Friday, August 23, 2013

మీరూ పురోహితులుగా మారండి

   హిందూ మతం లోని ఆనందం, ఔన్నత్యం మీకు పూర్తగా తెలియాలంటే మీరు పురోహితులుగా మారాలి. ఏకులం వారైనా ఏమతం వారైనా ఈ పురోహితం చేయవచ్చు. నేను ఓ పురోహితుడిని కనుక ఆ ఆనందమేమిటో దానిరుచేమిటో ఎరిగిన వాడిని కనుక ఆ ఆనందం మీకూ పంచుదామని ఈ ప్రయత్నం. పురోహితులుగా మారాలంటే దానికి ప్రత్యేకమైన యోగ్యతలేవో కావాలి,  మనకి పొద్దున  లేచింది మొదలు ఉద్యోగం చేసుకోవడానికే సమయం సరిపోవడం లేదు, మళ్లీ ఈ పురోహితం ఎక్కడ వెలగబెట్టగలం, ఇది మనకి కుదరదు అనుకొంటున్నారేమో! అలా అనేముందు దీనిని ప్రయత్నించి అప్పుడు ఆ మాట చెప్పండి. నేనూ ఒప్పుకుంటాను. కనీస ప్రయత్నం లేకుండా ఓ మంచి ఆలోచనని కాదనకండి.  పూర్తిగా చదివితే మీకే అర్థమవుతుంది

౧. పురోహితులుగా ఏమి చేయాలి?

 ఏముంది సమాజ హితం.

౨. దానికి నేనెటువంటి గుణాలు కలిగి ఉండాలి?

 కాస్త సాధన -పూర్తి స్థాయి నిజాయతీ- కాస్త సాటిమనిషి పట్ల , సమాజం పట్ల ప్రేమ - తెలియనిది తెలుసుకోవాలనే తపన ఇవి ఉంటే మీరు పురోహితులుగా రాణించేస్తారు.

౩. అంటే ఇవి లేక పోతే పనికి రామా?

ఎందుకు పనికి రారు పనికొస్తారు. మీకు కనక శ్రద్ధ - తప్పును ఒప్పుకుని మార్పును స్వీకరించే గుణం  ఉంటే పై విషయాలు అలవరచుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. పైగా మనలో చాలా మందికి నా సమాజ శ్రేయస్సు కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన చాలా ఉంది. కాకపోతే అది ఎలా చేయాలో తెలియదు.

౪. సరే అయితే ఇప్పుడు మేము కూడా పంచ,కండువా కట్టుకుని పూజలూ అవీ చేస్తూ ఉద్యోగాలు మానేసి మీకూడా తిరగాలా ఏమిటి?

అబ్బే అవేవీ అవసరం లేదు. మీమీ ఉద్యోగాలు  నిరభ్యంతరంగా చేస్తూనే పురోహితమూ చేయవచ్చు. పైగా దీనికోసం మీకు ఇష్టంలేకుండా ఏత్యాగమూ చేయనవసరం లేదు. మీరు చేయవలసిందల్లా ఎవరికి మీరు పురోహితంద్వారా మేలు చేయాలనుకుంటున్నారో వారిని వెతుక్కోవడం, పురోహితం ప్రారంభిచడం.  పురోహితుడవ్వాలంటే బ్రాహ్మణుడు మాత్రమే అవ్వాలి అనే నియమం కూడా ఏమీ లేదు ఆసక్తి ఉన్న ఎవరైనా అవ్వొచ్చు. నిజానికి ఇప్పటికే చాలామంది తమకు తెలియకుండానే పురోహితం చేస్తున్నారు.

౫. అర్థకాలేదు. పూర్తిగా వివరంగా చెప్పండి.

 అదీ అలాఅడిగారుకనుక చెప్తున్నాను. :)

మనం ముందర పురోహితులుగా అవడానికి మానసికంగా సిద్ధపడాలి అంటే ముందు పురోహితం అంటే ఏమిటో తెలుసుకోవాలి. నాదృష్టిలో "ఆధ్యాత్మిక లేమితో బాధపడేవారి హృదయాలను ఆధ్యాత్మికతతో నింపడమే పురోహితం"    అంటే ఓ డాక్టరు వ్యాధిగ్రస్థునికి చికిత్స చేసి స్వస్థత చేకూర్చినట్లు, మనమూ సమస్యలో ఉన్నవారికి ఆసమస్యకు మూలకారణం వివరించి ఆనందం రుచి చూపిస్తూ, తోటి వ్యక్తులను తద్వారా సమాజాన్ని ఆనందం వైపు నడిపించడమే పురోహితం అంటే.

