Thursday, April 26, 2018

నక్షత్రముల జన్మము వివాహము

                     చంద్రునికి  దక్షుని  శాపం

కశ్యప ప్రజాపతి భార్య దితి గర్భంలో జన్మించిన 27మంది కుమార్తెలే 27 నక్షత్రాలు.

వీరిలో రోహిణి, అనూరాధ, ధనిష్ఠ అతి సుందరమైనవారు. రోహిణి ఈ ముగ్గురిలోనూ కూడా అందగత్తె. వారందరిని చూచి ముచ్చటపడి దక్షప్రజాపతి వారిని తనయింటికి తీసికొని వెళ్ళి తన బిడ్డలవలె పెంచాడు. ఆ నక్షత్రముల పేర్లు - అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉత్తరఫల్గుణి), హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ట, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణము, ధనిష్ఠ, శతభిషము, పూర్వాబాధ్ర, ఉత్తరాబాధ్ర, రేవతి.
ఆ బిడ్డలకు తగిన వరునికొఱకు దక్షుడు మునులను సంప్రదించాడు. మునుల సలహా ప్రకారం దక్షుడు తన కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్ళి చేశాడు. అందరిచేతను ఒక పూలమాల తయారు చేయంచి చంద్రుని మెడలో వేయించాడు.

🌷 *చంద్రునకు క్షయ వ్యాధి కలుగుట*

ఆ ఇరువదియేడుగురు భార్యలలో అత్యంత సుందరాంగియైన రోహిణిపట్ల చంద్రుడు ఎక్కువ అనురాగం చూపుతూ తక్కినవారిపట్ల అనాదరం ప్రదర్శించాడు. అప్పుడు వారు దుఃఖించి తమ తండ్రితో తమ బాధను చెప్పుకొన్నారు. దక్షుడు సహజంగానే కోపిష్టి గనుక చంద్రుని క్షయవ్యాధితో కృశింపమని శపించాడు. క్రమంగా చంద్రుడు కళావిహీనుడు కాసాగాడు. పరమేశ్వరుని ప్రార్థించాడు. దక్షుడినే ఉపాయం అడుగమని శివుడు చెప్పాడు.

చంద్రుడు దక్షునికి నమస్కరించి "తమ ఆశీర్వచన ప్రభావంచేత ఇప్పటికిలా ఉన్నాను" అన్నాడు. అందరు భార్యలను సమముగా ఎందుకు చూచుకోవడంలేదని దక్షుడు అడిగాడు. సృష్టిలో వైవిధ్యం ఉన్నపుడు అందరినీ ఒకేలా ఎలా చూసుకోగలమని చంద్రుడు ప్రశ్నించాడు. రూపమునకే ప్రాధాన్యత ఇవ్వడం తగదని దక్షుడు తెలిపాడు. అందరిలోకి రోహిణి అందగత్తె అని తాను భావిస్తున్నానని చంద్రుడు చెప్పాడు.

🌼 *దేవ, రాక్షస, మానవ గణములు*

దక్షుడు ఇలా చెప్పాడు - రూపములో తరతమ భేదాలు ఉండడం సాధారణం. నా పుత్రికలలో తొమ్మిది మంది (అశ్వని, మృగశిర, పుష్యమి, స్వాతి, హస్త, పునర్వసు, అనూరాధ, శ్రవణము, రేవతి) దేవతా స్వభావులు, మరి తొమ్మిది మంది (రోహిణి, ఆరుద్ర, భరణి, పుబ్బ, పూర్వాషాఢ, పూర్వాబాధ్ర, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాబాధ్ర) మానవ స్వభావులు, తక్కిన తొమ్మిది మంది (కృత్తిక, మఖ, ఆశ్లేష, విశాఖ, శతభిష, ధనిష్ఠ, చిత్త, జ్యేష్ట, మూల ) రాక్షస స్వభావులు. కనుక వారి గుణాలలో భేదాలున్నాయి. అయినాగాని అగ్ని సాక్షిగా చేసుకొన్న ప్రమాణాలు తప్పరాదు. అందువలన అసత్యదోషం కలుగుతుంది.
వివాహ సమయంలో చేసే ప్రమాణములు
చంద్రుని కోరికపై దక్షుడు పెండ్లినాటి ప్రమాణాలను ఇలా వివరించాడు - మంగళసూత్ర ధారణకు ముందు బ్రహ్మ చూపిన అన్నంమీద, దోసిళ్ళతో బియ్యం శిరసులపై పోసికొనేముందు ఆ బియ్యం మీద, ప్రధాన హోమానికి ముందు చేతిలో పేలాలు ఉంచుకొని, ఆ తరువాత సప్తర్షులనుఅరుంధతిని చూపించేటపుడు అనేక ప్రమాణాలు చేశారు. ఎన్ని ఇక్కట్లు వచ్చినా భార్యను విడువనని ప్రమాణం చేసినాక భార్యను నిరాదరిస్తే అది దోషం అవుతుంది. ప్రమాణ హక్కులు లేకుండా వివాహం ఎక్కడా జరుగదు. ఆ ప్రమాణాలను వధూవరులతో సరిగా పలికింపకపోవడం పురోహితుల దోషం అవుతుంది.
చంద్రునకు దక్షుని జ్ఞానోపదేశము
తెలిసి చేసినా, తెలియక చేసినా గాని సుకృతాలకు, దుష్కృతాలకు ఫలితం అనుభవింపక తప్పదు. కనుక యుక్తాయుక్తాలను తెలిసికొని కర్మలు చేయాలి. మానవేతర జంతుజాలానికి గత జన్మ పాపాలను అనుభవించడమే గాని ఆ జన్మలో క్రొత్తగా చేసే పాపాలేవీ ఉండవు. గతజన్మలో జీవులు చేసిన కర్మఫలాలు (ముందు జన్మలలో అనుభవించడానికి నిలువ చేసుకొన్నవి) తరువాతి జన్మలలో అనుభవించాలి.
వీటిలో ఆరుజన్మలనుండి ప్రోగైనవి సంచితములు.
ఏడు జన్మల క్రింద చేసినవి ప్రారబ్ధములు
ఈ జన్మలో చేసిన కర్మలకు ముందు జన్మలలో అనుభవింపవలసిన ఫలాలు ఆగామి
వీటిలో తెలియక చేసిన అపరాధములకు పశ్చాత్తాపం పొంది, సన్మార్గాన్ని అలవరచుకోవడం వలన జీవులు క్షంతవ్యులు అవుతారు. అంటే పారి పాపాలనుండి విముక్తి లభిస్తుంది. అంతే కాకుండా జ్ఞానం ద్వారా సంచితములు, ఆగామి నుండి విడుదల పొందవచ్చును. ప్రారబ్ధం మాత్రం అనుభవించి తీరవలసిందే.

