Sunday, December 9, 2018

పుట్టినిల్లు- మెట్టినిల్లు కులదైవములు

పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు కులదైవములను కొలుచుకోవడం స్త్రీలకు మట్టుకే చెల్లును. మనము కులదైవములను కొలుచుకోకపోతే మనం చేసే పనులలో చిక్కులు ఉద్యోగ వ్యాపారరీత్యా మందము, ఎదురుచూడని నష్టం, ఇలా ఎన్నో కష్టనష్టములకు గురికావలసి వచ్చును. కులదైవ దోషం ఉండేటప్పుడు మనం వేరే ఏ దైవమును కొలుచుకున్నా సరైన ఫలితములు లభించదు. అందువల్ల ఏడాదికి ఒక మాటైన మీ కులదైవ కోవెలకు వెళ్లి పూజాదులు చేసుకోండి.
మనలను కాపాడే దైవములు
ఇంటి దైవము. మనతో కూడా వుండి చనిపోయిన మన పూర్వీకులు. కన్యగానో సుమంగళిగానో చనిపోయిన వారు, మన ఇష్ట దైవము. దీనినే ఇంటి దేవత కుటుంబ దేవత కన్యా దైవం సుమంగళి ప్రార్థన అని కొలుచుకుంటాము.
కులదైవము : ఒక వంశములో పరంపరాను సారముగా జీవించే వారికి కులము అని పేరు. వీరు అనేకముగా పురుష సంతానము దాయాదులు జ్ఞాతులు మట్టుకే ఇలాంటి కులానికే ప్రత్యేకమైన దైవము కోవెల ఉండును. ఈ కులదైవములను కొలుచుకొన్న కోటి పర్యాయములు ఫలితము లబించును. గురువును మరచిన కులదైవమును మరవవద్దు అనేది మన పెద్దల వాక్కు. ఇంటిలో ఏ ప్రయోజనము అంటే వివాహము, ఉపనయనము , సీమంతము లాంటి ఈ శుభ కార్యములు చేసినా పత్రికలో కులదైవం పేరు వేయడం పరిపాటి.
జాతి దైవము : పైన చెప్పిన కులాల సమూహమే ఒక జాతి. ఈ జాతులకు వుండే దైవమె అని పరిగణింప బడును. వీటిలో అనేకముగా స్త్రీ దైవములే ఎక్కువగా ఉండును. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామీ సాయి బాబా లాంటివి .
గ్రామ దేవతలు: కుల జాతి సమూహమును కాపాడేది గ్రామ దేవత: వూరి ప్రజలందరూ జాతి మత భేదము లేకుండా కొలుచుకొనే దేవత. అనేకముకా గ్రామ దేవతలు కాళి మహమ్మారి లేక వీరభద్రుడు మునీశ్వరుడు లాంటివి వుంటుంది.
ఒక కులము అవిచ్ఛిన్నముగా వృద్ధి కావాలంటే కుల దైవ పూజ చాలా అవసరము. కులదైవ దోషము వుంటే మిగతా దైవముల అనుగ్రహము లభిచందు. కులదైవ అనుగ్రహం వల్ల పుత్రపౌత్ర అభివృద్ధి జరుగును. కుటుంబం సుఖ సంతోషములతో ఓలలాడును. అందరు కలిసి కులదైవ పూజలు (అన్న తమ్ములు ) చేసుకుంటే కులదైవమే కాకుండా మన పితరులు కూడా చాల సంతసించి ఆశీర్వదిస్తారు
కులదైవ పూజ వల్ల ఇంటిలో పెండ్లి కాని వారికి వివాహ బంధము ఏర్పడడం, సంతానము లేని వారికి పుత్రులు కలగడం,, సఖ్యత లేకుండా పోట్లాడుకునే దంపతుల మధ్య అన్యోన్య భావము ఏర్పడడం, జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం నేటికి మనకు లభించే నిదర్శనము.
ఏ వంశములోను పదమూడు తరాలకు అనంతరం ఒకే దైవం వుండదు. దానికి నిదర్శనం మన గృహములో ఒకటి పిల్లలు లేకుండా పోవడం, వున్నా కేవలం స్త్రీ సంతానం మట్టుకే వుండడం దీనిని మనం నేరుగా చూస్తున్నాము కదా! ఏ కులదైవమని ఒక వంశములో ౧౩ తరాలకు మించదు అంటే అంతతో ఆగి పోవును వృద్ది లేకుండా. ఇది నేటి విజ్ఞానము కూడా ఒప్పుకుంటుంది
Written by_ గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ...