ఇక మనం పురోహితులము అవ్వాలంటే మనకు కావలసిన అర్హత ఙ్ఞానం. వ్యాధికి సంబంధించిన సంపూర్ణ అవగాహన. వ్యాధి ఏమిటి?  ఆధ్యాత్మిక లేమి ఏ మానసిక సమస్యకైనా మూలకారణం ఇదే అనిగుర్తుంచుకోవాలి . ( అనేక భౌతిక విషయాలలో కూడా ఆధ్యాత్మిక సాధన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ) మరి దాని చికిత్స ఏమిటి? ఆధ్యాత్మిక సాధన. చికిత్స ద్వారా మనం వారికి అందించ గలిగినది ఏమిటి? ఆనంద జీవనం.

మన ఋషులు భారతీయ జీవన విధానాన్ని రూపొందించడంలో ఎంతో తపన చెందారు. ఆనందం ఎక్కడనుండి వస్తోంది? దానిని పరిపూర్ణంగా పొందడం ఎలా? కష్ట సుఖాలకు అతీతంగా నిశ్చల ఆనంద స్థితి ఏవిధంగా పొందగలం? మొదలైన అనేక ప్రశ్నలకు సమాధానాన్ని వారి తపస్సు ద్వారా పొందారు. దానిని భవిష్యతరాలకు అందించడానికి తపించారు. వారి ప్రేమను తలచినప్పుడల్లా నాకళ్లు చమరుస్తాయి. భారతీయ జీవన విధానం వారు మనకు పెట్టిన భిక్ష. అది ఆనందం అనే పరమావధిని లక్ష్యంగా చేసుకుని రూపొందించ బడింది. కానీ నేడు ధనం పరమావధి అని ప్రాకులాడడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయి. మన పూర్వులకు ఎంత ప్రేమ ఉంటే నేటికీ మనం భారతీయ జీవన విధనాన్ని కళ్లారా చూడగలుగుతున్నాం!?  ఈ విధానం నలుగురూ అమలుపరచేలా చేయడంలో ఎంత తపించి ఉంటారు!? మన మీద ఎంత ప్రేమ ఉంది వారి హృదయాలలో!?   అదే మనకు స్ఫూర్తి కావాలి. మనకున్న బలహీనతలను తొలగించడంలో వేయింతల బలాన్ని ఇవ్వాలి. ఋషులు మనకు ఒక జీవన విధానాన్ని ప్రసాదించారు. దానికి ప్రాతి పదికగా వేదాన్ని వారసత్వంగా ఇచ్చారు. ఆ ఋషుల స్ఫూర్తితో తన ప్రతి చర్యలోనూ ప్రేమను నింపుకుని తాను తరిస్తూ చుట్టూ ఉన్న నలుగురినీ తరింప చేసేవాడే పురోహితుడు. ప్రతీ ఒక్కరూ ఎంతో కొంత ఙ్ఞానాన్ని, ఎంతో కొంత అఙ్ఞానాన్నీ కలిగి ఉంటారు. ఎవరూ పరిపూర్ణులు కారు. కానీ తమఙ్ఞానాన్ని నలుగురికీ పంచాలనుకునేవారు క్రమక్రమంగా కొత్త విషయాలను తెలుసుకుంటూ పరిపూర్ణ ఙ్ఞానం ( ఆనందం ) వైపు పయనిస్తారు. ముందు మనకుతెలిసినదెంతో మనం ఇంకా సాధించ వలసినదేమిటో విచారణ చేసుకోవాలి. ఆ తరువాత మనకు తెలిసిన పరిధిలో సాటివారికి తగు సహాయమందించాలి. అలా సాయమందించడంలో మననూ అనేక తెలియని విషయాలు ప్రశ్నిస్తూ ఉంటాయి. వాటికి "సద్గ్రంధ పఠనం-సజ్జన సాంగత్యం- స్వీయ సాధన" మొదలైన వాటి ద్వారా సమాధానాలను రాబట్టుకోవచ్చు. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఆ సమస్యలకు కారణం చాలావరకు ఆధ్యాత్మిక లేమి. ఆధ్యాత్మిక సాధన ఉన్నట్లైతే మనం, మన సమాజం నేడు ఎదుర్కొంటున్న చాలా సమస్యలు అసలు సమస్యలే కావు. కనక ఆదిశగా మనం పయనిస్తూ తోటివారిని పయనింప చేసే ప్రయత్నమే పురోహితం అంటే. మీకు కష్టంలో ఎవరైనా కనపడితే చూస్తూ ఊరుకోకండి. దానికి తగిన తరుణోపాయం ఆధ్యాత్మిక సాధన అన్న విషయాన్ని వారికి నచ్చే, వారు మెచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేయండి. మీ తపన, తోటి వారిపై గల ప్రేమ, మీకు భగవంతుడి పై గల నమ్మకం, మీ ప్రార్థనలో కల ఆర్తి, గురువుల ఆశీస్సులు మీకు దారి చూపుతాయి. ఇంకా  ఈ విషయంలో  సాధకులైన తోటి మిత్రుల సహకారాన్ని పొందండి. మీకవసరమనుకుంటే నా పూర్తి సహకారాన్ని నేనందిస్తాను.


ఇట్లు
"మీ "
జి.సుబ్రహ్మణ్య శర్మ 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...