Friday, January 18, 2019

ఏ సమయంలో నిద్ర లేస్తే మంచిది?



ఏదైనా సాధించాలంటే సాధనం బాగుండాలి. తుప్పుపట్టిన కత్తితో ఏ సైనికుడు యుద్ధం చేయలేడు.అందుకే యుద్ధానికి వెళ్లేవాడు కత్తిని పదును పెట్టుకోవాలి. అలాగే ఏదైనా ధర్మకార్యం చేయాలన్నా..జీవిత పరమర్థాన్ని తెలుసుకోవాలన్నా , సాధనమైన శరీరాన్ని అందుకు అనుకూలంగా సిద్ధం చేసుకోవాలి. ఈ లక్ష్య సాధనలో భాగంగా ప్రాచీన రుషులు మనకు అందించిన మార్గమే సదాచారం.

ప్రపంచ విఖ్యాత పండితుడు మాక్సుముల్లరు. ఆయన తన చివరి రోజుల్లో… భగవంతుడిని ప్రార్థిస్తూ, తాను మరల పుడితే భారత దేశంలో పుట్టాలని కోరుకున్నాడట. అయితే ఈనాటి ఇంగ్లీష్ ఎడ్యుకెటేడ్ ఆధునిక మేధావులు, సెక్యులర్ వాదులు , మార్క్స్ మేకాలే వాదులు మాత్రం పుణ్యభూమి భారత్ విలువ తెలియక ఇప్పటికి మన దేశాన్ని నిందిస్తున్నారు. మాక్స్ ముల్లర్ భారత్ లో పుట్టాలని కోరుకోవడానికి ప్రధాన కారణం సదాచార పూర్ణమైన భారతీయ జీవన విధానం. మానవుడు నిద్రలేవడంతోనే అతని దైనందిన జీవితం ఆరంభమౌతుంది. సదాచారంలో మొదటి అంశం నిద్రలేవటం.

నిద్ర ఎప్పుడు లేవాలి..?

ఈ విషయంలో మన ధర్మ శాస్త్రాలు, వైద్యశాస్త్రం ఏం చెప్పాయి..?
నిద్ర లేచే విషయంలో హిందు ధర్మ శాస్త్రాలు, వైద్య శాస్త్రం కూడా ఒకే మాటగా “బ్రాహ్మే ముహూర్తే బుద్ధేత” అని, అలాగే “బ్రాహ్మీ ముహూర్తే ఉత్థాయ చింతయే దాత్మనో హితం” అని పేర్కొన్నాయి. ఆయురారోగ్యాలతోపాటు ధర్మాచరణకు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలని హిందూ ధర్మ గ్రంథాలు తెలిపాయి.

సూర్యోదయానికి ముందున్న ముహూర్తాన్ని రౌద్రమంటారు. దీనికి ముందున్నదే బ్రాహ్మీ ముహూర్తం. అనగా సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందుండే సమయం. ఈ సమయంలో నిద్రలేవటంలో వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది. భూమి తన చట్టూ తాను తిరగటం వలన రాత్రింపగళ్లూ ఏర్పడతాయి. బ్రాహ్మీముహూర్తం నుంచి మధ్యాహ్నం వరకు ఉండే సమయం ఉత్తేజం కలిగించే సమయం. ఈ సమయంలో దేహంలో అన్ని రకాల శక్తులు వృద్ధి పొందుతాయి, చురుగ్గా పనిచేస్తాయి. దీనిని ఆదాన సమయం అంటారు.

మధ్యాహ్నం నుంచి మధ్యరాత్రి దాటే వరకు శిథిలత నిచ్చు సమయం. ఈ సమయంలో అలసట స్వభావాలు ఏర్పడుతుంది. శరీరంలోని అన్ని అవయవాల శక్తులు సన్నగిల్లుతాయి. దేహం విశ్రాంతి కోరుకుంటుంది. దీనిని విసర్గ సమయం అంటారు. ఆదాన సమయంలో నిద్రపోవటం, విసర్గ సమయంలో మెలకువగా ఉండటం శారీరకంగానూ, మానసికంగానూ అనారోగ్యకరమైంది. దీంతో బుద్ది చురుకుదనం కోల్పోతుంది. లౌకిక వ్యవహారాలకే ప్రాధాన్యత నిచ్చేవారు ఈ వత్యాసం గుర్తించలేరు. ఇలాంటి వారు తమ ఆధ్యాత్మిక దృష్టిని వికసింప చేసుకునే అవకాశాలను చాలా వరకు కోల్పోతారు. అందుకే ఇలాంటి వారికి అవసరమైన శాంతస్థితి చేకూరదు. దీంతో వీరు నిజమైన సుఖ శాంతులకు దూరం అవుతారు. ఈ ప్రవృత్తిని నిశాచర ప్రవృత్తిగా పిలుస్తారు.

