Wednesday, October 17, 2018

ధ్వజస్థంభం పుట్టుక



మనం ఏదేవాలయానికి వెళ్ళినా ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి, ప్రదక్షిణచేసి ఆతర్వాతే లోపలికి వెళతాం. అసలీ 'ధ్వజస్థంభం' కధాకమామీషూ ఏంటో ఓసారి చూద్దాం. ఈ ధ్వజస్థంభం ఏర్పడటానికి ఓకధ ఉంది.

భారత యుద్ధానంతరం పాండవులలో జ్యేష్టుడైన ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టిస్తాడు. ధర్మబధ్ధంగా రాజ్య పాలన చేస్తుంటాడు. ధర్మమూర్తిగా, గొప్పదాతగా పేరు పొందాలనే కోరికతో విరివిగా దానధర్మాలు చేయడం మొదలు పెడ్తాడు. ఇదంతా చూస్తున్న శ్రీకృష్ణుడు అతనికి తగినరీతిగా గుణపాఠం చెప్పాలనుకుంటాడు. ధర్మరాజుకి అశ్వమేధయాగం చేసి, శత్రురాజులను జయించి, దేవతలనూ బ్రాహ్మణులను సంతుష్టి పరచి, రాజ్యాన్ని సుస్థిరం, సుభిక్షం చేయమనీ చెప్తాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసా వహించి అశ్వమేధానికి సన్నాహాలు చేయించి, యాగాశ్వానికి రక్షకులుగా నకుల సహదేవులను సైన్యంతో పంపుతాడు.

ఆ యాగాశ్వం అన్నిరాజ్యాలూ తిరిగి చివరికి మణిపుర రాజ్యం చేరుతుంది. ఆ రాజ్యానికి రాజు మయూర ధ్వజుడు. ఆయన మహా పరాక్రమ వంతుడు, గొప్ప దాతగా పేరుగాంచినవాడు. మయూరధ్వజుని కుమారుడు తామ్ర ధ్వజుడు, పాండవుల యాగాశ్వాన్నిబంధిస్తాడు. తామ్రధ్వజునితో యుద్ధం చేసిన నకులసహదేవులు, భీమార్జునులు ఓడిపోతారు. తమ్ములందరూ ఓడిపోయిన విషయం తెల్సుకున్న ధర్మరాజు స్వయంగా యుధ్ధానికై బయలుదేరగా శ్రీకృష్ణుడు అతన్ని వారించి మయూరధ్వజుడ్ని యుధ్ధంలో జయించడం సాధ్యంకాదనీ, మహాబలపరాక్రమవంతులైన భీమార్జునులే ఓడిపోయారనీ, అతడ్నికపటోపాయాంతో మాత్రమే జయించాలనీ చెప్తాడు.

శ్రీకృష్ణుడు, ధర్మరాజుతోకలసి వృద్ధ బ్రాహ్మణుల రూపంలో మణిపురం చేర్తాడు. ఆ బ్రాహ్మణులను చూసిన మయూరధ్వజుడు వారికి దానం ఇవ్వదలచి ఏమి కావాలో కోరుకొమ్మని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు, "రాజా! మీ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారుడ్ని పట్టుకుంది. బాలుని విడిచి పెట్టవలసినదిగా మేముప్రార్థించగా, సింహం మానవ భాషలో' మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజైనా మయూరధ్వజుని 'శరీరంలోని సగభాగం నాకు ఆహారంగా అతడి భార్యాపుత్రులే స్వయంగా కోసి ఇవ్వగా తెచ్చి ఇస్తే, ఈతడ్ని వదిలేస్తాననీ చెప్పిందనీ, కనుక ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలోని సగభాగాన్ని దానమిచ్చి ఈతడి కుమారుని కాపాడమని కోరుతారు. వారి కోరిక విన్న మయూరధ్వజుడు అంగీకరించి దానికి తగిన ఏర్పాట్లు చేయించి భార్యాసుతులు అతని శరీరాన్నిమధ్యకు కోసి వారికి ఇవ్వమని చెప్తాడు. వారు ఆయన శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు కారటం చూసిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అంటాడు. అందుకు మయూరధ్వజుడు, "మహాత్మా తమరు పొరపడుతున్నారు. బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది, కానీ ఆ భాగ్యం తనకు కలగటంలేదు కదా అని ఎడమ కన్ను చాలా బాధపడుతూ కన్నీరు కారుస్తున్నది." అని వివరిస్తాడు.

మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి "మయూరధ్వజా! నీ దానగుణం అమోఘం ! ఏదైనావరం కోరుకో! అనుగ్రహిస్తాను" అంటాడు. "పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేలాగానుగ్రహించండి. " అని కోరుతాడు మయూరధ్వజుడు. అందుకు శ్రీకృష్ణుడు "తథాస్తు" అని పలికి, "మయూరధ్వజా! నేటి నుంచీ ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన మీదటనే ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరమున దీపం ఎవరుంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచీ ఆలయాల ముందు ధ్వజస్తంభాలు తప్పనిసరిగా ప్రతిష్టించడం ఆచారమయింది. భక్తులు ముందుగా ధ్వజస్థంభానికి మొక్కి ఆ తర్వాతే ములవిరాట్టు దర్శనం చేసుకోడం సాంప్రదాయంగా మారింది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

హారతి ఎందుకివ్వాలి? ఎలా ఇవ్వాలి..?



 దేవునికి  హారతి ఇవ్వడానికి కారణం ఏంటి? హారతి రహస్యం ఏంటి? అసలు హారతులు ఎన్ని రకాలు? ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు. ఏదో మొక్కుబడిగా పూజ తంతు ముగించేవాళ్లు ఈ విషయాలు తెలుసుకుంటే... వారిలో భక్తిభావం, కార్యదక్షత, ఏకాగ్రత పెరుగుతాయ్. మూతపెట్టి అలాగే ఉంచితే... కొన్నాళ్లకు నామరూపాలు లేకండా హరించుకుపోవడం కర్పూరం లక్షణం. అది మానవ జీవితానికి ప్రతీక. అందుకే... భగవంతునికి హారతి ఇచ్చేప్పుడూ... 'స్వామీ... ఈ జన్మని ఇచ్చావ్. ఇప్పుడు ఇలా ఉన్నాను. ఇంకా ఎన్నో పరిణామక్రమాలు చూడాల్సి ఉంది. అందుకే.. ఎలాంటి కష్టాలు కలుగనీయకుండా... ఈ హారతి కర్పూరం మాదిరిగానే... నీలో  ఐక్యమైపోయే అదృష్టాన్నిప్రసాదించు తండ్రీ'  వేడుకోవడమే హారతి  ఇవ్వడంలోని ఆంతర్యం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ ....✍ 

ధర్మం గుఱించి “కర్ణ-శ్రీకృష్ణ” సంవాదం


ఓ కృష్ణా!  నేను పుట్టి పుట్టక ముందే నా తల్లి కుంతి నన్నువదిలి వేసింది,
అలా పుట్టడం నా తప్పా? నా పాపం కాదు గదా ?
నేను సూతుడనైనందున ద్రోణుడు నాకు విద్య నేర్పలేదు 

పరశు రాముడు నాకు యుద్ద విద్య నేర్పాడు కాని, అవసర సమయంలో నాకు మంత్రప్రేరిత  అస్త్రాలు ఏమీ గుర్తు రావు అని శపించాడు 

పొరపాటున నేను వదిలిన బాణం గోవుకు తగిలి ఒక బ్రాహ్మణుడు నన్ను అకారణంగా శపించాడు 

ద్రౌపది స్వయంవర సమయంలో అవమానించబడ్డాను 

చివరికి నా తల్లి కుంతి కుడా యుద్ధం ఆరంభం అవుతుందన్న చివరి క్షణం లోనే నా జన్మ రహస్యం నాతో చెప్పింది , అదీ కుడా తన బిడ్డలను కాపాడుకోవడం కోసం

ఇంత వరకు నేను ఏదైనా పొందాను, గౌరవించబడ్డాను అంటే, అది దుర్యోధనుని దయాబిక్ష !!!

