Friday, September 2, 2016

విశ్లేషణ

మనస్సు అనేది చాలా విచిత్రమైనది. అది చెడుకు లొంగినంత సులభంగా మంచికి లొంగదు. మనస్సే బంధనానికి కాని, ముక్తికి కాని కారణమవుతుంది. మనస్సును నిగ్రహించడం జీవునికి అతిముఖ్యమైన పని. అర్జునుడంతటి స్థితప్రజ్ఞుడే, స్థిరచిత్తుడే, శ్రీకృష్ణునితో కృష్ణా! మనస్సు చాలా చంచలమైనది. అది సమస్త ఇంద్రియాలను క్షోభింపజేస్తుంది. ఇంద్రియ సుఖాలలోనే దృఢంగా ప్రవర్తిస్తుంది. అట్టి మనస్సును నిగ్రహించడం ప్రతికూలమైన వాయువును అడ్డుకోవడమంతటి దుష్కరం అని వాపోవడం గమనార్హం. మనశ్చాంచల్యం చాలా చిత్రమైనది కూడా. అది నిరంతరం అభ్యస్తమైన విషయాలలో కూడా నిలకడగా ఉండదు. అలాంటి మనస్సును భగవంతునియందు నిలపడం అనుకున్నంత సులభమైన పని కాదు. వేపమానును పాలుపోసి పెంచితే చేదు వదలనట్లుగా, కుక్కతోక వంకర వదలనట్లుగా, గొడ్డలిని నీట నానబెడితే మెత్తబడనట్లుగా, తేలుతో స్నేహం చేసినా అది కుట్టక మాననట్లుగా, చిత్తం అనేది ఎన్ని మంచి మాటలువిన్నా, మరల మరల అదే చెడు తలంపులతో పరిభ్రమిస్తూ ఉంటుంది. అదే విషయాన్ని అన్నమయ్య చెప్తున్నాడు ఈ కీర్తనలో అన్నమయ్య.

పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా || భారమైన||

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా || భారమైన||

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా || భారమైన||
(ఆ.సం.రాగి రేకు 47 – వ.సం.287)

విశ్లేషణ:
పల్లవి: భారమైన వేపమాను పాలువోసి పెంచినాను
తీరని చేదేకాక దియ్యనుండీనా

ఆ.వె. వేము పాలు వోసి ప్రేమతోఁ బెంచిన / చేదు విఱిగి తీపి చెంద బోదు/ ఓగు నోగేఁగాక యుచితజ్ఞుఁ డెటులౌను
విశ్వదాభిరామ వినురవేమ ! – ఈ వేమన పద్యం అందరికీ విదితమే! వేపచెట్టు కి పాలుపోసి పెంచినా దాని సహజసిద్దమైన చేదు పోయి తీపిదనం రాదు. అదేవిధంగా చెడ్డవాడు చెడ్డవాడే కాని ఎన్ని మంచి మాటలు చెప్పినా చెడ్డవాణ్ణి మంచి వానిగా మార్చలేము అంటూ ఆటవెలదులను ఈటెగా విసిరిన దిట్ట చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేము. అలాగే అన్నమయ్య కూడా చిత్తాన్ని గూర్చిన చిత్రాలు అనేకం అంటూ రకరకాల దృష్టాంతాలు తెలియజేస్తున్నాడు.