కనుక పశ్చాత్తప్తుడై, సన్మార్గం అవలంబించి, జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని జీవుడు సంచితములనుండి, ఆగామినుండి విముక్తుడై, ప్రారబ్ధాన్ని మాత్రం అనుభవించి, కర్మశూన్యుడై ముక్తిని పొందవచ్చును. బ్రహ్మజ్ఞాని కూడా ప్రారబ్దాన్ని అనుభవించి తీరాల్సిందే.

జ్ఞానియైనవాడు తన కర్మలనన్నింటిని హరింపజేసుకొని, శ్రీహరి పంకేరుహ ధ్యానైక చిత్తుడై, జనన మరణములు లేని స్థితిని పొందుటయే మోక్షము. కర్మమేమాత్రము శేషించినా గాని జన్మము తప్పదు.

ఈ ప్రపంచం సమస్తమూ పరమాత్మ స్వరూపమే అని తెలిసికొని, సకల జీవులపట్ల సమభావంతో వర్తించడం సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అప్పుడు భేదబుద్ధి తొలగి, సర్వ ప్రపంచంలో పరబ్రహ్మమే నిండియున్నదన్న జ్ఞానం ఆత్మకు లభిస్తుంది. దానివలన బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.

చంద్రుని క్షయరోగ విముక్తి
తన భార్యలను (అనగా చంద్రుని భార్యలు, దక్షుని పుత్రికలు అయిన వారిని) చంద్రుడు క్షోభకు గురి చేశాడు గనుక అతనికి క్షయరోగం కలిగిందని దక్షుడు తెలిపాడు. అందరిపట్ల పక్షపాత బుద్ధి లేకుండా మెలగమని చెప్పాడు. అందుకొరకు దినమునకొక భార్యతో ఉండమని, ఆ 27 దినములు 27 యోగములు అవుతాయని దక్షుడు చెప్పాడు. - అవి విష్కంభము, ప్రీతి, ఆయుష్మాన్, సౌభాగ్యము, శోభనము, అతిగండము, వృద్ధి, ధ్రువము, వ్యాఘాతము, హర్షణము, వజ్రము, సిద్ధి, వ్యతీపాతము, పరియాన్, పరిఘము, శివము, సిద్ధము, సాధ్యము, శుభము, శుక్రము, ఇంద్రము, వైధృతి.
అలా ఉండడం వలన క్రమంగా రోగం క్షీణిస్తుందని, శుక్లపక్షంలో వృద్ధిని పొందుతూ కృష్ణపక్షంలో కళావిహీనుడు అవుతుంటాడని దక్షుడు ఉపాయం చెప్పాడు. తన శాపం అమోఘం గనుక దానిని తొలగించడం సాధ్యం కాదని, కాని మదోన్మత్తుడైన రాజు (చంద్రుడు) క్రమంగా జరిగినదానిని మరిచిపోయే ప్రమాదం ఉంది గనుక ఆ విధాన్ని అలా ఉండనీయమని చెప్పాడు. దక్షునికి నమస్కరించి, అతని ఆనతి తీసికొని చంద్రుడు అతని ఆజ్ఞ ప్రకారం నడుచుకోసాగాడు.