ఇప్పుడు చెప్పు కృష్ణా! నేను దుర్యోదనుని పక్షాన నిలబడం లో తప్పేంటి ?

ఓ కర్ణా! నేను చెరసాల లో పుట్టాను 

నేను పుట్టక ముందు నుండే నన్ను చంపడానికి చూసారు 

నేను పుట్టిన రాత్రే,  నేను నా జననీ జనకుల నుండి నుండి వేరుచేయ బడ్డాను 

నీవు చిన్నప్పటి నుండే కత్తిసాము, కర్రసాము , రథారోహణ, అశ్వచాలనం, ధనుస్సు, బాణాలు వంటి వాటిని సాధన చేస్తూ పెరిగావు

నేను ఆల మందలను కాస్తూ పెరిగాను, పైగా నడక రాక మునుపే, నన్ను చంపడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి 

నన్ను సంరక్షించడానికి ఏ సైన్యమూ లేదు, నాకు ఏ ప్రాధమిక విద్యా లేదు 

"జనమంతా వాళ్ళ భాదలకు కారణం నేనే  కారణం అట" కొన్నిసార్లు జనాలు అనడం నేను విన్నాను 

నీ శౌర్య ప్రదర్శనలో నీ గురువుల చేత నువ్వు మన్ననలు పొందుతున్నపుడు, కనీసం నాకు ప్రాధమిక విద్య కుడా లేదు , నేను సాందీపముని గురుకులానికి చేరింది ఎప్పుడో తెలుసా!  నా 16వ ఏట !

నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నావు  నేను ఎవరైతే నన్ను కోరుకుంటున్నారో వాళ్ళను మరియు, రాక్షసుల / దుష్టుల నుండి నేను కాపాడిన వారిని చేసుకున్నాను

జరాసంధుడి బారినుండి నా పరివారాన్ని కాపాడుకోవడం కోసం, నేను మొత్తం యదుకులాన్ని యమునా నదీ తీరం నుండి (మధుర) ఎక్కడో ఉన్న సముద్ర తీర ద్వారకకు తరలించవలసి వచ్చింది.  దానికి కొందరు పిరికి వాడు అనికూడా అన్నారు 

ఒక విషయం గుర్తుంచుకో కర్ణా!

జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయి జీవితం అనేది ఎవరికీ పూల పాన్పు కాదు..ధర్మరాజు కుడా ఎన్నో సార్లు ఎన్నో కష్టాలు అనుభవించాడు. కానీ అతను నమ్మిన ధర్మాన్ని అతను ఎప్పుడూ తప్పలేదు . ధర్మం ఏంటో? నీ అంతరాత్మకు తెలుసు.

ఎన్ని సార్లు నువ్వు అవమానింపబడ్డావు అనేది కాదు , జీవితం ఎంత చెడు అనుభవాలను చవి చూపించిది అనేది కాదు , ఎన్నిసార్లు నీకు అన్యాయం జరిగింది అనేది కాదు  ఆయా సమయాలలో ధర్మం తప్పకుండా నువ్వెలా నిలబడ్డావు అనేది ముఖ్యం .

ఆరోపణలు ఆపు కర్ణా!

 దుర్యోధనుడు అన్నివేళలా ధర్మం తప్పాడు. ఇది నీకు పూర్తిగా  తెలుసు అయినా అతని పక్షం వహించావు. నీ జీవితంలో నీకు జరిగిన అన్యాయాలు, నువ్వు అధర్మం పక్షాన నిలవడానికి కారణాలు కాబోవు కాకూడదు

"ధర్మోరక్షతి రక్షితః"  అనే సూక్తి ని అందంగా అర్ధం అయ్యేలాగ వివరించారు. ఎంత కఠోర పరిస్థితుల కారణం గానైనా ధర్మం తప్పితే అధర్మం.