జీవునికి మనస్సనేది వేపమాను లాంటిది. నిత్యం చెడు తలంపులే దాని వృత్తి. ఎంత తియ్యటి పాలను అనుదినము పోసినా చేదే తప్ప తీపిరాదు అనగా చెడు తలపులు చిత్తాన్ని వీడడంలేదు అంటున్నాడు అన్నమయ్య. రోజూ ఎన్నో మంచి మాటలను, ఉపదేశాలను వింటాం. దాలి గుంటలోని కుక్కరీతిగా అవన్నీ ఆ క్షణం మాత్రమే. అయ్యో! పాపం చేస్తున్నాం అనుకుంటాం. కానీ వెనువెంటనే అన్నీ మర్చిపోయి దైనందిన జీవితంలో తప్పులనే బురదలో పొర్లుతూ ఆనందిస్తూ ఉంటాము. అర్జునుడు భగవద్గీతలో మనందరి తరఫున భగవానునిని అడిగినది ఏమిటంటే..”చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవద్దృఢం, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం”. దాని అర్ధం “ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది. బాగా మథించే స్వభావం కలది. దృఢమైనది. మిక్కిలి బలీయమైనది. కనుక దాన్ని నిగ్రహించడం గాలిని ఆపడంలా చాల దుష్కరంగా భావిస్తున్నాను” . అని శ్రీకృష్ణునితో అనగా.. జగద్గురువైన కృష్ణుడు అంటాడు.. “అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం,అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే” అనగా…”ఓ మహాబాహూ! నిస్సందేహంగా మనస్సు చంచలమైనదే. దాన్ని వశపరచుకోవడం మహా కష్టం. కాని, అర్జునా! అభ్యాసం మరియూ వైరాగ్యం అనే రెండింటి ద్వారా దాన్ని వశం చేసుకోవడం సాధ్యమే.” అని చెప్పడం జరిగింది. అభ్యాసం అంటే అనుదినం నిరంతరం సాధనకై యత్నించడం, రాగం (రక్తి, అనురాగం) లేకపోవడమే విరాగం. దాని భావమే వైరాగ్యం అని శెలవిస్తాడు భగవానుడు. కనుక అభ్యాసం, వైరాగ్యం నిరంతర సాధనల ద్వారా మనిషి చిత్తాన్ని జయించవచ్చు.

చ.1 పాయదీసి కుక్కతోక బద్దలు వెట్టి బిగిసి
చాయ కెంతగట్టినాను చక్కనుండీనా
కాయపు వికారమిది కలకాలము జెప్పినా
పోయిన పోకలే కాక బుద్ధి వినీనా

సంస్కృతం లో “శ్వాన పుచ్ఛ న్యాయం” అనగా తెలుగులో “కుక్కతోక న్యాయం” అని అర్థం. దానినే మనం “కుక్కతోక వంకర” అని వాడుకలో ఉపయోగిస్తూ ఉంటాము. కుక్క తోకని తిన్నగా చేయాలని ఎంత ప్రయత్నం చేసినా దాని వంకరపోదు.”ఎలుగు తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు రాదు” అని వేమన అన్నట్లు, వంకర గుణాలు,వక్ర బుద్ధి ఉన్నవారిలో ఎంత ప్రయత్నించినా మార్పు రాదు. దీనినే అన్నమయ్య ఉదాహరణగా గ్రహిస్తూ… కుక్కతోకను కొయ్య బద్దలు పెట్టి ఎన్నిరోజులు కట్టి మరల విప్పినా వంకరను చక్కగా చేయలేము. అలాగే మనసు కూడా మాట వినినట్టే ఉంటుంది మరలా జారిపోయి పాతవాసనలతో గుభాళిస్తుంది. మన దేహంలోని రకరకాల వికారాలకు మనసుకు ఎన్ని మార్లు ఎన్నివిధాలుగా బుద్ధి చెప్పినప్పటికీ కుక్కతోక వంకర వలె తిరిగి అదే పోకలు పోవడం మరలా అదే స్థితి కొనసాగడం గురించి వాపోతున్నాడు అన్నమయ్య.
ఇంద్రియాలను, బుద్ధిని అదుపులో ఉంచుకోవడమే సంయమనం. ఇంద్రియాలలో ఏ ఒక్కటి చలించినా దానివల్ల చిల్లులున్న పాత్రలోని నీరు దిగజారిపోయినట్లు బుద్ధి దిగజారిపోతుంది. అంతఃకరణాన్ని అదుపు చేయడాన్ని శమము అనీ, ఇంద్రియాలను అదుపుచేయడాన్ని దమము అనీ అంటారు. మోక్షం పొందటానికీ, బంధంలో చిక్కుకుపోవడానికి కానీ ఇంద్రియాలే ప్రధాన కారణాలు అవుతున్నాయి. విషయ భోగాలందే శాంతి, సౌఖ్యాలు లభిస్తాయని భావించడం కేవలం మన భ్రాంతి మాత్రమే అవుతుంది. సహనం కలిగి ఉండడంవల్ల ధైర్యం గాంభీర్యం, వీరత్వం, ఆత్మబలం పెంపొందుతాయి. సహనానికి మూలం క్షమాబుద్ధి. ఎప్పుడు మానవుడు సంతోషదుఃఖాలకు లొంగకుండా ఉంటాడో, మానవుని మనస్సు ఇంద్రియాలతో సంపర్కం పొందినపుడు చిత్తంలో వికారం ఉదయింపకుండా ఉంటుందో అప్పుడే మానవుని జితేంద్రియునిగా లెక్కింపవచ్చు. అలాంటి షోడశవికారములు లేని బుద్ధిని ప్రసాదించమని అన్నముని విజ్ఞాపన!

