Tuesday, April 3, 2018

నల్లటి విష్ణువు తెల్లటి శివుడు ఒకరేమిటి?

ఇటువంటి ప్రశ్నలు ఎవరు వేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవక్కరలేదు. ఈ విషయంలో మన పెద్దవారు ఎన్నడో తమ తీర్పు, తర్కం చెప్పి వున్నారు. మరొక్కసారి మనం అవలోకనం చేసుకుందాము. వేదం “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే !! శివస్య హృదయం విష్ణో: విష్ణుస్య హృదయం శివః !! యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషి !!”” అని ఘోషిస్తోంది. శివుడే విష్ణువు విష్ణువే శివుడు, ఇద్దరి హృదయమూ ఒక్కటే, వారికి భేదం చూపినవారికి ఉత్తమగతులు లేవని చెబుతోంది. తాత్త్వికంగా ఒక్కటే అయిన తత్త్వం అయిన పరబ్రహ్మ ఈ రెండు రూపాలగా కనబడుతుంది. శుద్ధస్ఫటిక రంగు శివునిది అని చెబుతుంది, అలాగే విష్ణువు నీలమేఘశ్యాముడు అని పురాణాలు వారి రంగుల గురించి చెప్పింది. మరి శుద్ధ సత్త్వ స్వరూపం తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఉందేమిటి అని ప్రశ్న వేస్తున్నారు.

అసలు ఏ గుణం లేని ఏ రంగులేని ఏ రూపంలేని  పరమాత్మ మనకోసం ఉపాసనకోసం ఒక రూపం తీసుకున్నారు. ఒకసారి ఈ రంగుల ప్రాధాన్యత గురించి చూస్తె ఇంద్రధనస్సులోని ప్రాధమిక రంగులు అన్నీ కలిపితే వచ్చేది నలుపు రంగు. అన్ని గుణాలు కలిపిన పరమాత్మ తత్త్వానికి సంకేతంగా విష్ణువు నల్లని రూపం. విశ్వవ్యాపకుడైన బ్రహ్మాండనాయకుడు విశ్వమే తానై ఉన్నవాడు నల్లని రంగు, అన్నీ తనలో ఇముడ్చుకున్న వాడి రూపం విష్ణువు. విష్ణువు చెల్లెలు మహామాయ, నారాయణి కూడా నల్లటి రూపం, దుర్గ, కాళీ. నారాయణ నారాయణి ఒకే తత్త్వం చెబుతున్న పురుష-స్త్రీ రూపాలు. ఆ సంపూర్ణ శక్తి స్వరూపం తానే రెండు విధాలుగా కనబడతాడు. ఉపాసనకు అందేందుకు అమ్మలా శక్తిస్వరూపిణిగా కనబడతాడు, పరమపురుషునిగా విష్ణురూపంలో అనుగ్రహిస్తున్నాడు.

అదే అన్ని రంగులు నల్ల రంగునుండి ఒకొక్కటి తీసి వేస్తూ పోతే మిగిలేది కేవలం తెలుపు. అదే వర్ణం ఆదిదేవుడు ఆ మహేశ్వరుని స్వరూపం. ఏమీ లేని సృష్టి జరగని సమయంలో ఉన్న ఆ పరమాత్మ తనకు తాను విభాజించుకున్నాడు తన మాయ ద్వారా. తనను విభజించుకునే ముందు ఏదైతే ఏదైతే రూపం వుందో గుణరహితంగా ఉన్నదో అదే ఆ పరమాత్మ రూపం సదాశివుని వర్ణం. అదే సంపూర్ణంగా గుణాలు, వర్ణాలు సంతరించుకున్న రూపం ఆ విష్ణు రూపం. ఒక సెట్ థియరీ ప్రకారం యూనివర్స్ స్టేట్ విభజనకు ముందు ఏదైతే వుందో అదే అన్ని సెట్స్ యొక్క ఇంటర్సేక్షన్ అవుతుంది. ఇన్ఫినిటీ (పూర్ణం) అన్ని సంఖ్యలను కలిపితే వచ్చేది, అలాగే divisor అతి సూక్ష్మమైన సంఖ్యతో విభజిస్తే వచ్చేది కూడా ఇన్ఫినిటీ. అన్నీ కలిపినా ఇన్ఫినిటీ, తనకు తాను సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులుగా విభజించుకున్నా ఇన్ఫినిటీ. ఆ పూర్ణం నుండి పూర్ణం కలిపినా తీసినా విభజించినా వచ్చేది పూర్ణమే. అదే ఆ పరమాత్మ.

మనకున్న చక్రాల పరంగా చూసుకుంటే లోనున్న శక్తి మూలాధారంలో నిండి వున్నప్పుడు ఆ ఏడు చక్రాల దాటాక వెళ్ళగలిగితే శివానికి చేరుకుంటుంది. లోనున్న విష్ణువు శివుడవుతున్నాడు. ఈ ఏడు చక్రాల/ఏడు రంగులలో కలిసున్న ఆ తత్త్వం విష్ణుతత్త్వం అనుకుంటే ఆ ఏడు రంగులను తీసి వేస్తె వచ్చే ఆ శుద్ధస్ఫటిక వర్ణం ఆ శివునిది.  అలా తన సహస్రారం నుండి శక్తిని శివునిలో కలిపితే ఎప్పటికీ మరణం అన్నది లేని మోక్షానికి చేరుకుంటున్నాడు. ఈ రెండు తత్త్వాల కలయికే శివశక్తి స్వరూపం, అర్ధనారీశ్వర తత్త్వం. దీనికి సంకేతంగా ఏడు కొండలపై నిలిచి వున్న ఆ వేంకటేశ్వరుడు మనల్ని రక్షించు గాక !!!

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...