వేకువ జామునే నిద్ర లేచే విషయంలో పసిపిల్లలే సదాచారపరులు. చిన్నారులు తల్లిదండ్రుల కంటే ముందే బ్రాహ్మీ ముహూర్తాన్నే నిద్రలేస్తారు. వాళ్లను నిద్రలేపుతారు. పసిపిల్లలు నిద్రలేచే ఈ ప్రవృత్తి ప్రకృతి సిద్ధం. బ్రాహ్మీ ముహూర్తంలో పక్షుల కిలకిలా రావాలు వినిపిస్తాయి. పశుపక్ష్యాదులు కూడా బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేస్తాయి. అంతేకాదు సకల పుష్పాలు…ఈ ముహూర్తంలోనే పరిమళాలు వేదజల్లుతాయి. అలాగే ఈ ముహూర్తంలో నిద్రలేస్తే, మన బుద్ది కూడా వికసించి ఉత్తమ సమాలోచనలు పొందుతుంది. అందుకే ఇది బ్రాహ్మీ ముహూర్తం అయ్యింది. బ్రాహ్మీ అంటే సరస్వతి. బ్రాహ్మీ ముహూర్తాన లేచిన వెంటనే చల్లని నీటితో కళ్లు తుడుచుకోవాలి. కొన్ని గంటలుగా కాంతిని నిరోధించిన కళ్లకు హఠాత్తుగా వెలుగు చూపటం దోషం. అందుకై ఇలా చన్నీటితో తుడుచుకోవాలి.

ఆ తర్వాత ‘సముద్ర వసనే దేవి! పర్వత స్తనమండలే, విష్ణుపత్ని! నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే’ అని భూదేవికి నమస్కరించిన తర్వాతే పాదం భూమిపై మోపే ఆచారం మన పెద్దలది. మన దైనిందిన జీవితమంతా సకల దుష్ట విసర్జనలతో సహా ఈ భూమి మీదే చేస్తాము. కాబట్టే మనకు తిండిని ప్రసాదించే, జీవితాంతం మనలను భరించే ఈ భూమికి క్షమాపణ చెప్పుకొని నెత్తిన కాలు పెట్టుటం కనీస కర్తవ్యం. కాలు తగిలితే సారీ చెప్పుకొనే నాగరికతను చూస్తున్న మనం…భూదేవిని క్షమించమని ప్రార్థనను చేయలేమా?

నిద్రలేవగానే శుభదర్శనం చేయాలని సదాచారం చెబుతోంది. నిద్రలేవగానే శ్రోతియుని , గుణ సంపన్నుని, గోవును, అగ్నిని, సోమయాజిలాంటి వారినే చూడాలని, పాపిష్ఠివారిని, అమంగళకర వ్యక్తులను చూడతగనది అంటారు. ఇలా అనడంలో నిద్రలేచిన వెంటనే చేసే దర్శనం ఆరోజు జీవితంపై ప్రభావం చూపుతుందని ప్రజల విశ్వాసం. అందుకే ఎప్పుడైన ప్రమాదం జరగగానే ఛీ..నిద్రలేస్తూ ఎవరి మొగం చూచానో అనుకోవడం మనం చూస్తాం. చాలా మంది నిద్రలేవగానే అరచేతిని చూచుకొంటారు.

కరాగ్రే వసతే లక్ష్మీ-కరమధ్యే సరస్వతీ! కరమూలే స్థితో బ్రహ్మా- ప్రభాతే కరదర్శనం!! అనేది ఆర్ష వ్యాక్యం. అరచేతి అగ్రభాగం లక్ష్మీస్థానం. మధ్యభాగం సరస్వతి స్థానం. కరమూల బ్రహ్మ లేదా గోవింద స్థానం. కాబట్టే ఉదయం లేవగానే అరచేతిని చూచుకొంటారు. అరచేతిలో శ్రీరామ వ్రాసి కన్నుల కద్దుకొవడం కొందరు చేస్తారు. నిద్రలేవనగానే ఏ విధంగానైన దర్శనం అయ్యేటట్లు చేసుకోవడం మంచిది.

