు ఉత్తమ ఉపనయన కాలమని పెద్దల భావన.
ఉపనయనం చేయించే అధికారం ముందుగా తండ్రికి లేనిచో అన్నకు అదికూడా లేనిచో దాయాదులకు అంటే సగోత్రికులకు ఉంటుంది. ఉపనయనం చేయించే వ్యక్తిని ఆచార్యుడుగా వ్యవహరిస్తారు. ఉపనయన సమయంలో వటువునకు ఆచార్యుడు గాయత్రీ మంత్రోపాసన చేస్తాడు. యజ్నోపవీత ధారణ సమయంలో అయిదుగురు బ్రహ్మచారులను పూజించి పసుపు బట్టలను ఇవ్వడం ఆచారం. బ్రహ్మ దేవునకు సహజంగా లభించిందీ మొదట పుట్టినదీ అయిన ఈ పవిత్ర యజ్ఞ ఉపవీతాన్ని నేను ధరిస్తున్నాను ఈ యజ్ఞ ఉపవీతం నాకు తేజస్సు, బలం, దీర్ఘాయువు, నిర్మలత్వం మరియు పుష్టిని ఇచ్చుగాక అని వటువు మంత్రయుక్తంగా చెప్పి ధరిస్తాడు. యజ్ఞోపవీత ధారణ వటువునకు ఆశ్రమ వాసాధికారం, కామ్యసిద్ధి, విద్యాధ్యయనం, వేదాధ్యయనం, సంపద, యశస్సు, ఆయుష్షు మరియు ధర్మాచరణాధికారం ఇస్తుంది.
అగ్నిహోత్రమునకు ఉత్తర దిక్కుగా ఆచార్యుడు కూర్చుని దక్షిణ దిశగా సన్నికల్లు ఉంచి వటునిచే అతిష్టేమ మంత్రం చెప్పి తొక్కించాలి. రాయివలెనే నీవు బ్రహ్మచర్య వ్రతములో స్థిరుడవై ఉండాలని దీని అర్ధం. ఆ రాతి మీదనే వస్త్రాలను అభిమంత్రించి వటువునకు ధరింపచేయవలెను, దేవతా వస్త్రాలను ధరించి ఐశ్వర్య వంతుడవై ఆర్తులను ఆప్తులను ఆదుకుంటూ నిండునూరేళ్ళు జీవించమని ఆశ్వీర్వదిస్తూ ఈ వస్త్రధారణ జరుగుతుంది. ఆ తరువాత మొలత్రాడు కట్టి యజ్ఞోపవీతాన్ని ధరింపచేసి మంత్రోపాసన చేయించాలి. వటువు ఆచార్యునకు గోదానం ఇచ్చి దండధారణ చేయించి అగ్నికి ప్రదక్షిణచేసి భిక్షాటనకు బయలు దేరాలి.
ఉపనయనము తరువాత వటువు కనీసం 12 సంవత్సరాలు ఒక వేదమునైనా అభ్యసించాలి. అలాగే ఒక్కో వేదానికి ఒక్కో 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించవచ్చు. కానీ అది తప్పని సరికాదు. కలియుగములో ఎక్కువకాలం బ్రహ్మచర్యం మంచిదికాదని ఋషి భావన. ఆ తరువాత స్నాతకం చేసి వివాహ జీవితంలో ప్రవేశపెట్టడం శాస్త్రసమ్మతం.
బ్రహ్మచారికి నియమ నిష్ఠలు అనేకం ఉంటాయి. సుగంధ ద్రవ్యాలను వాడరాదు, పగటి నిద్ర పనికి రాదు, అలంకరణ చేసుకోరాదు, కామక్రోధ మద మాత్సర్యాలకు దూరంగా ఉండాలి, స్త్రీలయందు మౌనం సాధించాలి, సంగీత నృత్య వాద్యాలకు దూరంగా ఉండాలి, దుర్జన సాంగత్యం చేయకూడదు, చన్నీటి స్నానం మాత్రమే చేయాలి, వాహనాన్ని అదిరోహించకూడదు, వివేకం వీడకూడదు. దంతధావనానికి సుగంధాలను ఉపయోగించరాదు, అతిగా ఉద్రేకం, సంతోషం లాంటివి దరిచేరనీయకూడదు. అద్దములో ముఖమును చూడరాదు. మధువు, మాంసము తీసుకొనకూడదు. ఉప్పు, కారం లేని సాత్విక భోజనమే భుజించాలి. గురువు ఆజ్ఞను శిరసావహించాలి. ఇలా అనేక నియమ నిస్ఠలతో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి. విద్యాభ్యాస సమయంలో బ్రహ్మచారి గురువునకు ఏమీ ఇవ్వనవసరం లేదు. కానీ విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువును అడిగి అతను కోరినది గురుదక్షిణగా సమర్పించడం ఆచారం.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
చార్ ధామ్
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్, ద్వారక,పూరీ మరియు రామేశ్వరం లను కలిపి చార్ ధామ్
గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే ఉపదేశించబడిన ఈ క్షేత్రాలలో మూడు
వైష్ణవ క్షేత్రాలు మరియు ఒక శైవ క్షేత్రము కలదు. కాలక్రమేణా చార్ ధామ్
అనే పదము హిమాలయాలలోని పుణ్యక్షేత్రాలను ఉద్దేశించేదిగా వ్యవహారంలోకి
వచ్చింది.
