Wednesday, April 3, 2019

"ఉగాది" ఆచరణ విధానం:

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

Thursday, March 21, 2019

వసంతోత్సవం

మన సంప్రదాయంలో ఉన్న అనేకానేక పండుగలలో హోలీ కూడా ఒకటి. ఇది ఆనందకేళీ రవళుల నడుమ జరుపుకొనే సంతోష తరంగహేల. పూర్వకాలం నుంచి దేశమంతటా ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ పండుగనే వసంతోత్సవమని, ఫాల్గుణోత్సవమని కూడా పిలుస్తారు.

ఈ పండుగ పలు పురాణాల్లో తారకాసుర సంహారానికి సంబంధించినదిగా పేర్కొన్నారు. రుషులు, మునులు, సత్పురుషులు, దేవతలు అందరిని ఆనాడు తారకాసురుడు వేధిస్తూ ఉండేవాడు. ఆ అసురుడి పీడ తొలగాలంటే పార్వతీపరమేశ్వరులకు జన్మించే కుమారుడే సమర్ధుడని దేవగురువు బృహస్పతి దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవేంద్రుడు మన్మధుడిని పిలిచి దేవకార్యాన్ని చక్కబెట్టమన్నాడు. మన్మధుడు విషయం పూర్తిగా అర్ధం చేసుకోకుండా దేవతలందరికి రాజైన ఇంద్రుడే వచ్చి స్వయంగా అడిగాడు కదా అని రంగంలోకి దిగాడు. అప్పటికి శివుడు యోగనిష్ఠలో ఉన్నాడు. పార్వతీదేవి అక్కడికి సమీపంలో ఉండి శివుడికి పరిచర్యలు చేస్తూ ఉంది. మన్మధుడు శివుడున్న చోటుకు వెళ్ళి తన ప్రతాపాన్ని చూపాడు. యోగనిష్ఠలో శివుడికి మనోవికారం కలిగింది. ఎదురుగా ఉన్న పార్వతీదేవిని చూశాడు. అయితే అంతలోనే జరిగినదేమిటో తెలుసుకున్నాడు శివుడు. వెంటనే తన యోగనిష్ఠను చెడగొట్టినందుకు మూడో కంటితో మన్మధుడిని చూశాడు. క్షణాల్లో మన్మధుడు భస్మమయ్యాడు. మన్మధుడి భార్య రతీదేవి బోరున విలపించింది.

దేవతల మేలు కోరి తన భర్త అలా చేశాడే తప్ప మరే విధమైన తప్పు ఆయన చేయలేదని, తనకు మళ్ళీ పతి భిక్ష పెట్టమని వేడుకుంది. శివుడు కరుణించాడు. రతీదేవికి మాత్రమే మన్మధుడు ఆనాటి నుంచి కనిపిస్తాడని, ఇతరులెవరికీ మన్మధుడు కనిపించడని శివుడు చెప్పాడు. రతీదేవి అంతటి భాగ్యమే తనకు చాలునని శివపార్వతులకు నమస్కరించింది. ఆ తర్వాత మన్మధుడిని పూజించింది. మన్మధుడినే కాముడు అని అంటారు. ఆ కాముడు దహనమైంది పూర్ణిమనాడు. ఆ పూర్ణిమే ఫాల్గుణశుద్ధ పూర్ణిమ. అందుకే ప్రతి ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధపూర్ణిమను ఇలా కామ దహన పూర్ణిమగా పిలుచుకోవడం ఆచారంగా వస్తోంది. కామదహనోత్సవం అని కూడా దీన్ని పిలుస్తారు. కాముడు దహనమైనప్పుడు రతీ దేవి విలపించింది. అలాంటి విలాపాన్ని పురస్కరించుకుని ఉత్సవం జరుపుకోవడం ఏమిటని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ రతీదేవి విలాపాన్ని దయతో అర్ధం చేసుకున్న శివుడు మళ్ళీ ఆమెకు తన భర్త కనిపించేలా వరాన్ని ఇచ్చాడు. ఆమె పూజలు కూడా చేసింది. అందుకే దీన్ని ఉత్సవంలా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

ఫాల్గుణశుద్ధ పూర్ణిమను మహాఫాల్గుణి అని, హోలికా, హోలికాదాహో అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే హుతాశనీ పూర్ణిమా, వహ్ని ఉత్సవం అని కూడా అంటారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ రోజున లక్ష్మీనారాయణ వ్రతం, అశోక పూర్ణిమా వ్రతం, శశాంక పూజ, చంద్రపూజ లాంటివి జరుపుతూ ఉంటారు. తెలుగునాట మాత్రం కామునిపున్నమగా ఇది బాగా ప్రసిద్ధం. తమిళనాడు ప్రాంతంలో ఈ రోజున పంగుని ఉత్తిరం అనే పండుగ జరుపుతారు. ఫాల్గుణశుద్ధ పూర్ణిమనాడు చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో ఉంటాడంటారు. ఫల్గుణి అనే పదం పంగుని గాను, ఉత్తర అనే పదం ఉత్తిరంగాను, తమిళ భాషలో పలకడం వల్ల పంగుని ఉత్తిరంగా దీన్ని వ్యవహరిస్తారు.