దైవ ప్రార్థన తర్వాత ముఖం, కాళ్లు చేతులు కడుగుకొని పుక్కిలించి ఉమ్మివేయాలి. అనంతరం జలపానం చేయాలి. ప్రాతఃకాల జలపానం ఎంతో ఆరోగ్యప్రదం. రాత్రి నిద్రకు ముందు రాగి, వెండి , కంచు లేదంటే మట్టి పాత్రలో మంచినీరుంచి ప్రాతః కాలంలో త్రాగితే సకల దోషాలు పోయి ఆరోగ్యం చేకూరుతుంది. వాత పిత్తశ్లేష్ఠు, ప్రకోపాలు తొలగటమేకాక హృద్రోగం, కాస, శ్యాస, క్షయ, అస్మరీ..మూత్రంలో రాళ్లు, గ్రహణీ….రక్త విరేచనాలు, అతిసార, అతి మూత్ర మొదలైన ఎన్నో వ్యాధులు క్రమంగా ఉపశమిస్తాయి. అంతేకాక సంతోషం, బలం, ఆయుర్వృద్ధి, వీర్యవృద్ధి,ఆరోగ్యం కలుగుతాయి. జలపానం చేశాక కొంత సేపు నడవడం మలబద్దకాన్ని పొగడుతుంది.

బ్రాహ్మీ ముహూర్తంలో ప్రాతః స్మరణ కర్త్యవంగా మన పెద్దలు చెప్పారు. ప్రాతఃస్మరణతో పుణ్యము, సంస్కారం, చేకూరుతాయి. ఇష్టదైవాలతోపాటు, మహనీయులను, పుణ్యతీర్థాలను స్మరించటం, మహనీయుల జీవిత విశిష్టతను తెలుసుకొని ఆచరణలో వారిని ఆదర్శంగా స్వీకరించడం జీవితానికి ధన్యత.
Written by_ Mr గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కర్ణవేధ

చెవులం అనగా 'కర్ణవేధ' అను విశేషార్థం కలదు. కర్ణవేధ అనగా చెవులను పోటుతో వేధించడం. చెడు మాటలు విన్నప్పుడల్లా ఆ పోటు గుర్తుకు రావాలి అని అంతరార్థం. కర్ణవేధ చేయించినపుడు పురోహితుడు 'మాశృణు పాప్నానం, మాశ్రావయ పాప్నానం మోచ్ఛారయ పాప్నానం మాచర పాప్నానం మాపశ్య పాప్నానాం' అని చెవిలో చెప్పి బంగారుతీగను ఈ మంత్రంతో ప్రోక్షించి మొదట దైవానికి పురోహితునికి అర్పించి కంసాలికి ఇచ్చి చెవులు కట్టించెదరు.

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.

చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధల్రు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టిం చుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.

ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.

ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొస్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారు చేయించుకుని ధరిస్తున్నారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Thursday, January 17, 2019

ఏమైంది నాకు?

ఉదయం 6 గంటల సమయం…….ఆఫీసుకు వెళ్ళాలని లేవడానికి ప్రయత్నం
చేస్తున్నాను. కానీ……లేవలేకపోతున్నాను.. ఎందుకో ఏమిటో మరి……
” ఏమైంది నాకు? ఎందుకు లేవలేకపోతున్నాను ? ” ఒక్క నిమిషం ఆలోచించాను.
నిన్న రాత్రి పడుకునేందుకు గదిలోకి వచ్చిన నాకు గుండెలో సమ్మెటతో కొ్ట్టినంత
నొప్పి వచ్చింది…స్ప్రుహ లేకుండా పడిపోయాను.తరువాత ఏం జరిగిందో నాకు
తెలియదు…..
కాఫీ కావాలి నాకు……..నా భార్య ఎక్కడ ఉంది. ఎందుకు నన్ను లేపలేదు.
ఆఫీసుకు టైం అవుతోంది కదా! నా పక్కన ఎవ్వరూ లేరు. ఏమైంది నాకు?
వసరాలో ఎవరినో పడుకోబెట్టి ఉన్నారు…….ఇంటి బయట చాలా మంది గుంపుగా
ఉన్నారు. ఎవరో చనిపోయి ఉన్నారు……అయ్యో! అది నేనే! దేవుడా!
నేను చనిపోయానా?బయట చాలా మంది ఏడుస్తున్నారు…..బిగ్గరగా
పిలిచాను……..నా మాటలు ఎవ్వరికీ వినపడటం లేదు. బెదిరిపోయి
నా పక్కగదిలోకి తొంగి చూశాను…. నా భార్య విపరీతంగా ఏడుస్తోంది.
కొడుకును పట్టుకుని…….భార్యను పిలిచాను……..తనకు నా మాటలు
వినిపించలేదు……..మరో గదిలోకి వెళ్ళి చూశాను……
ఆ గదిలో మా అమ్మ …నాన్న ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కూర్చోని ఉన్నారు
దు;ఖంలో…….