ఇట్లు
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన ఆది శంకరాచార్య ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్‌ధాం హోదాను ఆపాదించారు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాధ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాధ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకానాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాధస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా దేవాలయాలు హిందూ, అవి శైవమతానికి మరియు వైష్ణవ శాఖలలో మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంలా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న బద్రీనాధ్, కేదార్‌నాధ్, గంగోత్రి మరియు యమునోత్రి ఆలయాలను కలిపి ఛోటా చార్‌ధామ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా ఉత్తరాఖండ్ పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
శుక్లయజుర్వేదం
యాజ్ఞవల్క్య మహర్షి సూర్యుడినుండి నేర్చుకుని ప్రచారం చేసిన యజుర్వేదాన్నే శుక్లయజుర్వేదం అంటారు. ఉపనిషత్కాలపు ప్రాచీన భారతదేశంలో యాజ్ఞవల్క్యుడు గొప్ప ఋషిగా, మహామేధావిగా, బ్రహ్మతత్వవేత్తగా గణనకెక్కాడు. అతని తండ్రి వాజసుడు. కనుక అతడు వాజసనేయుడయ్యాడు. వ్యాస శిష్యుడైన వైశంపాయన మహర్షికి అతడు శిష్యుడు. గురువు వద్ద యజుర్వేదం అభ్యసించాడు. ఒకసారి గురువుతో తగాదాపడగా గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యనంతా తిరిగి అప్పగించమన్నాడు. దానితో విద్యనంతా అప్పగించి సూర్యునికై తపస్సు చేసాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి యజుర్వేదమంతా తిరిగి నేర్పాడు. దానికే యజుర్వేద వాజసనేయ శాఖ అని, శుక్ల యజుర్వేదమని పేర్లు వచ్చాయి. యాజ్ఞవల్క్యుడు గురువుకు అప్పగించివేసిన దానికి కృష్ణ యజుర్వేదము అని పేరు వచ్చింది.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
మహాన్యాసము
మహాన్యాసము
నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు
అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు
మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ
మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో
ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.
మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.
రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది
ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.
౧. ప్రథమాంగన్యాసము
భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత, పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.
౨. ద్వితీయాంగన్యాసము
ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.
౩. తృతీయాంగన్యాసము
సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.
తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.
తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.
తర్వాత షోడశాంగ రౌద్రీకరణము - ఓం అం విభూరసి ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్‍ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.
దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.
౪. చతుర్థాంగన్యాసము
"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.
౫. పంచమాంగన్యాసము
ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్‍ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.
తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్‍ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.
తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్‍ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.
తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.
తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.
తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః" అని దిగ్బంధమును చూపించ వలెను.
తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).
వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్‍ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్‍ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్‍ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్‍ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.
లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).
[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి" అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]
ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.
ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ
Subscribe to:
Posts (Atom)
నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి
బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...
-
విష్ణు ర్మమాగ్రతః పాతు కృష్ణో రక్షతు పృష్ఠతః | హరి ర్మే రక్షతు శిరో హృదయం చ జనార్దనః || మనో మమ హృషీకేశో జిహ్వాం రక్షతు కేశవః | పాతు నేత్...
-
మనిషికి పూర్ణాయుర్దాయం 120 సంవత్సరాలు. దీనిలో సగభాగం 60. కాబట్టి అరవై ఏళ్ళు నిండాయంటే, ఆ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన భాగం పూర్తి అయినట్లు లెక్...
-
అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు....