హోలికా పూర్ణిమా, హోలి అనే పేర్లు రావటానికి మళ్ళీ పురాణకథలు కొన్ని ప్రచారంలో ఉన్నాయి. పూర్వం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి హరిభక్తిని సహించలేక అతడిని చంపడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాడు. అవేవీ ఫలించలేదు. హిరణ్యకశిపుడికి హోలికా అనే ఒక సోదరి ఉండేది. ఆమెకు అగ్ని బాధ లేకుండా ఓ వరం ఉండేది. హిరణ్యకశిపుడు హోలికను పిలిచి ప్రహ్లాదుని ఆమె చేతికిచ్చి మంటల్లోకి ప్రవేశించమన్నాడు. మంటల వల్ల హోలికకు ప్రమాదం ఉండదని ప్రహ్లాదుడే మరణిస్తాడనేది ఆ రాక్షసుడి భావన. అయితే దైవచిత్రంగా మంటల్లోకి ప్రవేశించిన హోలికా దగ్ధమైంది. ప్రహ్లాదుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ బయటకు వచ్చాడు. హోలికా దహన సందర్భాన్ని పురస్కరించుకుని హోలీ పండుగ వచ్చిందని పెద్దలు చెబుతారు. ఇలాంటిదే రఘు మహారాజు కాలంలోను ఓ కథ జరిగిందంటారు. ఆ రోజుల్లో దుంధ అనే ఓ రాక్షసి ఉండేది. ఆమె ఆ రాజ్యంలోని పసి పిల్లలందరిని చంపి తింటూ ఉండేది. ఇతర పీడలేవీ ఆ రాజ్యంలో లేకపోయినా ఈ భయంకర పీడ మాత్రం నాటి ప్రజలందరిని బాధిస్తూ ఉండేది. ఈ బాధకు విరుగుడుగా ఫాల్గుణశుద్ధ పూర్ణిమ నాడు కల్యాణ వ్రతం చేస్తే ఆ రాక్షసి బాధ తొలగిపోతుందని నారదుడు రఘుమహారాజుకు చెప్పాడు. రఘువు అలానే చేసి ఆ రాక్షసి బాధను తొలగించాడు. అందుకే పూర్వకాలం నుంచి ఈ పూర్ణిమ రోజున కల్యాణ వ్రతం కొంతమంది జరుపుతుంటారు.

హోలీ పండుగ నాడు ఒక్కో ప్రాంతంలో రాత్రివేళ, అర్ధరాత్రి వేళ, తెల్లవారుజామున పాత వస్తువులను మంటల్లో వేసి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఆనందంగా పాటలు పాడుతూ ఉండడం కనిపిస్తుంది. ఈ మంటలు వేయడం, మంటల్లో మన్మధుడు, రతీదేవి బొమ్మల్ని కూడా వేయడం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అయితే ఏ ప్రాంతంలోని వారైనా సరసంగా వరసైన వారి మీద రంగు నీళ్ళు చల్లుకోవడం, పెద్ద హోలీ మంట వేయడం అనే రెండింటిని మాత్రం సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు. హోలీ నాడు రంగులను వరసైన వారి మీద చల్లుతూ ఉత్సాహంతో, సంతోషంతో ప్రజలంతా కాలం గడుపుతూ ఉంటారు. ఇలాంటి వేడుకంతా రాబోయే ఆనందకర వసంత రుతువుకు స్వాగత సన్నాహమేనని, ఈ సన్నాహమే సంప్రదాయంగా పరిణమించిందని పెద్దలు చెబుతున్నారు.

హోలీ పండుగ నాడు రాత్రి కొన్ని ప్రాంతాల్లో రాజ వీధుల్లో, నాలుగు వీధులు కలిసే చోట పెద్ద పెద్ద భాండాలలో రంగునీళ్లను నింపి ఉంచుతారు. ఆ నీళ్ళను ఒకరిమీద ఒకరు చల్లుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. ఆ తర్వాత యువకులంతా హోలీ పాటలు పాడుతూ ఇంటింటికి తిరిగి పాత వస్తువులను సేకరించి హోలీ మంటల్లో వేస్తూ ఉంటారు. హోలీ పండుగ వ్రతం చేసుకొనే పెద్దవాళ్ళకు భక్తిని పంచుతూ, చిన్నారులకు పీడలను పోగొడుతుందనే నమ్మకాన్ని కలిగిస్తూ, యువతకు ఆనందాన్ని చేకూర్చుతూ వినోదాల సంబర హేలగా తరతరాలుగా దేశమంతటా జరుగుతూ వస్తోంది.