” నేను చనిపోలేదు బ్రతికే ఉన్నాను ” అని బిగ్గరగా అరిచాను…….ఎవ్వరూ నన్ను
చూడటం లేదు..
బయటికి పరుగెత్తి వచ్చాను…….అక్కడ నా ప్ర్రాణ స్నేహితుడు భయంకరంగా
ఏడుస్తున్నాడు…..వాడిని మిగతావాళ్ళు ఓదారుస్తున్నారు…….
నా స్నేహితునితో నాకు గొడవవచ్చి………..వాడితో సంవత్సరం నుండి నేను
మాట్లాడ్టం మానేశాను…….ఎన్ని సార్లు బ్రతిమిలాడినా మాట్లాడలేదు.మరి
వాడెందుకు ఏడుస్తున్నాడు………అవును నేను చనిపోయాను……నిజంగానే
చనిపోయాను.
‘ దేవుడా! నన్ను ఒక్కసారి బ్రతికించు తండ్రీ! కొద్దిరోజులు నాకు సమయాన్ని
ఇవ్వు…..ఇన్ని రోజులు నేను నా ఉద్యోగ వత్తిడితో నా భార్యను మంచిగా
ప్రేమగా చూసుకోలేకపోయాను…..నువ్వు చాలా అందంగా ఉన్నావనీ..
నువ్వు భార్యగా దొరకడం నా అదృ్ష్టం అని చెప్పలేకపోయాను……..
నా బిడ్డతో మంచిగా గడపలేకపోయాను……నేను వచ్చేలోగానే నా
బిడ్డ నిద్రపోయేవాడు……

ఇప్పటికీ నన్ను పసిపిల్లాడిలాగానే చూసుకునే నా తల్లిదండ్రుల బాధను
చూడలేకపోతున్నాను……..చేసిన తప్పును తెలుసుకుని నన్ను మన్నించమని
వేడుకున్న నా స్నేహితుడిని మన్నించలేని పాపిని నేను.” అని బి్గ్గారగా
ఏడుస్తున్నాను…….” దేవుడా! దయవుంచి నన్ను బ్రతికించు……నా తల్లి
మొహంలో నవ్వును చూడాలి………నన్ను క్షమించి నాకు కొన్నిరోజులు
ప్రాణబిక్ష పెట్టు స్వామీ! ”
ఇంతలో ఎవరో నన్ను కుదిపి లేపుతున్నారు……కళ్ళు తెరిచి చూశాను.
నా భార్య……” ఏమైంది? కల కన్నారా? పిచ్చి పిచ్చిగా అరుస్తున్నారు.
ఏమైంది మీకు ?” అని అడుగుతోంది.
అంటే ఇంతసేపు నేను కల కన్నానా! అంటే నేను చావలేదన్నమాట.
నిజంగానే నాకు ఇది మరుజన్మనే! ఆఫీసుకు టైం అయిందన్న నా
భార్య మాటలు విని తనని ఒక్కసారి దగ్గరకు రమ్మని పిలిచి
” నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని…..నీలాంటి అమ్మాయి నాకు
భార్యగా దొరకడం……నేను గమనించనేలేదు ఈరోజెంత అందంగా
ఉన్నావో తెలుసా ? ” అన్నాను……ఆశ్చర్యంగా నా వంక చూసి
ఒక్కసారిగా నన్ను హత్తుకుంది కన్నీళ్ళతో నా భార్య,,,,,,

మిత్రులారా! మీకు ఇంకా చాలా సమయం ఉంది… మీ ఈగో లను
పక్కనపెట్టి మీ కుటుంబాన్ని ప్రేమించండి….అన్నీ పోగొట్టుకున్నతర్వాత
బాధపడి ఏమీ లాభం లేదు……కుటుంబంతో గడపండి………స్నేహితులతో
మంచిగా ప్రవర్తించండి……ఈ జన్మ దేవుడిచ్చినది……ఆనందంగా
జీవించి ఎందరికో ఆదర్శంగా లేకపోయినా కనీసం మీ కుటుంబమైనా
మీవల్ల ఆనందంగా ఉండెటట్లు చూసుకోవలిసింది ఖచ్చితంగా మీరే!
……….ఇంత ఓపిగా చదివిన మీకు ధన్యవాదములు

Tuesday, January 8, 2019

ధనుర్మాస మహాత్యం

ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో వేంకటేశ్వరున్ని పూజిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈమాసం మొత్తం  శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు.

సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగా ఈ థనుర్మాసాన్ని భావిస్తారు. ఈ మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ఎంతో పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలని మన పురాణాలు తెలుపుతున్నాయి.

ప్రతిదినం ఉదయాన్నే నిద్రలేచి దీపారాధన చేసిన తర్వాత ...మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దద్యోజనమును సమర్పిస్తారు. ఈ ధనుర్మాస ప్రత్యేక ప్రసాదాలను తీసుకుంటే తమకి ఆ ఏడాదంతా మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇక ఈ ధనుర్మాస ఉత్సవాలను దేశవ్యాప్తంగా విష్ణు దేవాలయాల్లో ఘనంగా నిర్వహిస్దారు. 108 దివ్య వైష్ణవక్షేత్రాలలో ప్రధాన మైన తిరుమలలోనూ ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తారు అర్చకులు.

ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతుంది. ఈనెల 16వ రాత్రి 10గo.52ని ల నుంచీ ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు టీటీడీ అధికార్లు. ఈ నెల రోజులపాటూ శ్రీవారికి చేసే సుప్రభాత సేవను రద్దు చేసి ఆస్ధానంలో తిరుప్పావై పఠించనున్నారు అర్చకులు. దీని వెనుక పురాణ గాధను పరిశీలిస్తే  గోదాదేవి  తనను ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాశురాలను ఈ నెల రోజుల పాటూ పఠిస్తారు. రోజుకొక పాశురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఆలయంలో జరుగుతుంది. నిత్యం వేదపారాయన చేసే అర్చకులే స్వామివారికి సుప్రభాతాన్ని నిర్వహిస్తారు. అయితే ఈ ధనుర్మాసం మొత్తం జీయంగార్లు తిరుప్పావై పాశురాలను స్వామివారికి చదివి వినిపిస్తారు.

గోదాదేవి రచించిన ఈ 30 పాశురాలను రోజుకోక పాశురం చోప్పున.... పటిస్తారు జీయంగార్లు. అనంతరం స్వామివారికి తోమాలను సమర్పించి, సహస్రనామార్చన చేస్తారు అర్చకులు. అనంతరం యధావిదిగద అన్ని పూజలు నిర్వహిస్తారు. ఇక ఈ మాసం మొత్తం స్వామివారికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు. పెళ్లి కావాల్సిన వారు ఈ మాసంలో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ఈ అక్షింతలను తాము శిరస్సున దరిస్తే ఖచ్చితంగా ఏడాదిలోనే వివాహం అవుతుందని భక్తుల విశ్వాసం అందుకే ఈ మాసంలో పెద్ద ఎత్తున భక్తులు తిరుమల వస్తుంటారు.

ఇక శ్రీవారి ఆలయంలో జరిగే ఏకాంత సేవలో నిత్యం  భోగ శ్రీనివాస మూర్తికే జరుపడం ఆచారం. అయితే ఈ ధనుర్మాసంలో మాత్రం భోగ శ్రీనివాస మూర్తికి  బదులుగా ఆలయంలోని శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు అర్చకులు. మరో వైపు  నిత్యం శ్రీవారిని తులసీ ఆకులతో అర్చిస్తుంటారు అర్చకులు. అయితే ఈ మాసం మొత్తం తులసిఆకులకు బదులుగా బిల్వ  పత్రాలను ఉపయోగించడం ఆచారం. ఈ బిల్వపత్రాలంటే లక్ష్మీదేవికి అత్యంత ఇష్టం కావడంతో ఈ ధనుర్మాసంలో ఈ పత్రాలతోనే స్వామివారిని అర్చస్తారు అర్చకులు.

ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయానికి కంటే ఐదుఘడియలు ముందుగా నిద్రలేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలని మన పురాణాలు తెల్పుతున్నాయి. ఈ మాసంలో స్వామివారిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకిస్తే తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల విశ్వాసం. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలని, అలాగే ఈనెలరోజుల పాటూ ఈ వ్రతాన్ని చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు నిష్టతో ఉంటే స్వామివారి సంతృప్తి చెంది కోర్కెలు తీరుతాయని మన పురాణాలు తెలుపుతున్నాయి.

కాత్యాయనీవ్రతాన్ని ధనుర్మాసంలో వివాహంకాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీగోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రత విధానం ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంతి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు, అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరిస్తారు. శ్రీరంగంలోని రంగనాథ స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవం మహా ఘనంగా జరుగుతుంది. తమిళనాడులో ధనుర్మాస వ్రతాన్ని ''పావై నొంబు'' అంటారు.

జాతకకర్మ సంస్కారం

గర్బాంబు పానజోదోషః జాతాత్సర్వోపినశ్యతి''

ఈ జాతకర్మ సంస్కారముచే శిశువు గర్బమునందు, గర్భ జలపానాది దోషము నివర్తించును.

కుమారే జాతేసతి జన్మదినసమారభ్య దశదిస పర్యన్తం, దశదిన మధ్యె యస్మిన్‌ కస్మి& దిససే తజ్జాతకర్మ పుత్రవిషయే కుర్యాత్‌''

పుత్రోత్పత్తి కాలమునగాని, పదిదినములలోనే నాడేనియు లేదా పదియవ దినమందైననూ జాతకర్మ యనబడు సంస్కారము చేయదగినది, జన్మించిన శిశువునకీ కార్యముచే ఆయుర్వృద్ధి గల్గును.

