Thursday, April 26, 2018

జీవితం


జననమూ, మరణమూ ఓ జీవితపుస్తకంలో మొదటి పేజీ. చివరి పేజీ. ఈ రెండింటి మధ్య ఉన్నదే మనం బతకడానికి  సాక్ష్యం. ఎలా బతికాం...అనేది ఈ మధ్య పేజీలే చెబుతాయి.
బుద్ధుడు ఓరోజు శిష్యులను ఉద్దేశిస్తూ మన జీవిత కాలమెంత అని ప్రశ్నించారు.
అప్పుడు ఓ శిష్యుడు ఏ మాత్రం ఆలోచించకుండా 75 ఏళ్ళు అన్నాడు.
"ఏంటీ  ? 75 ఏళ్ళా?" అని బుద్ధుడు ఆశ్చర్యంగా చూశారు శిష్యుడి వైపు.
బహుశా అన్నేళ్ళనేది తప్పేమో అనుకుని మరో శిష్యుడు అరవై ఏళ్ళండీ అన్నాడు.
"అవునా, అన్నేళ్ళా..." అని బుద్ధుడు మళ్ళీ ఆశ్చర్యంగా చూశాడు.
ఆదికూడా తప్పేమో అనుకుని ఒక్కొక్క శిష్యుడు 50, 45, 40, 35, 30....అంటూ ఏళ్ళు తగ్గిస్తూ చెప్పసాగారు.
ఎవరి జవాబుతోనూ తృప్తి చెందని బుద్ధుడు అవేవీ కాదన్నాడు. నెలలో వారాలో రోజులో గంటలో నిముషాలో కాదంటూ చివరగా "ఈ క్షణం" అని అన్నారు.
అదెలాగని శిష్యుల ప్రశ్న.
అంతట బుద్ధుడు "మనమందరం ఆలోచించని ఆ క్షణమే అసలైన జీవితం. క్షణమే కదా నిర్లక్ష్యం చేస్తాం. కానీ అది తప్పు. క్షణాలన్నీ కలిస్తేనేగా నిమిషాలు, నిమిషాలన్నీ కలిస్తేనేగా గంటలూ, గంటలన్నీ కలిస్తేనేగా ఒక రోజవుతుంది. రోజులు వారాలు, వారాలు నెలలు, నెలలు సంవత్సరాలు...ఇలా లెక్కేయడం పరిపాటి. కానీ ఇవన్నీ మొదలయ్యేది "క్షణం"తోనేగా. ఆ క్షణం ఏ విధంగా సద్వినియోగం చేసామన్నదే ప్రధానం...." అని చెప్పారు.
బుద్ధుడి జవాబు నిజమేగా....
ఆ క్షణంలో
వచ్చే కోపంతో  మనలో విచక్షణ కోల్పోతాం.
ఆ క్షణంలో కలిగే మంచి
మనల్ని సంతోషపరచొచ్చు.
ఆ క్షణంలో మన నవ్వు
మరొకరిని మన వైపు తిరిగి చూసేలా చేయొచ్చు.
ఆ క్షణంలో మనం తట్టే తలుపు చప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తి ఆలోచనను మార్చొచ్చు.
ఆ క్షణంలో మన ఓదార్పు మాట ఓ వ్యక్తికి కొత్త జీవితానికి నాందీ కావచ్చు.
ఆ క్షణంలో మనం మొదలు పెట్టే ఓ సత్కార్యం ఓ గొప్ప పనికి
మూలం కావచ్చు.
ఇలా క్షణక్షణం అనేకునే క్షణాల సమాహారమే నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలూనూ. కనుక సంవత్సరాల్లో ఒదిగి ఉన్న క్షణాలను నిర్లక్ష్యం చేయకుండా బతకడమే ఓ మంచి జీవితానికి అర్థం చెబుతుంది.

Written by_గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...