Saturday, March 9, 2019

కంటి రోగాలకు చక్కటి పరిష్కారం "చక్షుషీ విద్యా ప్రయోగం"

కంటి రోగాలను తగ్గించుటలో చక్షుషీ విద్యా ప్రయోగం మహత్తరమైనదని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. సంధ్యావందనము తరువాత సూర్యుని ఎదురుగా తూర్పు వైపు కూర్చుని గాయత్రి మంత్రం 24 సార్లు చదివిన తరువాత ఈ క్రింది మంత్రముతో ఒక చెంచా నీరు భూమికి సమర్పిస్తూ వినియోగించాలి.

తస్యశ్చాక్షుషీ విద్యాయా ఆహిర్భుధ్న్య ఋషి గాయత్రీ
ఛందః సూర్యో దేవతా, చక్షు రోగ నివృత్తయే వినియోగః

తరువాత క్రింది మంత్రాన్ని 12 సార్లు జపించాలి.

ఓం చక్షుః చక్షుః స్థిరో భవ ! మాం పాహి పాహి!
త్వరితం చక్షు రోగాన్ శమయ శమయ !
మమ జాత రూపం తేజో దర్శయ దర్శయ!
యధాహం అంధోనస్యాం తథా కల్పయ కల్పయ !
కళ్యాణం కురు కురు !
యాని మమ పూర్వ జన్మో పార్జితాని చక్షుః ప్రతిరోధక దుష్కృతాని సర్వాణి నిర్మూలయ నిర్మూలయ!
ఓం నమః చక్షుస్తేజో దాత్రే దివ్యాయ భాస్కరాయ !
ఓం కరుణా కరాయామృతాయ ! ఓం నమః సూర్యాయ
ఓం నమో భగవతే సూర్యాయాక్ష తేజసే నమః !
ఖేచరాయనమః ! మహాతేనమః ! రజసే నమః !
అసతో మా సద్గమయ ! తమ సోమా జ్యోతిర్గమయా !
మృత్యోర్మా అమృతంగమయ!

ఇలా 12 సార్లు చదివిన తరువాత పంచ పాత్ర లోని జలాన్ని అర్ఘ్య రూపంలో సూర్యునికి సమర్పించాలి.

1,2 చుక్కలు జలాన్ని రెండు చేతి వేళ్ళకు రాసుకుని కళ్ళు తుడుచుకోవాలి.

Sunday, February 17, 2019

థైరాయిడ్‌ మందగిస్తే..



కొద్దిపాటి పనికే అలసిపోవటం.. ఏకాగ్రత సరిగా కుదరకపోవటం.. చురుకుదనం తగ్గటం.. బరువు పెరగటం.. వయసు మీద పడుతున్నకొద్దీ ఇలాంటివి సహజమేనని చాలామంది భావిస్తుంటారు. కానీ థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగించటమూ (హైపోథైరాయిడిజమ్‌) ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది!మన మెడ ముందుభాగానికి కరచుకొని ఉంటుంది థైరాయిడ్‌ గ్రంథి. ఇది ‘జీవక్రియల’ను (మెటబాలిజమ్‌) నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోతే రకరకాల సమస్యలు బయలుదేరతాయి. ఈ సమస్య పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ. ముఖ్యంగా వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి ఆరంభమవుతుంటాయి. వీటిపై అవగాహన కలిగుండటం అవసరం.

నిస్సత్తువ: ఇంతకుముందు తేలికగా చేసిన పనులే అయినా త్వరగా అలసట ముంచుకొస్తుంది. ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్టు అనిపిస్తుంటుంది.

చలి తట్టుకోలేకపోవటం: వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్నా తట్టుకోలేకపోవటం మరో లక్షణం. చుట్టుపక్కల వాళ్లు మామూలుగానే ఉన్నా చలి చలిగా అనిపిస్తుంటుంది.

ఆకలి తగ్గటం, బరువు పెరగటం: జీవక్రియల వేగం తగ్గినపుడు కేలరీల అవసరమూ తగ్గుతుంది. దీంతో ఆకలి కూడా మందగిస్తుంది. మరోవైపు కేలరీల వినియోగం తగ్గటం వల్ల ఖర్చు కాకుండా మిగిలిన కేలరీలు కొవ్వు రూపంలో స్థిరపడతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.

అధిక రక్తపోటు: థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు పడిపోతే అధిక రక్తపోటుకు దారితీయొచ్చు. కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరుగుతాయి. కొంతకాలానికి గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యమూ తగ్గొచ్చు.

ఏకాగ్రత లోపించటం: జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లోపించటం వంటివీ మొదలవ్వచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు ఇష్టమైన వ్యాపకాలు, అభిరుచుల వంటి వాటిపై ఆసక్తి సన్నగిల్లితే నిర్లక్ష్యం తగదు.

మలబద్ధకం: థైరాయిడ్‌ హార్మోన్ల స్థాయులు తగ్గితే మలబద్ధకం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారటం, గోళ్లు పలుచగా అవటం.. ఇలా రకరకాల సమస్యలూ బయలుదేరతాయి.

గర్భధారణకు ఏది మంచి వయసు?