"కుమారస్య ఆయుష్యాభివృధ్యర్థం జాతేన కర్మణా సగ్గ్స్కరిష్యే అని సంకల్పము, ఇందు ఫలీకరణ హోమమను పేర హోమకార్యముగలదు ఈ హోమ కార్యముచే, "ఆయుష్యాభివృద్ధర్థం, అనయోర్బాల సూతికయోః చండాలాదిపిశాచే భ్యోరక్షణార్థం. ఫలీకరణ హోమం కరిష్యే||" అని సంకల్పింతురు,

జన్మించిన బాలునికి పిశాచాది బాధలనుండియు, బాలగ్రహాది బాధల నుండియు, రక్షణార్థమై యీ ఫలీకరణ హోమము చేయుదురు. దీని వల్ల బాలారిష్టాదులకు శాంతికల్గును.

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను.

“స్నాతోలంకృతః పితా అకృత నాలచ్ఛేదం అపీతస్తన్యం అన్త్యెరస్పృష్టం ప్రక్షాళితం కుమారం మాతురుత్సాం  గేకారాయిత్వా..... అస్యకుమారస్య గర్భాంబు పాతజనిత దోష నిబర్హణాయుర్మేధాభివృద్ధి బీజ గర్భ సముద్భావైనో నిబర్హణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం జాతకకర్మ కరిష్యే “ అని ధర్మ సింధువు జాతకకర్మ  సంకల్ప విధానాన్ని నిర్దేశిస్తున్నది. దీన్నిబట్టి జాతకకర్మ ప్రయోజనం మాత్రమే కాక అది ఎప్పుడు చేయవలసిందో కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ విధానంలో కొంత ఇబ్బంది లేకపోలేదు.

ముహూర్త దర్పణం నందు
“తస్మిన్ జన్మముహూర్తే పి సూతకామ్టే ధవా శిశోః కుర్యాద్వైజాతకర్మాఖ్యం పితృపూజని తత్పరః” శిశువు జన్మించిన వెంటనే గాని పురుడు తొలగిన తరువాత గాని జాతకకర్మ చేయవలెనని నిర్దేశిస్తున్నది. ఈ విధంగా చేయబడుతున్నదే ఈనాటి బారసాల. ముహూర్త చింతామణిలో “తజ్జాతకర్మాది శిశోర్విధేయం పర్వఖ్యరిక్తోన తిధే శుభే హ్ని ఏకాదశ ద్వాదశకే పి ఘస్రేంమృధ్రువ క్షీప్రచారోడుశుస్యాత్” అని 11 వరోజుగాని, 12 వ రోజు గాని జాతకకర్మ చేయవలెనని చెప్పినది. పర్వతిధులు, రిక్త తిధులు, జాతకకర్మకు పనికిరావు. మృధు,ధృవ,క్షిప్ర, చర నక్షత్రాలలో ఏవైనా జాతకకర్మ చేయవచ్చును. చవితి, నవమి, చతుర్ధశి రిక్త తిధులు, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు, ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు, హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు, స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు, మంగళ, శనివారాలు జాతక కర్మకు పనికి రావని ధర్మ సింధువు వచనం.

ప్రస్తుతం బారసాలకు తిధులు నక్షత్రాలు చూడటం ఆచారంగా లేదు. పైగా అది వైదిక జాతకర్మ సంస్కారంగా నిర్వహించబడటం కానరాదు. అంతేకాదు జాతకర్మాదులను ప్రాయశ్చిత్త పూర్వకంగా ఉపనయనానికొక రోజు ముందుగా (ఒకొక్కప్పుడు ఆదేరోజు కూడా) జరిపించేయటం ఆచారంగా మారిపోయింది.

దేవర్షి పితృ ఋణాలు మూడింటిలో పిత్ర జననం వలన పితృ ఋణాలు విముక్తి కలుగుతుందని భారతీయుల పవిత్ర భావన. జాతకకర్మ, నామకరణం, డోలారోహణాలతో పాటుగా బాలింతరాలి చేత మొట్టమొదటగా నూతిలో చేద వేయించి నీరు తోడించే కార్యక్రమాన్ని కూడా కలిపి లౌకికాచారంగా ఇరవై ఒకటో నాడు నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కానవస్తుంది. ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా మాత్రం చూస్తున్నారు.