చ.2 ముంచిముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా
మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యి నా
పంచమహాపాతకాల బారి బడ్డచిత్తమిది
దంచి దంచి చెప్పినాను తాకి వంగీనా

ఇనుప గొడ్డలిని నీటిలో ఎన్నిరోజులు నానబెట్టినా మెత్తబడుతుందా? అలాగే జీవుని చిత్తం సహితం ఎన్ని సార్లు ఎన్ని మంచి విషయాలు చెప్పినా లొంగక లౌకికమైన పాడు విషయ వాంఛల చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. తెలిసో తెలియకనో పంచమహాపాతకాల వంటి పాపాల పొదలో సదా సంచరించే మనసును దారికి తేగలగాలి. స్త్రీ హత్య, శిశు హత్య, గో హత్య, బ్రహ్మ హత్య, గురు హత్యలను పంచ మహాపాతకాలు అంటారు. దైనందిన జీవితంలో కూడా మనం వంట వండేప్పుడు కూరగాయలు తరిగేప్పుడో, అన్నం ఉడికించేప్పుడో మనకు తెలియకుండా కొన్ని సూక్ష్మ జీవులని సంహరిస్తుంటాం. అలా చేసినందుకు మనకు పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి అంటుంటారు పెద్దలు. అయితే అన్నం మాని వీటిని నివృత్తి చేయలేం కనుక జీవుడు పంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. అవి దేవతలని ఆరాదించటం, మనకు శరీరం ఇచ్చినందుకు పితృ దేవతలను ఆరాదించటం, మన చుట్టూ ఉండే ప్రాణికోటితో భూతదయతో ప్రవర్తించటం, ధానధర్మాలు చెయ్యటం ఇలా మంచ మహాయజ్ఞాలు చెయ్యాలని అంటారు. ఒక రైతు పంట పండించేందుకు భూమి దున్నిన మొదలుకొని, క్రిమికీటకాదులని సంహారం చేస్తాడు కాబట్టి రైతు తప్పనిసరి పంచ మహాయజ్ఞం చెయ్యాల్సి వస్తుంది. ఇండ్లముందు వివిద ధాన్యాలను చల్లటం, ఇలా తమ వృద్దిని చూపటంతో పాటు లోపల భూత దయ ఇమిడి ఉంది. పంట ఇంటికి తెచ్చేముందు ప్రకృతి దేవతలకు ఆరగింపు చేస్తారు. ఇవన్నీ పంచమహా యజ్ఞాలే! ఇలాంటివన్నీ హరించి కేవలం పాపాలవైపే లాగేస్తున్న మనసును అరికట్టడం ఎలా? శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అను ఆరింటిని శమాది షట్కసంపత్తి అంటారు. ఈ ఆరు లక్షణములు కలిగి ఉన్నవాడు తప్పనిసరిగా అత్మస్వరూపుడే అయి ఉంటాడు. ఏ పరిస్థితిలోను ఆకార బ్రాంతికి లోనవడు. అయితే.. నిత్యానిత్యవస్తు వివేకము, ఇహాముత్ర ఫలభోగ విరాగమును సంపాదించ కుండా శమాది షట్కసంపత్తిని ఆచరించుట వలన ప్రయోజనము ఏమి ఉండదు. అలాంటి వైరాగ్యాన్ని ప్రసాదిచమని కోరుతున్నాడు అన్నమయ్య.