కొందరు ఎలాంటి ప్రణాళికలూ లేకుండా పెళ్లయిన వెంటనే పిల్లలను కంటుంటే.. మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే 35 ఏళ్లు దాటాక గానీ సంతానం గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. మహిళలు రజస్వల అయిన దగ్గర్నుంచీ ప్రతి నెలా అండాశయంలోని అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల సంఖ్య బాగా పడిపోతుంది. ఇక మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతూ వస్తుంది. మగవారు 40 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టబోయే పిల్లల్లో ఆటిజమ్‌ తలెత్తే అవకాశమున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతానం కనటాన్ని మరీ త్వరగా లేదా మరీ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మహిళలు 21-29 ఏళ్ల మధ్య గర్భం ధరించేలా చూసుకోవటం మంచిది

Wednesday, February 13, 2019

చీమ తెలివి - మనిషి బతుకు జీవిత సత్యం

నా దృష్టి ఒక చీమపై పడింది.
 ఆ చీమ తనకన్నా అనేక రెట్లు పెద్దదైన ఒక ఆకుని మోస్తూ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు గంట సేపు అనేక అడ్డంకులు, అవరోధాలతో, ఆగుతూ దారి మార్చుకుంటూ గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడం గమనించాడు.

             ఒక సందర్భంలో నేలపైనున్న పెద్ద పగులును  ఆ చిన్న చీమ దాటవలసి వచ్చింది. అప్పుడది ఒక క్షణం ఆగి పరిస్థితిని విశ్లేషించి తాను మోస్తున్న ఆ పెద్ద ఆకును దానిపై పరచి దాని పైనుండి నడిచి అవతలకి చేరుకొని మళ్ళీ ఆ ఆకు అంచుని పట్టుకొని పైకెత్తుకుని ప్రయాణం ప్రారంభించింది.

భగవంతుని సృష్టిలోని ఆ చిన్నప్రాణి తెలివితేటలు
 ఆకర్షింప చేసాయి. విస్మయం చెందిన నన్ను, ఆ సన్నివేశం సృష్టి యొక్క అద్భుతాలపై ఆలోచనలో పడేసింది.

              భగవంతుని సృష్టి అయిన ఆ ప్రాణి పరిమాణములో ఎంతో చిన్నదైనా తన మేధస్సు,
 విశ్లేషణ, ఆలోచన, తర్కం, అన్వేషణ, ఆవిష్కరణలతో సమస్యలను  అధిగమించటం నా కళ్ళ ముందు సృష్టికర్త యొక్క గొప్పతనాన్ని అవగతం చేసింది.

                 కొంత  సేపటికి చీమ తన గమ్య సమీపానికి చేరుకోవడం నేను చూసాడు. అది ఒక చిన్న రంధ్రం ద్వారా భూగర్భం లోపలకి ప్రవేశించే చీమల నివాసస్థలం, అప్పుడా క్షణంలో నాకు ఆ చీమ వ్యవహారంలో ఉన్న లోపం స్పష్టంగా అర్థం అయ్యింది. ఆ చీమ తాను ఎంతో జాగ్రత్తగా గమ్యం వరకు తీసుకు వచ్చిన  ఆ పెద్ద ఆకును  చిన్న రంద్రం ద్వారా లోనికి ఎలా తీసుకెళ్లగలదు? అది అసంభవం.

 ఆ చిన్న ప్రాణి  ఎంతో కష్టానికోర్చి, శ్రమపడి, నేర్పుగా ఎన్నో అవరోధాలనధిగమించి చాల దూరం నుంచి తెచ్చిన ఆ పెద్ద ఆకును అక్కడే వదలి ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.

                  తను మోస్తున్న ఆకు భారం తప్ప ఇంకేమి కాదనే ఆలోచన సాహసంతో కూడుకున్న ఆ ప్రయాణం మొదలు పెట్టె ముందు ఆ చీమకు రాలేదు. చివరాఖరికి వేరే మార్గం ఏమి లేక దానిని అక్కడే  వదలి ఆ ప్రాణి గమ్యాన్ని చేరుకోవలసి వచ్చింది.

దీని ద్వారా నేను ఒక గొప్ప జీవిత పాఠాన్ని ఆ రోజు తెలుసుకున్నాను.
ఇది మన జీవితాలలోని సత్యతను కూడా తెలియ చేస్తుంది.

               మనం మన పరివారం గురించి, మన ఉద్యోగం, మన వ్యాపారం, ధనం ఎలా సంపాదించాలని, మనం ఉండే ఇల్లు ఎలా ఉండాలి, ఎలాంటి వాహనంలో తిరగాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎలాంటి ఉపకరణాలు ఉండాలి ఇలా ఎన్నో ఆలోచనలు, ప్రణాళికలు చేస్తాము.

 కానీ చివరికి వాటన్నింటిని వదలి అంతిమముగా మృత్యువనే బిందువు పెట్టబడడం ద్వారా మన గమ్యమైన శ్మశానం చేరుకుంటాము.