ధర్మోరక్షతి రక్షిత:

పరమ పవిత్ర క్షేత్రం "వారణాసి"



ఋగ్వేదంలో కాశీ నగరాన్ని " జ్యోతి స్థానం " అని వర్ణించారు . స్కంధ పురాణం లోని కాశీ ఖండం లో అయితే సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడు "ముల్లోకాలూ నాకు నివాసమే... అందులో కాశీ క్షేత్రం నాకు మందిరం " అని చెప్పినట్లుగా వర్ణన ఉంది. ఈ నగర ప్రాశస్త్యం గురించి వివరించడానికి ఇదొక్కటి చాలు . గంగా నదితో "వరుణ", "అస్సి" అనే రెండు నదుల సంగమస్థానం మధ్య ఉన్నందున కాశీ కి "వారణాసి" అనే మరో పేరు వచ్చింది. వారణాసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి నది సంగమ స్థానం ఉన్నాయి. ఇంకో కథ ఏంటంటే "వరుణ" నదికే పూర్వకాలం "వారణాసి అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. "వారణాసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని రాశేవారు. అది తరువాత 'బవారస్'గా మారింది. వారణాసిని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే నామాలతో ప్రస్తావించారు.


సుమారు 5వేల సంవత్సరాల క్రితం శివుడు వారణాసి నగరాన్ని స్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కంద పురాణం వంటి అనేక ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తిపురాలలో ఒకటైన కాశీకి విచ్చేశారు. ఆ నగరాలలో అయోధ్య, మథుర, గయ, అవంతిక, కంచి, ద్వారక నగరాలు మిగిలినవి. పూరాతత్వ పరిశోధనల లెక్కల ప్రకారం వారణాశి పరిసర ప్రాంతాలలో క్రీస్తు పూర్వం 11-12 శతాబ్ధాలలోనే నివాసాలు ఆరంభమయ్యాయని తెలుస్తోంది. ఇది ఆర్యుల మత, తత్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతోంది. 



ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రధమ స్థానంలో ఉందని పరిశోధనలు తెలియ జేస్తున్నాయి . పురాతత్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల ఆవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రధమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఆ విశ్వనాథుడు శరీరం అయితే.. కాశీ ఆయన ఆత్మ అని తరతరాలుగా భారతీయ ఆధ్యాత్మిక జగత్తు ఎలుగెత్తి చాటుతోంది. ప్రపంచం మొత్తం ప్రళయంలో నాశనమైనా కాశీ మాత్రం చెక్కుచెదరదని మన పురాణాలు చెబుతున్నాయి. దానికి తగ్గట్టే వేల సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లను ఎదుర్కుంటున్నా... ఈ క్షేత్రం మాత్రం సజీవంగా తన ఉనికిని చాటుకుంటోంది. 

వారణాసి అంటేనే ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇంకా వివరంగా చెప్పాలంటే ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్నిచూడవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఒక లెక్క ప్రకారం కాశీ లో దాదాపు 23 వేల ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మందిరం, దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లోఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న స్వామి ... "విశ్వేశ్వరుడు" , "విశ్వనాథుడు" పేర్లతో పూజలందుకొంటున్నాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం మిగిలిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. ఈ ఆలయం పలుమార్లు విధ్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయ సమీపంలో ఉన్న " గ్యాంవాపీ " మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందిరం విధ్వంసం చేయబడింది. అయితే 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు. 1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ దాని రెండు గోపురాలకు బంగారు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్వీకరించింది. అప్పటి కాశీ రాజు విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది. కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మందిరం ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించుకోవడం ఆచారం. అలాగే.. కాశీ విశ్వనాథాలయానికి సమీపంలోనే అన్నపూర్ణాదేవి మందిరం కూడా ఉంది. ఈ దేవాలయం లోపలనే కాశీ వచ్చే భక్తులకు ఉచిత అన్నదానం నిర్వహించబడుతోంది.