పాపకార్యం అంటే ఏమిటి?



 ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది. 

స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా, వేదము చెప్పిన కార్యములను, విధివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి. 
వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు పవిత్రమవుతుంది.
Written by_గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ....

ఆదిత్య హృదయం సోత్రం ... తాత్పర్యం

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు .

సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి: 

రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.
Written by_ Mr.Sharma

ఆచమన విధానము

ప్రతి కార్యమునందు ఒక్కొక్క ఆచమనవిధానము చెప్పబడినది. ఆచమనము ద్వారా కేవలము మనలను మనమే శుధ్ధి చేసుకొనుటయేగాక బ్రహ్మఆచమన విధానము నుండి మొదలుకొని సమస్తమును పరితృప్తి చేయుచున్నాము ఆచమనము చేయకు౦డా చేసెడు కర్మలన్నియుని వ్యర్ధములైపోవును. కావున శౌచాన౦తరము కూడా శాస్త్రమున౦దు ఆచమనక్రియ నిర్దేశి౦పబడినది. శుభ్రమైన మడి వస్త్రమును మూడు, ఐదు గోచులుగా ధరి౦చి, శిఖ ముడివేసుకొని వుపవీతియై ఉ౦గరపు వ్రేలునకు దేవపవిత్రమును ధరి౦చి, ఆసనముపై సావధాన చిత్తముతో కూర్చొని, పాదములను నేలమీద ఉ౦చి ఆచమనము చేయవలయును. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు నకు ముఖము చేసి మాత్రమే ఆచమనము చేయవలెను.


ఆచమనము చేయు నీరు బుడగలు, నురుగు లేనిదిగ స్వచ్చముగ ను౦డవలెను. ఆచమి౦చునపుడు నోటిను౦డి ఎటువ౦టి శబ్దము రాకూడదు.

ఆచమనము చేయు జలము బ్రాహ్మణునకు హృదయము వరకు, క్షత్రియులకు క౦ఠమువరకు, వైశ్యులకు తాలువు(దౌడ)వరకు, శూద్రులకు మరియు స్త్రీలకు నాలుక వరకు చేరునట్లుగా తీసుకొనవలెను.

గోకర్ణాకృతిగా పట్టిన హస్తములో మినుపగి౦జ మునుగున౦తటి జలమును మాత్రమే తీసికొని అరచేతితో ఆచమనము చేయవలెను. గోకర్ణాకృతి మూడు విధములుగా చెప్పబడినది.

౧. బొటనవ్రేలి మధ్య వ్రేలి మూలమునకు వ౦చిపెట్టి, చూపుడువ్రేలును దానిమీదకి వ౦చిపెట్టి, తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచిపెట్టినచో హస్తము గోకర్ణాకృతికి(గోకర్ణము-ఆవు చెవి ఆకారమునకు) వచ్చును లేదా

౨. చూపుడు వ్రేలును వ౦చి బొటన వ్రేలి మూలమునకు చేర్చిపెట్టి, బొటనవ్రేలి మధ్యవ్రేలి మధ్య గణుపునకు చేర్చి తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును. లేదా

౩. అరచేతిని అర్ధచ౦ద్రాకారముగా మడచి ఆవుచెవి వలె చేయవలెను, కనిష్ఠిక(చిటికెనవ్రేలు)ను మరియు అ౦గుష్ఠమును దూరముగ - వేరుగా చేసి తక్కిన మూడు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి పట్టినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును.