చ.3 కూరిమితో దేలుదెచ్చి కోకలోన బెట్టుకొన్నా
సారె సారె గుట్టుగాక చక్కనుండీనా
వేరు లేని మహిమల వేంకటవిభుని కృప
ఘోరమైన ఆస మేలుకోర సోకీనా

ఎంతో స్నేహభావంతో తేలును తెచ్చుకొని తమ అంగ వస్త్రం లో పెట్టుకున్నా అది తన నిజ స్వభావం తో మళ్ళీ మళ్ళీ కుడుతూనే ఉంటుంది గానీ స్నేహితత్వం పాటిస్తుందా? అలాగే మనిషి యొక్క చిత్తం ఎన్నిసార్లైనా చెడు తలంపులతోనే ఉంటుంది కానీ బయటపడడానికి ఏమాత్రం ప్రయత్నించదు. బాహ్య వస్తువులను మనం చూసేది, వినేది, కేవలం బాహ్య ఇంద్రియాల సహాయం ద్వారా మాత్రమే. బాహ్యేంద్రియాలు ఎంతవరకు విషయాలను సేకరించి తెలుపగలవో అంతవరకు మాత్రమే మన మనస్సు తెలుసుకోగలదు. అదే భగవంతుని కృప కలిగితే తెర తొలగిపోతుంది. అప్పుడు అంతఃచేతన యొక్క అంతర్నేత్రం విడివడి భగవంతుని ముఖాముఖి స్పష్టంగా చూడగలుగుతుంది. అంతర్నేత్రం యొక్క దివ్యదృష్టి బాహ్యేంద్రియాలను కూడా సచేతనంగా మార్చగలదు. వీటన్నింటికీ ప్రాణాలను కూడా ఇవ్వగలంత ప్రేమ, పరిపూర్ణంగా అతని వద్ద తనని తాను నివేదించుకోగల సమర్పణ భావం కావాలి. నిత్యానిత్య వస్తు వివేకము, ఇహపరలోక ఫలభోగ వైరాగ్యము, శమాది షట్కసంపత్తి, ముముక్షత్వము అను నాలిగింటిని సాధనా చతుష్టయ సంపత్తి అంటారు. సాధకుడు బ్రహ్మజ్ఞానమును అధ్యయనము చేసి అనుభవమునకు తెచ్చుకొనుటకు ఈ లక్షణములను అలవరచు కొని సంసిద్ధుడు కావలెను. సాధనా చతుష్టయ సంపత్తియే సాధకునికి నిజమైన సంపద. అటువంటి సాధనా బలంతో మహిమగల స్వామి శ్రీవేంకటేశ్వరుని కృపకు పాతృలు కాగలగడం గొప్ప అదృష్టం. కానీ అనేక ఘోరమైన ఆశలతో ఉన్న ఈ మానవులు అలాంటి మేలు కోరనిస్తుందా? అని ప్రశ్నిస్తున్నాడు అన్నమయ్య.