 మన జీవన ప్రయాణంలో ఎంతో ఆపేక్షగా, ఎంతో భయంగా మనం మోస్తున్న భారమంతా అంతిమంలో ఉపయోగపడదని, మనతో తీసుకెళ్లలేమని మనం తెలుసుకోవటం లేదు. ఒక క్షణము ఆలోచించండి.. మీరు స్మశానానికి తీసుకెళ్లేది మంచి వారా, చెడ్డవారా  అనేది మాత్రమే... మనల్ని తగలపెట్టాకా. మన ఆస్తుల గురించి, మన అంతస్తుల గురించి మాట్లాడుకోరు.. మనము చేసే మంచి పనులగురించి, చెడ్డపనుల గురించి మాత్రమే మాట్లాడుకుంటారు.. ఈ చిన్న జీవిత సత్యాన్ని తెలుసుకోండి..
మంచి మార్పు ఎప్పుడైనా, ఈ క్షణమైనా రావొచ్చు.. మారండి.. 

Sunday, February 10, 2019

ధర్మబద్ధ జీవనమే అతి పెద్ద పూజ



ఆయనకు వేదమే ప్రమాణం.. ఆయన మాట వేద సమానం.. అందుకే ఆ మాటలు.. ఇంటింటా వినిపిస్తున్నాయి.. మది మదినీ తడుతున్నాయి.. పురాణేతిహాసాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. ఆయనే చాగంటి కోటేశ్వరరావు. తన వచనామృతంతో తెలుగునాట భక్తి ఉద్యమం సాగిస్తున్న ప్రవచన చక్రవర్తి అంతరంగం ‘హాయ్‌’కి ప్రత్యేకం..