ఆచమనము చేయునప్పుడు ఎడమచేతి చూపుడువ్రేలుతో కుడిచేతిలోగల జలమును స్పృశి౦చుటవలన సోమపానము యొక్క ఫలము లభి౦చును.

తుమ్మినప్పుడు, ఉమ్మినతర్వాత, నిద్రి౦చిలేచిన పిమ్మట, వస్త్రములను ధరి౦చిన మీదట, ఆవిలి౦త వచ్చిన పిదప, అశృవులు - కనులను౦డి నీరు జారిన తదుపరి ఆచమనము చేయవలెను లేదా కుడిచెవిని స్పృశి౦చుట చేత ఆచమనవిధి పూర్తియగును.

మోకాళ్ళకు పైగా జలమున౦దు నిలబడి కూడా ఆచమి౦చవచ్చును. నీరు మోకాటిలోతుక౦టే తక్కువగా ఉ౦డినచో ఈమాట చెల్లనేరదు. అప్పుడు కూర్చు౦డియే ఆచమనము చేయవలెను.
Written by_ Mr.Sharman

భగవంతుని అనుగ్రహమే అసలు సాధనం


మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.

ఈ 'ఆరు రాత్రుల యాగం' అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి. ఈ ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.

భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు. అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది.
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.....

సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
"శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః" 

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.
Written by_గుట్టీ సుబ్రహ్మణ్యశర్మ 

ధృతి అంటే పట్టుదల


నేను చేసి తీరుతాను; పట్టుదల మౌఢ్యము కాకూడదు. భగవంతునియందు భక్తితో ఆయనచేతి ఉపకరణంగా చేయగలనన్న విశ్వాసం అయి ఉండాలి. ఆత్మగౌరవం అన్న పేరుతో అహంకారం కాకూడదు.
దృష్టి అన్నమాటకి అర్థం నైపుణ్యం. ఏ పని ఎలా చేయాలో అలా చేయడం నైపుణ్యం. ఎంతసేపూ దీపం పెట్టనాండీ? దీపంలో వత్తులు ఎన్ని వేయాలండీ? నూనె వేయనాండీ? నెయ్యి వేయనాండీ? తూర్పుకి పెట్టనాండీ? ఉత్తరానికి పెట్టనాండీ? ఎన్నాళ్ళు అడుగుతావు ఆ మాట? ఎన్నాళ్ళు దీపం దగ్గర ఆగిపోతావు జీవితంలో. ఏది ఎందుకు చేస్తున్నావో, అలా చేయడం వల్ల నీకేం కలుగుతోందో తెలుసుకున్న నాడు కర్మ అన్న నిచ్చెన మీద మెట్లు ఎక్కుతావు. ఆ నైపుణ్యం లేనినాడు ఏది చేసినా పుణ్యంకోసమే. సుందరకాండ వింటే నాకు అపారమైన పుణ్యం వచ్చి రాష్ట్రపతిని అయిపోవాలి. పుణ్యం, పుణ్యం, పుణ్యం - ఏం చేస్తావు దానితో? మళ్ళీ పుడుతూండాలి, అనుభవిస్తూండాలి. పరమేశ్వరుడు చాలా చమత్కారి. అనంతమైన పుణ్యం నువ్వు చేసేస్తే అనుభవించడానికి ఒక జన్మనిస్తాడు, చక్రవర్తిని చేస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలివిగో అనుభవించేశావు చక్రవర్తిగా. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" - ఇంత పుణ్యం చేసీ దేవతా పదవిని పొందిన వాడు క్రిందపడిపోతాడు మర్త్యలోకంలోకి. పుణ్యం చేయడం కాదు పుణ్యాన్ని చిత్తశుద్ధికి వాడుకోవడం నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉండడం దృష్టి. దృష్టి ఒక కార్యం చేసేటప్పుడు తనకు కీర్తి వస్తే కీర్తికి కారణాన్ని దృష్టిలో పెట్టుకోవడం

Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...