జీవితం


జననమూ, మరణమూ ఓ జీవితపుస్తకంలో మొదటి పేజీ. చివరి పేజీ. ఈ రెండింటి మధ్య ఉన్నదే మనం బతకడానికి  సాక్ష్యం. ఎలా బతికాం...అనేది ఈ మధ్య పేజీలే చెబుతాయి.
బుద్ధుడు ఓరోజు శిష్యులను ఉద్దేశిస్తూ మన జీవిత కాలమెంత అని ప్రశ్నించారు.
అప్పుడు ఓ శిష్యుడు ఏ మాత్రం ఆలోచించకుండా 75 ఏళ్ళు అన్నాడు.
"ఏంటీ  ? 75 ఏళ్ళా?" అని బుద్ధుడు ఆశ్చర్యంగా చూశారు శిష్యుడి వైపు.
బహుశా అన్నేళ్ళనేది తప్పేమో అనుకుని మరో శిష్యుడు అరవై ఏళ్ళండీ అన్నాడు.
"అవునా, అన్నేళ్ళా..." అని బుద్ధుడు మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు.
ఆదికూడా తప్పేమో అనుకుని ఒక్కొక్క శిష్యుడు 50, 45, 40, 35, 30....అంటూ ఏళ్ళు తగ్గిస్తూ చెప్పసాగారు.
ఎవరి జవాబుతోనూ తృప్తి చెందని బుద్ధుడు అవేవీ కాదన్నాడు. నెలలో వారాలో రోజులో గంటలో నిముషాలో కాదంటూ చివరగా "ఈ క్షణం" అని అన్నారు.
అదెలాగని శిష్యుల ప్రశ్న.
అంతట బుద్ధుడు "మనమందరం ఆలోచించని ఆ క్షణమే అసలైన జీవితం. క్షణమే కదా నిర్లక్ష్యం చేస్తాం. కానీ అది తప్పు. క్షణాలన్నీ కలిస్తేనేగా నిమిషాలు, నిమిషాలన్నీ కలిస్తేనేగా గంటలూ, గంటలన్నీ కలిస్తేనేగా ఒక రోజవుతుంది. రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు...ఇలా లెక్కేయడం పరిపాటి. కానీ ఇవన్నీ మొదలయ్యేది "క్షణం"తోనేగా. ఆ క్షణం ఏ విధంగా సద్వినియోగం చేసామన్నదే ప్రధానం...." అని చెప్పారు.
బుద్ధుడి జవాబు నిజమేగా....
ఆ క్షణంలో
వచ్చే కోపంతో  మనలో విచక్షణ కోల్పోతాం.
ఆ క్షణంలో కలిగే మంచి
మనల్ని సంతోషపరచొచ్చు.
ఆ క్షణంలో మన నవ్వు
మరొకరిని మన వైపు తిరిగి చూసేలా చేయొచ్చు.
ఆ క్షణంలో మనం తట్టే తలుపు చప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి ఆలోచనను మార్చొచ్చు.
ఆ క్షణంలో మన ఓదార్పు మాట ఓ వ్యక్తికి కొత్త జీవితానికి నాందీ కావచ్చు.
ఆ క్షణంలో మనం మొదలు పెట్టే ఓ సత్కార్యం ఓ గొప్ప పనికి
మూలం కావచ్చు.
ఇలా క్షణక్షణం అనేకునే క్షణాల సమాహారమే నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలూనూ. కనుక సంవత్సరాల్లో ఒదిగి ఉన్న క్షణాలను నిర్లక్ష్యం చేయకుండా బతకడమే ఓ మంచి జీవితానికి అర్థం చెబుతుంది.

Written by_గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

అక్కడికి వెళ్లి... ఆ ప్రాంతాల రహస్యాల గుట్టు విప్పగలరా???

భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా పుణ్యక్షేత్రాలు అద్భుతమైన ఇంజనీరింగ్ పరిజ్జానికి నిలయాలు. దీంతో సదరు ఆలయాల నిర్మాణంలో దాగున్న కిటుకులను ఇప్పటికీ తెలుసుకోవడం అసాధ్యమవుతోంది. కొన్ని క్షేత్రాల నిర్మాణానికి వినియోగించిన ముడి పదార్థాల ఏమిటన్న విషయం నిగూడర రహస్యమైతే మరికొన్నింటిలో భవనాలు, గుళ్లు, గోపురాల నిర్మాణానికి వాడిన ఇంజనీరింగ్ విధానం ఎటువంటిదన్నతి తెలుసుకోవడానికి మహామహులు తలలు బద్దలు కొట్టు కుంటున్నారు. మరికొన్ని క్షేత్రాలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. అటువంటి రహస్యాలతో కూడిన క్షేత్రాల్లో కొన్నింటి వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం. మీరు ఎప్పుడైనా అక్కడికి వెళ్లినప్పుడు వాటి రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నించండి. ప్రపంచం దష్టిని ఆకర్శించండి...

1. గాలిలో తేలే స్తంభం...

ప్రతి పుణ్యక్షేత్రంలోని గుడిలో అనేక స్థంభాలు ఉంటాయన్న విషయం తెలిసిందే. స్థంభం అంటే భూమి పై ఉంటూ పై కప్పును మోసేది అనేది ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో ఉన్న వీరభద్ర దేవస్థానంలో కూడా మొత్తం 70 స్థంభాలు ఉన్నాయి. ఇందులో ఒక స్థంభం మాత్రం గాలిలో తేలి ఉంటుంది.

2.ప్రయత్నించి విఫలం...

అది ఎందుకన్న విషయం ఇప్పటికీ ఎవరూ కనిపెట్టలేక పోయారు. ఓ బ్రిటీష్ ఇంజనీర్ ఈ స్థంభాన్ని భూమి పై నిలబెట్టడానికి ప్రయత్నిస్తే పై కప్పు మొత్తం కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీంతో సదరు దేవాలయం నిర్మాణం మొత్తం ఈ వేలాడే స్థంభం పై ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది. ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో ఇది ఒక్కటే.

