Monday, February 12, 2018

నవనందులు సర్వ పాపహరణాలు

మన రాష్ట్రంలోని నవ నందులను దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నందిని పూజిస్తే సాక్షాత్తూ శివుని అనుగ్రహం పొందవచ్చని చెబుతారు.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుని కుటుంబం లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది. పార్వతి దేవి కి పులి, వినాయకునికి మూషికం, కుమారస్వామి కి నెమలి మరియు శివునికి నంది వాహనంగా ఉంటుంది. అన్నింటిలోకీ నంది ప్రత్యేకమైనది. నందిని పూజిస్తే పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. అలాంటి నంది మన రాష్ట్రంలో నవ నందుల రూపంలో కర్నూలు జిల్లాలో కొలువై ఉన్నాడు.

ప్రథమ నంది
నందుల్లో మొదటిది ప్రథమ నంది. ఇది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. సూర్యాస్తమ సమయాల్లో(కార్తీక మాసంలో) నందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం.

నాగ నంది
నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు.

సోమ నంది
సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (నంద్యాల పట్టణానికి లోపల) జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.

సూర్య నంది
సూర్య నంది నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో రోడ్డు పై ఉన్నది. సరిగ్గా చెప్పాలంటే నంద్యాల నుండి 4 కి. మీ. దూరం వెళితే యు. బొల్లవరం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి కిలోమీటరు దూరం వెళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజూ సూర్యకిరణాలు లింగం పై పడటం ఇక్కడి విశేషం.

శివ నంది
శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉంటుంది.

విష్ణు లేదా కృష్ణ నంది
మహానంది రోడ్డు మార్గంలో, మహానంది ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీహరి శివుణ్ని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

గరుడ నంది
నంద్యాల నుండి మహానందికి వెళ్ళటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్ళే పనిలో ఎటువంటి ఆటకం కలగకుండా ఉండేందుకై పరమేశ్వరుణ్ణి ప్రార్ధించిన ప్రదేశమిది.

మహానంది
మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగి తేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికంగా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుటుంది.

వినాయక నంది
వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...