యజ్ఞయాగాదులే చేసి మోక్షాన్ని పొందాలని ఎక్కడా లేదు! ‘కలౌ నామ సంకీర్తనః’ అంటారు. ఒక్క నామం చాలు. ఇష్టదైవం నామం పట్టుకున్నా తరించిపోతావు. ‘రామ’, ‘శివ’ నామాలు స్మరిస్తే చాలు. ‘కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకొని పిలిచినా, ఆడుకుంటూ అయినా, గేళి చేస్తూ అయినా, పద్యం చదువుతూనో, పాట పాడుతూనో, గద్యం చెబుతూనో అందులో భగవన్నామాన్ని తెలిసిగానీ, తెలియక గానీ ఉచ్ఛరిస్తే.. అది నీ పాపాలను తొలగిస్తుంది. తరింపజేస్తుంది’ అని భాగవతంలో అజామీళోపాఖ్యానం తెలియజేస్తోంది.
* మీరు భారత ఆహార సంస్థలో ఉద్యోగి. కానీ, ప్రవచనాలవైపు రావడానికి కారణం?
మా నాన్నగారి రక్తం నాలో ప్రవహించడం వల్ల ఇలా వచ్చానేమో. వారికి సనాతన ధర్మంపై, ఆర్ష వాఙ్మయంపై, భక్తితో కూడిన జీవనంపై చాలా అనురక్తి, నిబద్ధత ఉండేవి. అదే నాకు ప్రేరణ. అదే ప్రవచనాల వైపు నడిపించింది.
* చిన్నప్పటి నుంచే రామాయణం, భారతం వంటి పురాణ వాఙ్మయంపై మక్కువ కలిగి ఉండేవారా?
నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల నుంచి పురాణాలపై అనురక్తి ఉంది. తమ్మిరాజు గారని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన మా ఇంట్లో ముందు భాగంలో అద్దెకు ఉండేవారు. తరచుగా వీటి గురించి ప్రస్తావన చేస్తుండేవారు. అలా వాటి మీద నాకు అనురక్తి బాగా స్థిరపడింది.
* చదువుకునే రోజుల్లో సహచరులతో వీటిపై చర్చలు జరిపేవారా?
మాకు ఇలాంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి కోణంతో విద్యా బోధన ఉండేది. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో.. మాకు తెలుగు పాఠం చెప్పేవాళ్లు మంచి విద్వాంసులు. ఉపాధ్యాయుడు నరసింహాచార్యులు గారు, మా ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఎల్‌ సూర్యనారాయణ గారు.. జీవితంలో క్రమశిక్షణతో నడవడానికి ఇవి ఉపయోగపడతాయని ధార్మిక విషయాలను బోధిస్తుండేవారు. ఈ కోణంలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. నాకు సహజంగా ఉన్న అనురక్తికి ఇవి బాగా తోడయ్యాయి.
* సంక్లిష్టమైన విషయాలను అలతి పదాలతో చెప్పగలిగే ధారణ మీరెలా అలవర్చుకున్నారు?
నేను ప్రవచనానికి వెళ్లినప్పుడు నా అంతిమ లక్ష్యం ఒకటే! ప్రవచనానికి ఆర్తితో వచ్చి రెండు గంటల సమయం వెచ్చిస్తున్న వ్యక్తికి నా వల్ల ఏదో ప్రయోజనం కలగాలి. అది కొంతమందికే అందితే.. ఎంతో ఆర్తితో వచ్చిన వారు నిరుత్సాహ పడతారు. అలా జరగకూడదని నేను ఎంత కిందివరకు వెళ్లి అర్థమయ్యేట్టు మాట్లాడొచ్చో.. అంత వరకూ వెళ్లాలనుకుంటా. ఆ తపనే ఎక్కువ మంది ఆదరణకు నోచుకోవడానికి కారణం అయి ఉండవచ్చు.
* ‘మనిషి శిథిల వస్త్రాన్ని విసర్జించి నూతన వస్త్రాన్ని ధరించినట్టే.. ఆత్మ శిథిల దేహాన్ని వదిలి నూతన దేహాన్ని అవిష్కరిస్తుందని గీతలో చెప్పారు. ఆత్మకు చావు లేద’న్నారు. అంటే పునర్జన్మ ఉంటుందనేనా?
సనాతన ధర్మం పునాదులన్నీ పునర్జన్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. ఎంత మంది రక్షకభటులు, ఎన్ని చట్టాలు మనిషిని నియంత్రించగలవు? నేను చేసింది నేనే అనుభవించాలి అనే స్పృహ పాపం చేయకుండా నియంత్రిస్తుంది. ఇతరులను బాధించకుండా, శాంతియుతంగా ఉండడానికి పునర్జన్మ సిద్ధాంతం ఉపకరణమే కదా!
* మన పురాణాల్లో, శాస్త్రాల్లో స్త్రీ-పురుష వివక్ష చూపలేదు.  వీరిద్దరి సంగమమే ఈ సృష్టి అని చెప్పాయి. కానీ, కొన్ని దశలు దాటిన తర్వాత ఎందుకు వివక్ష వచ్చింది? స్త్రీ అనేక విషయాల్లో వివక్ష ఎదుర్కొంటోంది.. ఇదెలా పోవాలి?
మనసులో ఏదో పెట్టుకొని మహిళలను దూరం పెట్టినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇచ్చి గౌరవించాలి. వారిని కాపాడటం కోసమో, భౌతికంగానో, ఇతరత్రా కారణాల చేతనో వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిందయితే.. దానిని సక్రమంగా వివరించి కొనసాగించాల్సి ఉంటుంది.  చటుక్కున వాటిని తీసేయడం కూడా ప్రమాదమే! ఇది రక్షణ కోసం ఏర్పాటు చేసిందని వివరణ ఇవ్వాలి. అది అపోహ అయినప్పుడు, అది మౌఢ్యం అయినప్పుడు దానిని తొలగించి వారి స్థానాన్ని వారికివ్వడమే మర్యాద.
* రామాయణంలో రాముడి ద్వారా సమాజాన్ని చూపించారు వాల్మీకి. అటువంటి రామాయణంలోనూ ఎవరో ఏదో అన్నారనో సీతమ్మను అరణ్యవాసానికి పంపించడంలో ఎటువంటి ధర్మం ఉంది?
చాలాకాలంగా రామాయణంపై జరుగుతున్న చర్చల్లో వస్తున్న ప్రశ్న ఇది. రాముడి మనసులో సీతమ్మ మీద అసలు అనుమానం లేనే లేదు. బాగా ప్రేమ ఎక్కడ ఉంటుందో.. అక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే.. అవతల వారు మానసింగా ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఇవతలి వారు అనుభవిస్తారు. సీతమ్మ మీద అనుమానం ఉంటే రాముడు ఆమెను అయోధ్యకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయడు. కానీ, లోకం సరైంది కాదు.. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అయోధ్యకు వెళ్లిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటే.. సీతమ్మ చాలా బాధపడుతుంది. ఆమెను ఎవ్వరూ ఏమీ అనకూడదనీ, ఆమె అలా బాధపడకూడదనీ.. సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించారు. అగ్నిహోత్రుడు ఆమెను మహాపతివ్రత అన్నారు. ఉత్తరకాండలో సీతమ్మను పరిత్యజించడానికి ముందు.. ఒక గూఢచారి వచ్చి సీతమ్మను ఇలా అంటున్నారని రామునితో చెప్పాడు. రాముడు వెంటనే నిర్ణయం తీసుకోలేదు. మిత్రులతో మీరేం అనుకుంటున్నారని అడిగాడు. మిత్రులు కూడా గూఢచారి చెప్పిన మాటకు అనుకూలంగానే మాట్లాడారు. ఇది ‘ఇవ్వాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆమె గర్భవతి. ఈ మాట రేపు అంతఃపురానికి వస్తుంది. చెలికత్తెలు ఏం మాట్లాడుకుంటున్నా.. నా గురించేనేమో అని సీత అనుకొని బాధపడుతుంది. మానసికంగా కుంగిపోతే సంతానం తేజోవంతంగా ఎలా పొందగలుగుతుంద’ని ఆలోచించాడు రాముడు. ఆమె ప్రశాంతంగా ఉండి సంతానం కనాలని వనాలకు పంపించాడు. సీతారాములు రెండు కాదు ఒక్కటే అని సీతమ్మే చెప్పింది. రామాయణం సహృదయంతో అర్థం చేసుకుంటే.. రాముడెప్పుడూ సీతమ్మను వదిలిపెట్టేయలేదన్న విషయం మనకు దృఢంగా అర్థమవుతుంది. అందుకే సీతమ్మ భూమిలోకి వెళ్లిపోతే.. రాముడు సరయూలోకి వెళ్లిపోయాడు. ఇంక రాముడు సీతమ్మను వదిలేశాడన్న ప్రశ్నే రాదు. అదే నిజమైతే నేటికీ పెళ్లిపత్రికలపై సీతారాముల బొమ్మలు వేసి, వారి శ్లోకాలను ఎందుకు అచ్చు వేయిస్తా?.
* రామాయణం కంటే భారతం ముందు జరిగిందని కొందరంటారు. కానీ శాస్త్రం ప్రకారం రాముడు ముందు.. కృష్ణుడు తర్వాత అంటారు. మీరు దీన్నెలా వివరిస్తారు?
ఇతిహాసం అంటే... ఇది ఇట్లే జరిగిందని అర్థం. ఇక ఇందులో అనుమానాలేం లేవు. రామాయణ కర్త వాల్మీకీ రామాయణంలో భాగం. భారత కర్త వ్యాసుడు భారతంలో భాగం...  వాళ్లు రాసిన ఈ రచనల్లోనే రామాయణం త్రేతాయుగంలో జరిగిందని చెప్పారు. మహాభారతం ద్వాపర యుగంలో జరిగిందని రాశారు. అంటే రామా అవతారం తర్వాత... కృష్ణావతరం.
* చాతుర్‌వర్ణ వ్యవస్థలో చెప్పేందేమిటి? ఇప్పుడు కులాల పేరుతో జరుగుతోందేమిటి?
గుణాలతో ఎవరు ఏదైనా కావచ్చు. విశ్వామిత్రుడు రాజు. బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణమే అంగీకరించిందిగా! ఇక సంకుచిత ప్రయోజనాలు, అధికారం ఆశించే వాళ్లు మనుషులను విభజించి లబ్ధి పొందడానికి చూస్తుంటారు. వారి గురించి వ్యాఖ్యానించను.
* ఎంతో ఆడంబరంగా, బాగా ఖర్చు పెట్టి కొందరు పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే దైవం మనల్ని కరుణిస్తాడని నమ్మకంతో ఉంటారు. ఇలా గొప్పగా చేస్తేనే  ఫలితం ఉంటుందంటారు కొందరు. వీరికి మీరిచ్చే సలహా?
ప్రపంచంలో ప్రతీ ఒక్కటీ దేవుడు సృష్టించినవే కదా! మరి అన్నీ ఆయనవే అయినప్పుడు మనల్ని ఎందుకు అడుగుతాడు? ఫలానా ఉపకరణం సమర్పించి పూజ చేస్తేనే మిమ్మల్ని అనుగ్రహిస్తానని ఎందుకు చెబుతాడు. భగవంతుడు పూజలో మనసు అడిగాడు. ధర్మబద్ధంగా బతకడమే అతి గొప్ప పూజ. అరగంటో, గంటో పూజ చేస్తావు. మరి 23 గంటలు అధర్మంగా బతికితే భగవంతుడు అనుగ్రహిస్తాడా? దేవుడు చెప్పింది మనం ఆచరిస్తే ఆయన సంతోషిస్తాడు గానీ... ఏవేవో సమర్పించి పెద్దపెద్ద పూజలు చేస్తే అనుగ్రహించడు.
* పెళ్లి అంటే ఆడంబరాలేనా? కొందరు లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నారు. పెళ్లి చేయటానికి ఏ రకమైన విధానం ఉండాలి?
పెళ్లిలో ఆడంబరం అనే పదానికి స్థానం లేదు. వివాహ క్రతువు దాన్ని కోరలేదు. పెళ్లిద్వారా గృహస్థాశ్రమంలోకి వచ్చి ధార్మికమైన సంతానాన్ని పొందాలి. తన కామాన్ని ధర్మంతో ముడివేయాలి. ధర్మపత్నిని స్వీకరించి సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. దంపతుల మధ్య ఉండవలసింది అవగాహన. ఇద్దరు సమాజంలో ఆదర్శవంతంగా బతకాలి.  ఇంత పవిత్రమైన వివాహ క్రతువుకు ఇన్నివేలమంది రావాలి.. యాభై వంటకాలుండాలి.. ఇన్ని పట్టుచీరలు, ఇంతబంగారం పెట్టాలి.. అని ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు. మీదగ్గర చాలా డబ్బు ఉంటే మీ అమ్మాయి పెళ్లి చేసి.. మిగిలిన డబ్బుతో పేదమ్మాయి పెళ్లిచేసి ఆదర్శంగా ఉండమంటాను.
* ఈ మధ్య యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. దీనికి కారణం వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేకపోవటమా? నైరాశ్యమా?
దీనికి పిల్లలను మాత్రమే అననక్కర్లేదు. తల్లిదండ్రులు, బంధువులు, సమాజం, విద్యాలయాలు, ప్రభుత్వం.. అన్నింటికీ సమాన భాగస్వామ్యం ఉందంటాను. సీతమ్మ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో.. పాండవులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. నెల్సన్‌ మండేలా ఎన్ని బాధలు పడ్డాడో.. అయినా వీరంతా బతికి చూపించారు కదా. కష్టాలు పడనివాడెవ్వడూ ఉండడు. పిల్లలకు అబ్దుల్‌కలాం జీవితం గురించి చెప్పరు. మహాత్ముల జీవితచరిత్రలు పిల్లలకు అందుబాటులో ఉండవు. పాఠ్యాంశాల్లోకి తీసుకురారు. ఓ పండుగొస్తే మేనమామగానీ, పెద్దనాన్నగానీ మంచి పుస్తకం తీసుకొచ్చి పిల్లలకు ఇవ్వరు. ఇంట్లోవాళ్లు మంచి పుస్తకాలు చదివి భోజనం చేసేప్పుడు పిల్లలకు చెప్పరు. ఎంతసేపు పిల్లలు ఇంటికొచ్చినప్పటి నుంచి 99.9 శాతం మార్కులు వచ్చాయా లేదా అనే ప్రశ్ననే ఉంటుంది. ఆ పిల్లవాడు చదువైతే చదువుకున్నాడు. అయితే జీవితంలో చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోవటానికి మార్గం తెలీదు. అంతలా కూరుకుపోతున్నాడు. ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే.. రామాయణం, భారతం ఛాందసాలు అనటం మానాలి. నెల్సన్‌మండేలా, అబ్దుల్‌కలాం జీవితాలు ఇప్పుడు మా అబ్బాయికెందుకు?అని తల్లిదండ్రులు అన్నన్నాళ్లు ఈ నైరాశ్యం నుంచి పిల్లలు బయటపడే అవకాశం లేదు.