3. ఆ నీరు ఎక్కడి నుంచి...

ఇదే ఆలయంలో దాదాపు మూడు అడుగుల పొడవైన మానవుడి పాద ముద్ర ఉంది. ఇంతటి బ`హత్ పాద ముద్రను ఎవరు చెక్కారన్నది ఇప్పటికీ నిగూడ రహస్యం. స్థానిక కథనం ప్రకారం ఇది హనుమంతుని పాదముద్రగా భావించినా ఎటువంటి నీటి ఎద్దడి సమయంలోనేనైనా సదరు పాదం నుంచి ఊరే నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది తెలుసుకోలేక పోతున్నారు.

4. వేసవిలోనైనా, వర్షాకాలంలోనైనా ఒకటే నీటి మట్టం...

యాగంటిలోని నందీశ్వర ఉన్న అగస్త పుష్కరిణిలోకి ఓ నంది విగ్రహం నుంచి నీరు వస్తుంది. ఈ విగ్రహంలోని నీరు ఎక్కడి నుంచి వస్తోందన్నది మొదటి ప్రశ్న. అదే విధంగా అటు వేసవి, ఇటు వర్షకాలం ఏ సమయంలోనైనా పుష్కరిణిలో ఒకే మట్టంలో నీరు ఉంటుంది. ఇది ఎలా సాధ్యమన్న విషయాన్ని ఇప్పటికీ ఎవరూ చెప్పలేరు.

5. ఆ గోపురం నీడ ఎందుకు పడదు...

తమిళనాడులోని తంజావూరులో ఉన్నబృహదీశ్వర ఆలయం గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఉన్న ప్రధాన ఆలయం గోపురం నీడ భూమి పై పడదు. ఈ దేవాలయానికి చెందిన మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం నిర్మించి వెయ్యి ఏళ్లు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. దీనిలో ఉన్న మర్మం ఇప్పటికీ తెలియదు. 80 టన్నుల ఏక శిలతో తయారు చేయబడిన వీమాన గోపురాన్ని 216 అడుగుల ఎత్తులో ఎలా ఉంచారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్న.

6.నదీ తీరం ఒడ్డున ఎడారి...

కర్ణాటకలో కావేరి నదీ తీరం ఒడ్డున తలకాడు అనే పట్టణం ఉంది. ఈ పట్టణం మొత్తం ఎడారిని తలపిస్తోంది. ఎక్కడ చూసిన ఇసుక దిబ్బలు ఉంటాయి. ఇక ప్రతి ఏడాది ఇసుక పరిమాణం పెరుగుతూ ఉటుంది. ఇది ఎలా సాధ్యమన్న విషయానికి సరైన ఆధారాలు ఇప్పటికీ లేదు. ఓ కథనం ప్రకారం ఓ రాణి శాపం వల్ల తలకాడు ఇలా అయి పోయిందని చెబుతున్నా పరిశోధకులు, శాస్త్రవేత్తలు దీన్ని నమ్మడం లేదు.

7. ఆ కిరణాలు సరిగ్గా అదే రోజు ఎలా తాకుతున్నాయి...

ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని గవి గంగాధరేశ్వరస్వామి దేవాలయం ఒక గుహాలయం. ఇక్కడ ప్రతి ఏడాది శంకరాత్రి రోజున దాదాపు ఒక గంటపాటు సూర్య కిరణాలు నంది విగ్రహానికి ఉన్న కొమ్ముల గుండా ప్రసారం అయ్యి లింగాన్ని తాకుతాయి. క్రమం తప్పకుండా ప్రతి ఏడు జరిగే ఈ అద్భుతాన్ని చూడటానికి చాలా మంది దేవాలయానికి వస్తారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. ఈ గుహాలయం నిర్మాణంలో వాడిన రహస్యం ఇప్పటికీ నిగూడ రహస్యం.

8.అంతులేని సంపద

కేరళలోని అనంత పద్మనాభ స్మామి టెంపుల్. ఇక్కడ దాదాపు దాదాపు 22 బిలియన్ డాలర్లు విలువ చేసే సంపద ఉన్నట్లు ఐదు నేల మాగళిలను తెరవగా తెలిసింది. మరో మూడింటిని తెరవడానికి ఇప్పటికీ ఎవరూ సాహసం చేయడం లేదు. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒక నేల మాగళికకు నాగబంధంతో ద్వారాన్ని మూసి వేశారు. పక్కనే ఉన్న ఓ శ్లోకాన్ని చదివితే ఈ నాగబంధం తనంతకు తానే తెరుచుకుంటుందని కొంతమంది చెబుతున్నారు.

9. నాగబంధనం విడిపించే శ్లోకం చదవగలరా

అయితే సదరు శ్లోకం చదవడం తెలిసిన వారు మాత్రం ఇప్పటికీ ఎవరూ లేరు. ఒక ద్వారాన్ని ధ్వని తరంగాల ద్వరా మూయడం, తెరవడం అప్పటికే మన వాళ్లు కనిపెట్టారని దీని వల్ల అర్థమవుతోంది కదా. ఇక ఈ నాగమాగళిలో ఏముందన్న విషయం ఇప్పటి వరకూ ఎవరూ చెప్పడం లేదు.

