Wednesday, May 16, 2018

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత


అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనకు జూచుట) మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.

4. పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...