శిశువు జన్మించిన సమయము ననుసరించి, మాతా పితరులకు క్షేమకరమగునా? లేదా? యనియు, జన్మించిన శిశువునకు బాలరిష్టాది దోషములు లేకను, ఆయుర్వృద్ధికరమైన విధానమున్నదా? లేదా యనియు విచారింపదగియున్నది. అట్లు తల్లి దండ్రులకు, మేనమామలకు, జన్మించిన శిశువునకు దోషములున్నచో, నవగ్రహ, జప, హోమదానాదులచేతనూ తదితర జప హోమశాంతుల చేతను దోషనివారణమునకు శాంతికలాపములుగలవు వానిని యెరింగిన మహనీయులనడిగి, తగిన శాంతులు జరుపుకొని యంనతరము దాని జాతకర్మ నామ కరణాదులు జరపుకొనుట పెద్దలయాచారము. తల్లి దండ్రులకు మేనమామలకు, దోషకరమైన రీతిని కొన్ని జన్మలుండునుగాన విధిగ పెద్దలనడిగి శాంత్యాదులు జరుపుకొనుట శ్రేయస్కరము. ఈ జన్మ దోషాదులు జ్యోతిషము తెలిసిన పెద్దలు చెప్పగలరు. వానికి శాంతులు చక్కని పురోహితులు జరిపించగలరు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

సంక్రాంతి ఆచారాలు - వైదిక రహస్యాలు

హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగలోనూ ఆధ్యాత్మిక రహస్యంతో పాటు వైద్య విశేషం, విజ్ఞానశాస్త్ర దృక్పథం, సామాజిక స్పృహ... ఇలా ఎన్నో దాగుంటాయి ఆయా పండుగ వచ్చిన కాలాన్ని బట్టీ - ఆ పండుగకి ఏర్పాటు చేయబడిన ఆచారాలని బట్టీ. ఆ దృక్కోణంలో చూస్తే సాధారణమైన పండుగల్లోనే ఇన్ని విశేషాలు కన్పిస్తూంటే, ఈ సంక్రాంతిని ‘పెద్ద పండుగ’ అని వ్యవహరించారంటే దీన్లో ఎన్నెన్నో రహస్యాలు దాగి ఉన్నట్లే. సంక్రాంతిని కొన్ని ప్రాంతాలలో పతంగుల పండుగగా జరుపుకుంటారు. దృష్టాదృష్టాలకుప్రతీకగా ఈ  సంప్రదాయాన్ని పేర్కొంటారు.

యోగం అంటే రెంటి కలయిక అని అర్థం. శరీరం- మనసూ అనేవే ఆ రెండూ . శరీరానికి స్నానాన్ని చేయించినా మనసు అపవిత్రంగానూ దురాచనలతోనూ ఉంటే అది ‘యోగం’ (రెంటి కలయిక) కా(లే)దు. అదే తీరుగా మనసెంతో పరిశుభ్రంగా ఉన్నా శరీరం స్వేదమయంగానూ అలసటతోనూ సహకరించ(లే)ని స్థితిలోనూ ఉన్నట్లయితే అది కూడా ‘యోగం’ అయ్యే వీల్లేదన్నారు పెద్దలు. ఆ కారణంగా శరీరమూ మనస్సూ అనే రెండూ పవిత్రంగా ఉండేందుకు స్నానాలని చేయాలని ఓ నియమాన్ని చేశారు పెద్దలు.

  కార్తీకం నెలపొడుగునా స్నానాలని చేసినట్లే ఈ మార్గశీర్ష పుష్యమాసాల్లో కూడా  ప్రతిరోజూ స్నానాలని చేయాలన్నారు. దీనికి మరో రహస్యాన్ని కూడా జోడించవచ్చు. చంద్రుని పుట్టు నక్షత్రం మృగశిర. మృగశిర + పూర్ణిమ చంద్రుడు కలిస్తే అది మార్గశీర్ష మాసం అవుతుంది. చంద్రునికి ఇష్టురాలైన భార్య ‘రోహిణి’ (రోహిణి శశినం యథా). ఈ రోహిణి, మృగశిర అనే రెండు నక్షత్రాలూ ఉండే రాశి ‘వృషభం’.

  కాబట్టి ఈ మార్గశీర్షం నెలపొడుగునా స్నానాలని చేస్తే తన జన్మ నక్షత్రానికి సంబంధించిన మాసంలో స్నానాలని చేస్తూన్న మనకి చంద్రుడు మనశ్శాంతిని (చంద్రమా మనసో జాతః) అందిస్తాడు. చలీ మంచూ బాగా ఉన్న కాలంలో తెల్లవారుజామున స్నానాలని చేయగలిగిన స్థితిలో గనుక మన శరీరమే ఉన్నట్లయితే యోగ దర్శనానికి భౌతికంగా సిద్ధమైనట్టేననేది సత్యం.