10. కైలాసనాథ టెంపుల్

మహారాష్ర్టలోని ఎల్లోర గుహల్లో ఉన్న కైలసానాథ టెంపుల్ ఏక శిల నిర్మితమైనవి. దీనిని ఎవరు, ఎప్పుడు నిర్మించారన్న విషయం పై ఇప్పటికీ సరైన ఆధారాలు లేవు. ఇందులో కొన్ని శిల్పాలు రాకెట్, గ్రహాంతర వాసులను కూడా పోలి ఉన్నాయి. వాటిని ఆవిధంగా ఎందుకు చెక్కారు, ఒకవేళ అప్పటి వారికి గ్రహాంతర వాసుల గురించి ముందే తెలుసా తదితర విషయాలన్నీ జవాబులు లేని ప్రశ్నలే
సుదర్శన చక్రం

మనఆచార వ్యవహారాలు- వానివిలువలు


సాధారణంగా నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేస్తాడు. ఎవరు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది ‘ధర్మపత్నీ సమేతస్య’ అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే పూజామందిరంలోకి వెళ్ళడం ఇంక అంతకన్నా అన్యాయమైన విషయం ఏం ఉంటుంది? ఇంక దానిమీద వ్యాఖ్యానం చేయడం అనవసరం. కాబట్టి అలాగే పూజ చేస్తారు అని మనం భావన చేయాలి. పురుషుడు ప్రతిరోజూ పూజ చేస్తాడు. నైమిక్తిక తిథులలో పూజ చేసేటప్పుడు భార్య కూడా ప్రక్కన కూర్చుంటుంది. వినాయక వ్రతంలాంటిది చేసినప్పుడు. వస్త్రధారణా నియమం అన్నప్పుడు ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ వేసుకుంటుంది, వివాహిత అయితే చీర కట్టుకుంటుంది. అమ్మవారికి అవే కదా ప్రధానం. కాబట్టి మనం కూడా అవే కట్టుకుంటాం. ఇక పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది – ‘వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ’ – గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబరుడే అవుతుంది. బట్ట గోచీ పోయాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని ‘కచ్ఛము’ అంటారు. ‘వికచ్ఛః’- గోచీ పెట్టుకోలేదు; అనుత్తరీయశ్చ – పైన ఉత్తరీయం లేదు; అంటే ఉత్తరీయం ఒక్కటే  ఉండాలి పురుషుడికి. చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు. దేవాలయంలోనైనా అంతే. కళ్యాణం చేసుకోవడానికి వెళ్తే ఎవరో వచ్చి చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పక్కరలేదు. మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఎందుకంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు. నీ గుండెలలో ఏ పరమాత్మ ఉన్నాడో వాడే ఎదురుగుండా ఉన్నాడు. వాడు వీడికి, వీడు వాడికి కనపడాలి. ఉత్తరీయం ఒక్కటే వేసుకుంటారు. గోచీపోసి పంచె కట్టుకోవాలి. ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు. యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. కాబట్టి ఉత్తరీయం లేకుండా ఉండకూడదు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తున్నారు అనుకోండి నీయందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు స్వాగతం చెప్పడానికి ఇంటి బయటికి వచ్చిన ఇంటి యజమాని ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. నేను ఎవరి ఇంటికైనా వెళ్ళాను అనుకోండి, ఆయన ఎడమ భుజం మీద ఉత్తరీయం వేసుకుని ఎదురు వచ్చి స్వాగతం పలికాడు అనుకోండి ఆయన అభ్యున్నతి కొరకు మంచిమాటలు చెప్పవచ్చు. ఆయన అలా రాలేదు అనుకోండి నాపని చూసుకుని వెళ్ళిపోవడం మంచిది. ఎందుకంటే నాకు అయన పెద్దరికం అనడానికి గుర్తు ఏమిటంటే భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలకాలి. మీరు గమనించండి కావ్యాలలో, పురాణాలలో భుజం మీద ఉత్తరీయంతో స్వాగతం పలికాడు అని ఉంటుంది. అప్పుడే పెద్దలు మాట్లాడతారు. కాబట్టి ఉత్తరీయం ఉండాలి. నువ్వు భగవంతుడితో సమన్వయము అవుతున్నావు. ఆయన చేయి చాపాలి, కాళ్ళు చాపాలి, ఆయన తింటే కదూ నువ్వు పెట్టింది అందింది. ఆయన అనుగ్రహించాలంటే నువ్వు మంగళప్రదుడివై అయి ఉండాలి. ఉత్తరీయం వేసుకుని ఉండాలి. ‘అనుత్తరీయశ్చ, నగ్నశ్చ – వాడు బట్టలు లేకుండా పూజ చేశాడు అని గుర్తు. ‘అవస్త్రఏవచ’ – మళ్ళీ నొక్కి చెప్పింది వేదం. వాడు నగ్నంగా ఉన్నాడు. నగ్నము అన్నమాటకు అర్థం అంటే దిక్కులు కప్పని వాడై ఉన్నాడు. ఒక చుట్టు చుట్టి కట్టాను అనుకోండి పూజకు పనికిరాను. గోచీపోసి కట్టే కూర్చోవాలి. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. దేవాలయంలో అంతరాలయ ప్రవేశం చేయరు. అలా పంచె కట్టుకునేటప్పుడు ఆ పంచెకి కానీ, ఉత్తరీయానికి కానీ అంచు ఉండాలి. అంచు లేని బట్ట కట్టాడు అంటే అమంగళప్రదుడు అని గుర్తు. అవతలి వాడు పదికాలాలు బ్రతకాలి అని కోరుకుంటే అంచు ఉన్న బట్టలు తీసుకువచ్చి పెడతారు. ఒక ప్యాంటు గుడ్డ నేను పెట్టాను అనుకోండి, దానికి అంచు ఉండదు. అందుకే పీటలమీద అల్లుడికి పెట్టాలి అంటే నీకు కోటు కుట్టించాలి అని మోజు ఉంటే బయట కుట్టించు. పీటల మీద కూర్చున్నాడు భగవత్ కార్యంలో. ఆయుఃకారకం నువ్వు ఇచ్చేది. నువ్వు ఉత్తరీయం వేసుకోవాలి. ఉత్తరీయం లేకుండా బట్టలు పెట్టకూడదు. ఉత్తరీయం లేకుండా బట్టలు పుచ్చుకోకూడదు. అంచు ఉన్న బట్టలు పెట్టాలి. అందుకే ఇప్పటికీ మనవాళ్ళు పంచెల చాపు పెడతారు. పరమమంగళప్రదుడు అనడానికి గుర్తు అంచు ఉన్న బట్ట గోచీ పోసుకుని కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉంటే పరమ మంగళప్రదుడు. శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పూజ దగ్గరికి వెళితే లాల్చీ, బనియను కూడా పనికిరావు. తీసేసి ఉత్తరీయం కప్పుకుని గోచీ పోసి పంచె కట్టుకుని కూర్చుని పూజ చేయాలి. గోచీ ఎంత బాగా పోయాలి. అంచు ఎంత బాగా మడత పెట్టాలి సంబంధం లేదు. ఒక అంచు తీసి నీకు వచ్చినట్లు దోపుకుంటే చాలు కచ్ఛ ఉన్నట్లే. కాబట్టి పురుషుడికి పూజ చేసేటప్పుడు వస్త్రధారణయందు అటువంటి నియమము ఉన్నది. అదేం పెద్ద విశేషమా? అదేం బ్రహ్మవిద్యేం కాదు. పూజయందు ఎప్పుడూ గోచీపోసి పంచె కట్టుకుని ఉత్తరీయం వేసుకుని పురుషుడు పూజ చేయవలసి ఉంటుంది.............

