Sunday, April 29, 2018

శ్రీ నృసింహ జయంతి

ఈ రోజు  28-04-2018 , శనివారం, వైశాఖ శుద్ధ చతుర్దశి )

_*ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం _*
_*నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ॥*_

శ్రీ నృసింహ జయంతి. శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో....
అవతార వృత్తాంతం:
వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులు శాపవశాత్తు మూడు రాక్షస జన్మలు ఎత్తి శ్రీ హరి చేత సంహరింపబడి తిరిగి వైకుంఠం చేరుకుంటారు. ఆ రాక్షసావతారాలలో జయవిజయులు మొదటగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపుడుగా జన్మిస్తారు. శ్రీహరి వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు. దానితో హిరణ్య కశిపుడు శ్రీహరి పై ద్వేషం పెంచుకుని ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనను పగలు గాని, రాత్రి గాని, ఇంటి బయట గాని, ఇంటి లోపల గాని, భూమి మీద కాని, ఆకాశంలో గాని, అస్త్రం చే గాని, శస్త్రం చేత గాని, మనిషి చేత గాని, మృగం చేత గాని చంపబడకుండా ఉండాలనే వింత షరతులతో కూడిన వరం పొందుతాడు.
కానీ హిరణ్య కశిపుని భార్య లీలావతికి పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. గర్భంలో ఉన్నప్పటి నుంచే హరి భక్తుడైన ప్రహ్లాదుని హరి భక్తి మానమని ఎంత బోధించినా, బెదరించినా, చంపే ప్రయత్నం చేసినా మనసు మార్చుకోడు. తండ్రి ప్రయత్నిస్తున్న కొద్దీ ప్రహ్లాదునిలో భక్తి మరింత ఎక్కువ కాసాగింది. ప్రహ్లాదుని మృత్యువు వరకు తీసుకువెళ్లినా అతనిలో ఏమార్పూ లేదు. విషప్రయోగం చేసినా, ఏనుగులతో తొక్కించినా, లోయలో పడవేసినా ఎప్పటికప్పుడు విష్ణుమూర్తి రక్షిస్తూ ఉండేవాడు.
ఇక విసిగిపోయిన హిరణ్యకశిపుడు నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడో చెప్పమనగా. "ఇందుగలవాడు అందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదికిన అందందే కలడు నా శ్రీహరి" అని భక్తితో ప్రహ్లాదుడు "ఈ స్తంభంలో కూడా నా శ్రీహరి ఉన్నాడు" అని చెప్పగా, దానితో మరింత ఆగ్రహావేశాలకు లోనై హిరణ్యకశిపుడు "ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీ హరి" అని ఒక్కపెట్టున ఆ స్థంభాన్ని తన గదతో పగులగొడతాడు. అంతే భయంకరాకారుడై, తల సింహం రూపంలో మొండెం మనిషి ఆకారంలో నృసింహమూర్తిగా అవతరించి గర్జిస్తూ ఒక్క ఉదుటున ఆ రాక్షసుడిని తన తొడలమీద పడుకోబెట్టి తన గోళ్లతో అతని వక్షస్థలాన్ని చీల్చి చెండాడి హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు.
పాంచరాత్రాగమంలో 70కి పైగా నరసింహమూర్తుల గురించి ప్రస్తావించబడి ఉంది. కానీ ముఖ్యమైనవి మాత్రం
*నవ నారసింహమూర్తులు. అవి...*
1) ఉగ్ర నారసింహుడు
2) కృద్ధ నారసింహుడు
3) వీర నారసింహుడు
4) విలంబ నారసింహుడు
5) కోప నారసింహుడు
6) యోగ నారసింహుడు
7) అఘోర నారసింహుడు
8) సుదర్శన నారసింహుడు
9) శ్రీలక్ష్మీ నారసింహుడు
నృసింహ జయంతి రోజు ఉపవాసం ఉండి నృసింహ మూర్తిని పూజించి సద్గతులు పొందవచ్చు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి నరసింహ పురాణంలో చెప్పబడి ఉంది. అవంతీ నగరమున సుశర్మ అను వేదవేదాంగ పారాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుశీల మంచి ఉత్తమురాలు. వారికి ఐదుగురు కుమారులు కలుగగా వారిలో చిన్నవాడైన వాసుదేవుడు వేశ్యాలోలుడై, చేయరాని పనులు చేసేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాసుదేవునకు, వేశ్యకు కలహము సంభవించి. దాని మూలంగా వాసుదేవుడు ఆ రాత్రి భోజనం చేయలేదు. ఆనాడు నృసింహ జయంతి. వేశ్యలేనందు వలన ఆ రాత్రి వాసుదేవుడు జాగరణ కూడా చేసాడు. వేశ్య కూడా ఉపవాసము, జాగరణ చేసింది. అజ్ఞాతముగా ఇలా వ్రత ఆచరించుడం వలన వీరు ఇద్దరూ ముక్తులై ఉత్తమగతులు పొందారని నృసింహ పురాణం చెబుతున్నది.
అందరికీ *నరసింహ జయంతి శుభాకాంక్షలు....

జై నారసింహ !  జైజై నారసింహ !!

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...