కాశీ అనగానే గుర్తువచ్చే మరో ప్రత్యేకత.. గంగా తీరం అంతటా నిర్మించబడ్డ స్నాన ఘట్టాలు. ఇక్కడ స్నానం ఆచరించడానికి దేశం నలుమూలల నుంచీ వేలకొద్దీ ప్రజలు వస్తుంటారు. కేవలం తమ పాపాలు పోగొట్టుకోవడానికే కాకుండా... తమ వారికి పిండ ప్రదానం చెయ్యడానికి వస్తుంటారు. అందుకే వారి కోసం ఘాట్లను ఏర్పాటు చేశారు. వారాణసిలో మొత్తం 84 ఘాట్లు ఉన్నాయి. వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధియాలు, హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లచే నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఎక్కువ ఘాట్లు స్నానానికి, దహనకాండలకు వాడతారు. కొన్ని ఘాట్లు పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంసిచబడుతున్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచ గంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. 

కాశీలో ఉన్న పవిత్రాలయాలలో 'సంకట్ మోచన్ హనుమాన్ మందిరం' కూడా అతి ముఖ్యమైనది . ఈ మందిరం " బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం " ఆవరణలో ఉన్న దుర్గా, ఆధునిక విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసి నదీతీరంలో ఉంది. ప్రస్థుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్ర సమరవేత్త మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది. తులసి రామాయణం సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడింది. సీతారాముల ఆలయం కూడా ఉంది. కేవలం ఇవి మాత్రమే కాదు .. కాల భైరవ .. కేదార .. తదితర మహిమాన్విత ఆలయాలకు నెలవు వారణాసి నగరం. ఆధునిక దేవాలయం గా పిలవబడే బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం.. అంతరిక్ష పరిశోధనలకై జైపూర్ రాజా నిర్మించిన జంతర్ మంతర్.. ఇలా ఎటువైపు చూసినా .. ఆధ్యాత్మిక .. చారిత్రిక .. ఆధునిక దృక్పథాల సమాగమంగా విలసిల్లుతుంది కాశీ నగరం

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

దీపం వెలిగించే విధానం


                                  భక్తి సమాచారం


ఇక్క డ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను, స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక ననకు వేదమూ అవసరమే, వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.
ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.
భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి.

అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Sunday, October 14, 2018

పద్మ ప్రశస్తి

సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి. ‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి. వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.
పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి. శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్‌ పురాణం. విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.

ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది. ‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.

పంకమంటే బురద. అక్కడ పుట్టిన పద్మం పంకజమైంది. పంకంలో పుట్టినా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది. మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు. ‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది.
శుభసూచకమైన ‘స్వస్తిక్‌’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.

యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.

శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు. మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది. కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.

శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం. మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

విలువైన కాలం

మనిషిగా జన్మనెత్తాం. బతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసిఉండాలి. కాలం చాలా విలువైనది. పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించినవారే విజయసోపానాలు అధిరోహించగలిగేది!
ఇద్దరు ఒకే రోజున, ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు. అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకల్యాణం కోసం అహర్నిశలూ తపిస్తారు.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పనిచేయవలసిన అవసరం ఉండదు.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణమూ వృథా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. భూమ్మీదకు ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాలనిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులూ ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్షు గురించి ఆలోచన అనవసరం. అయితే గియితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులుంటాయి. ధర్మం మారుతుంది. సంఘం మారుతుంది. మనిషి మారతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది.

కాలం చాలా గొప్పది. కాని దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు. అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుడి కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు. కాలాన్ని దివ్యం చేశారు. కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చిపారేస్తుంది. కాలమే పెను మార్పులకు గురిచేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టేసి చోద్యం చూస్తుంది. మనమొక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని, జారిపోకుండా వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
దెబ్బ తగిలింది... మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు. దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్నా కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలమూ చికిత్సలో భాగమే.

ప్రతి క్షణం మనం కాలంలోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడుకాలం, మంచి కాలమని మనిషి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటాడు. నిజానికి కాలం నిమిత్తమాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
దైవాంశ సంభూతులం కాని మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయంకోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన వివేకం. అదే నిజమైన ప్రజ్ఞ!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...