ముఖ్యమైన అర్ధములు: పాయ = రెండుగా చీల్చు; కాయపు = శరీరపు; వికారము = మనసు యొక్క మాఱుపాటు; కోక = వలువ, వస్త్రము; సారె = మాటిమాటికి; మేలుకోర = మేలుకోరే దిశగా.

విశేషాంశములు: షోడశవికారములు = జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, మనో బుద్ధి అహంకారములు 3, రజస్సత్వతమోగుణములు 3 షోడశవికారములు. జ్ఞానేంద్రియములు = కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము; కర్మేంద్రియములు = కాళ్ళు, చేతులు, వాక్కు, గుదము, గుహ్యేంద్రియము

Sunday, August 21, 2016

నవగ్రహాల్లో ఏ గ్రహదోషమైనా తొలగాలంటే చేయవలసిన పరిష్కార మార్గములు నవగ్రహాల్లో ఏ గ్రహదోషమైనా తొలగాలంటే.........!!

ఆయా గ్రహాలకు సంబంధించిన వారం నాడు, మూట గట్టిన నవధాన్యాలు వేపచెట్టుకి కట్టాలి. ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం నానబెట్టి ఆవుకు పెట్టాలి.

గ్రహాలు – వివరాలు.......

1. సూర్యుడు - ఆదివారం
ధాన్యం : గోధుమలు
పుష్పం : తామర
వస్త్రం : ఎర్రని రంగు గల వస్త్రం
జాతి రాయి : కెంపు
2. చంద్రుడు - సోమవారం
ధాన్యం : బియ్యం / వడ్లు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : ముత్యం
నైవేద్యం : పెరుగన్నం
3. కుజుడు - మంగళవారం
ధాన్యం : కందిపప్పు
పుష్పం : సంపంగి మరియు తామర
వస్త్రం : ఎరుపు రంగు వస్త్రం
జాతి రత్నం : ఎర్రని పగడం
నైవేద్యం : కందిపప్పు తో కూడిన అన్నం
4. బుధుడు - బుధవారం
ధాన్యం : పచ్చ పెసర పప్పు
వస్త్రం : పచ్చని రంగు వస్త్రం
జాతి రత్నం : పచ్చ
నైవేద్యం : పెసరపప్పు తో కూడిన అన్నం

5. గురు - గురువారం
ధాన్యం : వేరుసెనగ పప్పు
పుష్పం : మల్లె
వస్త్రం : బంగారు రంగు వస్త్రం
జాతి రత్నం : పుష్య రాగం
నైవేద్యం : సెనగపప్పు తో కూడిన అన్నం
6. శుక్రుడు - శుక్రవారం
ధాన్యం : చిక్కుడు గింజలు
పుష్పం : తెల్లని తామర
వస్త్రం : తెల్లని వస్త్రం
జాతి రత్నం : వజ్రం
నైవేద్యం : చుక్కుడు గింజల తో కూడిన అన్నం
7. శని - శనివారం
ధాన్యం : నల్ల నువ్వులు
వస్త్రం : నల్లని వస్త్రం
జాతి రత్నం : నీలం
నైవేద్యం : నల్లని నువ్వులు కలిపిన అన్నం
8. రాహువు - శుక్రవారం
ధాన్యం : మినుగులు
పుష్పం : అడవి మందారం
జాతిరత్నం : గోమేధుకం
వస్త్రం : నల్లటి వస్త్రం
నైవేద్యం : మినుగులతో కూడిన అన్నం
9. కేతువు - మంగళవారం
ధాన్యం : ఉలవలు
పుష్పం : ఎర్రని కలువ
వస్త్రం : రంగురంగుల వస్త్రం
జాతి రత్నం : వైడుర్యం
నైవేద్యం : ఉలవల అన్నం.

జి. ఎస్ ఎస్ శర్మ

Tuesday, August 16, 2016

జంధ్యాలపౌర్ణమి

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

ఎవరు ఎన్ని ముడులు ధరించాలి? బ్రహ్మచారి ఒక ముడి వున్న జంధ్యాన్ని ధరించాలి. గృహస్థుడు మూడుముడులు ధరంచాలి. అయితే కొందరు నాలుగు ముడులు, ఐదు ముడులు కూడా ధరిస్తూంటారు.