30 వేల ఫలితాన్నిచ్చే ఒకే ఒక్క ప్రదక్షణం "చండ ప్రదక్షణం"

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది!!

ప్రదక్షిణా విధానాన్నివివరించే ఒక శ్లోకం!!

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.

మంత్ర శక్తి మహిమ

                             ఓంశ్రీమాత్రేనమః

                     అద్వైత చైతన్యజాగృతి.

మనఃక్లేశాలను ప్రక్షాళనం చేసి, నిర్మలత్వం కలిగించే ముఖ్య పరికరాలే మంత్రాలు*
ఈ జన్మ....గత జన్మ వాసనలతో,
మనలను కట్టి పడవేసి, ఆచేతన,సుప్తచేతన ఆలోచనల, కోరికలను చేధించడానికి మంత్రం సహాయపడుతుంది.

మంత్రం మన మనసు పొరల్లో దాగియున్న పలురకాలైన ఆలోచనలను దూరం చేస్తుంది. సక్రమంగా, మనస్సాక్షిగా, ధ్యానం చేయబడిన మంత్రాలు సత్ఫలితాలను ఇస్తాయి. మన మనసులోని వ్యతిరేక భావాలను దూరం చేస్తాయి.

ఉదాహరణకు..

‘హుం’ కారం మనలోని భయాన్ని పారద్రోలుతుంది.

‘రాం’ కారం మనకు శాంతిని కలుగచేస్తుంది.

మంత్రంలో ‘మ’కారం అంటే మననం,
మననం అంటే పదేపదే ఉచ్ఛరించడం.

‘త్రం’కారం అంటే త్రాణం,
త్రాణం అంటే రక్షించేదని అర్థం,

కాబట్టి ‘మంత్రం’అంటే ఏకాగ్రచిత్తంతో పదేపదే ఉచ్ఛరించే వానిని రక్షించేదని అర్థం.మననం చేయువానిని రక్షించేది మంత్రమని అర్థం.

మంత్రత అనేది నిర్గుణ బ్రహ్మస్వరూపం. ఒక బీజం (విత్తనం) పెద్దచెట్టు గా వృద్ధిచెందినట్లు, నిర్గుణ బ్రహ్మమే మంత్రంగా సూచించబడింది.

మంత్ర వివరణపై అనేక నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

తన హృదయం నుండి అవగతమయ్యే శక్తే మంత్రమనీ, దేవతా దిష్టితమైన ఒకానొక అక్షర రచనా విశేషమే మంత్రమనీ,
దేవతా స్వరూపమే మంత్రమనీ,
సాధనకు, కార్యసిద్ధికి, ప్రత్యేక ఫలితాలకు ప్రకృతి శాస్త్రాలను అనుసరించి వివిధ ప్రక్రియలలో అభ్యాసమూలమైన సిద్ధిత్వాన్ని కలిగించేదే మంత్రమనీ కొన్ని అక్షరాల ప్రత్యేక ఉచ్ఛారణే మంత్రమనీ,
ఒక శబ్దాన్ని యాంత్రికంగా, పారవశ్యం కలిగేంతవరకు పునశ్చరణ చేయడమే మంత్రమని అంటారు.