ధర్మం మారుతూ ఉంటుంది. సత్యం ఎప్పడూ ఒక్కలాగే ఉంటుంది. ధర్మాన్ని పట్టుకోగా..పట్టుకోగా చివరికి సత్యంలోకి వెళతాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం ధర్మం. ఉదాహరణకు కొడుకు ముందు నిల్చుంటే తండ్రిలా ఉండాలి. భార్య వద్ద భర్తలా మెసలాలి. ఇది ధర్మం. ఇలా తండ్రిలా, భర్తలా మారుతూ...మారుతూ.. చివరకు ఆత్మగా ఈ మార్పులేకుండా ఉండిపోవడమే సత్యం. ధర్మం... అనుష్టించగా... అనుష్టించగా సత్యం అవుతుంది. ఆ సత్యమే భగవంతుడు.
మనకు దేవతామూర్తులు ఎక్కువ. పూజలు ఒక్కటే. భగవంతుడిని ఏ రూపంలో రమ్మని భక్తుడు అడుగుతాడో ఆ రూపంలోనే వెళ్తాడు. పరమహంస.. ఈ ప్రశ్నకే ఓ మాటంటాడు. ఓ వ్యక్తి చెట్టుమీద ఉండే పురుగు ఎర్రగా ఉందంటాడు. మరొకరు పసుపు అంటాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి పకపకా నవ్వి.. ఆ పురుగు ఊదా రంగులో ఉందని చెప్పాడు. ఈశ్వరుడంతే. ఉన్నది ఒక్కడే. ఎవరికి ఎలా చూడాలనిపిస్తే అన్ని రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడ
రామావతారంలో... రాముడు ఏం చేశాడో మనిషి దాన్ని చేయాలి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తట్టుకొని నిలబడ్డాడు రాముడు. మనిషీ అదే చేయాలి.
కృష్ణావతారంలో... కృష్ణుడు ఏం చెప్పాడో అలా చేయాలి. ఎందుకంటే కృష్ణావతారంలో కొన్ని అద్భుతాలుంటాయి. అవన్నీ మనిషి చేయలేడు. అందుకే కృష్ణుడి మాటలను  అనుసరించాలి.
జోతిష్యం.. వేదాలకు ఉపాంగం. నేత్ర స్థానంలో ఉంటుంది. భవిష్యత్తును దర్శించి... పరిహారం చెబుతుంది. అయితే జోతిష్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా కొందరు చేసేది నాకు నచ్చదు. ఒక వైద్యుడు కుడికాలికి చేయాల్సిన శస్త్రచికిత్స ఎడమ కాలికి చేశాడనకో... అది వైద్యుడి తప్పు... అంతేగానీ వైద్యశాస్త్రం మొత్తంది కాదు. జోతిష్యంలో తప్పు లేదు. జోతిష్యం ఓ శాస్త్రం. దీన్ని ఉపయోగించి సమాజ సంరక్షణకు ఏదీ చెప్పాలో అది చెప్పాలి. తగినంత పరిజ్ఞానం లేకుండా వ్యాపారంగా మార్చడాన్ని నేను సహించను.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...