- మొదటిపోగు..., వైదిక నిత్యకర్మానుష్ఠానం కోసం, - రెండవపోగు...,గృహష్థాశ్రమ ధర్మాచరణ కోసం, - మూడవపోగు...,ఉపాకర్మ రోజున ఉపాంగవస్త్రంగా ధరించడంకోసం, - నాల్గవపోగు...,తప్పనిసరి పరిస్థితిలో దానం చేయడం కోసం, - ఐదవపోగు..., పాముకాటుకుగురైన వారి కాలికి కట్టడానికి ఉపయోగంచేవారు.

యజ్ఞోపవీతము యొక్క ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలము వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి ఉంచుకొనవలెను. తదుపరి ఆచమనము చేసి యజ్ఞోపవీత ధారణా మంత్రము

"యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః"

అని చెప్పుచు, ఒక పోగు "నిత్య కర్మానుష్టాన ఫల సిధ్యర్థం ప్రథమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని ధరించవలెను.

మరల ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ, రెండు పోగులను "గృహస్తాశ్రమ ఫల సిద్ద్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని జంటగా ధరించవలెను.
తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను.

మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను.

తదుపరి పాత, క్రొత్త జంధ్యములను కలిపి కుడి చేతి బొటన వ్రేలు-చూపుడు వ్రేలు మధ్యన పట్టుకుని "దశ గాయత్రి" (పది మారులు గాయత్రి మంత్రమును) జపించి, యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మ చారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:
"ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్"

తదుపరి ఈ క్రింది విసర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను.

"ఉపవీతం ఛిన్నతంతుం జీర్ణ కర్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తు మే"

తిరిగి ఆచమనం చేసి నూతన యజ్ఞోపవీతము తో కనీసం పది సారులైనను గాయత్రి మంత్రము జపించి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. తరువాత గాయత్రీ దేవత నుద్దేశించి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించ వలెను.

Tuesday, August 18, 2015

నువ్వు నా సొంతం అయినా రోజు

{20/05/2015}

గాలి మనల్ని పిల్చినప్పుడు 
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో, సీతాకోకచిలుకలమై ఆకాశపు ఆనందంలో. 
ఎందుకంటే, మరి రాత్రి అలాగే వచ్చింది మన వద్దకి 
తనను తాకమనీ వినమనీ -

మనకు తోడుగా ఎర్రెర్రని పూలు - 
మాట్లాడలేదు అవి ఏమీ రాత్రంతా, తలలు వొంచి తమ పరిమళాన్ని పంచే పారవశ్యంలో. 
మనమే మరి, కృతజ్ఞతతో వాటి ముందు మోకరిల్లి 
ప్రార్ధించీ, పుష్పించీ -

ఇక ఆ తరువాత, గూళ్ళల్లో 
పక్షులు కదిలితే, రెక్కలు మొలిచి ఎగిరాం మనం: నాలోకి నువ్వూ, నీలోకి నేనూ. 
మంచు అద్దుకున్న స్వప్నాలూ, గులాబీ కళ్ళ కన్నీళ్ళూ 
శిధిల గృహాలూ అప్పుడు మనలో -

పేర్లని కోల్పోయి మిగిలేం చివరికి 
చీకట్లో మిలమిలామంటో నువ్వో నేనో: నా అరచేతిలో నీ హృదయంతో, నీ అరచేతిలో 
కొట్టుకులాడే నా ప్రాణంతో, ఓరిమితో, శాంతితో, అశాంతితో
బ్రతకాలాన్న ఒకే ఒక్క కోరికతో -