ఈ జగత్తు అంతా దెైవానికి ఆధీనమై ఉంది. అటువంటి దెైవం మాత్రం మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. కాబట్టి శబ్ధరూపంలో నున్న దెైవశక్తి స్వరూపమే మంత్రం,

మంత్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఆమంత్రం దేవతామూర్తి యొక్క శక్తి సాధకునిలో అణువణువు వ్యాపించి
ఉంటుంది. అప్పటివరకు నిబిఢీకృతమై ఉన్న దెైవికశక్తులు సాధకునికి ఉపయోగపడి జ్ఞానోదయ మవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద,
మాత్సర్య, మాలిన్యాలు తొలగి, మనస్సు నిశ్చలమై, సచ్చిదానంద స్థితిని పొందుతాడు.

అత్యంత శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి, శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమయిన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రంలోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి, అత్యద్భుతమైన మహాశక్తి ఉత్పన్నమవుతుంది. యోగసాధన సఫలీకృత మయ్యేందుకు యోగాశక్తి ఎలా అవసరమో అదే విధంగా మంత్రసాధన ఫలించేందుకు విశేషమైన మానసిక ఏకాగ్రత అవసరం.

ఈ వాక్ శక్తీకరణ కలిగినప్పుడు, మనం కొన్ని సాధారణ శబ్దాలలో నిగూఢమైన అర్థాలను చూడగలం. అవి ఎన్నో అడ్డంకులను అధిగమించి ఈ సమస్తవిశ్వంతో సంభాషించే స్థితికి సాధకుని తీసుకెళ్తాయి.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాలో గ్రహణసమయాలలో అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి కదా! వాటిని స్థానిక భాషలోకి తర్జుమా చేసుకొని దెైవాన్ని పూజించకూడదా? అని కొంతమంది ప్రశ్నిస్తుంటారు. ఇందుకు సమాధానం ఒక్కటే.మంత్రం శబ్దప్రధానమైనది. ధ్వనాత్మక సృష్టిపదార్థం సృష్టి కంటే ముందే పుట్టింది. ఇతర తత్త్వాలకంటే శబ్దతత్త్వం శక్తివంతమైనది. కాబట్టి మంత్రానికి ఆధారం శబ్దం అయింది.

సంస్కృత భాషలోని అక్షరాలలో శబ్దం, అర్థం రెండూ ఉన్నాయి. ఈ అక్షరాల నిర్మాణం వల్ల అనేక మహిమలు కలుగుతాయి. అందుకే మిగతా భాషల కంటే సంస్కృతం ఉత్కృష్టమైన మంత్ర ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే సంస్కృతం మంత్రంలో నుండి ఉద్భవించింది మరి.

మంత్రాలు రెండు రకాలు.

1. దీర్ఘమంత్రాలు,
2. బీజామంత్రం.

మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది.

దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై,
ఇరవెై నాలుగు అక్షరాలతో,
ఇరవెైనాలుగు చంధస్సులెై,
ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది.

గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్, యజుర్, సామవేదాల నుంచి గ్రహించబడి,
‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి.

‘గాయత్రీ’ మంత్ర ద్రష్టం అయిన విశ్వామిత్రుడు మంత్రనుష్ఠాన ప్రభావంవల్ల జితేంద్రియుడవడమే కాక, రాజర్షీత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు.

అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.
హ్రస్వబీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి.

దీర్ఘమంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనల పై ఆధారపడి ఉంటాయి.

ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది? అన్న ప్రశ్న మనకు కలుగవచ్చు.అందుకు సమాధానం, త్రికాల వేదులెైన ఋషులు, జగత్ కళ్యాణం కోసం అందించిన
సత్యోపదేశాలే ‘మంత్రాలు’.

అదే విధంగా ‘మంత్రసిద్ధి’ ఎన్ని రోజులకు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంటుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందవచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణ ప్రదాలు. వాటి ఉచ్ఛారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి అన్నది పెద్దలవాక్కు.

అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశముంది.

ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, చంధస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం,అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడింది.

1. ఋషి:
మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరిచేత ఆవిష్కరింపబడిందో, ఎవరిచేత సిద్ధి పొందిందో, అతనినే ఆ మంత్రానికి కర్తగా (ఋషిగా) భావించాలి.

2. ఛందస్సు:
శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పు తున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడు కొనేందుకు గాయత్రీ వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకొన్నారు.

3. దేవత:
ప్రతి మంత్రానికి ఒక అధిష్టాత దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్ఠాన దేవతను హృదయ కమలంలో నిలుపుకొని ధ్యానించాలి.

4. బీజం:
మంత్రానికి ప్రత్యేకశక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి.

5. శక్తి:
మనం మంత్రశక్తిని వహించినప్పుడే, అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాలలో నిలిపి ధ్యానించాలి.

6. కీలకం:
మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపాసనామూర్తిని దర్శించి, ఆత్మసాక్షాత్కారంతో సర్వసిద్ధులను పొందుతాడు.