రంగవల్లికలు

  రంగమంటే హృదయం అనే వేదిక అని అర్థం. ‘వల్లిక’ అంటే తీగ అని అర్థం. ప్రతి వ్యక్తికీ తన బుద్ధి అనే దాని ఆధారంగా అనేకమైన వల్లికలు (ఆలోచనలు) వస్తూ ఉంటాయి. ఆ అన్నిటికీ కేంద్రం (ముగ్గులో మధ్యగా ఉన్న గడి లేదా గదిలాంటి భాగం) సూర్యుని గడి కాబట్టి అక్కడ కుంకుమని వేస్తారు మహిళలు. కాబట్టి ఏ సూర్యుడు బుద్ధికి అధిష్ఠాతో ఆ బుద్ధి సక్రమమైన వేళ ఆ సక్రమ బుద్ధికి అనుగుణంగానే ఈ వల్లికలన్నీ ఉంటాయనేది యోగదృష్టి.ఆ సక్రమాలోచనలకి అనుగుణంగానే మనసు ఆదేశాలనిస్తూంటే శరీరం తన అవయవాలైన చేయి కాలు కన్ను... అనే వీటితో ఆయా పనులని చేయిస్తూంటుందన్నమాట.

గొబ్బెమ్మలు

స్నానాలనేవి పురుషులకే కాదు. స్త్రీలకి కూడా నిర్దేశింపబడినవే. అందుకే వారికి సరిపడిన తీరులో వాళ్లని కూడా యోగమార్గంలోకి ప్రవేశింపజేసి వారిక్కూడా యోగదర్శనానుభూతిని కల్పించాలనే ఉద్దేశ్యంతో స్త్రీలకి గోపి+బొమ్మలని (గొబ్బెమ్మ) ఏర్పాటు చేశారు. నడుమ కన్పించే పెద్ద గొబ్బెమ్మ ఆండాళ్ తల్లి అంటే గోదాదేవి. చుట్టూరా ఉండే చిన్న చిన్న గొబ్బెమ్మలనీ కృష్ణ భక్తురాండ్రకి సంకేతాలు. ఈ అన్నిటికీ చుట్టూరా కృష్ణ సంకీర్తనని చేస్తూ (నృత్యాభినయంతో కూడా) స్త్రీలు పాటలని పాడుతూ ప్రదక్షిణలని చేస్తారు. నడుమ ఉన్న ఆ నిర్వ్యాజ భక్తికి (కోరికలు ఏమీలేని భక్తి) తార్కాణమైన గోదాదేవిలా చిత్తాన్ని భగవంతుని చుట్టూ ప్రదక్షిణాకారంగా తిప్పుతూ ఉండాలనేది దీనిలోని రహస్యమన్నమాట.

మొదటిరోజు ‘భోగి’

భోగము అంటే పాము పడగ అని అర్థం. భోగి అంటే అలా పడగ కలిగినది ‘పాము’ అని అర్థం. అలా ఎత్తిన పడగతో పాము ఎలా ఉంటుందో అదే తీరుగా వ్యక్తి కూడా శరీరంలోని వెన్నెముకని లాగి పట్టి స్థిరాసనంలో (బాసింపెట్టు) ఉంటూ, ముక్కు మీదుగా దృష్టిని ప్రసరింపజేస్తూ కళ్లని మూసుకుని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే అదే ‘యోగ దర్శన’మౌతుందని చెప్పడానికీ, ఆ యోగ ప్రారంభానికి సరైన రోజు నేడే అని తెలియజేయడానికీ సంకేతంగా పండుగలోని మూడు రోజుల్లోనూ మొదటి రోజుని ‘భోగి’ అని పిలిచారు. యోగ ధ్యానాన్ని చేస్తూన్న వేళ బుద్ధి సక్రమంగా ఉండాలని చెప్పడానికీ, దాన్ని బాల్యం నుండీ అలవాటు చేయాలని చెప్పడానికీ సంకేతంగానే - పిల్లలకి రేగుపళ్లని  పోస్తూ వాటిని ‘భోగిపళ్లు’గా వ్యవహరించారు.

సంక్రాంతి

సూర్యుడు ఈ రోజున ధనూ రాశి నుండి మకర రాశిలోకి జరుగుతాడు కాబట్టే దీన్ని ‘మకర సంక్రమణం’ అన్నారు.ఇప్పటివరకూ ఉన్న బుద్ధి కంటే వేరైన తీరులో బుద్ధిని సక్రమంగా ఉంచుకోవడమే ‘మకర సంక్రాంతి’లోని రహస్యం. ఇది నిజం కాబట్టే ఈ రోజున బుద్ధికి అధిష్ఠాత అయిన సూర్యుణ్ని ఆరాధించవలసిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. అంతేకాదు. మన బుద్ధిని సక్రమంగా ఉండేలా - ఉంచేలా ఆశీర్వదించగల శక్తి ఉన్న పితృదేవతలని ఆరాధించవలసిన రోజుగా కూడా తెల్పారు పెద్దలు. పెద్దలకి (పితృదేవతలకి) పెట్టుకోవలసిన (నైవేద్యాలని) పండుగ అయిన కారణంగానూ దీన్ని ‘పెద్ద పండుగ’ అన్నారు - అలాగే వ్యవహరిస్తున్నారు కూడా.
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...