ప్రేమ? తెలియదు. ద్వేషం? తెలియదు. 
పిల్లలు కసురుకున్నాంక, మనస్సు చివుక్కుమని చిన్నబోయిన తల్లి ముఖంలా 
జీవితం మారినాంక, ఒక రాత్రిని తాకీ, వినీ - మొగ్గై 
పూవై ముళ్ళై సువాసనై మబ్బై

వానై, మెరుపై, నిప్పై, సర్వం మరచి 
క్షణాకాలమైనా అలా జ్వలించిపోయే ఆ పాప పవిత్ర తీవ్రత కాలాల కన్నా, ఇరువురికి 
ఇరువురూ ఇచ్చుకునే ఒక మెరుగైన బహుమతి 
అంతకన్నా ఏమున్నది?

Sunday, August 16, 2015

పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది.

పంచభూతాత్మకమైన ఈ ప్రకృతిలో నీటికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రాణికోటికి జీవనాధారమైనది కనుక నీటిని దైవస్వరూపంగా భావిస్తాం. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, వాటినుంచి అన్నం, అన్నం వల్ల ప్రాణులు ఉత్పన్నమైనట్లు శ్రుతులు చెబుతున్నాయి. మన శరీరం కూడా పంచభూతాల తత్వంతో ఏర్పడిందే. అందుకే దీన్ని పాంచభౌతిక దేహం అంటున్నాం.
సకల చరాచరాలను సృష్టించేది నీరే. 'నారాయణుడు' అంటే నీరే స్థానంగా కలవాడని అర్థం. నీటి నుంచే నారాయణుడు ఆవిర్భవించినట్లు రుగ్వేదం చెబుతోంది. ఉదకంలో భగవంతుడు, భగవంతుడిలో ఉదకం ఉందనీ, దాని విశేషం తెలుసుకున్నవారే ముక్తికి అర్హులనీ 'మంత్రపుష్పం' చెబుతోంది. 'జీవితమివ్వడానికి, దీర్ఘాయువు కలిగించేందుకు, తేజస్సు పెంచేందుకు ఈ జలాలు కదులుతూ మమ్మల్ని తడుపుతుండాలి' అన్న వేదార్థం కూడా ఉంది.

నీటితో చేసే అయిదు రకాల స్నానాల వివరణ పద్మపురాణంలో ఉంది. శరీరానికి విభూతి పూసుకొంటూ జలస్మరణం చేయటం ఆగ్నేయస్నానం. శుద్ధజలంతో స్నానం చేస్తే అది వారుణస్నానం. శిరస్సుమీద జలాన్ని ప్రోక్షణ చేసుకుంటే బ్రహ్మస్నానం. గోధూళిలో సంచరిస్తే వాయవ్యస్నానం. ఎండకాస్తుండగా కురిసేవానలో తడిస్తే దివ్యస్నానంగా చెబుతారు. తడిగుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం కపిలస్నానం. ఏనుగులా చాలాసేపు స్నానం చేయడం శ్రేష్ఠమని నీతిశాస్త్రకారుడు చెప్పాడు.

మన ఆరోగ్యవృద్ధి కోసం సనాతనులు పలు సందర్భాల్లో పలువిధాలుగా నీటిని స్వీకరించాలని చెప్పారు. ఆధునిక విజ్ఞానశాస్త్రమూ దీన్నే సమర్థిస్తోంది. సంధ్యావందనంలో పెట్టిన ఆచమన విధి అందులో ఒక భాగమే. అరచేతిని ఆవుచెవిలా చేసుకొని అందులో ఒక ఉద్ధిరణ శుద్ధోదకం పోసుకుని మూడుసార్లుగా ఆచమనం చెయ్యమన్నారు. సంధ్యావందనం ముగిసేలోగా ఇలా చాలాసార్లు చేయవలసి వస్తుంది. అంటే, రోజూ మనం నీరు తరచూ తాగాలన్న సంకేతమిది. పూజలో కూడా 'మధ్యేమధ్యే పానీయం సమర్పయామి' అంటున్నాం. ఎలాంటి జలం అంటే, 'శుద్ధాచమనీయం' అంటున్నది వేదం. నీరు పరిశుభ్రంగా లేకుంటే వ్యాధులు వస్తాయన్న హెచ్చరిక ఉంది అందులో.