7. అంగన్యాసం:
అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ర్పయోజనమవుతాయి. శరీరశుద్ధికోసం న్యాసాలు తప్పనిసరిగి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకొని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు.

వినియోగం:
చతుర్దిధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు.

ప్రతి మంత్రానికి మంత్రాధిష్థాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని, సాధకుడు మనసులో నిలుపుకొని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితములు మంత్రోపాసనకు చాలా ముఖ్యం.

పండుగ సమయాలలో గ్రహణ సమయాలలో
అమావాస్యలలో మంత్రోచ్ఛారణ అధికంగా చేయాలి.

మంత్రాలు కర్మార్థమై జనించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వలన ఆ
మంత్రానికి సంబంధించిన దెైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది.

మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకు..హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ, నారాయణ’ అనే మంత్ర జపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి.

భక్తహనుమ ‘రామ’ నామజపంతో ఉత్తేజితుడెై సముద్రాన్ని దాటి లంకను చేరాడు.
గాయత్రీ మంత్ర జపం వలన విశ్వామిత్రుడు రాజర్షిత్వాన్ని వదలి బ్రహ్మార్షిత్వాన్ని పొందాడు.

మహాత్ములు కొన్ని ప్రాధమిక మంత్రాలను సూచించారు. అవి:..

ఓం’.
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ‘ఓం’ కారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైనది.

అకార, ఉకార, మకారాలు అనే మూడు శబ్దాల సమన్వయం 'ఓం’కారం. ఈ మూడు భాగాలు జాగృత, స్వప్న, గాఢ సుషుప్తి స్థితులకు, రజ సత్త్వ, తమో గుణాలకు ప్రాతినధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలెైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు.

వేదం ఓంకారరూపం, వేదరాశి..
ఋగ్వేదం నుండి ‘అ’ కారం,
యజుర్వేదం నుండి ‘ఉ’ కారం,
సామవేదం నుండి ‘మ’ కారం
పుట్టి, వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓం కారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం.

శ్రీం:
అమ్మ వారికి చెందిన మంత్రం. ఐశ్వర్యాన్ని, సకల అభీష్టసిద్ధిని కలిగిస్తుంది.

హూం:
సృష్టిలోని వ్యతిరేక శక్తులను నాశనం చేసే దెైవికక్రోధం యొక్క శబ్దం ‘హూం’.

ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే, హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితమవుతుంది.

రాం:
ఇది దివ్య తేజోబీజం. శాంతిని కలిగిస్తుంది.

ఐం:
జ్ఞాన బీజం. ఏకాగ్రత,శక్తులను ప్రసాదిస్తుంది.

మాం:
మాతృబీజం. అగ్నిబీజాలకు ఆద్యం.

సోహం:

ఊపిరి యొక్క స్వాభావిక బీజం.
‘సో’ ఉచ్ఛ్యాసం,
‘హం’ నిశ్శ్వాసం.
సోహం నుండి హల్మ శబ్దాలను వేరు చేస్తే ఓంకారం.
‘సో’ శక్తి ‘హం’ శివుడు.

గాయత్రీ మంత్రం:

ఓం కారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తులలో, బ్రహ్మ సూత్రాలలో, పురాణాలలో గాయత్రీ దేవత సగుణ, నిర్గుణ, స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీ దేవని గాయత్రీ మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రీని జపిస్తారో వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు.

ఏకాక్షర మంత్రం – ‘ఓం’.

అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం’. దీనినే ‘ప్రణవం’అని కూడా అంటారు. మంత్రోచ్ఛారణ జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన.

ఉదా..బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొని వచ్చి, ఆ బిడ్డను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవతా మూర్తులు, మంత్రోచ్ఛారణతో మనం మననం చేయగానే మనపట్ల ప్రసన్నలవుతున్నారు.

మహా శక్తివంతమైన మంత్రాలను మన ఋషులు, అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.‘ఐం,శ్రీం,హ్రీం,క్లీం’ అనే ఏకాక్షర బీజమంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలవుతాయి.

ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం.
సమస్త మంత్రాలసారంగా ‘ఓం’కారం చెప్పబడింది.

సాధారణంగా మంత్రాలు మూడు విధాలు..

1. తామస మంత్రం: క్షుద్రంతో ఉచ్ఛారణ చేసేవి.

2. రాజస మంత్రం: యుద్ధంలో గెలుపు కోసం చేసేవి.

3. సాత్విక మంత్రం: ఆధ్యాత్మిక సాధనకై చేసేవి.

చంధోబద్ధంగా ఉన్న మంత్రాలు ‘ఋక్కులు’ అని గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను ‘యజస్సులు’ అని అంటారు. ఓంకారం లేని మంత్రం ఫలవంతం కాదు.
అలాంటి మంత్రం ప్రాణవాయువు లేని నిర్జీవ శరీరం వంటిది.

ఓంకారం ఆ సర్వేశ్వరుని నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై, దాన్నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం – ‘అ’ కారం, యజుర్వేదం నుండి ‘ఉ’ కారం, సామవేదం
నుండి ‘మ’ కారం కలసి ‘ఓం’ కారం ఏర్పడింది.

లోకాసమస్తా సుఖినో భవంతు

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...