మనకు సంక్రమించే వ్యాధుల్లో అధికభాగం స్వచ్ఛమైన నీరు తాగకపోవడంవల్లే సంభవిస్తున్నాయి. వేదంలో అడుగడుగునా 'శుద్ధోదకం' అనే మాట వినిపిస్తుందందుకే. ఒక అగ్గిపుల్ల ప్రకాశానికీ, దహనానికీ ఎలా వినియోగపడుతుందో ఒక్క నీటిచుక్క ఆరోగ్య రక్షణకు, ఆరోగ్యహానికీ అలాగే ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలో జల ఔషధ వైశిష్ట్యం సవివరంగా ఉంది. ప్రకృతి చికిత్సలో నీటికిగల ప్రాచుర్యం అనూహ్యమైనది. వేలసంవత్సరాల పూర్వం రాజులు జలస్తంభన విద్య నేర్చేవారు. పరిశుద్ధమైన నీరునిచ్చే వర్షంకోసం యజ్ఞాలు చెయ్యాలని 'గీత'లో పరమాత్మ చెప్పాడు.

జలతరంగాల్లో అంతర్యామిగా ఉన్న రుద్రుడికి నమస్కారమని 'రుద్రనమకమ్‌' చెబుతోంది. మత్స్యకూర్మావతారాల ఆవిర్భావం నీటినుంచే జరిగింది. అందుకే సలిలం దైవసమానం. జలచరాలన్నింటికీభగవంతుడే ఆశ్రయమిచ్చి ప్రత్యక్ష సంరక్షకుడయ్యాడు. విషాన్ని హరించి జలాన్ని శుద్ధిచేసే జలచరాలెన్నో ఉన్నాయి. వాటికి ఆ వరం దైవమే ప్రసాదించాడు.

పరమాత్మ 'పత్రం, పుష్పం, ఫలం, తోయం'లలో తనకు నాలుగోదైన నీటిని సమర్పించినా సంతుష్టి పొందుతాననే చెప్పాడు. కలియుగంలో వ్యామోహ, ప్రలోభాలకు దాసులైన మానవాళికి ఇంతటి సేవాసౌలభ్యం అనుగ్రహించాడంటే భగవంతుడికి మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి.

చెంబుడు నీళ్లుపోస్తే శంభుడు సంబరపడతాడు కదా! అందుకే ఆ అగ్నినేత్రుణ్ని అభిషేక ప్రియుడంటున్నాం. సృష్టిలో మూడువంతులు నీరు, ఒకవంతు నేల ఉంది. వృక్ష సంతతితో సహా సకలజీవకోటిని ఈ నీరే పోషిస్తోంది. పవిత్రమైన నదీ సాగర తీరాల్లో ఎన్నో దేవాలయాలు, పుణ్యతీర్థాలు వెలిసి భక్తకోటిని తరింపచేస్తున్నాయి. సముద్రస్నానం, నదీస్నానం మానవజన్మ సార్ధక్యానికి అత్యంత ఆవశ్యకాలని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆరోగ్య పరిరక్షణలోనూ నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరంలో అరవై ఎనిమిది శాతం నీరు ఉంది.

భూగర్భంలో జలవనరులు అడుగంటిపోతున్న ఈ విషమ పరిస్థితుల్లో తమవంతుగా నీటిని పొదుపుగా వాడుకోవడం మానవాళి పరమావధి. ప్రతి నీటిబిందువును అమృతసింధువుగా భావించి, అప్రమత్తతతో ఉంటే జలయాగాలు చేసినంత ఫలితం

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...